Previous Page Next Page 
రాగహేల పేజి 13

   "నువేదో కధ చెప్తానన్నావ్-చెప్పనేలేదు" "కధా" "అవును, అప్పుడే మర్చిపోయావా? ఈసఫ్ ఫేబుల్స్ కధచెప్తానని ఎదురుగా కూర్చోబెట్టుకొన్నావ్ నన్ను" "అవునవును" "మరి చెప్పు" "సరే విను" అతడు ముందుకు వంగి ఆమె ముఖంమీద వాలుతున్న ముంగురులను చూస్తూ మొదలుపెట్టాడు. "ఓ అబ్బాయి, ఓ అమ్మాయిని ప్రేమించాడు" "ఇది చాలా పాతకధే" పెదవి విరిచింది మహతి. "అవును, సృష్ట్యాదిగా వస్తున్న కధే ఇది. ఆదం ఈవ్ తో మొదలయిన ఈ కధ, మానవులమనుగడ ఈ భూమిమీద ఉన్నంత కాలం నడుస్తూనే ఉంటుంది. ఈ కధకు ఆదిమధ్యాంతాలు లేవు. భూతభవిష్యత్ వర్తమానాల తేడా లేదు. "గ్రేట్ జీనియస్!" అతడ్ని చూస్తూ అనుకొంది మహతి. గడ్డం కింద అరచెయ్యి ఆనించి శ్రద్దగా వినసాగింది. "ఊఁ చెప్పు! అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు" "ఓ రోజు ఆ అమ్మాయి, అబ్బాయి తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలనుకుంది" "చిన్న సందేహం! ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించిందా?" "ఆ సంగతి ఈ కధలో లేదు" "అయిది అది మనకధే" అప్రయత్నంగా అనేసింది మహతి. ఆమె గుండెలు వేగంగా కొట్టుకొన్నాయి. అతని రియాక్షన్ కోసం ఆదుర్దాగా అతని ముఖ్మలోకి చూచింది. అతడి పెదవుల మీద చిరునవుతృటికాలం కదిలి అదృశ్యమైంది. ఏమి వ్యక్తిత్వం? ఎంతటిసహనం? ఎంత ప్రశాంతత? ఆమె ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. "ఊఁ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత?" ఎంతో ఆలోచించి ఆ మాట అంది మహతి. అతను తన సజెషన్ ను అందుకుంటాడనుకుంది. "లేదు" అతడు ఎలాంటి బెరుకు లేకుండా అన్నాడు. ఆమె తన కనుపాపలపై ఆవరించిన నిరాశనుకనురెప్పల చాటునదాచుకున్నది. "పరస్పరం ప్రేమించుకొంటే ఆ కధే వేరు. వాళ్ళ ప్రేమ సాఫల్యానికి అడ్డంకులు సామాజికమైనవి అయితే కధ నడుస్తుంది". "అలాంటి అడ్డంకులు, వత్తిడులూ లేకపోతే?" చూపులు అతని ముఖంమీదనిలిపి అడిగింది. "ప్రేమించుకొని పెళ్లిచేసుకొన్న వాళ్ళూ, పెళ్లి చేసుకొని ప్రేమించుకున్నవాళ్ళు కొన్ని కోట్లమంది ఉన్నారు. అయినా వాళ్ళప్రేమలు కధలకు ఇతివృత్తాలు కాలేదు. పండిన పంట ఇంటికిచేరితే కధకాదు. ఈనగాచి నక్కలపాలైతేనే కధ"    
    "రవీ!" ఆమెకేదో భయంభయంగా ఉంది. "అసలైన సిసలైన ప్రేమకధ ఒన్ వే ట్రాఫిక్ లోనే ఉంటుంది" మహతి ముఖంలో వచ్చిన మార్పు గమనించి ఆగాడు రవి. "మహతీ? ఇదినిజంకాదా?" ఆమె తనలో పొంగిన భావపరంపరలను అదుపులో పెట్టుకొని" అసలు కధలోకి రా" అంది. "ఇదే?" "ఏదీ!" ఆమె త్రుళ్ళిపడింది. అతను ఆర్ద్రంగా చూశాడు ఆమె మనసు కరిగింది. ఎటో జారిపోతోంది. "వింటున్నావా?" "ఊఁ" "అమ్మాయితో అబ్బాయన్నాడు-డార్లింగ్, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేకపోతున్నాను. నీకోసం ఏదైనా