Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 14


    అతను ఊహల్లో పడ్డాడు.
    "నాకు డబ్బు కావాలి!"
    "ఎంత?"
    "నా చెల్లాయికి జబ్బు నయం చేసుకునేందుకు, నాకు ఉద్యోగం దొరికేవరకు మేం సుఖంగా బ్రతికేందుకు చాలినంత?"
    "అదే ఎంతంటున్నాను?"
    "నాకు మాత్రం ఏం తెలుసు!"
    "బావుంది నీకో తెలియాక నాకూ తెలియక-ఎంతని యివ్వను?" ప్రశ్నించింది కృష్ణవేణమ్మగారు!
    "మీరే తప్పుచేశారు!"
    ఆమె ముఖం బిగుసుకుపోయింది. కోపం తాండవించింది. "నన్ను -యీ కృష్ణవేణమ్మని తప్పుచేశానంటావా? ఎంత ధైర్యం! నా యింటికే వచ్చి నా తిండితిని ఎంత మాటన్నావ్? గెట్ అవుట్!"
    "లక్షణంగా వెళతాను. నా విగ్రహం, నా పచ్చల హారం అమ్ముకోలేకపోయాను-ఇప్పుడిక తప్పదు-"
    ఉలిక్కిపడిందామె. చప్పున కూర్చున్న చోటు నుంచి లేచివచ్చి అతని ముఖంలోకి సూటిగా చూసి "ఆ హారం యిలా ఇవ్వండి. ఇన్నేళ్ళు వెధవ సెంటిమెంట్స్ తో ఆ హారం అమ్ముతానంటావా త్రాష్టుడు?" అంది అరుస్తూ.
    "అమ్ముతానన్నవా?"
    "మరేమన్నావ్?"
    "ఎందుకమ్ముతాను? బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుంటాను. హీనమన్నా పదివేలిస్తాడు!"
    "పదివేలు కావాలా? ఎలా తీరుస్తావ్?"
    నిశితంగా ఆమె ముఖంలోకి చూసి "నాకు నా శక్తి మీద నమ్మకం వుంది. కష్టిస్తాను, ఉద్యోగం సాధిస్తాను. అప్పుతీర్చి ఆ హారం నా చెల్లాయికి యిస్తాను. నా పాలిటికి ఆమే దేవత!" అన్నాడు.
    "పదివేలి స్తే యిప్పుడు సరిపోతుందా? నేనిస్తాను?"
    "పదో - పాతికో! మీ ముష్టి దేబరింపు ఎందుకు నా హారం నా ముఖాన పడెయ్యండి!"
    "ఏం చేస్తావు యివ్వకపోతే!"
    "ఏం చేస్తానా? ఏం చేస్తానా?...
    చెళ్ళుమంది అతని చెంప
    "అమ్మగారూ!" కేకేశాడు రవి.
    "బాబుగారూ!"
    "అన్నయ్యా!"
    ఇద్దరి పిలుపులకి ఒక్కసారిగా ఊహల్లోంచి బయటపడ్డాడు. తన ఊహలకి తనకే సిగ్గేసింది.
    "ఏమ్మా!" అన్నాడు స్వాతిని చూసి
    "ఎందుకలా కేకేశావ్?" ఆదుర్దాగా అడిగింది.
    "ఏం లేదు! ఏం లేదు!" అన్నాడు గాబరాగా.
    అంతలో ఆయా "బాబూ! అమ్మగారు రమ్మంటున్నారు!" అంది నెమ్మదిగా.
    "అమ్మగారా? ఎక్కడున్నారు?"
    "హాల్లో!"
    "ఒక్కరేనా? ఇంకెవరయినా వున్నారా?"
    "ఎవరూ లేరూ-ఒక్కరే వున్నారు."
    "ఎందుకు?"
    "మాకేం తెలుసు బాబూ! ఏం పనిమీద పిలిచారో!" అంది ఆయా.
    ఒక్కక్షణం తటపటాయించి మనస్సు కుదుటపరుచుకుని 'పద!' అన్నాడు లేస్తూ.
    ఒక్క అడుగువేసి "స్వాతీ! యిప్పుడే వస్తానమ్మా. జాగ్రత్తగా వుండు" అన్నాడు.
    "నేను వస్తానన్నాయ్."
    "ఎందుకమ్మా?"
    "ఆమెని నా జబ్బుకి డబ్బు అడుగుతాను. నాకునయం చేసుకునేందూకి కావలసినంత డబ్బు అడుగుతాను. నాకు నయం అయ్యేదాకా యిక్కడే ఉండేందుకు అనుమతీ కోరతాను" అంది స్వాతి.
    రవి మనస్సు కరిగిపోయింది. ఆమెని దగ్గరికి లాక్కుని ప్రేమగా తలనిమిరి "ఒద్దులే స్వాతీ! నేను అడుగుతాను, అంతగా అంగీకరించకపోతే నువ్వు అడుగుదువుగానీ - ఇక్కడే ఉండు ఏం భయంలేదులే!" అన్నాడు.
    "భయంకాదు. నేనూ వస్తాను!"
    కొద్ది దూరంలో నుంచున్న ఆయా ఆసహనంగా చూస్తుంది ఇద్దర్నీ.
    "ఆయా! ఒక్క క్షణం వస్తున్నామని చెప్పు" అన్నాడు రవి.
    "ఏమో బాబూ! అమ్మగారు మహా కరెక్ట్. టైం అంటే టైం అంతే! వెంటనే రండి" అని వెళ్ళిపోయింది.
    మరో నిమిషం తర్వాత ఏదో ఆలోచించుకున్న రవి, స్వాతిలో సహాకదిలేడు.
    సినిమా హాలంతవున్న వరండాదాటి రాజదర్బారు లాటి హాల్లో అడుగు పెట్టారిద్దరూ అంత పెద్ద హాలుని, ఆ హలులోని ఫర్నిచర్ ని, ఆ అలంకరణని చూసి విస్తుబోయింది స్వాతి. విస్పారిత నేత్రాలతో గోడలకున్న తైలవర్ణ చిత్రాలను చూడసాగింది.
    రవికి కూడా కృష్ణవేణమ్మగారు ధనవంతులనే తెలుసుకానీ మరీ యింత భూరిసంపన్నులను కోలేదు. ఐశ్వర్యం ఉండటమే చాలదు! దాన్ని బాగా వినియోగించుకుని అందంగా తోటలు, దొడ్లు, భవంతులు నిర్మించుకోవటం లేదు! అది ఎంతో కళాభిజ్ఞత, రసికత ఉన్నవాళ్ళకే చెల్లు అనుకున్నాడు రవి, గోడలకి, అందంగా అలంకరించిన రాజా రవివర్మ చిత్రాలనీ వాటినీ చూస్తూ.
    "రవీ!" హాలు మధ్యలో రాజదర్బారులో మహారాణిలా టేబిల్ ముందు కూర్చున్న కృష్ణవేణమ్మగారు గంభీరంగా పిలిచారు. అంతపెద్ద హాలులో ఆమె కంఠస్వరం మంద్రస్థాయిలో ప్రతిధ్వనించింది.
    "అమ్మగారూ!" అన్నాడు వినయంగా రవి.
    'ఈ బేబీయే కదూ నీ చెల్లాయి స్వాతి! మొన్న ఓ పూట స్వప్నతో మాటాడుతూ వుంటే చూశాన్లే."
    "అవునండీ."

 Previous Page Next Page