వద్దన్నా వో రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది నందకి. తామూ, తమ యిల్లూ, తమ యింట్లో అద్దెకున్న వాళ్ళూ- యిప్పటి ఈ పరిస్థితులు ఎక్కడి కక్కడ! తమ ప్రవర్తనకి కామాక్షమ్మలాంటి అద్దెకిచ్చే వాళ్ళ ప్రవర్తనకీ పోలికా పొంతనా వున్నయ్యా! ఊహూఁ అదో మంచి కాలం! అది కేవలం మంచి మనుషుల కాలం! నైతిక విలువలకి మానవత్వనైకి అతి విలువయిన కాలం అది మరి యిప్పుడు! డబ్బు! డబ్బే రాజ్యం ఏల్తోంది!
9
నారాయణకి పిత్రార్జితంగా వచ్చిన యిల్లు అట్టే విశాలమైంది కాదు.
కానీ ఒక కుటుంబం దర్జాగా, హాయిగా మహారాజుల్లా ఎంతో హాయిగా జీవించొచ్చు! రెండు కుటుంబాలు వో విధంగా, అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళ జీవిత ప్రతిబింబంగా వుండచ్చు! మూడు కుటుంబాలు ఇరుకుగా గడపవచ్చు. కాంపౌండ్ లోపల అనుకూలంగా ఇంటిముందూ, వెనుకవున్న ఖాళీస్థలాల్లో మరో రెండుగదులు వేసుకోవచ్చు. కులాసాగా దిలాసాగా గడపచ్చు!
కానీ తాతగారు కట్టించిన ఆ ఇంటికి రిపేర్లు చేయించాలంటేనే నారాయణతో అవడంలేదు. ఉన్నదాన్ని దక్కించుకోవటానికి యిబ్బంది అవుతూ వుంటే కొత్తగా ఇంకెక్కడ వేస్తాడు గదులు?
అతని ఆర్ధిక స్థితి చూసే వాటా అడగకుండా వదిలేసి వెళ్ళారు సోదరులు.
వేన్నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా బాడుగకి ఆ యింటిని ఇచ్చాడు నారాయణ. అద్దెకివ్వటం ఇష్టం లేకపోయినా యివ్వాల్సి వచ్చింది.
నిజానికి బాడుగకి ఇవ్వడంవల్ల కుటుంబానికి కొంచెం ఇరుకే- యిబ్బంది అయిపోయింది కూడా!
కానీ ఏం చేస్తాడు?
పెరుగుతున్న జీవిత వ్యయం దృష్ట్యా అతనికి తప్పలేదు ఓసారి ఆ యింట్లో ఓ తాలుకాఫీసు గుమాస్తా చేరాడు.
ముందుగది ఓ పెళ్ళికాని అబ్బాయికి ఇచ్చి దాన్నానుకుని వున్న గదిలో మరో పెళ్ళయిన బ్రహ్మచారికి యిచ్చి ఆఖరి రెండు గదులు ఆ గుమాస్తాకి యిచ్చారు.
ఆయన ఇంకో సంవత్సరంలో రిటైర్ అవుతారు. కొడుకుల్ని బాగా చదివించాడు! కొడుకులు అంతా మంచి ఉద్యోగాల్లో వున్నారు. పెళ్ళిళ్ళు చేసి పంపేశాడు. ఒకడు హైస్కూలు హెడ్మాష్టరు. కుటుంబ ఖర్చులకి మించే వస్తుందతని జీతం అయినా హెచ్. ఎం.ఎలవెన్స్ కూడా తండ్రికి పంపించడం పంపాలనుకున్నా అతని భార్య చిల్లిగవ్వకూడా పంపనివ్వదు. కానీ అయన కొడుకుని నిందించదు. అతని కుటుంబ ఖర్చులు అతనివి అంటాడు.
రెండోవాడు గోల్డ్ మైన్స్ లో సూపర్ వైజరు అతని భార్య వో గోల్డ్ ఫీల్డ్.....కుటుంబమూ పరిమితమే. అపరిమిత మయినా ఆదాయం వున్నా వీళ్ళకేమీ పంపించదు. ఆవిడకి వీళ్ళంటే గిట్టదు. వీళ్ళ ఏదో యివ్వాల్సొస్తుందనే పూర్తిగా తెగతెంపులు చేసుకొని వెళ్ళింది.
మూడోవాడు ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ లో టైపిస్ట్ అతను అన్నగారిని ఫాలో అవుతాడు.
ఇద్దరి కూతుళ్ళకి పెళ్లిచేసి, ముగ్గురు కొడుకుల్ని చదివించేసరికి ఉన్నది, వెనకేసింది అంతా హరించుకుపోయింది. దాని కాయనేం వర్రీ అవటం లేదు. కానీ బ్రతకటానికి యిప్పుడు జీతం డబ్బులే ఆయనకి గతి.
దాన్లోనూ లోగడ తీసుకున్న అప్పులలో కటింగ్స్ పోనూ భార్యాభర్తలకి బొటాబొటీగా అవుతుంది.
