ఆ ఇంటి కిందభాగంలో అంతా డిమ్ గా వెలుగుతున్నాయి లైట్లు. చిన్నారావు తప్ప ఇంకెవరూ ఉన్న అలికిడి లేదు.
చిన్నారావు సిగరెట్లు తేవడానికి బయటికి వెళ్ళాడు.
కామాక్షికి సైగ చేసింది సృజన.
ఇద్దరూ పిల్లుల్లాగా గుమ్మంవైపునడవడం మొదలెట్టారు.
అప్పుడు కర్ణకఠోరంగా అరవడం మొదలెట్టింది చిలక.
"పిట్టని పట్టుకో! పిట్టని పట్టుకో! పిట్టని పట్టుకో!!"
స్థంభించిపోయారు సృజనా, కామాక్షి.
వాళ్ళూ తేరుకునేసరికి ఎదురుగా కనబడింది.....
అహల్య! అక్కడున్న వాళ్ళందరికీ మేడమ్!
విహ్వలంగా అహల్య మొహంలోకి చూశారు సృజనా, కామాక్షి.
వాళ్ళు ఊహించినట్లు అహల్య మొహంలోకో పచ్చాయలు కనబడటం లేదు. తిట్లు లంకించుకుంటుందేమో అని భయంగా ఎదురుచూసింది సృజన.
కానీ తిట్టలేదు అహల్య 'నాతోరండి' అంది సహనంగా.
సృజనా, కామాక్షి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.
"రండి" అంది అహల్య మళ్ళీ.
అడుగులో అడుగేస్తూ ఆమె వెంటనడిచారు ఇద్దరూ.
వాళ్ళని వంటింట్లోకి తీసుకెళ్ళింది అహల్య పాతకాలపు వెండి గ్లాసులు రెండుతీసి వాటినిండా సేమ్యాపాయసం పోసి అందించింది.
గ్లాసుని అందుకోకుండా, పెద్దగా ఏడవడం మొదలెట్టింది కామాక్షి. దుఃఖాన్ని ఆపుకోవడానికి పెదిమలు బిగపట్టింది సృజన.
అహల్య కాసేపు వాళ్ళిద్దరినీ పరీక్షగా చూసి, తర్వాత నవ్వు మొహంపెట్టింది.
"మంచి అమ్మాయిలు మంచి అమ్మాయిల్లాగే ఉండాలి అల్లరి పిల్లల్లా మొండితనం చెయ్యకూడదు అవునా?" అని, నెమ్మదిగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళీ వెళ్ళగానే అక్కడ ప్రత్యక్షం అయింది రంగేలీ. వాళ్ళని మళ్ళీ ఇందాకటి గదికి తీసుకెళ్ళింది. పక్కలు దులిపివేసి ఉన్నాయి అక్కడ వాళ్ళకోసం. పడుకున్నారేగానీ నిద్రపట్టలేదు సృజనకీ, కామాక్షికి కూడా.
అర్ధరాత్రి అయ్యాక, అలసటతో కనురెప్పలు బరువెక్కిపోతూ ఉండగా-----
హఠాత్తుగా వినబడింది పెద్దకలకలం! గందరగోళంగా చాలా గొంతులు ఒక్కసారే మాట్లాడుతున్నట్లు సవ్వడి. గద్దించి ప్రశ్నిస్తోంది ఒక మొగగొంతు. భయం భయంగా చెబుతున్న జవాబులు వినబడుతున్నాయి. వాళ్ళ మీదికి వంగి గాభరాగా అంటోంది రంగేలీ. "లేవండి, లేవండి తొందరగా!" ఒక్క ఉదుటున లేచి కూర్చున్నారు సృజనా, కామాక్షి.
"ఇత్రండి! ఇటు! ఇటు!" అంది రంగేలీ ఆదుర్దాగా. కదలకుండా అక్కడే నిలబడి అయోమయంగా బెదురుచూపులు చూస్తూ ఉండిపోయారు ఇద్దరూ. "మిమ్మల్నే! కదలమంటూంటే! పోలీసుల చేతికిచిక్కి జైలుకివెళ్ళాలని ఉందా ఏమిటి? లేవండి!" అంటూ వాళ్ళిద్దరినీ చెరోచేత్తో బలంగా మంచం మీదనుంచి కిందికి లాగి, లాక్కెళ్ళడం మొదలెట్టింది రంగేలీ.
"పైకెక్కండి. ఆ అటక మీదికి! పోలీసులకి చిక్కామంటే రాత్రంతా కంట్రోల్ రూంలో మగ్గాలి!" కానీ నిజంగానే పోలీసులకి చిక్కిపోవాలని ఉంది సృజనకి. పోలీసులు గనక తమని చూస్తే తక్షణం ఈ చెరలో నుంచి విముక్తి కలుగుతుంది.
