"ఏమీలేదు పద." ఉదయచంద్ర అడుగు ముందుకు వేశాడు.
వాడితో ఏమని చెప్పాలి? ఆ కళ్ళగురించి చెప్పాలంటే, సిగ్గుగా వుంది. కళ్ళేమిటి? తనను వెంటాడడమేమిటి? అదే తన దగ్గరకు వచ్చే ఒక మానసికరోగి చెప్తే తనెలా తీసుకుంటాడు? అది దృష్టి విభ్రమంగా భావిస్తాడు. అయితే తనకుకూడా....ఛ....తనేమిటిలా ఆలోచిస్తున్నాడు? తనకు విభ్రమాలేమిటి?
ఇదంతా వీరభద్రుడి చేష్టలేనేమో? వీడికి ఏవేవో మంత్రతంత్రాలు తెలిసినట్టుంది. మాయాజాలంకూడా చేస్తాడేమో? తనను బెదరగొట్టి ఇక్కడ్నుంచి పారిపోయేలా చెయ్యడానికి అలాంటి ఏర్పాటేదో చేసివుంటాడు. అసలు విలన్ వీడే! ఇంకా సందేహం ఎందుకు? వీడే మానసిని హింసిస్తున్నది వీడే. ఈ సంగతి శివరామయ్యకు తెలుసా? తెలిస్తే ఎందుకు ఊరుకుంటాడూ? శివరామయ్యను వీడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా?
ఆ మెట్టు రహస్యం ఏదో వీడికి తెలిసి వుండాలి. ఆ మెట్టుమీద నుంచి పడిందెవరు? పడ్డారా? లేక తోసేశారా? ఎవరు ఎవర్ని హత్యచేశారు? ఆ హత్య ఎందుకు చేశారు? ఆ సంగతి వీడికి తెలిసి వుండాలి. ఆ ఝూస్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని శివరామయ్యను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? ఏం సాదించాలని? డబ్బా? లేక మానసిని పోందాలనా?
ఇలా అయితే రహస్యంగా పొంచివుండి ఆమెను వెంటాడవలసిన పనేముంది? శివరామయ్యను అదిరించి బెదిరించి మనసిని లొంగదీసుకొనే వాడేగా? మానసి లొంగకపోతే ఇలా హింసిస్తున్నాడా? అదే నిజమైతే శివరామయ్య మానసిని చికిత్సకోసం తనదగ్గర కెందుకు తీసుకోస్తాడూ? ఇక్కడికి రమ్మని ఎందుకు ప్రాధేయపడ్తాడూ?
ఇదంతా ఒక సాలెగూడులా వుంది. బుర్రంతా వేడెక్కిపోతున్నది.
తను ఇక్కడకు ఒక సైకియాట్రిస్టుగా వచ్చాడు. మానసి మనసు చెదిరే బహిర్గత ప్రేరణలను పరిశీలించడానికి వచ్చాడు. మానసి మనసు చెదిరే బహిర్గత ప్రేరణలను పరిశీలించదానికి వచ్చాడు. అందువల్ల మానసికి చికిత్ససులభం అవుతుందని భావించాడు. కాని ఇదేమిటి తను ఇలా ముళ్ళకంపలో పడిపోయాడు? ఈ ఇల్లేమిటి? ఈ మనుషులేమిటి? ఆలోచిస్తుంటే మతిపోతున్నది. తనేమన్నా అపరాధ పరిశోధకుదా? కనీసం ఏనాడూ డిటెక్టివ్ నవలలు కూడా చదవలేదు. అవి చదివి చాలామంది తన దగ్గరకు ట్రీట్ మెంటుకు వచ్చారు. అంతా అయోమయంగా వుంది. సాలెగూడులో ఇరుక్కుపోయినట్టుగా వుంది.....తన పరిస్థితి.
"డాక్టర్ బాబుగారూ! మంచం బయట వెయ్యమంటారా?"