దానికితోడు ఆయనకీ జబ్బు చేసింది ఓనెల పాటు మందులకి, తిండికి, పథ్యాలకి రెట్టింపు ఖర్చు అయింది.
కొద్దిగా తేరుకోగానే డ్యూటీకి వెళ్ళాడు. ఎలాగో లాగించేద్దామనుకున్నాడు! వారం తిరక్కముందే ట్రాన్స్ ఫర్ వచ్చింది ఆయనకీ. ఆ విధిలేని పరిస్థితులలో స్టేషన్ వదలక తప్పలేదు. ఊరు వదిలేముందు మంచిగా అనిపించుకోటానికి చేతిలో, సేవింగ్స్ లో వున్నదంతా కొట్లల్లో వున్న బాకీలు తీర్చేందుకే సరిపోయింది ఏమీ మిగల్లేదు.
ఉన్న సామానంతా గోనె సంచుల్లో, చెక్క పెట్టెల్లో సర్ది ఎం.జి.కి బుక్ చేశారు. ఆర్డరు వచ్చేక టపా కట్టేసి వెళ్ళిపోతున్నంత యమయాతన పడ్డారు! తమతో ఒక సూట్ కేస్ మాత్రం వుంచుకున్నారు. ఏమి ఆలోచించుకున్నారో ఏమో బయలుదేరేముందు భార్యా భర్తలు ఇద్దరూ వచ్చారు. ఎంత మధన పడుతున్నారో వాళ్ళ ముఖాల్లో కళాకాంతులు లేవు.
వాళ్ళని చూడగానే నారాయణ, సుందరమ్మా ఆప్యాయంగా ఆహ్వానించారు. వాళ్ళకి ట్రాన్స్ ఫర్ వచ్చినందుకు యింత అర్దాంతరంగా వెళ్తున్నందుకు, విచారపడ్డారు ఆమెకి ఆయనకి కాఫీలు ఇచ్చింది సుందరమ్మ.
తర్వాత ఆమెకి బొట్టుపెట్టి రవిక ఇచ్చింది సుందరమ్మ అది అందుకుని కన్నీళ్ళతో "ఎందుకమ్మా ఇవన్ని మాకు నేనేం ఆడబిడ్డనా?" అందామె.
"వదినగారూ? నాలుగేళ్ళున్నారు మా ఇంట్లో! బాగా కలిసిపోయాయి కుటుంబాలు! ఒక్కసారయినా మనం సరదాకయినా పోట్టాడుకోలేదు. అన్నగారు జబ్బుపడి కోలులోకముందే ట్రాన్స్ ఫర్ చేశారు. ఇంకా కొన్నాళ్ళుంటే బావుండేది. అయినా ఇంకో ఏడాదికి ఎలాగూ రిటైరవుతారు కదా రిటెన్షన్ కోసం ప్రయత్నంచేసి వుండకూడదా? రిటైర్ అయ్యాక ఏ అబ్బాయి దగ్గరికో వెళ్ళితే అయ్యేది!" అంది.
ఆమె ముఖం మ్లానమైంది. "ఎందుకంటావులేమ్మా? కొడుకుల్ని కన్నాను కానీ వాళ్ళ అదృష్టాల్ని కన్నానా? కొడుకులు నా వాళ్ళే కోడళ్ళు నా వాళ్ళా? ఇలా ట్రాన్స్ ఫర్ అయింది చేతిలో చిల్లిగవ్వ లేదు డబ్బు పంపించండి. జీతం రాగానే అవసరమనుకుంటే మళ్ళీ పంపుతానంటే ఒక్కగాడిద కొడుకు ఒక్కపైసా పంపలేదు! కొడుకులు కొడుకులు అనిమురిసిపోవటమే కానీ ఏం లాభం లే వొదినా! అంతా ఋణ విముక్తికి పుట్టుకొచ్చినవాళ్ళే!"
ఆ మాటలకి సుందరమ్మ ఏమీ అనలేదు. ఇన్నాళ్ళ నుంచీ చూస్తూవున్న కథే అనుకుని నిట్టూర్చింది ఆమె అదృష్టానికి! "వెళ్ళొస్తామొదినా!" అంది ఆమె.
ఆయన లేచి నారాయణ దగ్గరకు వచ్చి "ఏమండీ ఈ నెలలో ఇరవైరోజులదీ, వెనుకటి నెలది బాడుగ యివ్వలేక పోయాను. ఎంత ప్రయత్నించినా వీలుపడలేదు. అక్కడ చార్జీ తీసుకున్న తర్వాత జీతం రాగానే పంపుతానని చెప్పటానికి మనసు అంగీకరించటం లేదు. ఇదిగో ఈ గడియారం మీతో అట్టిపెట్టండి. నేను వచ్చే ఫస్టు తర్వాత బాడుగతెచ్చి దీన్ని తీసుకవెళతాను. అసలు దీన్ని అమ్మేసి డబ్బే ఇవ్వాలనుకున్నాను.