Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 15


    
    "ఏమండీ!" మళ్ళీ పిలిచాడు రాజారాం.
    
    జాలిగా చూసింది నంద "ఒక వారంలోగా ఇస్తాను!" సంజాయిషీ యిస్తున్నట్టుగా అంది.    

    చిన్నపిల్లలు బొంకితే పెద్దాళ్ళు గలగలా నవ్వేసినట్టు నవ్వేడతను. "చూడండి మేడం! మీరు వారంలో ఎలా ఇవ్వగలుగుతారో చెబుతారా?" ఏం సమాధానం చెబుతావో చెప్పు అన్నట్టు అడిగేడు.

 

    "బాబూ!" బలహీనంగా పిలిచింది సుందరమ్మ.
    
    ఆమె పిలుపు వినగానే అంతదాకా సౌమ్యంగా మాట్లాడుతున్న రాజారాం ముఖం బిగుసుకుపోయింది.
    
    "బాబూ! ఎలాగో తెచ్చిస్తూంది కాస్త వోపిక పట్టు!"
    
    "ఇదిగోనమ్మా! మళ్ళీ ఒకటో తారీఖు వచ్చేస్తే మూడు నెలల అద్దె బకాయి అవుతుంది. ఒక్కసరి అంతా ఇచ్చెయ్యాలంటే మీ అమ్మాయి జీతం మొత్తం ఇచ్చెయ్యాలి! ఇచ్చేస్తే మీ కుటుంబం ఎలా జరుగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి!-" అన్నాడు రాజారాం.
    
    "అదీ బాబూ! నువ్వు కాస్త దయతలచి-"
    
    "అద్దె వదిలెయ్యమంటారా!" హేళనగా అడిగేడు.
    
    "బాబూ" ఆమె మనస్సు దెబ్బతింది. "మేం డబ్బులేని వాళ్ళమే కానీ అభిమానం లేని వాళ్ళం కాము. అద్దె ఇవ్వలేని రోజు చెట్టు క్రింద ఉంటాం. లేదా అద్దె ఇచ్చి పస్తులు పడుకుంటాం. కానీ దేహీ అని యాచించం!" అంది.
    
    ఆ మాత్రానికే ఆమెకి ఆయాసం వచ్చేసింది.
    
    "అబ్బో! రోషం! అంత రోషం వున్నవాళ్ళు బాడుగ వెంటనే ఇచ్చెయ్యకూడదూ!" ఎప్పుడు వచ్చిందో కామాక్షమ్మ చప్పున అందుకుంది.
    
    నంద ముఖం కత్తి వాటుకి నెత్తురు చుక్క లేనట్టుగా పాలిపోయింది! గుండెల్లో నేరుగా కత్తి గుచ్చినట్టుగా అయిపోయి, విలవిల్లాడిపోయింది అయినా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో "పిన్నిగారూ!" అని బలహీనంగా పిలిచింది.
    
    "ఈ వరుసలు తరువాత! ముందు బాడుగ ఇవ్వు! అయినా నువ్వెంత వెధవ సన్నాసివిరా! ఆ అమ్మాయి కబుర్లు చెబుతూ వుంటే బాడుగ అడగడం మానేస్తావా? బావుంది! యజమానికి ఇల్లు పట్టదు. తల్లి రోగిష్టి! వయసులో కూతురు పెత్తనాలు! ఇక మగవాళ్ళేం వ్యవహారాలు చేస్తారు!" వెటకారంగా అంది కామాక్షమ్మ.
    
    కామాక్షమ్మ మాటలకి చప్పున ఇంత విషం మింగేద్దాం అనిపించింది నందకి.
    
    "ఛీ! ఛీ! ఏం మనుషులు! ఆడవాళ్ళు ఆడవాళ్ళని నమ్మలేరే! ఎందుకీ జాతి ద్వేషం! తమనంత నీచంగా ఎలా అనుకుంటుంది ఈ కామాక్షమ్మ. ఈమెకి బుద్ది చెప్పాలి! అలా అనుకోగానే ఆమెకి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది దెబ్బకి దెబ్బ! మాటకి మాట! వేటుకి వేటు! పోటు పోటు! అదే యిలాంటి వాళ్ళకి సమాధానం అనుకుని" కామాక్షమ్మగారూ" అంటూ ధైర్యంగా పిలిచింది.
    
    నివ్వెరపోయింది కామాక్షమ్మ ఆ పిలుపుకి. తనని పేరుతో పిలుస్తుందా అనుకుంది. ఆమెలో కోపం ఉవ్వెత్తున ఉబికి వచ్చింది. తనని అవమానించినందుకు శాస్తి చేయాలని "నందా!" అని పిలిచింది కోపంగా.
    
    "మీరే మీ అబ్బాయిని పంపేరు. ముందే మీరు రాకూడదూ? కేవలం మమ్మల్ని అవమానించటానికి వచ్చారా?" ఆమెతో పోట్లాడటానికి సిద్దమైనట్టుగా అడిగేసింది నంద.
    