అందుకని, పోలీసుల సాయం కోసం అరవడానికి నోరు తెరవబోయింది సృజన. ఆమె నోరు తెరవడానికి అరక్షణం ముందే, ఆమె మనసులో మెదులుతున్న ఆలోచనలను చదివెయ్యగలిగింది రంగేలీ. తక్షణం రెండుచేతులతో వాళ్ళనోళ్ళు నొక్కేసింది. అక్కడ అటకకి దగ్గరగా ఒక స్టూలు వేసి ఉంది. దానిమీది కెక్కేసి, అక్కడనుంచి అటక మీదికి పాకేసి, భద్రంగా దాక్కోవాలని తహతహగా ఉంది రంగేలీకి.
కానీ, చెయ్యి వదిలేస్తేగావుకేకలు పెట్టేటట్లు ఉన్నారు ఈ పిల్లలు. ఆ కేకలు ఇన్స్ పెక్టర్ గనక విన్నాడంటే, ఈ బిజినెస్ చేస్తున్నందుకు డొక్క చించడంతోబాటు, అమ్మాయిల్ని బలవంతంగా ఎత్తుకొచ్చి దాచినందుకు గానూతోలు వలుస్తాడు. చాలా స్ట్రిక్టు మనిషి అతను. అది తలుకుని, భయంతో ఆ అమ్మాయిల నోళ్ళు మరింత గట్టిగా నొక్కేసి, తలుపు మూలగా నక్కిందిరంగేలీ.
మరుక్షణంలో తలుపులు తెరుచుకున్నాయి. ఇన్స్ పెక్టర్ లోపలికి తొంగిచూశాడు.
పైప్రాణాలు పైనే పోయాయి రంగేలీకి.
రంగేలీపట్టువదిలించుకోవాలని శాయశక్తులా గింజుకుంటోంది సృజన.
అంతలో బయట నుంచి ఒక పెద్దకేక వినబడింది. ఆ గొంతులో చెప్పలేనంత ఎగ్జయిట్ మెంట్!
కేకచెవిన బడగానే ఇన్స్ పెక్టర్ తల గదిలోనుంచి అదృశ్యమైంది. మళ్ళీ వినబడింది ఆ గొంతు.
"ఇన్స్ పెక్టర్ సాబ్! ఇన్స్ పెక్టర్ సాబ్! నర్సింగ్ దొరికిండు ఈ రూములో!"
"నర్సింగా? ఏ నర్సింగ్?"
"వాడే సర్! హయత్ నగర్ లో బందిపోటు దొంగరనంచేసినాడులే! వాడు!"
తక్షణం నర్సింగ్ దగ్గరికి చేరుకున్నాడు ఇన్స్ పెక్టర్, బ్రోతల్ హౌస్ లను రెయిడ్ చెయ్యడం, వ్యభిచారులని పట్టుకెళ్ళడంఎప్పుడూ ఉండేదే!
రొటీన్!
కానీ, అందరూ వెదుకుతున్న బందిపోటుని పట్టుకోవడం.....
వెల్! దిసీజ్ సమ్ థింగ్ స్పెషల్!
"వాన్లోకి ఎక్కించిన ముండలు చాలు! ఇంక నర్సింగ్ గాన్నివ్యాన్ ఎక్కించండి! హుషారుగా ఉండాలి! లేకపోతే తప్పించుకుపోగలడు నా కొడుకు!" అన్నాడు ఇన్స్ పెక్టర్. పోలీసులందరి దృష్టికీ ఇప్పుడు నర్సింగ్ కేంద్రమయ్యాడు. ఇద్దరు కానిస్టేబుల్సు అతన్ని చెరోవైపూ ఉడుముల్లా పట్టుకున్నారు. ఇన్స్ పెక్టర్ స్వయంగా తనే అతని చేతికి బేడీలువేశాడు. నలుగురు కానిస్టేబుల్సు నర్సింగ్ కి ముందూ వెనకా నడుస్తూ అతన్ని వ్యాన్ ఎక్కించారు. కొద్దినిమిషాల్లో, ఊహాతీతంగా మారిపోయిన ఈ పరిస్థితిని చూసి తెరపినబడ్డరంగేలీ, మనసులోనే దేముడికి దణ్ణం పెట్టుకుని, ఊపిరిబిగబట్టి నిలబడింది.
ఇంకకొద్ది క్షణాలు.....అంతే......పోలీసులు వెళ్ళిపోతారు. వాళ్ళు గనక వెళ్ళిపోతే తనకు యాభయ్యో, వందో చలాన్ కట్టడం తప్పుతుంది. దానికితోడు, రాత్రంతా పోలీసు కంట్రోల్ రూంలో జాగారం చెయ్యవలసిన అవస్థకూడా తప్పుతుంది.
ఇంకాకొద్ది క్షణాలు.....అంతే!
