"పరశురాంగారుండేది--?" "న్యూ మూన్ హోటల్ పక్క వీధిలో" మహతి చెప్పింది. అతడు తనలోతనే నవ్వుకొంటున్నాడు. అది ఆమె చూసింది. "ఎందుకు నీలో నువ్వేనవ్వుకొంటున్నావ్?" "న్యూ మూన్ అంటేగుర్తొచ్చి" "ఏమిటొచ్చింది?" "నో మూన్ గుర్తొచ్చింది" "నాకేం అర్ధం కావడంలేదు" విసురుగా అంది మహతి. "న్యూ మూన్--నోమూన్ అంటే అమావాస్య--పౌర్ణమేగదా? మీ అంకుల్ సరిగ్గా ఉండాల్సినచోటే ఉన్నాడని నవ్వొచ్చింది". "అంకుల్ ని నువ్వలా హేళనగా మాట్లాడటం నాకిష్టం లేదు" మహతికోపంగా అంది. "సారీ! మహతీ! నన్నపార్దం చేసుకొన్నావ్. అమావాస్యకూ పౌర్ణమికీ పిచ్చి ఎక్కువవుతుందని మన పెద్దవాళ్ళు చెప్పడం నువినలేదా? ఆధునిక మనో విజ్ఞానశాస్త్రప్రకారం కూడా కొంతవరకు అది నిజమేనని తేలింది. అమావాస్యకూ పౌర్ణమికీ సముద్రంలో అలలు ఉవ్వెత్తుగా లేస్తాయి. ఎందుకో తెలుసా? చంద్రుని ఆకర్షణకు సముద్రం పొంగుతుంది. అలాగే మనిషిలో ఉండేద్రవాలూ పొంగుతాయి. ఉద్రిక్తతను కలిగిస్తాయంటారు" అనిఆగి "ఇదే బజారు కదూ?" అంటూ రవి న్యూ మూన్ హోటల్ పక్క వీధిలోకి కారు తిప్పాడు. "అయితే ఇప్పుడు ఎవరికీ పిచ్చంటావ్?" మహతి కంఠం జీరపోయింది. "ప్రొఫెసర్ పరశురాంగారి....." "రవీ!" గొంతు నొక్కినట్టుఅయ్యింది మహతిక
"పరశురాంగారి దగ్గరకు వచ్చేవాళ్ళకు అమావాస్యకు, పౌర్ణమికీ పిచ్చి ఎక్కువవుతుందంటున్నాను. అంతేకాని పరశురాంగారికి పిచ్చి అనడంలేదు". సరిగ్గా అతను కూడా ఇలాగే అన్నాడు. వాళ్ళిద్దర్లోదేన్లోనూ పోలికలేకపోయినా ప్రొఫెసర్ పరశురాంగారి గురించి ఏకాభిప్రాయమున్నట్టుంది. ఇతను సుతిమెత్తగా చెప్పాడు. అతడు కటువుగా చెప్పాడు. అంతే తేడా! అవును! అంతే! "వచ్చేశాం అదిగో ఆ రెండో ఇల్లే" అతనిభుజం తట్టి పరశురాంగారి ఇల్లు చూపించింది మహతి. రవి రోడ్డు పక్కగా కారాపాడు. మహతిదిగి అతని కోసం ఆగింది. కారు మెల్లగా దిగి, డోర్ అద్దాలను చిన్నగా ఎత్తి, తాపీగా లాక్ చేశాడు. మళ్ళీ లాక్ పడిందోలేదోనని డోర్ లాగి చూసుకున్నాడు. చుట్టూ కలియచూస్తూనిల్చున్నాడు. "అబ్బా! ఏమిటి రవీ! కారెక్కడికీపోదులే. రా త్వరగా" ప్రహరీ గోడకు తగిలించివున్న నేమ్ బోర్డు చదువుతూ నిల్చున్న రవిని చూసి విసుగ్గా అన్నది. "అన్నీ తప్పులే" నసిగాడతను. "అబ్బా! ఏమిటి నీ సణుగుడు. రమ్మంటుంటే" అసహనంగా అందిమహతి. 'సు'గాదు 'శు' గొణుక్కున్నాడు. "అబ్బ! 'సు', శ, అలు ఏమిటిరవీ!" అతని చెయ్యి పట్టుకుని గుంజింది కదలమన్నట్లు. "స్పెల్లింగ్ మిస్టేక్స్" "మీనింగ్ సరిగా వుంటే చాల్లే. పద పద" "స్పెల్లింగ్ లేకుండా మీనింగ్ వుండదు. అక్షరాల్నిబట్టి అర్ధాలు మారుతుంటాయి. చూడు-పొ,పరశురాం అని వుంది. పొ కాదు ప్రొ అని వుండాలి. ప్రొ ప్రక్కన వుండాల్సింది కామాకాదు. అఫాస్టఫియస్ వుండాలి. అక్కడ 'న' కు కొమ్మిచ్చిన 'సు' కాదు వుండాల్సింది. 'శ' కు కొమ్మిచ్చిన 'శు' వుండాలి. సైకాట్రిస్టు కాదు, సైకియాట్రిస్టు అని వుండాలి" బోర్డుమీదవున్నా అక్షరాలను వేలెత్తి చూపిస్తూ పక్కన వున్న మహతి వింటోందా లేదా అన్నధ్యాస లేకుండా నే చెప్పుకుపోతున్నాడు రవి. "ఇంగ్లీషులో వున్న మీ అంకుల్ పేరు చూడు. ఎ అర్ధం స్ఫురిస్తుందో చెప్పు". అప్రయత్నంగానే ఆమెచూపులు బోర్డుమీద నిలిచాయి. "ఏం? సరిగానే వుంది. నువేమిటో అక్షరాలన్నీ పీకి పీకి లాగిలాగి అర్ధాలను తలకిందులు చేస్తున్నావ్" ఆమెచిరాకు పడిపోయింది. "మహతీ! ప్లీజ్, లుక్ ఇట్. పరశురాంలో రాంఎలా రాశారో చూడు- ఆర్.ఎ.ఎం. అని వుంది. పైగా ఆర్ కాపిటల్ లెటర్ లో వుంది. ఆర్.ఎ.ఎం. అంటే అర్ధమేమిటో నీకు తెలుసుగా". "గొర్రె" కసిగా అంది. "కాదు. పొట్టేలు" దిద్దాడామెను. "అదే గొర్రె ముదిరితేపొట్టేలు అవుతుంది" ఆమెకు కంపరం ఎత్తి పోతోంది. "జండర్ మారుతుంది" రవి మందహాసం చేశాడు.
