నువ్వే నా కిష్ణయ్యా! నీ దగ్గరికే వచ్చారా ఈ పోర్లు?"
"ఆడ? డైరెక్టుగా నా దగ్గరికే వచ్చారు! రాక ఇంకెక్కడి కెళ్తారు మరి?" అన్నాడు కిష్ణయ్య. అతను ఆ ఇంటికి కాపలా కుక్కలాంటివాడు.
బయటనుంచి ముసల్ది పెడుతున్న శాపనార్ధాలు వినబడుతున్నాయి.
అప్పుడు మొదటిసారిగా గుర్తువచ్చింది సృజనకి. ఆ ముసలిది విసిరిన రోకలి తగిలినచోట తొడమీద కదుపుకట్టిందని.
"ఈళ్ళంతా ఏరీ? లాటుగా అందర్నీ పట్టుకెళ్ళిపోయాడా ఇన్స్ పెక్టర్ సాబ్?" అన్నాడు కిష్ణయ్య.
"వదుల్తాడూ? అందర్నీ పట్టుకు పోయాడు రాక్షసుడు! ఇక్కడ ఇంకా రంగేలీ మిగిలింది. నేను మిగిలాను. ఈ పిల్లల పని పట్టడానికి" అన్నాడు ఒకతను వాళ్ళదగ్గర్కివస్తూ, అతని పేరు ఉస్మాన్ అక్కడ నిత్యం జరిగేగానా బజానాలో ఢోలక్ వాయిస్తాడు. నెంబర్ వన్ శాడిస్టు అతను. ఆ ఇంటికి కొత్తగా తేబడ్డఆడపిల్లల మనోస్థయిర్యాన్ని నీరుకారిపోయేటట్లు చేసి, బానిసలుగా మార్చే చాకచక్యం అతనికి ఉంది.
ఆ ఇంట్లో ఉన్న టార్చర్ ఛాంబర్ కి అధిపతి అతను.
"ఏంపిల్లలూ? పారిపోగలమనుకుంటున్నారా ఏమిటి? ఢోలక్ వాయించినట్లువాయించి పారేస్తా!
ఖబడ్దార్!" అన్నాడు గుడ్లురుముతూ.
కిష్ణయ్య పెద్దగా నవ్వాడు.
రంగేలీకలగజేసుకుంది.
"కొత్తపిల్లలులే ఉస్మాన్! నలుగు రోజులుపోతే వాళ్ళే మెత్తబడిపోతారు! పోనియ్!"
"ఆ రెండోపిల్ల మెత్తబడుతుందేమోగానీ, ఈ పిల్ల ఉంది చూడు" అని సృజనని చూపించాడు ఉస్మాన్ "ఇది పొగరు బోతుగుర్రం! నాలాంటి వాడు స్వారీ చేస్తేగానీ ఇలాంటిగుర్రాలు మచ్చికకావు. ఏమంటావ్! నడవ్వే పిల్లా!"
"వద్దు ఉస్మాన్! పిల్ల మరీ లేతగా ఉంది. దాన్ని హింసించకు!" అంది రంగేలీ గాభరాగా.
"పిల్ల చచ్చి ఊరుకుందంటే కష్టం!"
"పోపోలేపోనే ఆఠ్! (కొజ్జా) నువ్వునాకు చెప్పేదేమిటి? రావే పిల్లా!" అన్నాడు ఉస్మాన్.
భయంతో రక్తం గడ్డకట్టినట్లయిపోయింది సృజనకి కదలకుండా నిలబడి పోయింది తను.
తీవ్రంగా చూసి, ఆమె పొడుగాటిజడని అందుకున్నాడు ఉస్మాన్. "నడవ్వే!"
బాధభరించలేకతల వంకరగా పెట్టింది సృజన. వేళ్ళాడిపోతూ అతని వెంట నడిచింది. రెండో చేత్తో కామాక్షిని లాక్కెళ్ళాడు ఉస్మాన్.
ఆ గది గోడలనిండా భయాత్పాతాన్ని కలగజేసే చిత్ర విచిత్రమైన ఇస్ స్ట్రుమెంట్సు తగిలించి ఉన్నాయి. వాటివైపు ఇష్టంగా చూసుకున్నాడు ఉస్మాన్. వాటిలోనుంచి ఒక పరికరాన్ని సెలెక్టు చేసుకుని, చేతుల్లోకి తీసుకున్నాడు.
