"మా రవి అన్నయ్య అనుకొన్నాను."
"మరి పలకరించాలిగా."
"అతడితో నేను మాట్లాడను."
"ఏం?"
"అతడికి మహా గర్వం!"
"అలాగా ?" గౌతమ్ కంఠం అదోలా పలికింది."
"అతడంటే రవికి కూడా పడదు."
"ఐ.సి" సాలోచనగా అని రవిని పరిశీలనగా చూశాడు.
అంతలో వర్ధనమ్మ కాఫీలు పట్టుకొచ్చింది. సంభాషణ ఆగిపోయింది.
"అమ్మా! ఇతడు నాకు బంధువటగా? నీకు తెలుసా?"
వర్ధనమ్మ ముఖం వేలాతలా పోయింది. ఆమె కళ్ళల్లో ఏదో భయం రెపరెపలాడింది.
"నీకు బంధువా? అయితే నాక్కూడా బంధువే అయి ఉండాలిగా?"
వర్ధనమ్మ మాటకు విశ్వం చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వు చూసి వర్ధనమ్మ గతుక్కుమంది.
అందరూ మౌనంగా కాఫీ తాగుతూ ఎవరి ఆలోచనలో వాళ్ళు పడిపోయారు.
కాఫీ కప్పులు తీసుకొని వర్ధనమ్మ లోపలకు వెళ్ళింది."
"మనం బయట కలుసుకొని మాట్లాడుకోవడం మంచిది."
"నాతొ అంత పని ఉందా?"
"ఉంది."
"ఏం పని?"
"ఆ విషయమే మాట్లాడటానికి ఇంత దూరం వచ్చాం."
"ఓ.కే. ఎక్కడ దిగారు?"
"హోటల్ అప్సర."
"సరే, మీరు వెళ్ళండి. నేను ఆరు గంటలకు వస్తాను."
"తప్పకుండా వస్తావు కదూ?"
"ఎందుకు రానూ? మీరంటే నాకు భయం అనుకుంటున్నారా? ముఖం తప్పిస్తాననుకుంటున్నారా? మీతో నాకూ ఉంది పని. తప్పక వస్తాను. ఇక మీరు వెళ్ళండి."
ఇద్దరూ లేచారు.
గౌతమ్ విశ్వంతో కరచాలనం చేశాడు.
అప్పటికే రవి రోడ్డుమీదకు వచ్చాడు.
4
విశ్వం రవీ హోటల్ రూమ్ లో ఆత్రుతగా గౌతమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతవరకూ ఆరు గంటలు కావడం లేదు. కాలం కుంటుతూ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇద్దరూ రెండు గంటలు దీర్ఘంగా చర్చించి ఈ గౌతమ్ ఆ గౌతమ్ మీద కసి తీర్చుకోడానికి ఉపయోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
"అంతా బాగానే ఉంది. నువ్వు మా అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకుంటావ్ మరి నా విషయం?"
విశ్వం అర్ధం కానట్టు అతడి ముఖంలోకి చూశాడు. రవీ మళ్ళీ మొదటికే వచ్చాడనిపించింది. వీణ్ణి తగలెయ్య వీడికి అన్నీ సందేహాలే. అనుకొన్నాడు విశ్వం.
నీ విషయమా?"
"అవును, నేను ఇందు మీద కసి తీర్చుకోవాలి."
"మీ అన్నయ్య జైలుకు వెళ్తాడు. ఇందు మీద అది ప్రతీకారం కాదా?"
"కాదు." ఖచ్చితంగా అన్నాడు రవి.
విశ్వానికి కోపం వచ్చింది. మౌనంగా ఉండిపోయాడు.
"అంత చాలదు. నాకు జరిగిన ప్రతీకారానికి అంత చాలదు."
'అయితే ఏం చేస్తానంటావ్?"
"ఇందు వివాహం ఈ గౌతమ్ గాడితో జరుగుతుంది."
"నీకు మతి పోయిందా?"
"ఏం! ఎందుకలా అన్నావ్?"
"ఈ గౌతమే ఇందుమతికి స్టెప్ బ్రదర్ అవుతాడు. ఇద్దరి తండ్రులు ఒక్కరే."