    "మాకీవన్ని తెలియవు? అద్దె ఎప్పుడిస్తావో చెప్పు!" చప్పున మాట మార్చేసిందామె. ఎక్కడ పొడిస్తే ఆయువు పట్టుకి సోకి ప్రాణం పోతుందో బాగా తెలిసిన దానిలా ప్రవర్తించింది. 

   

    తెల్లబోయింది నంద! ఏం జవాబు చెప్పాలి! ఎలా నెగ్గుకు రావాలి? ఆమె వ్యవహార దక్షతకి ఆశ్చర్యపోయింది నంద!
    
    ఎదుటి మనిషిని దెబ్బ కొట్టేసి తనే రిపోర్టు ఇచ్చిన వ్యక్తిలాగా ఆమె మాట్లాడుతూ వుంటే నందకి దిమ్మ తిరిగి పోయింది.
    
    "ఇప్పుడంటే ఈ క్షణాన ఎలా ఇవ్వగలను?"
    
    "సాయంకాలం- రేపు ఎప్పుడిస్తావ్?"
    
    "ఊహూ! ఇంకో వారం అయితే!" ఏదో ధైర్యంతో అనేసింది నంద. అంతకంటే యింకోమార్గం కన్పించలేదు. పి.యం. చేస్తోన్నట్టుగా ఆమె ప్రశ్నిస్తోవుంటే దిక్కుతోచక, ఈ గండం గడిచి వీళ్ళు వెళ్ళిపోతే చాలన్నట్టుగా అంది.
    
    "ఎలా ఇస్తావమ్మా! ఎద్దేవాగా అడిగిందామె.

 

    "చూడండి! నేను ఎలా ఇస్తానో మీకెందుకు?"
    
    "బావుందమ్మోయ్! నువ్వనేది ఆఖరికి ఈ ఇల్లుతో మీకేం పని? అద్దెతో మీకేం పని? బాడుగకే ఉన్నాం కాబట్టి ఈ ఇల్లు మాదే అన్నట్టుగా వున్నావు. ఇలాంటి వేషాలు మన దగ్గర కుదరవు. మర్యాదగా బాడుగ రావాలి!"
    
    "కామాక్షమ్మగారూ! కోపంగా అరిచింది నంద!" మీరు ఇంకో మాట అనేందుకు వీల్లేదు. తక్షణం వెళ్ళండి! మీ బాడుగ మొత్తం రేపు ఇచ్చేస్తాను. అలా ఇవ్వకపోతే ఎల్లుండి మీ ఇల్లు ఖాళీచేసి వెళతాం- అద్దెకి ఏ వస్తువో కుదువ పెట్టి వెళతాం ఇకనుంచి నెలనెలా రెండోతేది ఉదయం రండి బాడుగకి! ముందు మీ బాడుగ ఇచ్చేసి ఆనక మేం మా యింటి విషయాలు చూసుకుంటాం. తింటామో పస్తులే ఉంటామో, మీ కక్కర్లేదు. కరెక్టుగా అద్దె పట్టు కెళ్ళండి అంతే!" చాచి చెంపమీద కొట్టినట్టుగా, మాటల్తో పని లేదన్నట్టుగా, ఇహ ఎక్కువ మాట్లాడితే తన్నేస్తా అన్నట్టుగా అంది నంద!
    
    అంత ఆవేశం, పౌరుషం వచ్చేసింది ఆమెకి.
    
    "ఇహ చాల్లే పద!" ఏదో అనబోతున్న తల్లిని గద్దించాడు రాజారాం. అతనికి తల్లి అలా ప్రవర్తించడం, ప్రశ్నించటం బొత్తిగా నచ్చలేదు. అంతేకాదు ఈ విషయంలో అతనికి తల్లి ప్రమేయం కల్గించుకోవటం బొత్తిగా నచ్చలేదు కూడా! అందుకే అలా తల్లిని గద్దించాడు.
    
    రాజారాం ప్రవర్తనకి ఆశ్చర్యపోయింది కామాక్షమ్మ ఒక్క క్షణం నివ్వెరపోయినట్లయి "ఇంటికి పద నీ సంగతి చెబుతా! నన్నే మందలిస్తావా?" అన్నట్టుగా చూసి వెళ్ళిపోయింది.
    
    "చూడండి! మీరూ ఒకప్పుడు అద్దెల కిచ్చిన వాళ్ళే ఆ కష్ట నిష్టూరాలు మీకు తెలుసు. బాడుగ ఎటూ ఇవ్వక తప్పదు. ఎందుకు చెప్పండి ఈ రభస?" అని వెళ్ళిపోయాడు రాజారాం.
    
    "మేం బాడుగలకి యిచ్చిన రోజుల్లో యిలా ప్రవర్తించామా? అంది సుందరమ్మ.

 Previous Page Next Page