నే ననలేదు_____ఊహ చెప్పాను. అంతే మరేం చెయ్యను."
"ఒరే ఫూల్ అటునుంచి నరుక్కురారా అనే సామెత వినలేదా? మనకి పెద్దామె అడ్డం....మరి అమ్మాయిని మంచి చేసుకో ప్రేమించు. ఆమె నిన్ను ప్రేమించేట్టుగా చెయ్. దాంతో లైన్ క్లియర్. స్వప్న నీదవుతుంది. స్వప్న ఆస్తి నీదవుతుంది."
పిచ్చినాన్నా? అన్నట్టుగా చూశాడు ప్రేమించటం అంత సులువా అనుకున్నాడు. ఫైనలియర్లో యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ పాఠాలే చదవటం లేదు. అలవాటు లేని ప్రేమ పాఠాలు మొదలెట్టాలా? అనుకున్నాడు. "అయినా నీ చాందసం కానీ నాన్నా స్వప్నలాటి అమ్మాయిలకి ప్రేమా గీమా గిట్టదు. శుభ్రంగా మెడలు వంచి తాళికట్టిన అబ్బాయికి దాసీ అయిపోయి ప్రేమించేస్తారు అంతే" అన్నాడు.
"చవటా" అన్నాడు వెంకట్రామయ్య "పిడత మొహమా దిబ్బరొట్టి ముఖం వేసుకుని ఎలా అన్నావురా ఆ మాటలు సిగ్గులేదూ?" చడామడా తిట్టేశాడు.
ముఖం చిన్న బుచ్చుకున్నాడు మోహన్.
"వెళ్ళు వెళ్ళు పౌరుషముంటే స్వప్న మనస్సుని దోచుకో."
"బయటికి వెళితే పాకెట్ మనీకి ఇవ్వవు కానీ__" మోహన్ మాటలు పూర్తవలేదు. వంద రూపాయల నోటు విసిరేశాడు వెంకట్రామయ్య. కొడుకు వద్దకివచ్చి అనునయంగా ప్రేమగా అతని తల నిమిరి "బాబూ! నా ఏకైక పుత్రుడువి నువ్వు! మీ అమ్మ పోయాక నా ఆశలన్నీ నీమీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. నువ్వు నాలా కష్టపడకూడదు, సుఖపడాలి. పూటకి వెయ్యిరూపాయలైనా సులభంగా ఖర్చుచేసే స్తోమత రావాలి!" అన్నాడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయ్.
మోహన్ జవాబివ్వలేదు.
"వెళ్ళు! ఎక్కడికో వెళ్ళాలన్నావుగా." అన్నాడు.
మోహన్ వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్య పడక కుర్చీలో వాలిపోయి ఆలోచనల్లో మునిగిపోయాడు.
8
విస్కీ బాటిల్ ఓపెన్ చేసి నిదానంగా తాగుతున్నాడు నరసింహులు. అతని కెదురుగా మంచంలో మూల్గుతూ పడుకుని వుంది ఒక స్త్రీ ఆమె శల్యావశిష్టంగా ఉంది. ముఖంలో కళ వుట్టిపడుతున్నా కళ్ళు తళతళా మెరుస్తున్నా అనారోగ్య లక్షణాలు మాత్రం ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా జబ్బుతో తీసుకుంటూ మంచంలోపడ్డ వ్యక్తిలా ఉంది ఆమె.
"ఇంక చాలించరాదా?" నీరసంగా అందామె.
పకపక నవ్వాడు నరసింహం. అతని ముఖం తాగిన మైకంతో వికృతంగా ఉంది. కళ్ళుజ్యోతుల్లా మండుతున్నాయ్.
"ఏం తాగితే తప్పా? నాకిప్పుడు మిగిలిందొక తృప్తి కదా? పేకాటకెళితే డబ్బుపోయింది. వెయ్యి! వెయ్యి రూపాయలు ఒక్క రోజులో పోగొట్టాను. అఫ్ కోర్స్ అయిదువేలు ఒక్క క్షణంలో సంపాదించాననుకో! ఇలా ఖర్చయిపోతే మళ్ళీ మళ్ళీ ఆ మహాకాళికి ఫోన్ చెయ్యలేదు కదా? బెదరింపులూ ఎన్నాళ్ళు సాగిస్తాను? అందుకే ఆ విచారాన్ని మరిచిపోయేందుకు తాగుతున్నాను!"
ఆమె జవాబివ్వలేదు.
"ఇదో! ఆ భద్రకాళి ఎంతెగిరిందో తెలుసా?"
దానికీ సమాధానం యివ్వలేదు.
అతను తాగటం ఆపేశాడు. ఆమె దగ్గరిగా వెళ్ళి పాలిపోయి బలహీనంగా అందంగా వున్న ఆమె చెక్కిళ్ళు మృదువుగా నిమిరేడు. మంచం దగ్గర కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరి, పెదాలకి ఆనించుకుని సున్నితంగా ముద్దుపెట్టుకున్నాడు.
ఒక క్షణం ఆగి వలవాలా ఏడ్చాడు.
"నువ్వు నా మీద ప్రేమతో స్వర్గాన్ని కాలదన్నుకుని వచ్చావు. కనీసం నిన్ను భూమ్మీదయినా సుఖపెట్టలేకపోయాను. నరకంలోకి తోశాను. నేను నరకంలోకి వెళ్ళాను. ఇదిగో మళ్ళీ నరకంలోకి వెళుతున్నాను!" అని వడివడిగా వెళ్ళాడు.
అలాగే శూన్యంలోకి చూస్తూ వుండిపోయిందామె.
* * * *
రెండురోజులు గడిచాయి.
ఈ రెండు రోజులూ రవికి స్వాతికి అన్ని సౌకర్యాలు జరిగిపోతున్నాయి. వేళకి అన్నీ అమురుతున్నాయి అయితే అది వాళ్ళిద్దరికీ సుఖంగాలేదు. కాదంటే యీ పుష్టికరమైన ఆహారంవల్ల స్వాతి కొంచెం తేరుకుంది. ముఖంలో కళ పెరిగింది.
చెల్లయిని డాక్టరు దగ్గరికి తీసికెళ్ళాలనీ,. చికిత్స చేయించాలనీ, యింజక్షన్సూ, మాత్రలూ, టానిక్కులూ యివ్వాలని రవికి ఆరాటంగా ఉంది. అతను గత రెండు రోజులూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు.
ఎక్కడ చూసినా నోవేకెన్సీ బోర్దులే! ఒక ట్యుటోరియల్ కాలేజి ప్రిన్సిపాల్ మాత్రం ఆశాజనకంగా మాటాడేడు జులై లో తిరిగి కాలేజీ తెరిచాక పార్ట్ టైం జాబ్ యిస్తానన్నాడు. గంటకి రెండు రూపాయలు! రోజుకి రెండు గంటలో మూడుగంటలో పని! ఆ మాత్రం భరోసాకే మురిసిపోయి తన అడ్రస్ యిచ్చివచ్చాడు రవి.
ఆఖరికి ఆలోచించి ఆలోచించి యిక యీరోజు అమ్మమ్మగారి ఎదుటపడి డబ్బు అడగాలని నిశ్చయించుకున్నాడు.