"ఇందు వివాహం వీడితో జరుగుతుంది. వివాహం జరిగాక పెళ్ళి పందిట్లో పది ముందు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళని తెలిసే డాక్యుమెంట్స్ బయటపెట్టాలి. ఆ దెబ్బతో ఇందు పిచ్చిదై పోతుంది."
"అది అంత సులభం కాదని నా భావం."
"ఏం ఎందుకు కాదు? అమ్మకు వీడూ కొడుకే కనక వీడు తన కొడుకు గౌతమ్ కాదని కోర్టులో చెప్పదు. మౌనంగా వీడిని స్వీకరించక తప్పదు. అప్పుడు ఇందు కూడా అతడ్ని మా అన్నయ్య గౌతమ్ గానే భావిస్తుంది."
"ఇందును మోసం చెయ్యడం అంత తేలిగ్గాదు. ఆమె గౌతమ్ ను ప్రేమిస్తుంది. ఏ స్త్రీ అయిన తన ప్రియుణ్ణి లక్ష మందిలో నైనా గుర్తిస్తుంది." అన్నాడు విశ్వం.
రవి ఆలోచనలో పడ్డాడు.
"ఆ! ఒకటి చెయ్యొచ్చు."
"ఏమిటది?"
"మీ అన్నయ్య మీద అసహ్యం కలిగేలా....."
"ఎలా?"
"అతడు చేసే పనులన్నీ తన ప్రియుడే చేస్తున్నాడన్న భ్రమ కలిగించవచ్చును."
"అది సాధ్యమంటావా?"
"తప్పదు."
"అందుకు అరుణనే పావుగా చెయ్యక తప్పదంటావా?" ఏదో ఆలోచిస్తూ అన్నాడు రవి.
"తప్పదు. అదీకాక ఆ కారణంగా అరుణకు వచ్చిన కష్టం ఏమీ ఉండదు" అన్నాడు విశ్వం.
ఇన్నింటికీ అతడు ఒప్పుకొవాలిగా?"
"ఎవడి కోసం ఒప్పుకుంటాడు. డబ్బు -డబ్బు - దాని చుట్టూనే తిరుగుతుంది ప్రపంచం అని అతడికి తెలియదా? చిన్నప్పట్నుంచి తీరని కోర్కెలతో , చాలీ చాలని జీవితావసరాలతో పెరిగినవాడు లక్షలు వస్తున్నాయంటే ఏమైనా చేస్తాడు."
బెల్ మోగింది.
"వచ్చినట్టున్నాడు" రవి.
విశ్వం వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా దాదాపు గడపంత ఎత్తుగా నిల్చుని ఉన్న గౌతమ్ ను చూసి ఇద్దరూ తుళ్ళిపడ్డారు.
స్నానం చేసు ట్రిమ్ గా తయారై వచ్చాడు.
గౌతమ్ ముదురురంగు పాంటు మీద తెల్ల షర్టు వేస్తాడు. ఇతను కూడా అదే డ్రెస్ వేసుకున్నాడు. వీడే వాడే . సందేహం లేదు. తమను ఆటలు పట్టిస్తున్నాడు. మధనపడసాగాడు విశ్వం.
రవికి బుర్ర పనిచేయడం లేదు. ఏ ఆలోచనా లేదు. చాలా పెద్ద తప్పు చేసి - అకస్మాత్తుగా రెడ్ హండెడ్ గా దొరికినట్టుగా ఉంది రవి పని.
"నన్ను లోపలికి రానివ్వరా!"
"రండి! రండి!" విశ్వం గాబరాగా అన్నాడు.
"మీ రవి ఏమిటి నన్ను మళ్ళీ అలా చూస్తున్నాడు?"
"నిన్ను చూస్తూ మా అన్నయ్య గౌతమ్ ని కాదనుకోలేక పోతున్నాడు" ఇలాంటి డ్రస్సు ఇతనికీ ఉంది" రవి నాలుక పిడచకట్టుకుపోతూ ఉంటే పొడిపొడిగా అన్నాడు.
"ఓ! టేస్టులు కూడా ఒకటే అన్నమాట." అతడి కంఠం తమాషాగా పలికింది.