Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 13


    "నీ పుట్టుక గురించి....."
    "నా పుట్టుక గురించా?" అని వాళ్ళకేసి తిరిగి ఇద్దర్నీ చురుగ్గా చూశాడు.
    "ఆ చూపులకు రవి జంకాడు.
    తన అన్నయ్య ముందు నిల్చున్నట్టే అనిపించింది అతడికి.
    "ఏం నా పుట్టుక గురించి మీకు వివరాలు కావాలా?" గౌతమ్ ముఖంలోని కండరాలు బిగుసుకున్నాయి.
    "మమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దు. మీ వెల్ విషర్స్ గానే వచ్చాం."
    "వెల్ విషర్స్ ! గుడ్!" అని పకపక నవ్వాడు గౌతమ్.
    "అవునండీ."
    "మీరు నాకు వెల్ విషర్స్? రాస్కేల్స్, ఏదో ఉద్దేశ్యంతో వచ్చారు. మీ మాటలు నమ్మేంత అమాయకుణ్ణి కాదు. మా అమ్మను ఏమన్నారు? అసలు ఎందు కొచ్చారు? చెప్పు!" అంటూ పక్కనే ఉన్న రవి షర్టు కాలరు దగ్గరగా పట్టుకొన్నాడు.
    అనుకోనిది జరగడంతో రవికి భయం వేసింది.
    విశ్వం బిత్తరపోయి చూశాడు.
    "బాబో౧ వాళ్ళను ఏమీ చెయ్యకు. వాళ్ళు నన్నేమీ కాని మాటలు అనలేదు" అన్నది వర్ధనమ్మ.
    గౌతమ్ ఆమె మాటలు వినిపించుకోలేదు. షర్టు పట్టుకొని రవిని ముందుకు లాగాడు. రవి ముందుకు పడబోయి తమాయించుకున్నాడు.
    "నా షర్టు వదులు. నేనేమీ మీ అమ్మను అనలేదు" బిక్కమొహం వేసి అన్నాడు రవి.
    గౌతమ్ రవి ముఖంలోకి ఓ క్షణం చూసి షర్టు వదిలేశాడు.
    "మమ్మల్ని కొట్టడానికి సిద్దపడతావేం? మేము నిన్ను వెతుక్కుంటూ వస్తే!" అన్నాడు విశ్వం కాస్త బిక్క మొహం వేసి.
    "నన్ను వెతుక్కుంటూ వచ్చారా? అదే ఎందుకో చెప్పమంటూన్నాను."
    "మీకు ఒక మంచి న్యూస్ చెప్పాలనే వచ్చాం.
    "ఏమిటది? మరి చెప్పరేం?"
    "మీరలా కోపంగా ఉంటె?"
    "ఓ అదా! కూర్చోండి. అమ్మా కాఫీ ఇస్తావా?" "అలాగే బాబూ!" అంటూ వర్ధనమ్మ ఓసారి ఇద్దర్నీ చూసి లోపలకు వెళ్ళింది. వాస్తవానికి ఆమెకు అక్కడ్నుంచి వెళ్ళాలని లేదు.
    అన్నయ్య ఇలా మొరటుగా ప్రవర్తించడు. ఇతడి మాటలు చేష్టలు ఘాటుగా ఉన్నాయి. కారణం పెరిగిన వాతావరణం కావచ్చు. చుట్టూ ఉండే మనుషులూ, పరిసరాల ప్రభావం ఒక వ్యక్తీ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతుంది.
    "ఇతడి పేరు రవి, నీకు చాలా దగ్గరవాడు."
    విశ్వం మాటలు అర్ధం కానట్టు చూశాడు.
    "నీకు బంధువు."
    గౌతమ్ తుళ్ళి పడ్డాడు లోలోపలే. బంధువా? తన బంధువా? తనకెవరూ బంధువులు లేరే? పైగా అతడి వాలకం, దుస్తులు చూస్తే శ్రీమంతుడిలా కనిపిస్తున్నాడు. ఇంతవరకు తన ఇంటికి ఇలాంటి బంధువు ఎవడూ రాలేదు.
    "ఇతను అన్నపూర్ణమ్మ కొడుకు"
    "అసలు అన్నపూర్ణమ్మ ఎవరో తెలిస్తేగా అన్నపూర్ణమ్మ కొడుకంటే తెలియడానికి? ఏ ఊరు నుంచి వచ్చారు?" సీరియస్ గా అడిగాడు.
    "హైదరాబాద్ నుంచి ఇతని నాన్నగారి పేరు శంకర్రావు."
    చివ్వున తలఎత్తి రవి ముఖంలోకి చూశాడు గౌతమ్.
    "శంకర్రావా? ఎవరా శంకర్రావ్?"
    "ఆ పేరు నీకు తెలుసు!"
    గౌతమ్ విశ్వం ముఖంలోకి సాలోచనగా చూశాడు. మరుక్షణం అతడి నొసలు ముడిపడ్డాయి.
