మధ్యాహ్నం వాచ్ మెన్ ఆమె దగ్గరికి వచ్చి "ఇదిగో అమ్మా! ఉద్యోగం ఇచ్చి, అడ్వాన్స్ కూడా యిచ్చారు. అనవసరంగా మా అమ్మ పోయిందనీ....." అంటూ నసిగాడు.
ఆమె ఆనందంతో పొమ్గిపోతూ "ఫరవాలేదు! ఒక అబద్దం నీ సంసారాన్ని నిలబెడ్తే అది పాపం, నేరం అవదు. మనం అలా అబద్దం అడబట్టే కదా ఆయనలోని మానవత నిద్రలేచి తిరిగి నీకు ఉద్యోగం ఇచ్చారు! నాకెంతో సంతోషంగా వుంది" అంది.
అతను ఏమీ మాట్లాడకుండా ఆమెకి ఓ నమస్కారం పెట్టి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
ధృతికి చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయం నవీన్ కి వెంటనే చెప్పేసి, ఆయనమీద తను సాధించిన మొదటి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది.
"ధృతీ! మీకు ఫోన్" మేనేజర్ గారు అనగానే, తన క్యాబిన్ వైపు నడిచింది.
"హలో!" ఆ గొంతు ఆమెకి చిన్ననాటి నుండీ పరిచితం.
ఆమెకి చిన్నపిల్లలా ఎగిరి గెంతులెయ్యాలనిపించింది....."ఏయ్....! పెద్దగొప్ప....ప్రోద్దుతా నువ్వూ..." అంటూ వుంటే, అతను అందుకున్నాడు.
"అవును! నీకోసమే వచ్చాను నిన్ను చూశాను. వెళ్ళాను" అన్నాడతను.
"ఎందుకలా చేశావ్? మాట్లాడొచ్చుగా" ఉక్రోషంగా అంది.
"మనం కలుసుకుంటే తప్పకుండా మా ఇంటి విషయాలో, లేక మీ ఇంటి విషయాలో మాట్లాడుకుంటాం అది వద్దనేగా ఆయన నిన్ను విడిగా వుండమని రూల్ పెట్టిందీ" అన్నాడు.
"అయితే ఇలా ఫోన్ కూడా చెయ్యకూడదు" చెప్పింది కోపంగా.
"నిజానికి ఇలా చెయ్యడం తప్పే!" నిజాయితీ ధ్వనించింది అతని గొంతులో "కానీ సాయంత్రందాకా ఈ విషయమే ఆలోచించి మనసు పాడుచేసుకుంటావని చేశాను."
"కుటుంబ సభ్యులని కలుసుకోవద్దన్నారు కానీ, నిన్ను కలుసుకోవద్దనలేదే" అల్లరిగా అడిగింది.
"నువ్వు తెలివైనదానివి అనుకోవడంలో తప్పులేదు. కానీ అవతలి వారు అవివేకులు అనుకుంటే మాత్రం చిక్కుల్లో పడతావు" కాస్త మందలింపుగా అన్నాడు.
"సరే! సరే! మాష్టారూ యింక ఆపండి."
"ఆదివారందాకా శలవు! బై" అంటూ ఫోన్ పెట్టేశాడు.
ధృతి కూడా 'బై' అంది. కానీ తనకెంతో ప్రియమైన వస్తువులా ఆ రిసీవర్ని అలాగే ఓ నిమిషం చెంపకి ఆన్చుకుని నిలబడి, ఆ తరువాత పెట్టేసి, ఉత్సాహంగా తన సీట్ వైపు నడిచింది.
సీట్లో కూర్చోగానే ధర్మానందరావుగారి దదగ్గర్నుంచి పిలుపొచ్చింది. లేచి బుక్, పెన్సిల్ తీసుకుని హుషారుగా లోపలికి నడిచింది.
"కూర్చో!" ఆయన ఆమెని నిశితంగా పరిశీలిస్తూ అన్నాడు.
ఆమె కూర్చోగానే "వాచ్ మెన్ కి ఉద్యోగం ఇచ్చింది నీ అద్భుతమైన మానవత్వానికి ఆనందపడీ, అవాక్కయిపోయీ లేదా నీ తెలివితేటలకి బోల్తాపడిపోయీ కాదు" అన్నాడు.
