Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 14


    ఆయన ఆ మాట అనడం ఆలస్యం ఆమె రయ్యిమని ఆ గదిలోంచి బయటికి పరిగెత్తినట్లు వచ్చేసింది.
    
    ఎదుటివారికి మనలో తప్పులే ఎక్కువగా కనిపిస్తుంటే వారితో తలపడే ముందు 'మనం మార్గం తప్పుతున్నామేమో అన్న ఆత్మవిమర్శ చేసుకోవాలి' అన్న వివేకానందుడు గుర్తొచ్చాడు ఆ క్షణం.
    
                                                             * * *
    
    సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తల భారంగా, ఒళ్ళు నొప్పులుగా అనిపించింది. అయినా స్నానంచేసి టీ కలుపుకుందామని పాలు స్టవ్ మీద పెట్టింది. ఆ రోజంతా ధర్మానందరావుగారి మాటలు ఆమెని చిత్రవధ చేస్తూనే వున్నాయి. 'అలా అనుండాల్సిందీ, ఇలా అనుండల్సిందీ, ఛీ ఎందుకలా చేతకానట్లు మౌనంగా కూర్చుండిపోయానూ?' అని తనను తనే నిందించుకుంది. ఆ ఆలోచనలతోటి ఒళ్ళంతా అలిసిపోయినట్లుగా అయిపోయింది.
    
    "లోపలికి రావచ్చా?" నిశ్శబ్ధాన్ని భంగంచేస్తూ గంభీరమైన గొంతు వినిపించింది.
    
    ధృతి వంటింట్లోనుండి వచ్చేటప్పటికే ధర్మానందరావుగారు ముందు గదిలో నిలబడి కనిపించారు.
    
    ఆమె ఎంత ఆశ్చర్యానికి లోనయిందంటే "రండి" అనికూడా అనలేక పోయింది.
    
    ఆయన పొందికగా సర్దుకున్న ఆ గదినీ, గదిలోని వస్తువులనీ నిశితంగా గమనించసాగారు.    

    "కూర్చోండి" అందామంటే అక్కడ ఆయన కూర్చోడానికి అనువుగా ఏమీ కనిపించలేదు. అందుకే ఆ ప్రయత్నమేమీ చేయకుండా నిలబడింది.    

    ఆయన గూట్లో పద్దతిగా పేర్చి పెట్టిన పుస్తకాలని "చూడచ్చా" అని అడిగాడు.
    
    ఆమె తల వూపింది.
    
    ఆయన చలం, కొడవటిగంటి, తిలక్, శరత్, గోపీచంద్ ల పుస్తకాలని చూస్తూ "మంచి అభిరుచి వున్నట్లు వుందే" అన్నాడు.
    
    ఆమెకి ఆనందంగా అనిపించింది.
    
    "నేనూ మనుషులతో కంటే పుస్తకాలతోటే ఎక్కువగా స్నేహం చేస్తాను. అందుకే అన్నారు ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు ఒక కొత్త స్నేహితుడు దొరికినంత సంబరం కలుగుతుంది. దానినే కొన్నాళ్ళ తరువాత మళ్ళీ చదివితె చిరకాల మిత్రుడ్ని కలిసినంతటి ఆనందంగా వుంటుంది అని" అన్నాడు.
    
    ఆమెకి అంతా కలలోలాగా వుంది.
    
    ఆయన ఆమెని తప్పుకుంటూ వంటింటివైపు నడిచి లోనికెళ్ళడం చూసి, ఆమె కూడా అటు నడిచింది. లోపల కనపడ్డ దృశ్యం చూసి ఆమె చిత్తరువే అయింది.
    
    పక్కనేవున్న బట్టతో ఆయన పాలగిన్నె దింపి పక్కన పెట్టారు. అప్పటికే పాలు పొంగినట్లు గుర్తుగా పొయ్యిమీద పాలు కనిపిస్తున్నాయి.
    
    "ఒక్క నిమిషం ఏమరుపాటుగా వున్నందువలన పాలు వేస్టయ్యాయి. ఒత్తులు తడిసిపోతే మళ్ళీ మార్పించుకోవాలి. చూశావా ఎంత నష్టమో! అందుకే శ్రద్దగా చేయాలి ఏ పనైనా కూడా" అన్నాడామెతో.
        
    ఆమె సిగ్గుపడినట్లు తల వంచుకుంది.    

    ఆయన ముందుగదిలోకి వెళ్ళి అక్కడ వున్న చాపమీద మఠం వేసుకుని కూర్చున్నాడు.
    
