Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 15


    
    "ఏమోనండీ! భార్య పోయాక మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా వుండిపోయారని మాత్రం విన్నాను" అన్నాడు.
    
    ఆమె ఇక ఎక్కువగా సాగదియ్యలేదు సంభాషణ.
    
    రాత్రి ఎనిమిది అవుతుండగా కారు చప్పుడైంది.
    
    ధృతి తనకి తెలియకుండానే ఆయనకోసం ఎదురుచూస్తోంది.
    
    ధర్మానందరావుగారు కారు దిగి ఇంట్లోకి వెళ్ళడం చూసి వంటింట్లోకి నడిచింది- ఉన్నదేదో తినేసి పడుకుందామని.
    
    "అమ్మాయిగారూ!......అమ్మాయిగారూ!" అంటూ సుబ్బరాజు తలుపులు కొట్టాడు.
    
    "ఏమిటీ?" అంది తలుపు తీస్తూ.
    
    "అయ్యగారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు....ఏదో అర్జంటు పనట" అన్నాడు తొందర తొందరగా.
    
    ఆమె వెంటనే తలుపు జారేసి అతనివెంట నడిచింది.
    
    ధృతిని చూడగానే "ఇంపార్టెంట్ కాగితాహాలు కొన్ని టైప్ చెయ్యాలి. అదిగో మిషన్" అన్నాడు ధర్మానందరావు.
    
    ఆయన పక్కన కూర్చుని డిక్టేట్ చేస్తుంటే ఆమె టైపుచేస్తోంది.
    
    పది గంటల వరకూ అలా చేస్తూనే వుంది.
    
    ఆఖరి కాగితం పూర్తిచేశాక "భోజనం చేశావా?" అని అడిగాడు.
    
    ఆమె తల అడ్డంగా వూపింది.
    
    "సుబ్బరాజూ! మా ఇద్దరికీ భోజనం వడ్డించు...." అంటూ ఆయన పైకి దారితీశారు.
    
    "వద్దండీ" అన్న ఆమె మాట ఆయన వినిపించుకోలేదు. సుబ్బరాజు వచ్చి రమ్మని పిలవటంతో ఆమెకి తప్పలేదు. అతని వెంట లోనికి నడిచింది. అక్కడున్న డైనింగ్ టేబుల్ చూడగానే ఆమె కళ్ళు తిరిగిపోయాయి. 'ఒక్క మనిషికి ఎందుకింత పెద్దది? ఇద్దరు మనుషులు హాయిగా కాళ్ళు చాపుకుని పడుకోవచ్చు' అనుకుని తన వూహకి తనే నవ్వుకుంది.
    
    ఆయన నైట్ డ్రెస్ లోకి మారి వచ్చి "కూర్చో" అన్నాడు.
    
    సుబ్బరాజు రకరకాల కూరలు, పండ్లూ, స్వీట్లూ ఏవేవో తెచ్చి టేబుల్ మీద సర్దాడు. ధృతి కళ్ళు విప్పార్చుకుని చూడసాగింది.
    
    ఆమె అలాగే కూర్చోవడం చూసి, ఆయన తనే చకచకా వడ్డించసాగాడు.
    
    ఆమెకి చాలా మొహమాటంగా అనిపించింది.
    
    "నేనే వడ్డించుకుంటాను" అంది.
    
    ఆయన ఆ ప్రయత్నం మానేసి తినడం ప్రారంభించాడు. ఆమె మాత్రం అన్నంలో వేళ్ళు పెట్టి కెలుకుతూ కూర్చుంది.
    
    "ఏమీ తినటంలేదు. బాగాలేదా?" అడిగాడు.
    
    "అహ! అదికాదు....."
    
    "మరీ?" రెట్టించాడు.
    
    "మా తమ్ముడూ, చెల్లెలూ గుర్తొచ్చారు. వాళ్ళు అక్కడ...." పూర్తిచేయలేక పోయింది. ఏదో గొంతులో అడ్డుపడిన భావన!
    
    ఆయన ఆమె వంక ఓ నిమిషం తీక్షణంగా చూసి, "రేపటి గురించిన ఆలోచన మంచిదేగానీ, అది ఈ రోజని రసహీనం చేయకూడదు! అలాగే నిన్నటి విషయాలు తలుచుకుంటూ యీ రోజుని నిరర్ధకం చేసుకోకూడదు. వాళ్ళని సుఖపెట్టాలీ, మంచి జీవితం ఇవ్వాలీ అనేగా నువ్వు యిక్కడ కొచ్చిందీ...అందుకు ముందు నువ్వు బాగుండాలిగా.....! మంచిపిల్లలా భోంచెయ్యి" అన్నాడు.
    
    ఆమెకి ఆయన మాటలు ఊరటనిచ్చాయి. "నేను తమ్ముడ్ని, చెల్లెలినీ పైకి తీసుకురావాలి. ప్రపంచంలోని సౌకర్యాలన్నీ రుచి చూపించాలి" అనుకుంటూ ముద్ద నోట్లో పెట్టుకుంది.
    