    "వీరిల్లు నీకు తెలుసు."
    "ఇది మరీ బాగుంది. వీరిల్లు తెలుసంటావ్. శంకర్రావంటావ్. అన్నపూర్ణమ్మంటావ్. సరిగా చెప్పండి. నాకంతా అయోమయంగా ఉంది."
    "పోయిన శుక్రవారం రాత్రి నువ్వు వీరింటికి వచ్చావు గదూ?"
    నేనా? వీళ్ళింటికా ? నాకేమైనా పిచ్చా? ఎవరో అనుకుని, ఇక్కడ కొచ్చినట్టున్నారు. పైగా ఎప్పట్నుంచో తెలిసినట్టుగా నువ్వు నువ్వంటూ మాట్లాడుతున్నారు?"
    "అవును, నువ్వు మాకు కావాల్సినవాడివి. పైగా నీతో మాట్లాడుతుంటే అచ్చం రవి అన్నయ్యతో మాట్లాడుతున్నట్లే ఉంది. అందుకే అనుకోకుండా నువ్వు అనే సంభోధన నా నోటి నుంచి వచ్చింది. ఏమీ అనుకోవద్దు."
    "ఫర్వాలేదు. అసలు విషయానికి రండి."
    "నువ్వు పోయిన శుక్రవారం రాత్రి 9.30 గంటలకు శంకర్రావుగారి ఇంటికి వచ్చావు.
    గౌతమ్ ముఖం వెలతేలా పోయింది.
    "నేనా? శంకర్రావు గారింటికి వచ్చానా? ఈ జోక్ మరీ బాగుంది." మనసులో కలిగిన సంచలనాన్ని బయటికి కనిపించకుండా బింకంగా అన్నాడు.
    "ఇందుమతి నిన్ను చూసింది."
    "ఆవిడెవరు?"
    "మా గౌతమ్ ప్రియురాలు."
    "ఓ! గౌతమా? అతడెవరు?"
    "బుకాయించకండి. గౌతమ్ ఎవరో నీకు తెలుసు. అచ్చం మీలాగే ఉంటాడు. ఈరవికి సాక్షాత్తు అన్నయ్య.
    "అవునా?"
    "అంటే గౌతమ్ తెలుసనేగా?"
    గౌతమ్ నాలుక కొరుక్కున్నాడు.
    "నాకు తెలియదు." నిటారుగా కూర్చున్నాడు.
    "తెలియదా?"
    "తెలియదు"
    "చిన్నప్పట్నుంచి ఎవరూ మిమ్మల్ని మరో వ్యక్తిగా భావించి పలకరించలేదూ?"\
    "అదా? అలా చాలాసార్లు జరిగింది."
    "మరి ఆ విషయం మీరు ఆలోచించలేదా?"
    "ఇందులో ఆలోచించటానికేముంది? అలాంటివి చాలాసార్లు చాలా మంది జీవితంలో జరుగుతూ ఉంటాయి. మనిషిని పోలిన మనుషులుంటారు."
    "కాదు, కేవలం ఏదో పోలిక చూసి పొరపాటు పడటం జరుగుతూ ఉంటుంది. తీరా చూశాక అలా పలకరించినావాళ్ళు బిక్కమొహం వేస్తారు. నీ విషయంలో మాత్రం అలా కాదు. నువ్వు కాదు మొర్రో అన్నా నువ్వు బుకాయిస్తున్నా వనుకుంటారు. అంతవరకెందుకు. ఆరోజు రాత్రి నిన్ను హోటల్ దక్కన్ లో చూసి మా గౌతమ్ అనే ఆనుకున్నాను."
    మీరు నన్ను హోటల్ దక్కన్ లో చూశారా? నేను హైదరాబాద్ రాందే?"
    "ఆరోజు మీరు హైదరాబాద్ లో ఉన్నారు. ఆ రాత్రి మీరు అన్నపూర్ణమ్మను చూడటానికి వచ్చారు. మిమ్మల్ని చూసి ఆమె మూర్చపోయింది."
    రవి మౌనంగా కూర్చుని గౌతమ్ ని చూస్తున్నాడు. అతడికి తమాషా అనుభూతి కలుగుతోంది. గౌతమ్ కూడా విశ్వంతో మాట్లాడుతూనే మధ్య మధ్య రవిని చూస్తున్నాడు.
    "ఇవన్నీ మీకెవరు చెప్పారు?"
    "పరిస్థితుల్ని బట్టి మేమే తెలుసుకున్నాం."
    "ఇప్పుడు మీరెందు కొచ్చినట్టు?" మళ్ళీ అతడి కంఠం కరుకుగా పలికింది.
    హోటల్లో నన్ను చూస్తే మరి పలకరించలేదేం?" గౌతమ్ కుర్చీలో అసహనంగా కదిలాడు.

 Previous Page Next Page