సరిగ్గా సృజనకూడా అదే అనుకుంది.
ఇకకొద్ది క్షణాలు.....అంతే!
ఆ తర్వాత పోలీసులు వెళ్ళిపోతారు.
అప్పుడు తమని రక్షించేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు.
ఇంకముందుకి ఆలోచించలేదుసృజన. మరుక్షణంలో ఆమె పళ్ళు రంగేలీ చేతిలో లోతుగా దిగాయి.
"అమ్మోవ్!" అని వెర్రికేకపెట్టింది రంగేలీ. బాధతో కీచుగావచ్చింది ఆమె గొంతు.
ఎడమచేత్తో కుడి మణికట్టు దగ్గర పట్టుకుని విలవిల్లాడిపోవడం మొదలెట్టింది.
ఆ అదురుచూసి ఎలుగెత్తి అరిచింది సృజన.
"ఏమండీ! మమ్మల్ని వీళ్ళు ఎత్తుకొచ్చేశారు! హెల్ప్ ప్లీజ్! హెల్ప్!"
సరిగ్గా అదే సమయంలో వ్యాన్ ఇంజను రెయిజ్ చేశాడు డ్రైవరు. వెంటనే ఫస్టు గేరువేసి, వ్యాన్ కొద్దిగా కదలగానే టకటక సెకెండ్ గేర్, థర్డ్ గేరు వేశాడు. ఆశబ్దాలూ, వ్యాన్ లో ఉన్న ఆడవాళ్ళమాటలూ, పోలీసుల గద్దింపులూ, ఇవన్నీ సృజన కేకలని మింగేశాయి. ఆమె గొంతు ఎవరికి వినబడనేలేదు.
వంట్లో ఉన్న శక్తి అంతా కాళ్ళలోకి తెచ్చుకుని, పరిగెత్తడం మొదలెట్టారు సృజనా, కామాక్షి. అక్కడే వసారాలో ఉన్న కొయ్య స్థంభానికి ఆనుకు కూర్చుని, చిన్న ఇనప రోలులాంటి దాన్లో చిన్న ఇనప రోకలిని లేసి, తాంబూలాన్ని ముద్దగా నూరుకుంటున్న పళ్ళులేని వృద్దవేశ్య ఒకామె వీళ్ళని చూడగానే బోసినోటితో అరిచింది.
"ఎక్కడికే ఉరుకులు ఓ పిల్లలూ! ఆగండి! ఆగండి!"
ఆగలేదు ఆ ఆడపిల్లలు. మరింత వేగంగా పరిగెత్తారు. ముసలిది శాపనార్ధాలు పెడుతూ వణికే చేత్తో ఇనపరోకలి ఎత్తి వాళ్ళ వైపు విసిరింది. అది వచ్చి సరిగ్గా సృజన తొడకి తగిలింది. అయినా పరుగు ఆపలేదు సృజన. ఇద్దరూ ఇంట్లో నుంచి బయటపడ్డారు.
అప్పటికే వీధి మలుపు తిరుగుతోంది పోలీసు వ్యాను.
"దాన్ని అందుకోవాలి!" అంది సృజన.
రొప్పుతూ పరిగెడుతున్నారు ఇద్దరూ.
ఆవీధి మలుపు తిరగాగానే కనబడ్డారు వాళ్ళకి. అనాధరక్షకుడిలా నిలబడిఉన్న కానిస్టేబులు.
"అంకుల్! వాళ్ళు మమ్మల్ని తరుముకొచ్చి పట్టుకుంటారు! ఆపండి!" అంది సృజన.
"ఎవరు పట్టుకునేది! ఎందుకు?" అన్నాడు కానిస్టేబులు.
జరిగినదంతా గబగబ చెప్పింది సృజన.
శ్రద్దగావిని, సానుభూతిగా తల పంకించాడు అతను. "ఏం ఫర్వాలేదు! నాతోరండి!"
అప్పుడు మొదటిసారిగా గుండెలనిండా గాలి పీల్చుకుంది సృజన.
"భయంలేదురండి!" అన్నాడు కానిస్టేబులు మళ్ళీ.
అతని వెనకే నడిచారు ఇద్దరూ.
పక్క సందులోకి దారితీశాడు అతను. ఒక ఇంటిముందు ఆగాడు "లోపలికి పదండి."
సందేహించకుండా లోపలికి వెళ్ళారు ఇద్దరూ.
లోపలికి వెళ్ళి వెళ్ళగానే వినబడింది, చిలకగొంతు.
"పిట్టని పట్టుకో! పిట్టని పట్టుకో! పిట్టని పట్టుకో!"
ఒక్కసరిగా నిలువెల్ల కంపించింది సృజన శరీరం. కామాక్షి బావురుమని ఏడవడం మొదలెట్టింది. ఆ వెంటనే రంగేలీ నవ్వు వినబడింది.