"చూడండి అమ్మాయిలూ! నేను ఈ ఇంటికి ఓనర్ని! నా ఇష్టం లేకుండా, మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని ఎవరూ ఏమీచెయ్యలేరు. నేను భరోస ఇస్తున్నా! చాలా?"
"ప్లీజ్! నువ్వు మంచిదానిలాఉన్నావు. మమ్మల్ని వదిలెయ్యవా?" అంది సృజన.
దానికి జవాబు చెప్పకుండా చిన్నగా నవ్వి మరోసారి ఇద్దరి తలలునిమిరి, బయటకు వెళ్ళిపోయింది అహల్య.
వెంటనే సృజనా, కామాక్షీ ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు కావలించుకుని, ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయారు.
బయటవసారాలో అహల్య ఉస్మాన్ గుసగుసగా మాట్లాడుకోవడంవాళ్ళకి వినబడటంలేదు. అహల్య కోపంగా అంటోంది.
"సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఎదుటివాళ్ళని లొంగదీసుకోమన్నారు ఉస్మాన్! అంతేగానీ మొదట్లోనేమోటు పద్దతులు ఉపయోగించడం కరెక్టుకాదు."
అహల్య చివాట్లు వింటూ మొహం గంటుపెట్టుకున్నాడు ఉస్మాన్.
అది గమనించి స్వరం మార్చింది అహల్య. అనునయంగా అంది.
"ముందు బుజ్జగించాలి! బతిమాలాలి! ఆ తర్వాత బెదిరించి భయపెట్టాలి! అవన్నీ చేసినా కూడా దార్లోకి రాకపోతే అప్పుడు చూపిద్దువుగాని నీప్రతాపం! ఇదివరకు ఆ రజియామీదా, వసంత మీదా చూపించినట్లు!"
"విలవిల్లాడిచచ్చి ఊరుకుంది ఆ రజియాఅనే పిల్ల!" అంది పక్కనే ఉన్న రంగేలీ. ఆ విషయం చెబుతున్నప్పుడు ఆమె గొంతులో కరుణధ్వనించలేదు. మరే భావమూ ధ్వనించలేదు. ఏదో స్టేట్ మెంట్ ఇస్తున్నట్లు చాలా మామూలుగా గుర్తుచేసింది, ఆ కొంపలో బలవన్మరణంపోయిన ఒక అభాగ్యురాలి సంగతి.
ఉస్మాన్ ఇంకా మొహం మాడ్చుకునే ఉన్నాడు.
"తొందరపడకు ఉస్మాన్! నువ్వు చెయ్యాల్సినపని ముందుముందు ఉంటుంది! ఇంద! ఇదితీసుకో!" అంది అహల్య.
బొడ్లోనుంచి పదిరూపాయల నోటుతీసి ఇస్తూ, ఉస్మాన్ పరమనీచుడనీ, లుచ్చా అనీ ఆమెకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళందరినీ నయానోభయానో తన అదుపులో ఉంచుకోకపోతే తన బిజినెస్ సాగదని కూడా ఆమెకి బాగా తెలుసు. నోటు చూడగానే, ఉస్మాన్ మొహం కొద్దిగా వికసించింది. అది తీసుకునివెళ్ళిపోయాడు అతను. వెంటనే రంగేలీ అందుకుంది. "అక్కచెప్పింది రైట్!" ఆ మాటా ఈ మాటా చెప్పినాల్రోజుల్లో దారికి తెచ్చుకోలేమా పిల్లల్ని! మొదట్లో కష్టం కష్టం అంటారు! కష్టం అన్నవాళ్ళే తర్వాత తర్వాత ఇష్టం ఇష్టం అంటారు. ఓ యబ్బో! నా తలమీద ఎన్ని వెంట్రుకలున్నాయో అంత మందిని చూశాను ఇప్పటికి! రుచి తెలిసేదాకనే ఈ బెట్టంతా! అయినా శాస్త్రం చెప్పినట్లు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ముక్కు పచ్చలారని పసిపిల్లలనా చిత్రహింసబెట్టేది! వాళ్ళనినాకప్పగిస్తే నాల్రోజుల్లో మార్చి పారెయ్యలేనా ఏమిటి?
"ఆపవే నీ సొద! పెద్ద మొనగత్తెవి బయల్దేరావు!" అంది అహల్యవిసుగ్గా.
"మొనగాత్తెను కాబట్టే ఇన్ని చిట్కాలూ, వైద్యాలూ నేర్చుకోగలిగాను అక్కా? లేకపోతే మహుకుడురాసిన హరమేఖలా మొత్తం గడగడవప్ప చేసెయ్యడం ఇంకోళ్ళ తరమా ఏమిటీ? నాకు తెలిసిన వశీకరణం మందులు ఇన్నా అన్నా! మన కానిస్టేబులుకిష్టయ్యగాడి పెళ్ళాంవాడి మొహంమీద తుపుక్కున ఉమ్మేసిపుట్టింటికెళ్ళిపోతే వశీకరణం మందువేసిదాని తిక్క తిన్నగా కుదిర్చింది ఎవరు? నేనుకాదా ఏమిటి?" అని ప్రాకృత భాషలో ఉన్న ఒక శ్లోకాన్ని గబగబ చదివింది.