ఆమెకు వళ్ళు మండింది. "కోపం వచ్చిందా?" అనునయంగా అడిగాడు. "లేదు" "మరి లావున్నావేం" "రోడ్డుమీద నిలబెట్టిగంటలు గంటలుబోర్ కొట్టేస్తుంటే" ఆమెకు ఏడుపొచ్చింది. ఆపుకోవడానికి ప్రయత్నంచెయ్యలేదు. "గంటలు గంటలంటున్నావ్ డియర్. చూడు" చెయ్యిచాచి ఆమె కళ్ళముందు పెట్టాడు. "ఇంకా మూడున్నర నిముషాలుంది ఆరూ ముఫ్ఫైకి. ఇక్కడ్నుంచి లోపలకు వెళ్ళడానికి రెండు నిముషాలు చాలు. అపాయింట్ మెంట్ ఆరున్నరకు. ఇంకా ఒకటిన్నర నిముషంవుంది". "అయితే కొట్టుకో" "ఆ(" "అదే. బోరు. కొట్టుకో. ఇంకా ఒకటిన్నర నిముషంఉంది" మొండికేసినట్టుగా అంది మహతి. "ఒకటిన్నర నిముషంకాదు. ఒకటిన్నార జీవితం కూడా చాలదు. వీణ వాయిస్తున్న నీమూర్తిని చూస్తూ ఎన్నిజన్మలైనాకూర్చోగలను". అతని గొంతులో దేవతాస్వరాలేవో విన్పించాయి. తలెత్తి అతనికళ్ళల్లోకి చూసింది. మిగిలిన ఆ ఒక్క నిముషం ఆమె కనుపాపల మీదఅతను కరిగిపోయాడు.
సరిగ్గా 6-30కు ఇద్దరూ పరశురాం కన్సల్టింగ్ రూం ముందు వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. మరో రెండు నిముషాల్లో బాయ్ వచ్చివాళ్ళను చూసిలోపలకు వెళ్ళబోతుండగా "పిచ్చయ్యా, అంకుల్ కు చెప్పు" అందిమహతి. "అదేనమ్మా! మీరొచ్చారేమోనని అయ్యగారు చూసి రమ్మన్నారు" చెప్పి పిచ్చయ్యలోపలకు వెళ్ళాడు. ఆ కుర్రవాడలా లోపలకు వెళ్ళగానే రవి నవ్వుతూ మహతి వంకచూశాడు. "ఏం? వాడ్ని చూస్తే నవ్వొస్తోందా?" "చెయ్యి గిల్లుతూ చిలిపిగా అడిగింది మహతి. "మీ అంకుల్ కు ఆ పేరు గలవాడే ఎక్కడ దొరికాడా అని....?" "ఏ పేరు?" అమాయకంగా అంది మహతి. "పిచ్చయ్య సంధివిడగొడితే పిచ్చి+అయ్య-పిచ్చయ్య". "అక్కడ పేరు చూసి వ్యాఖ్యానమా? ఇక్కడ పేరు విని వ్యాకరణమా? బాబోయ్ నావల్లకాదు నిన్ను భరించడం?" "ఏమిటంత పెద్దగా అరుస్తున్నావ్? మీ అంకుల్ కి వినిపించవచ్చు" మహతి అటూయిటూ చూసింది. "ఇంకా నయం, వెయిటింగ్ రూంలో ఎవరూ లేదు" "ఏం ఉంటే?" వుంటే నాకేంభయమా? అసలు విషయం తెలియదేమో అయ్యగారికి" మహతి కొంటెగా అంది. "అసలు విషయమా?" "నిన్నెందుకు తీసుకొచ్చాననుకున్నావ్ ఇక్కడికి?" "మీ అంకుల్ని చూసి అతడెలాంటివాడోచెప్పమనేగా" "తెలివి. సంతోషించాం. నిన్ను పరీక్ష చేసి మార్కులేస్తాడు" "పరీక్షలో పాసైతే నాకేమిస్తావ్?" ఆమె కళ్ళల్లో కార్తీకదీపాలు వెలిగాయి. "ఫెయిలయితే?" ఈసారి మహతిముఖం గ్రహణంపట్టిన చంద్రుడిలా అయింది.