"కానీ నువ్వలా అడగటం లేదు బావా! నేను నీ కూతుర్ని ఎప్పుడైనా చేసుకుంటాను. దానికి బయానా గా ఇప్పుడే డబ్బు ఇవ్వు. దాంతో నా చెల్లెలికి మొగుడిని కొంటాను అంటున్నావు!" నంద కంఠం కొద్దిగా కోపాన్ని ప్రకటించింది.
అతనేం అన్లేదు. ఒక్క నిమిషం భారంగా నడిచింది.
"నందా! దీన్ని నువ్వు ఎలా వ్యాఖ్యానించినా ఫర్లేదు మనం మనం ఒకటి. అందుకే ఇంత ఫ్రీగా అడగగలిగాను!"
"ఇప్పుడు నాన్న డబ్బు ఇవ్వకపోతే- ఇవ్వకపోతే-"
"నందా ఈ ఊహలు వద్దు. ప్రాక్టికల్ కావాలి. నాన్నకు డబ్బు కావాలి. పెళ్ళి విషయం అలా వుంచినా ఫ్రెండ్లీగా నయినా ఆయన సర్దాలి."
నవ్వింది నంద! "నువ్వు నాన్నని బాంకర్ అనుకుంటున్నావా? నో యూజ్. పోనీ ఒక పని చెయ్యొచ్చుగదా! ఎలాగూ ఆ డబ్బు జయంతికే కదా! దాన్ని తర్వాత బ్యాంక్ లో వేస్తామని చెప్పరాదూ! లేదా పొలం! లేదా వో ఇల్లు దాని పేరరాయొచ్చు కదా?"
అతని ముక్కుపుటాలు విశాలమయ్యాయి. "నీకు తెలియని దేవుంది. ఆస్తి నాన్నగారి పేరిట లేదు. అంతా నానమ్మ పేరే వుంది.
"అమ్మమ్మనే అడుగు."
"ఆమె నన్నిక్కడికి పంపింది."
"మా కుటుంబ విషయాలు అన్నీ తెలిసి, ఇన్నేళ్ళుగా కూతురికి ఒక్క పైసా అయినా సహాయం చేయని అమ్మమ్మ మామయ్యా నిన్ను పంపారంటే ఆశ్చర్యంగా వుంది! లేదా వాళ్ళ ఉద్దేశ్యంలో నన్ను ఆ ఇంటికి రాకుండా చేయాలనే వూహ వుండొచ్చు. అంతే అయివుంటుంది" సూటిగా అంది నంద.
విక్రాంత్ ఏమీ అనలేదు.
అయిదు నిముషాలు భారంగా గడిచాయి.
బొత్తిగా వ్యక్తిత్వం లేని అతన్ని చూసి జాలిపడింది నంద.
మనిషి విలువ డబ్బువద్ద తెలుస్తాయన్నట్లు ఇతనిరూపం ఇక్కడ బయటపడుతోంది. అనుకుంటే తల్లిదండ్రులు ఎలా ఆడిస్తే, అలా ఆడే అతను రేపు జీవితంలో ఏం సాధించుకో గలడు అనుకుంది.
"వెళదామా?"
"టైం ఎంతయింది బావా?"
"ఎనిమిదికి అయిదు నిమిషాలయింది" అన్నాడు విక్రాంత్. ఇంకేమీ అనకుండా కదిలింది నంద.
"ఆమె మనస్సులో అతనిపై అంతకుపూర్వం ఏర్పరచు కున్న అభిప్రాయాలు ఆశలు అన్నీ ఎండకి కరిగే మంచులా కరిగిపోసాగాయి. ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, ఆప్యాయతలు స్నేహాలు అన్నీ హంబగ్, అన్నిటికా మూలాధారం డబ్బొక్కటే! దాని చుట్టూతా దాన్ని ఆధారం చేసుకునే అన్నీ ఏర్పడతాయి. అది లేకపోతే ఏవీ లేవు- అనుకుంది నంద.
8
రేడియో సిలోన్ లో సైగల్ పాట వినిపిస్తోంది. మధుర మధురంగా గుండెల్ని గిలిగింతలు పెడుతూ పక్కింటి రేడియోలోంచి దూరంగా వినిపించే ఆ పాట వింటున్నాడు నారాయణ.... పాట వింటే కలిగే ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కన్పిస్తోంది. సైగల్ పాట వినటం అతని కిష్టం. అతనికా అలవాటు ఎన్నో సంవత్సరాలు గా వుంది.