"మలయంచన్దనమ్, అరుణయ్ కూజ్కామమ్, గిరి: శిలాపుష్పమ్ మృగాజ్కా కర్పూరమ్ కన్ధలీ ఓషధీం విశేషో దేశాన్తరే ప్రసిద్దః
గజమః శిలా మనశ్శిలాః ప్రియాజ్ఞఃకామినీ
రసగోలఃసర్పవః నటహః ఏ తైస్సమ భాగై
కృతోదూపః ఉక్తకార్యం కరోతీతి."
నుదురు చిట్లించింది అహల్య!
"అంటే ఏమిటి?"
మిస్టీరియస్ గా చూసిరకంగా నవ్వింది రంగేలీ. మగా, ఆడా కాని గొంతుతో గుసగుసగా చెప్పింది.
"ఆడవాళ్ళని లొంగదీసుకునే వశీకరణంమందు చేసే పద్దతి అక్కా!"
"ఎలా చేస్తారు?" అంది అహల్య.
చెప్పడం మొదలెట్టింది రంగేలీ.
"చందనం, కుంకుమ పూవు, రాతి పూవు, కర్పూరం, కస్ధలి(తామరగింజలు) ఏనుగు మదం, మనశ్శిల, ప్రేంకణం, సర్జరసం, ఆవాలు సమ పాళ్ళుగా చేసి ధూపంవేస్తే కిష్ణయ్యగాడి గయ్యాళి పెళ్ళాం కూడా దెబ్బతోదారికొచ్చింది. లంఖినీలాంటి కిష్ణయ్యపెళ్లాన్నే లొంగదీసిన నాకు ఈ పిల్లలొక లెక్ఖాజమా? తెల్లారీతెల్లారకముందే ఒక మంచి భస్మంతయారుచేసి తలకి అంటానంటే ఈ తలతిరుగుడంతా తగ్గిఊరుకుంటుంది. నా తడాఖాచూపిస్తాను, ఉండు అక్కా! బస్తీమే సవాల్!"
అది విని కొద్ది క్షణాలపాటు ఆలోచించింది అహల్య. "సరే అలాగే కానియ్! నీ వల్ల కూడా పని కాకపోతే అప్పుడు నేను ఎలాగో ఉండనేఉన్నాను" అంది నెమ్మదిగా.
తనప్రతిభ చూపించడానికి మరో అవకాశం వచ్చినందుకు ఆనందంగా నవ్వింది రంగేలీ. లోపలికి వెళ్ళి, ఒక పెద్ద బోషాణం పెట్టెతెరిచి, అందులో ఉన్న కొన్ని రకాల దినుసులు తీసుకుని నూరడం మొదలెట్టింది.
ఒకగంట గడిచాక పడుకుని ఉన్న సృజననీ, కామాక్షినీ లేవదీసింది రంగేలీ. నీళ్ళగదిలోకి తీసుకెళ్ళింది. పెద్దహాలంత ఉంది ఆ పాతకాలపు స్నానాలగది. గోడలు నల్లగా పొగచూరి ఉన్నాయి. మట్టితో కట్టిన పెద్దపొయ్యి ఉంది. దానిమీద రాక్షసుడి పొట్టలా ఉన్న నల్లటికాగు పొయ్యిలో ఎండుకట్టెలు కణకణ మండుతున్నాయి. ఎత్తైన ముక్కాలిపీటలు రెండువేసి ఉన్నాయి అక్కడ. అక్కడంతావేడిగా ఉంది వాతావరణం.
దాన్లోప్రవేశించగానే యమకూపంలోకి వచ్చేసినట్లు అనిపించింది సృజనకి. రంగేలీ సాక్షాత్తు యమదూతలా కనబడింది.
తమ ఇద్దరినీ ఇప్పుడు ఈ సలసలమరిగే నీళ్ళున్నబానలో ఉడకపెట్టుకు తినేస్తుందా ఈ రాక్షసి?
"ఆ పీటలమీద కూర్చోండి" అంది రంగేలీ.
"ఎందుకు?" అంది సృజన బెదురుగా.
"ఎందుకేమిటమ్మా! తలంటి పోసుకోవడానికి" అంది రంగేలీ. ఆమె చేతిలో ఒక గిన్నె ఉంది. ఆ గిన్నెలో ఉంది ఆమె తయారుచేసిన వశీకరణం మందు.
అతిప్రయత్నం మీద ఒక గుటక మింగింది సృజన. "నేను....నాకు.....తలంటివద్దు" అంది వణుకుతున్న గొంతుతో.
"ఇదిగో! కాదూ, కూడదూ అని పేచీపెట్టకూడదు. తప్పు! పెద్ద వాళ్ళు ఎట్లాచెబితే అట్లా వినాలి"
"ప్లీజ్! నాకు తలంటివద్దు. చాలా జలుబుగా ఉంది" అంది సృజన తప్పించుకోవడానికి సాకులు కోసం వెదుకుతూ మధ్య మధ్య భయంగా రంగేలీ చేతిలోని గిన్నెవైపు చూస్తోంది తను.