పెద్దసైజు కాకరకాయలా ఉంది అది. కాకరకాయకు బుడిపెలు ఉన్నట్లు ముళ్ళుముళ్ళుగా ఉందిదాని ఉపరితలం అంతా.
ఇనపముళ్ళు!
"వద్దురా సైతాన్ కీ ఔలద్! పోరిచచ్చిపోతుంది." అంది రంగేలీ బయటనుంచి కంగారుగా.
"నేనసలే పోలీసోన్ని! హత్యలు చూడకూడదు" అంటూ కొంచెం ఎడంగా వెళ్ళినిలబడ్డాడు కానిస్టేబులు కిష్ణయ్య.
పిశాచంలా నవ్వాడు ఉస్మాన్. నెమ్మదిగా కిటికీలో నుంచి చెయ్యి బయటికి చాపాడు. అక్కడ ఒక బొప్పాయి చెట్టు ఉంది. అందుబాటులోనే ఒక కాయలో వేలాడుతోంది దానికి. ఆకాయను తెంపాడు ఉస్మాన్. గుడ్లు గుండ్రంగా తిప్పుతూ సృజనవైపూ కామాక్షి వైపూ భీకరంగా చూసి, ఇనపకాకరకాయ బొప్పాయి కాయలోగుచ్చి ఒక్కసారిగా మెలిపెట్టాడు. ఆబొప్పాయి కాయకే గనక నోరు ఉంటే, అది దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదం చేసి ఉండేది. అది చూడగానే, గజగజవణకడం మొదలెట్టారు సృజనా, కామాక్షి. ఎక్కడో తొలికోడి కూసింది. సుప్రభాతాన్ని సూచిస్తూ ఉత్సాహంగా కూసిన కూతలాగా లేదది. మేడమీద వేటుపడేముందు, మరణమాసన్న మైందని ఆలస్యంగా గురించి పెట్టిన చావుకేకలా ఉంది ఆ కూత.
"ఇట్రా!" అన్నాడు ఉస్మాన్. విహ్వలంగా చూసింది సృజన. నవ్వాడు ఉస్మాన్. అతనికి అది ఆటలాగా ఉంది. క్రూరమైన ఆట. ఒక్క అడుగు వెనక్కి వేసింది సృజన.
నవ్వుతూ కొంచెం ముందు నడిచాడు ఉస్మాన్.
అతడు ఇప్పుడు అచ్చం రాఘవులులా కనబడుతున్నాడు సృజనకి.
భయంగా మరి రెండు అడుగులు వెనక్కి వేసింది సృజన.
ఆమె వీపుని అడ్డగించింది గోడ.
నిస్సహాయంగా నిలబడి పోయింది తను.
ఇంకొక అడుగు ముందుకు వేశాడు ఉస్మాన్.
రెండుచేతులూ జోడించింది సృజన.
"ప్లీజ్! నాకు భయమేస్తోంది! నన్ను వదిలెయ్యవా? ప్లీజ్!"
విరగబడి నవ్వాడు ఉస్మాన్. చెయ్యి ముందుకు జాపాడు.
గట్టిగా కళ్ళు మూసుకుంది సృజన.
ఫెడేల్మని తలుపు తీసినచప్పుడైంది. సుడిగాలిలా రివ్వుమని లోపలికి దూసుకొచ్చింది అహల్య. ఆయసంతో ఆమె వక్షం ఎగిరెగిరిపడుతోంది.
"ఆగు!" అంది సివంగి గర్జిస్తున్నట్లు. "రేయ్ ఉస్మాన్! ఆగు!" మంత్రం వేసిన వాడిలా ఠక్కున ఆగిపోయాడు ఉస్మాన్. అతని మొహంలో చెప్పలేనంత ఆశాభంగం కనబడుతోంది.
గబగబ అతన్ని సమీపించి అహల్య విసురుగా అతని చేతిలోని ఇన్ స్ట్రుమెంట్సుని అందుకుని బలంగా కిటికీలోనుంచి బయటకు గిరాటేసింది.