చేస్తాను" అంతవరకు చెప్పి ఓ క్షణం ఆగి మళ్ళీ కధ మొదలు పెట్టాడు రవి------ "నిజంగా?" ఆమె అడిగింది. "ముమ్మాటికీ" అతడు చెప్పాడు. "మాట తప్పవుగదా?" "తప్పను" ఆమె ఆలోచించింది. "డియర్, చెప్పు నన్నేం చెయ్యమంటావో!" అతడు ఆవేశంగా అడిగాడు. ఆమె ఓసారి అతడి ముఖంలోకి చూసింది. "డియర్, ఇంకా అనుమానమా?" "నిజంగా నువు నాకోసం ఏదైనా చేస్తావా?" "నా ప్రేమ శంకిస్తున్నావా ప్రియా? చెప్పు ఏం చెయ్యమంటావు? నిప్పుల్లో దూకమంటావా? ఉరేసుకొని చావమంటావా?" "నువు చస్తే నాకేమొస్తుంది?" "మరి ఏం తెమ్మంటావ్?" "మీ అమ్మ గుండెకాయ" ఆమె అతడి కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో ప్రేమ మత్తు తగ్గలేదు. వెలుగు ఆరలేదు. ప్రేయసి పెట్టినప్రేమ పరీక్షకు నిలబడాలనే కృత నిశ్చయం ఉంది ఆ కళ్ళల్లో. గిర్రున వెనక్కు తిరిగాడు. ఇంటికేసి పరుగు లంకించుకున్నాడు. తల్లిని చంపాడు. గుండెకాయ తీసి పట్టుకున్నాడు. మళ్ళీ పరుగు. ఆలస్యం అయితే ప్రేయసిఏమనుకొంటుందో మరి! తన ప్రేమ ఎంత గాఢమైనదో తెలపడానికి అతని అణువణువులో ఉద్వేగం. పుట్టదాటి, గట్టు దాటి పరుగుతీస్తున్నాడు. ఎదురుదెబ్బ తగిలింది. బొక్క బోర్లా పడ్డాడు. చేతిలోని గుండెకాయ అల్లంత దూరానపడింది. లేచిమోకాళ్ళకంటినమట్టి దులుపుకున్నాడు. దూరంగా పడి ఉన్న తల్లిగుండె కాయను సమీపించాడు. వంగి భద్రంగా రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. "బాబూ! దెబ్బతగిలిందా?" తల్లిగుండె ఆక్రోశించింది.    
    "రవీ! ప్లీజ్ ఆపు, ఇక చెప్పకు. నేను వినలేను" మహతి కంఠం రుద్దమైంది. కళ్ళల్లో నీరు ఉబికింది. చెంపలు ఎరుపెక్కాయి. ఆమె లేచి వెళ్ళి వీణ అందుకొని శృతి చేసింది. "మహతీ" అతని పిలుపు ఆమెకు విన్పించలేదు. వీణమీద వేళ్ళు కదులుతున్నాయి. ఆమె మనసులోని అశాంతిని ఆ వీణా నాదం విన్పిస్తోంది. రవి వీణ వింటూ శాంతించాడు. "ఏంటమ్మా, ఇంకా కచేరీచేస్తూనే కూర్చున్నావ్! భోజనానికి ఆలస్యంఅయిపోవడంలా? అబ్బాయినికూడా ఇక్కడే భోంచెయ్యమను" డ్రాయింగ్ రూంలోకి వచ్చినతల్లిని చూసి మహతి వీణ పక్కన పెట్టిలేచింది. "అమ్మా! అన్నీ టేబుల్ మీదపెట్టి నువెళ్ళి రెస్టు తీసుకో. మేం వడ్డించుకుంటాం" మాట పూర్తికాకుండానే ఫోన్ మోగడం విన్పించి మహతి ఫోన్ వైపు నడిచింది. రిసీవర్ ఎత్తింది. "హల్లో! ఆ( ఆ( మహతినేమాట్లాడుతున్నా అంకుల్, నేనే చేయాలనుకుంటున్నా ఇంతలో మీరే చేశారు. ఆ( గుర్తుంది. సాయంకాలం అపాయింట్ మెంట్ గురించేగా? వస్తున్నాను అంకుల్". "నాలుగున్నరకు వేరే అపాయింట్ మెంట్ ఉంది. చాలా అర్జెంటు కేసు. రావద్దని చెప్పడానికే ఫోన్ చేశాను మహతీ". "ఐతే ఐదూ ఐదున్నరకు రమ్మంటారా అంకుల్?" "కొత్త కేసు టైం పట్టొచ్చు. రేపు ఉదయం ఎనిమిదింటికి రాకూడదూ?" "లేదంటే ఆరింటికొస్తాం. రవి మిమ్మల్ని చూడాలంటున్నాడు"

 Previous Page Next Page