Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 13

 

    వంకీలజుత్తు అందంగా పేప్ తీసుకుంది. పెదాలపై చిరునవ్వులు చిందులు వేస్తున్నాయి! శరీరంలో పై భాగం ఎలా వుండాలో అలా వంపులు తీరి వుంది.
    
    "ఎలావున్నా వత్తయ్యా!" అత్తగారి దగ్గర కూర్చుంటూ తనే ముందుగా పలుకరించాడు విక్రాంత్.
    
    "నువ్వెలా చదువుతున్నావో చెప్పు!"
    
    "ఏముంది? ఇంకో మూడేళ్ళలో ప్రాక్టీసు పెట్టొచ్చు! నవ్వుతూ సమాధానం చెప్పాడు వాడు. పుచ్చపువ్వులా నవ్వుతున్నాడు.
    
    "అలాగా! అయితే నాకు జబ్బు చేస్తే మరో డాక్టరు వద్దకి వెళ్ళే అవసరం ఉండదన్నమాట!" నవ్వుతూ అంది సుందరమ్మ.    

 

    "అదేం మాట అత్తయ్యా! నీకు జబ్బెందుకు రావాలి ఏ డాక్టరూ అవసరం లేకుండా సుఖంగా వుండాలి. నువ్వు అలా కోరుకోవాలి!"
    
    "అలా అంటావే కానీ ఫర్లేదత్తయ్యా! ఎలాంటి జబ్బయినా నేను క్షణాల్లో కుదిర్చేస్తానని అనలేదుగా?" అంది నంద.
    
    ఫక్కున నవ్వాడు విక్రాంత్! "గుడ్! నువ్వు నా పాయింట్ ని కేచ్ చేస్తావో లేదో అనుకున్నాను. కానీ కేచ్ చేశావు నందా? నీ నా భావాలకి భాషా బేధం తప్ప అర్ధ బేధం లేదు!" అన్నాడు గలగల నవ్వుతూ.
    
    నంద రెట్టించలేదు! మౌనం వహించింది.
    
    "పోన్లేరా బాబూ! ఎలాగయినా నువ్వు డాక్టరువవుతే అంతే చాలు!"  

 

    "ఎలాగో డాక్టరవుతే చాలా కష్టమమ్మా! కష్టపడి బాగా చదివి డాక్టరవాలి! అదీ నువ్వు కోరుకోవాల్సింది!" అంది నంద.
    
    "నువ్వేమిటీ ప్రతిదానికీ అలా అడ్డు తగులుతావు?" కొద్దిగా విసుగ్గా అంది సుందరమ్మ కూతురులా మాటాడటం ఆమెకి సుతరామూ యిష్టం లేదు.
    
    నంద లేచి వెళ్ళింది ఇంకేమీ అనకుండా.
    
    ఆ సాయంకాలం నంద, అతనూ బయటికి వెళ్ళారు. అతను ఇక్కడికి వచ్చినప్పటినుంచీ నందవైపు అదోలా చూస్తున్నాడు. ఆ చూపులో ఆరాధన, ఆప్యాయత రంగరించబడి వున్నాయి. యవ్వనంలో కనిపించే కోరికలూ తారట్లాడుతున్నాయి.
    
    ఇద్దరూ పార్క్ కి వెళ్ళారు.
    
    తను చెట్టు క్రింద కూర్చుని "కూర్చో!" అన్నాడు విక్రాంత్.
    
    నవ్వుతూ కూర్చుంది నంద.
    
    "నవ్వుతున్నావేం?"
    
    సమాధానం ఇవ్వకుండా మళ్ళీ నవ్వింది.
    
    "ఏయ్! ఏమిటా నవ్వు?" చిలిపిగా కేకేశాడు.
    
    "బావా! మా వూళ్ళో ఈ చోటుని ఏమంటారో తెలుసా?"
    
    "ఏమంటారు?" కుతూహలంగా ప్రశ్నించాడు.
    
    "లవర్స్ కార్నర్!"
    
    "ఓస్! అంతేనా?" తేలిగ్గా అనేశాడు.
    
    "ఏం?" ఆశ్చర్యపోయింది నంద.
    
    "మనం ప్రేమికులమేగా?"
    
    "బావా!"
    
    "కాదా నందా? నువ్వు నన్ను ప్రేమించడం లేదా?"
    
    "ఏ అమ్మాయి తన అత్త కొడుకుని ప్రేమించదు."
    
    "భలేదానివే! నేనడిగేది ఈ అమ్మాయి గురించి?" నంద చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు.
    