మంచి రోజుల్లో చెడు రోజుల్లో ఆఖరికి మానసికంగా సరిగాలేని ఈ రోజుల్లో కూడా ఆయనికి ఆ మాధుర్యం చెవుల కెక్కుతూనే వుంది. ఆనందం కలిగిస్తూనే వుంది.
"ఏమండీ!" ఎవరో బయటినుంచి కేకేశారు.
ఆ పిలుపుకి తన ఆలోచనల నుంచి బయటపడింది నంద.
రేడియోలో హిందీవార్తలు మొదలయ్యాయి. అప్పుడే ఎనిమిదై పోయిందర్రా అని చెప్తోన్నట్టు హాల్లో గడియారం ఎనిమిది గంటలు కొట్టింది.
అన్నం గిన్నె దించేసి బయటికి వచ్చింది నంద.
అక్క రాక చూసి వంటింట్లోకి వెళ్ళింది విమల.
'నమస్కారం!' ఇంటి యజమాని కొడుకుని చూసి నమస్కారం పెట్టింది నంద.
అతనామె కంటే అయిదారేళ్ళు చిన్నవాడే!
అయినా అతన్నప్పుడు చూసి చప్పున నమస్తే చెప్పిందామె. అప్పు మనిషితో అలా చేయిస్తోంది కాబోలు-
"చూడండీ! ఈ రోజు పదో తారీఖు. మీరు ఇంత వరకూ ఇంటద్దె ఇవ్వలేదు. పైగా పోయిన నెల అద్దె కూడా ఇవ్వనే లేదు. ఈ కాంపౌండ్ లో అందరూ అడ్వాన్స్ డ్ గా ఇచ్చేస్తూంటే మీరు నెలంతా వుండి కూడా ఇంకా బాడుగ ఇవ్వలేదు. రెండు నెలల అద్దె బాకీపెడితే మేమేం చేయాలో చెప్పండి. ఆఖరికి ఒకనెల అద్దె బకాయి పెట్టినా ఫర్వాలేదు గబగబా అనేశాడు రాజారాం.
అతనికి తల్లి అప్పగించిన పాటం ఎంత త్వరగా చెప్పేస్తే అంత బావుంటుందని పిస్తుంది.
ఆలస్యమైతే ఆమెని చూస్తే, ఆమె చెప్పే తీయని మాటలు వింటే కరిగిపోతానేమోనని భయం.
అలా అయ్యే గతనెల బాడుగ వసూలు కాలేదు.
"లేదండీ! త్వరలో ఇచ్చేస్తాను. నిజమే, ఆలస్యమై పోయింది!" తడబడుతూ అంది నంద.
అక్కడే కూర్చున్న నారాయణ ఈ విషయంలో ఏమీ జోక్యం కల్పించుకోలేదు.
నిరామయుడిలా వుండిపోయాడు.
"మీరు అలాగే అంటారు" గతనెలలోనూ అలాగే చెప్పారు మీ మాట నమ్మేను!"
"సారీ అండీ! ఈ పర్యాయం అలాకాదు ఇచ్చేస్తాను!"
"ఎప్పుడిస్తారు?" చప్పున అడిగాడు.
వెంటనే జవాబు ఇవ్వలేకపోయింది నంద. అవును ఎప్పుడిస్తుంది! పోయిన నెల ఒకటవ తేది ఇవ్వాలి అద్దె!
మళ్ళీ నెల గడిచి మళ్ళీ ఒకటవ తేది వచ్చింది!
రెండద్దెలకి ఆఖరికి ఒక అద్దె ఇచ్చినా చాలు. కానీ ఎలా ఇస్తుంది?
మళ్ళీ ఒకటో తారీఖు దాకా డబ్బు కళ్ళజూచే అవకాశం ఎక్కడిది?
తను సిటీబస్సు టిక్కెట్లు కొనేసింది. అందువల్ల ఆఫీసుకి వెళ్ళేందుకు చిక్కులేదు. కొట్లో వెచ్చాలు తెచ్చింది. నెలాఖరు దాకా సరిపోతాయి. ఎలాగో పూట గడిచిపోతుంది. మిల్లులో బియ్యం తెచ్చింది. అసలయినది అన్నంవుంటే ఆధరువులు ఎలా వున్నా ఫర్లేదు. పాలు, పెరుగు అప్పుపోస్తారు అందరికి పూటకి డోకా లేకుండా గడిచిపోతుంది. ఇప్పుడు డబ్బుతో అవసరం ఏముంది? సినిమాలు, షికార్లు తమ కవసరాలు కావు. "ఉన్నా డబ్బెక్కడిదసలు?" ఎలా వస్తుంది!