"కమీనే! ఇటువంటి పనులు ఇక ముందు ఈ ఇంట్లో జరగకూడదని ఒకసారి చెప్పాను. అప్పుడే మర్చిపోయావా? నువ్వు మనిషివి కావురా! పశువ్వి!" అంది ఆగ్రహంతో ఊగిపోతూ. అంత అవమానాన్నీ దిగమింగుతూ తల వంచుకున్నాడు ఉస్మాన్.
"రేయ్ ఉస్మాన్! నీ మొహం చూస్తేనే పంచె మహాపాతకాలూ చుట్టుకుంటాయి. ఛల్! నికల్ యహాసే! కిష్ణయ్యా! నువ్వుకూడా!"
"నేనువద్దు వద్దని చెబుతూనే ఉన్నాను అక్కా!" అంది రంగేలీ భయంభయంగా. కోపంతో కంపించిపోతున్న అహల్య అతిప్రయత్నం మీద తనని తాను అదుపులో పెట్టుకుని, సృజనవైపు తిరిగి చేతులు బార్లాజాపింది.
"భయపడ్డావా! బిడ్డా! దా! నాదగ్గరికి రా!"
దేవతలా సమయానికి వచ్చి తనని ఆదుకున్న అహల్యని చూస్తే అది కొద్దిగా సదభిప్రాయం ఏర్పడినా, నిలబడ్డచోటునుంచి కదలలేదు సృజన.
బిత్తరచూపులు చూస్తూ వచ్చి, సృజనని ఆనుకుని నిలబడింది కామాక్షి.
ఆ పిల్లలిద్దరినీ ఆప్యాయంగా దగ్గరకు పొడుపుకుంది అహల్య. తర్వాత విచారంగా అంది.
"ఈ మగాళ్ళందరూ మాయదారివాళ్ళేనమ్మా! ఆడ కూతుళ్ళ కష్టం వాళ్ళకేం తెలుస్తుందీ? ఈ ఉస్మాన్ ఉస్మానే. ఈ కిష్ణయ్యకిష్టయ్యే, ఆ శ్రీనివాసు శ్రీనివాసే!"
వెక్కిళ్ళతోకామాక్షీ సృజనల వీపులు ఎగిరెగిరి పడుతున్నాయి. సృజన కన్నీళ్ళతో అహల్య పైటకొంగు తడిసిపోతోంది.
స్వగతంలా చెప్పుకు పోతోంది అహల్య. "ఆడదానిమనసూ, ఆడదాని కష్టం ఇంకో ఆడదానికే తెలుస్తుందిగానీ ఈ మోటుమొగాళ్ళకేం తెలుస్తుందమ్మా? పాతికేళ్ళ క్రితం పాపం పుణ్యం ఎరగని నన్ను శ్రీనివాసుగాడు లేపుకొచ్చి ఈ కొంపలకమ్మేసి నప్పుడు నా కష్టం గురించి ఆలోచించాడా? ఏంలే? ఆడోళ్ళని నమ్మించడం, ఒళ్ళు "దోచుకోవడం, అయినకాడికి అమ్మిపారేయడం! అంతేకదావీళ్ళ వ్యవహారం! ప్రతిచోటా ఇదేకథ! మొగాళ్ళకి కావలసింది మన మనసు కాదమ్మా! మన వళ్ళు! అంతేనమ్మా ఈ లోకం! అంతే!"
మాటల్లోనే గద్గదికమై పోయింది ఆమె గొంతు. ఆమె చేతులు అప్రయత్నంగానే ఇద్దరితలలు నిమురుతున్నాయి.
ఆమెని వదిలించుకుని దూరంగా జరిగిపోవాలని ఉంది సృజనకు. కానీ ఎందుకోగానీ అలా చెయ్యలేకపోయింది.
"ఇకనుంచి నేనున్నానమ్మా మీకు! ప్రతిక్షణం కనిపెట్టుకు ఉంటా మిమ్మల్ని! ఇంక మిమ్మల్ని ఉస్మాను ఏం చెయ్యలేడూ కిష్ణయ్య ఏమిచెయ్యలేడూ! వీళ్ళ చేతులుపడిపోనూ, దరిద్రపు వెధవలు!"
నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంది సృజన.
మళ్ళీ చెప్పింది అహల్య.