    "చప్పున తలవంచుకుంది నంద! అంతదాకా చలాకీగా మాట్లాడిన ఆ అమ్మాయికి జీవితంలో తొలిసారిగా తనని కోరుకునే అబ్బాయి తనని ముట్టుకునే సరికి ఒళ్ళంతా విద్యుచ్చక్తి ప్రవహించినట్లయింది. బుగ్గలో వెచ్చటి ఆవిర్లు ప్రవహించాయి. నరనరాన ఆవేశం ప్రసరించింది శరీరమంతా కంపించిపోయింది.
    
    "బావా!" అంది. ఆమె కంఠం కొద్దిగా కంపించింది.
    
    "నందా! చెప్పు! నీ నోటి నుంచి ఆ మాట వినాలని వుంది!"
    
    తలూపింది నంద!
    
    ఎలాటి అమ్మాయి అయినా ఆ సమయంలో అంత కంటే వివరంగా సిగ్గు విడిచి చెప్పలేదు. అదే అంగీకారం.
    
    "థాంక్స్ నందా!" చప్పున ఆమె అరచేతిని తన పెదాలకి ఆనించుకుని ముద్దాడాడు విక్రాంత్.
    
    నంద శరీరం అంతా కంపించినట్లయి చప్పున తన చేతిని లాక్కుంది.
    
    "నందా! ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను నేను!" గంభీరంగా అన్నాడు విక్రాంత్.
    
    "నాతోనా?"
    
    "ఉహు! మామయ్యతో!"

 

    "ఏమిటి?"
    
    "నా చెల్లికి పెళ్ళి కుదిరింది. అతను ఇరాన్ లో ఇంజినీయర్! సెలవు మీద వచ్చాడు జయంతిని చూశాడు. ఒప్పుకున్నాడు! ఒక నెలరోజులు మాత్రమే సెలవుందట! ఈలోగా మేరేజ్ సెటిలైది ఆమెకి వీసా ఎప్లైచేసి ఈ నెల లోగా పెళ్ళిచేసుకుని వెళతారట!
    
    "అదృష్టవంతురాలు!" పొడిగా అంది నంద.
    
    "అతను కట్నం, లాంచనాలు అన్నీ కలిసి యాభయి వేలు అడిగాడు. అదంతా ఇక్కడే బ్యాంక్ లో జయంతి పేర వేస్తానన్నాడు. అతనికి అక్కడ డబ్బు అవసరం ఏముంది!"
    
    "నిజమే కదా! మీరు ఆమ్మాయి కే ఇవ్వచ్చు!"
    
    "అఫ్ కోర్స్! కానీ ఇప్పటికప్పుడే యాభయివేలు తేవాలంటే నాన్నతో అవటం లేదు. జయంతి పేరవుండే ఎస్.డీలు. ఇన్సూరెన్స్ పాలసీలు ఆమె కోసం చేయించిన నగలు అన్నీ కలిపి ముఫ్ఫై అయిదువేలు అయ్యాయి. ఇంకో పదిహేనువేలు షార్టయింది. అదిగాక పెళ్ళి ఖర్చులు!"
    
    ఆ మాటలకి నంద ఏమీ అనలేదు. ఊరకే వినసాగింది.
    
    బయలుదేరిన బాణం ఎక్కడ షూటయ్యేది ఆమెకి అవగతమయిపోయింది. అందుకే నిర్లిప్తంగా వుండిపోయింది.
    
    "కాబట్టి నాన్న మావయ్యని అడగమని చెప్పాడు. ఆయన్ని అడగబోయేముందు నీ అభిప్రాయం కనుక్కోవాలని" ఆగేడు విక్రాంత్.
    
    "థాంక్స్! బావా! కానీ నాన్న దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నీకు తెలియనిదే వుంది? ఇంటి అద్దెలమీదా ఆయన కొచ్చే జీతంతోనూ మా అందరి చదువులూ, సంసారం గుట్టుగా సాగడానికి ఎంతో ఇబ్బందిగా వుంది" బరువెక్కిన గుండెతో అంది నంద.
    
    "అలా అంటే ఎలా?" అన్నాడు విక్రాంత్.
    
    "అయితే నువ్వు కట్నం ఎడ్వాన్స్ గా అడుగుతున్నావా?'
    
    "అరె! ఏమిటా కోపం? నాపైనే! ఇదిగో నందా ఇది కట్నం ముందివ్వటం కాదు! మా అవసరాలకి ఆదుకోవటం! జయంతికి మంచి సంబంధం కుదరాలంటే ఈ హెల్ప్ కావాలి!" తనాశించిందే మరో విధంగా చెప్పాడతను.

 Previous Page Next Page