                                                               * * *
    
    ఆమె చెప్పిందంతా విన్న తర్వాత చిన్నగా నవ్వి "మొదటి పాదంలోనే వోజయం సాధించాను సుమా! అన్నట్టు చేశాడన్నమాట" అన్నాడు.
    
    ధృతి ఉడుక్కుంటూ "ఆయన అభిప్రాయం తప్పనీ, డబ్బుని మించిన ఆనందాన్నిచ్చే బంధాలు వున్నాయనీ నిరూపిస్తాను" అంది.
    
    నవీన్ సీరియస్ గా అన్నాడు "ముందరే చెప్పాను పొట్టేలు కొండని ఢీకొన్నట్లు ఆయనతో తలపడ్డావని ఆయన చెప్పేవన్నీ జీవిత సత్యాలు. జీవితం గురించి సుందర స్వప్నాలు కనే అమాయకత్వంలో వున్న నువ్వు అవి ఆరగించుకోలేకపోతున్నావు. కానీ, నీలా ఆలోచించేవాళ్ళు చాలా కొద్దిమందే అని నిరూపించాలని ఆయన గట్టి ప్రయత్నంమీద వున్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది."
    
    ఆమె అతని కళ్ళలోకి సీరియస్ గా చూస్తూ "చూడబోతే నువ్వు కూడా ఆయనలాగే...." అంది.
    
    "ఔను! ఆయన మాటల్ని అంగీకరిస్తాను" అన్నాడు.
    
    ఆమెకి గొంతు పూడుకుపోతుండగా అడిగింది- "మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి వున్నాయని నువ్వూ నమ్ముతున్నావా నవీన్?"
    
    ఆమె కంఠంలో ధ్వనించిన సన్నని బాధావీచిక అతన్ని కదిలించింది. ఆ మసక చీకటిలో ఆమె హారతి వెలుగులా వుంది. అతను జవాబు యివ్వకుండా ఆమె భుజంమీద చేయివేసి "పద పోదాం" అన్నాడు.
    
    పార్కులో జనం అంతా ఇళ్ళకి చేరుకుంటున్నారు.
    
    ధృతి రాను అన్నట్లు తల అడ్డంగా వూపుతూ, "నాకు జవాబు కావాలి" అంది హఠం చేస్తున్నట్లు.
    
    నవీన్ నవ్వి "మనకొచ్చే సమస్యలూ, ఇళ్ళల్లో జరిగే తగాదాలూ అన్నీ డబ్బుతో ముడివేసుకున్నవేగా ధృథీ" అన్నాడు శాంతంగా.
    
    "అయి వుండవచ్చు! కానీ డబ్బులేమి కారణంగా నువ్వు నీ జబ్బు తల్లిని వదిలివెయ్యాలని అనుకోవడంలేదే! నేను నా కుటుంబాన్ని వాళ్ళ బారిన వాళ్ళని వదిలేసి నా ఆనందాలు నేను వెతుక్కోటానికి సిద్దంగాలేనే" అంది విసురుగా.
    
    "సుఖపడటం కూడా అందరికీ రాదు ధృథీ" నవ్వుతూ చెప్పాడు.
    
    అతని చేతిని పట్టుకుంటూ అందామె - "అదే నవీన్ అనుబంధం అంటే! మనం లక్షలిచ్చినా అలా చెయ్యలేము. ఆ ఆపేక్షలూ, ఆప్యాయతలూ రుచి తెలిసినవాళ్ళు 'డబ్బే' ముఖ్యమని పరుగెత్తి, దానికోసం అర్రులుచాచి అలసిపోతారు. అలసిపోయిన వారికి రవ్వంత స్వాంతన అందించేవారు కరువై పరితపిస్తారు."
    
    అతను ఆమె కళ్ళలోని అమాయకత్వాన్ని, నుదుట జ్వలిస్తున్న ఎర్రటి తిలకపు బొట్టుని తదేకంగా చూస్తూ నవ్వుకున్నాడు. 'ఫస్టు తారీఖునాడు బడ్జెట్ వేసుకొని చూసుకుని, చివరికి రూపాయి కూడా మిగలదని తెలిసీ, తప్పదని రూపాయి మిగిల్చి పువ్వులు కొనుక్కొచ్చే భర్త కలిగిన భార్యా, 'నిన్న నువ్వు షోరూమ్ లో చూసి ముచ్చటపడిన చీర ఇదిగో...." అంటూ పాకెట్ అందించే భర్త కలిగిన భార్యా ఒకేలాంటి తృప్తినీ, ఆనందాన్నీ పొంది భర్తలకు ఒకేలాంటి అనురాగాన్ని అందించగలరా? అనే సందేహం కలిగింది. అయినా అది బయటపెట్టి ఆమెని బాధపెట్టదల్చుకోలేదతను.

 Previous Page Next Page