    ఆయన ప్రవర్తన ఆమెకి జీర్ణం అవడంలేదు. ఎలా అర్ధంచేసుకోవాలో కూడా అర్ధంకావడం లేదు. తన ఎమ్.డి. ధర్మానందరావుగారేనా! ఆ కనిపించే ఇంద్రభవనంలాంటి బంగళా ఓనర్ ఈయనేనా అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒకసారి గిచ్చి చూసుకోవాలనే కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. టీ కలిపి తీసుకొచ్చి ఆయన ముందర పెట్టింది.
    
    ఆయన టీ తీసుకుని త్రాగి "బావుంది" అన్నాడు.
    
    ధృతి థాంక్స్ చెప్పాలనే అనుకుంది కానీ గొంతు సహకరించలేదు.
    
    "ఇల్లు ఎలావుందీ? సుబ్బరాజు చేత అవసరమైనవి తెప్పించుకో" అన్నారు టీకప్పు క్రింద పెడుతూ.
    
    ఆమె అన్నింటికీ తలవూపింది. 'నా ధైర్యం ఏమయిపోయింది? కొంపదీసి ఈ మనిషికి ఏవైనా మానవాతీతమైన శక్తులున్నాయా?' అనుకుంది.    
    
    "ఇలా ఒంటరిగా వుండడం నీకు అలవాటు లేదు కదూ! ఒంటరితనాన్ని జయించాలంటే విలువైన ఆలోచన చెయ్యాలి" అంటూ లేచాడు. "వస్తాను" అని ఆయన పంచె కొద్దిగా ఎత్తిపట్టుకుని, హుందాగా తన బంగళావైపు సాగిపోతుంటే ఆమె అచేతనంగా చూస్తూ నిలబడింది.
    
    ఆ రాత్రి డైరీలో ఇలా రాసుకుంది..... "ప్రశాంతత పరిసరాల్ని బట్టికాదు, మనఃస్థితిని బట్టి దొరుకుతుంది. ఒంటరితనంలో అలజడే ఎక్కువ. ఒంటరితనాన్ని కోరుకునేవారు మనుషులని ఇష్టపడనివారయి వుండరు. మనుషులంటే భయపడేవారయి వుంటారు."
    
                                                              * * *
    
    లీల వల్ల ఆఫీసులో ధృతికి బెరుకుపోయింది. గాలిదుమారంగా వచ్చి కబుర్లు చెప్పేసి వెళ్ళిపోతుంది. టిఫిన్ తెచ్చుకోలేదంటే ప్రాణం తీసైనా సరే తన బాక్స్  లోంచి కొంత పెడుతుంది. వారం ఎలా తిరిగొచ్చిందో తెలియదు.
    
    శనివారం ధృతి హుషారుగా వుంది. ఆరోజు ప్రొద్దుటే ధర్మానందరావు గారు "ద్రాక్షతోటలు చూడ్డానికి వెళుతున్నాను, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో" అని చెప్పి వెళ్ళిపోయారు.
    
    ధృతి పెందలాడే ఇంటికి వచ్చేసింది.
    
    సుబ్బరాజు "కూరలేమైనా కావాలా అమ్మగారూ?" అంటూ వచ్చాడు.
    
    "అక్కర్లేదు. రేపు ఇంటికి వెళుతున్నాగా" అంది మెరుస్తున్న కళ్ళతో.
    
    సుబ్బరాజు కూడా నవ్వుతూ "అదేటీ! అమ్మాయిగోరు ఈరోజు వెలిగిపోతున్నారూ అనుకున్నాను. అదీ సంగతీ" అన్నాడు.
    
    ఆమె నవ్వి "పనయిపోయిందా?" అని అడిగింది.
    
    అతను అదోరకంగా తిప్పుకుంటూ "ఆ.... మా అయ్యగారు ప్రొద్దుట నుంచీ భోంచెయ్యలేదు. ఎప్పుడొస్తారో ఫోను కూడా చెయ్యలేదు" అన్నాడు.
    
    "అన్ని పనులూ నువ్వే చేస్తావా?" ధృతి అడిగింది.
    
    "ఓ..... వంటా, బట్టలు ఇస్త్రీ చెయ్యడం, ఒళ్ళు బాగోపోతే సేవ చెయ్యడం.... అన్నీనూ" అన్నాడు.
    
    "ఎవరూ దగ్గరవాళ్ళు లేరా పాపం?" ఆమె అడిగింది.

 Previous Page Next Page