"ఓకే. కం ఆప్టర్ సిక్స్!" అవతల పరశురాం ఫోన్ పెట్టేశాడు. "మహతీ! నేనెవర్నో చూడాలంటున్నానని చెబ్తున్నావ్?" "మా అంకుల్ కు" "అంకులా? నీకో అంకుల్ ఉన్నాడనే తెలియదే. నేను చూడాలనడం ఏమిటి?" "ప్రొఫెసర్ పరశురాంను చూద్దామనుకున్నాంకదా? ఆయనే ఫోన్ చేసింది. ఆయన్ను నేను అంకుల్ అనే అంటాను". "నాకు ప్రొఫెసర్ పరశురాం ని చూడాలనినీతో అన్నానా?" ఆశ్చర్యంగా అడిగాడు. "ఉట్టినే నేనే చెప్పాను. అల చెప్తేగాని ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వడని. లే భోజనం చేద్దాం". మహతి రవిచెయ్యి పుచ్చుకుని లేవదీసింది. భోజనాలయ్యాక రవి వెళ్తానని బయలుదేరాడు. "ఇప్పుడెక్కడికి వెళ్తావ్! రెండు దాటింది. అంకుల్ దగ్గర కెళ్ళొద్దాం?" అతన్నాపి అడిగింది. "ఆరింటికి కదా? మళ్ళీ వస్తావా?" అనుమానంగా అడిగింది. "ఏం నమ్మకంలేదా?"
"ఈలోపల అతనొస్తే?" కలవరపడింది మహతిమాట జారినందుకు. "ఎవరూ?" "కిరణ్" తృటికాలం అతడికళ్ళలోకి చూసి--చూడలేకతల పక్కకు తిప్పుకొంది. "కిరణా? ఎవరతను? మీ బంధువా?" "స్నేహితుడు" "ఊ( వస్తే--ఏమిటి ఇబ్బంది?" "మన ప్రోగ్రాం చెడగొడ్తాడు. తనతో బయటికి రమ్మంటాడు" "రమ్మంటే వెళ్ళు" ముక్తసరిగా అన్నాడు రవి. "నువేం మనిషివిరా బాబూ!" అన్నట్టు మహతి అతని ముఖంలోకి చూసింది. అంకుల్ అపాయిమెంట్ ఇచ్చారు. వెళ్ళకపోతే విసుక్కుంటారు. ఆయనకాలం అమూల్యమైంది". "ఆ మాటే అతడితోచెప్పు" "కిరణ్ వినడు. మొండివాడు" "అందుకు నేనేం చెయ్యగలను" "నువిక్కడే ఉండిపో" "నేనుంటే అతడురాడా?" నవ్వుతూ అన్నాడు. "రాడు!" అంతలోకే సర్దుకొని "ఒకవేళ వచ్చినా, నిన్ను చూసి తిరిగి వెళ్ళిపోతాడు" అంది మహతి. "పిరికివాడా?" "కాదు. సాహసి, ధైర్యశాలి" "అయితే నన్ను చూసెందుకుపారిపోతాడు?" "ఆమెకు నోట మాటరాలేదు. బుర్రకుతకుతలాడిపోతోంది. "అతడికి మగవాళ్ళనుచూస్తే సిగ్గేమో?" అదోలా నవ్వాడు అతను. ఆ నవ్వును ఆమె భరించలేకపోయింది.
"కాదు. చాలా చొరవ ఉన్న మనిషి. ఆడా మగాఅన్న తేడా లేకుండా అందరితో కలసి మెలసి తిరుగుతాడు. కొత్తా పాత అన్నా సంశయం కూడా ఉండదు". "అయినా నన్ను చూసిపారిపోతాడు. అవునా? మీ అంకుల్ పరశురాం----- అదే సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్ళాల్సింది అతడ్నే. నన్నుకాదు. అతడ్ని తీసుకెళ్ళు "డోర్ గట్టిగా గుంజితెరిచాడు. "నువ్వంటే అతనికిఇష్టంలేదు" ఆ మాట అతని గుండెకుశూలంగా తాకింది. డోర్ హాండిల్ మీద చెయ్యి బిగుసుకుపోయింది. స్థాణువులా నిలబడిపోయాడు కొద్ది క్షణాలు. "పరిచయమే లేదు. అతడి కెందుకిష్టం లేదో! చిత్రంగా ఉందే?" "అతడికి నువు తెలుసు" "ఇది ఇంకా బాగుంది. తెలిసినంత మాత్రాన?" "నువంటే దేషం, అసూయ పెంచుకొనే మనుషులకే సైకియాట్రిస్టుల అవసరం ఉంది. ఈ సాయంకాలమే అతడ్ని మీ అంకుల్ దగ్గరకు తీసుకెళ్ళు". "అకారణంగా కాదు. సకారణంగానే" ముఖంమీద కొరడా ఝుళిపించినట్టుగా అయింది