ఆమె స్థాణువులా మారి చూస్తూ కూర్చుంది.
ఆయన పెదవులమీద సన్నని చిరునవ్వు మెరిసింది....." నువ్వు అబద్దం ఆడావనీ, అతని అమ్మ పోలేదనీ నాకు తెలుసు."
ఆమె మాటలుదారి శిలాప్రతిమలా అయింది.
"నువ్వు అతనితో మాట్లాడినదంతా అతను యథాతధంగా నాకు నిన్ననే చెప్పేశాడు! అతను నాతో నిర్భయంగా 'కొత్త అమ్మాయిగారు యిలా చెప్పమన్నారండీ, నాకు మీతో అబద్దం చెప్పడం అంటే ప్ర్రాణం పోయినట్లుగా అనిపించి ఇలా పరిగెత్తుకు వచ్చానండీ!' అన్నాడు. నేను వెంటనే అతని నిజాయితీని మెచ్చుకుని ఉద్యోగం యిచ్చేశాను" అంటూ చిన్నగా నవ్వాడు.
ధృతికి చెంపదెబ్బ తిన్నట్లుగా అనిపిస్తోంది.
"అవసరంలో ఆదుకోవడానికి ఏమాత్రం పరిచయం లేకపోయినా ముందుకు వచ్చిన నీకు నిజాయితీగా వుండాల్సిందిపోయి, నాకు ఫెయిత్ ఫుల్ గా ఎందుకు మారాడని నీకు ఆశ్చర్యంగా వుందా?"
ఆమె "అవును" అన్నట్లు తల వూపింది.
"ఎందుకంటే...... తనలాగే పొట్టకూటి కోసం ఉద్యోగం చేసే నీకు రాయల్ గా వుంటే అతనికి ఏం లాభం? అదే నిజాయితీ నా దగ్గర చూపించి, నా బహిమానం కొట్టేస్తే, అతనికి ముందు కూడా నావల్ల నిజాయితీలూ, మనవత్వాలూ అన్నీ బలాదూర్" అన్నాడు విజయదరహాసంతో.
ఆమెకి తల కొట్టేసినట్లుగా అన్పించింది. ఆయన తన నాటకాన్ని ఎంత చక్కగా తిప్పికొట్టాడూ? అనవసరంగా తనకి సంబంధంలేని విషయంలో వేలు పెట్టి తనెంతగా ఫూల్ చెయ్యబడిందీ? తల్చుకుంటూ వుంటే ఏడుపొచ్చింది.
"ఇందాక ఫోన్ ఎక్కడ్నించి" ఆయన గొంతు కఠినంగా వినపడింది.
అనుకోని ప్రశ్నకి ధృతి ఆశ్చర్యపోయి..... "నా ఫ్రెండ్ దగ్గర నుంచి" అంది.
"ఆడా.... మగా?" ఆయన గొంతు అదోరకంగా ధ్వనించింది.
"స్నేహితుడు" రోషంగా అంది.
"ఉట్టి స్నేహితుడు మాత్రమేనా?" ఆయన గొంతులో హేళన లేదు, కానీ ఆరా వుంది.
"ఇప్పటిదాకా స్నేహితుడే...." ఆమెకి అభిమానంతో కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి.
"భవిష్యత్తులో ఏం జరగనుందో నీ చేతిలో లేదుకదా?" ఆయన రెచ్చకొట్టినట్లు అన్నాడు.
ధృతికి ఆ మాట అపశృతిలా ధ్వనించింది.
"ఏమైనా అది నాకు అనవసరం కానీ ఇలా ఆఫీసు ఫోన్లు పర్సనల్ పనులకి ఉపయోగించుకోవడం నాకు నచ్చదు. మరీ అర్జెంట్ అయితే తప్ప చెయ్యొద్దని చెప్పు నీ ఫ్రెండ్స్ కీ, బంధువులకీ" అన్నాడు.
ఆయన అంత మాట అనేసరికి ఆమె జీర్ణం చేసుకోలేకపోయింది. చాలా సున్నితమైనచోట తగిలినట్లుగా అనిపించింది. క్రింది పెదవి పంటితో బిగబట్టి "సారీ" అంది.
"వెళ్ళు.... వెళ్ళి పనిచూసుకో" అని ఫైల్లో తల దూర్చేశాడు.