అతనికి. "కారణమా? ఏమిటది?" ఎప్పుడూ అద్దినట్టుగా ఉండే ప్రశాంతత అతడిముఖంలో నుంచి మాయమైంది. "అతను నన్ను ప్రేమిస్తున్నాడు" మహతి ఊపిరిబిగబట్టి అతడిముఖంలోకి చూసింది. "ఓస్! అంతేనా?" అతని పెదవులపై విరిసిన చిరునవ్వును చూసి ఆమె త్రుళ్ళిపడింది. ఏమిటీ మనిషి? ఏమిటి వ్యక్తిత్వం? "దేవి ఒక్కతే. ఆరాధకులు ఎంతోమంది ఉంటారు. అందులో తప్పేముంది". "నీలా అందరూ అనుకోవద్దూ?" ఆమె ఉద్విగ్నతతో అంది. "అతడికి తెలియకపోతేనువే అతడికి చెప్పొచ్చుగా?" మెల్లగా చల్లగాశాంతంగా అన్నాడు. "అది నావల్ల కాదు" మొండిగా అంది. "అయితే మీ అంకుల్ తో చెప్పించు-----" ప్రశాంతంగా నవ్వాడు రవి. ఆమె నిరుత్తరై నిలబడిపోయింది. "మహతీ వస్తా" అతను హుందాగా నడుస్తూ వెళ్ళిపోయాడు. ఆమె అతను వెళ్ళినవైపే చూస్తూ స్థాణువులా నిలబడిపోయింది. అలా ఎంతసేపు నిలబడిందోమరి! ఆమె బయటికివచ్చి చూసేసరికి అతనికారు వెళ్ళిపోతూ కన్పించింది. వస్తాడా? తిరిగొస్తాడా? అతనే వస్తాడా? వీణ దగ్గిర కెళ్ళి కూర్చుంది. తంత్రులను కసిగా మీటింది. తీగతెగింది. మళ్ళీ అదే తీగతెగింది. తెగినతీగ మళ్ళీ తెగింది.
మహతి గేటువైపు చూస్తూ వరండాలో కూర్చుని ఉంది. టైంచూసుకొంది. ఆరు కావస్తోంది. అతను ఇంకా రాలేదు. కిరణ్ వస్తాడేమో? ఆమె గుండెలు దడదడలాడాయి. లేదు, లేదు. రవి వస్తాడు.ల అతనేవస్తాడు. ఒకవేళ కిరణ్ వస్తే? ఆ ఆలోచన రాగానే భయంకరంగా అన్పించింది మహతికి. ఎవరూ రారేమో? ఈ భావం కొంత రిలీఫ్ ను కలిగించింది ఆమెకు. అంతలోనే ఆ రిలీఫ్ లో నుంచి నిరాశ తొంగి చూసింది. అంతలో గేటు దగ్గరలో పలికి తిరుగుతున్నకారు కన్పించింది. ఆదుర్దాగా లేచి నిలబడింది. ఆ వచ్చేదెవరో? గబగబా మెట్లుదిగింది. అతను కారాపి దిగాడు. 'హమ్మయ్య' నిట్టూర్పు విడిచింది. అతడే వచ్చాడు. కారు దగ్గరకు పరుగుతీసింది. "రవీ! వెళ్దామా?" అతడు చిరునవ్వుతోనే అంగీకారాన్ని తెలియజేశాడు. మహతి అతనిపక్కన కార్లో కూర్చుంది. కారు గేటు దాటి రోడ్డెక్కింది. "సరిగ్గా టైంకొచ్చావ్. వస్తావో రావోనని ఎంత గాభరా పడ్డానో?" "అతడు రాలేదు?" రవి కారు స్లో చేశాడు. ముందు ఆటో వెళ్తోంది. ఆటోను కూడా ఓవర్ టేక్ చెయ్యలేడా? కిరణ్ అయితే ఈ పాటికి ఎన్నింటిని ఓవర్ టేక్ చేసేవాడో? సగం దూరంవెళ్ళి ఉండేవాడు. "రాలేదా" ముందుకుచూస్తూనే మళ్ళీఅడిగాడు. "ఎవరూ?" "నీ ప్రియుడు" "అని ఎవరు చెప్పారూ?" మహతి ఉలిక్కిపడింది. "నువే" "నేను అతడ్ని ప్రేమిస్తున్నానని నీతో చెప్పానా?" "అతడు నిన్ను ప్రేమిస్తున్నాడనిచెప్పలేదా?" "కాని, అతడ్ని నేను ప్రేమిస్తున్నానని మాత్రంచెప్పలేదు" "పోనీ ఇప్పుడు చెప్పు" "ఏమని?" "ప్రేమిస్తున్నానని" "ఎవరిని?" "నువు ప్రేమించేవాళ్ళనే" "నేనెవర్నీ ప్రేమించడంలేదు" "అది అబద్దం అనినీకూ తెలుసు" అతను నవ్వాడు. ఆ నవ్వులో విషాదం ఉంది. ఆమె ఖంగారు పడింది. "ఇటు ఇటు రైటుకు తిప్పు" అతడు కారు కుడి వైపు వీధికి తిప్పాడు.