వీరభద్రుడి గొంతువిని తృళ్ళిపడ్డాడు. ఆలోచననుంచి ఉదయచంద్ర.
"వద్దు.....వద్దు....ఇక్కడే బాగుంది. ఇక్కడే పడుకొంటాను" గదిలోకి ప్రవేశిస్తూ అన్నాడు ఉదయ్.
"మీ ఇష్టం బాబూ!" పక్క సర్దివేస్తూ అన్నాడు వీరభద్రుడు.
ఏమిటి తను భయపడ్తున్నాడా? బయట పడుకోవడానికి భయపడుతున్నాడా? నాన్సెన్స్ తనకు భయమేమిటి? మరయితే బయట ఎందుకు పడుకోనన్నాడు?
"అదే మంచిదిబాబూ! గదిలోనే పడుకోండి" సలహా ఇస్తున్నట్టుగా అన్నాడు వీరభద్రుడు.
ఉదయ్ కు ఒళ్ళు మండింది.
"ఏం బయట పడుకొంటే?"
"కొత్త చోటుగదా? బెరుగ్గా ఉంటుంది అంతే."
"అయితే బయటే వెయ్యి పక్క" బింకంగా, మొండిగాఅన్నాడు. దెబ్బతిన్న ఈగో ప్రతీకారాన్ని కోరుతుందా? తనలో తనే నవ్వుకున్నాడు ఉదయ్.
"లాభమేంటిబాబూ. మీకు నిద్రపట్టదు. గడియ వేసుకొని గదిలో పడుకోండి హాయిగా."
తన మనసును చదివినట్టే చెపుతున్నాడు. వీడు మామూలు మనిషి కాడు. ఏమైనా సరే వీడి అంతు కనుక్కోకుండా ఈ ఊరినుంచి కదలకూడదు.
"డాక్టర్ బాబూ" దక్షిణవైపు కిటికీ దగ్గర నిలబడి "తెరవమంటారా?" అని అడిగాడు.
"అదికూడా అడగాలా? తెరిస్తే ఏమౌతుందట?"
"ఊరికే అడిగాను బాబూ" అని కిటికీ రెక్కలు తెరిచాడు. గాలి రివ్వున దూసుకొచ్చింది. కొవ్వొత్తి రెపరెపలాడింది.
"బాబూ! మంచినీళ్ళు బల్లమీద పెట్టాను. ఇదుగో బాబూ! అక్కడ నడవాలో పడుకుంటాను. అవసరంవస్తే పిలవండి"
"నీ అవసరం నాకు లేదు. కిందకెళ్ళిపడుకో."
"అయ్యగారు మీకు తోడుగా పడుకోమన్నారు."
"నాకు తోడా? ఎందుకూ?"
"ఈ రాత్రికి పడుకోనివ్వండి బాబూ. అవసరం లేకపోతే రేపులేదు.
ఇప్పటికే వీడు తన మనసులో ఏదో చెడు విత్తనం నాటాడు. అది రాత్రికి రాత్రే మొలిచి మహావృక్షంగా పెరగొచ్చు.
మనసు కథా కమామీషూ తెలిసిన డాక్టర్ ఉదయచంద్ర ఆలోచనలో పడ్డాడు.
"నేను శెలవు తీసుకుంటా బాబూ! మీరు గడియ వేసుకొని పడుకోండి."
"ఒక్క నిముషం. పెళ్ళయిందా అని అడిగావ్. ఎందుకూ?"
"మీరు చెప్పకపోతేనేం బాబూ" దానికి తెలుస్తది బాబూ."
"దానికా? ఆడేవరు?" ఉదయ్ కంఠంలో బయలుదేరిన వణుకును అణచుకున్నాడు.
"ఇప్పుడు దాని ఊసెందుకులే బాబూ? పొద్దుపోయింది. తమరు పడుకోండి బాబూ" అంటూ వీరభద్రుడు గది బయటకు వచ్చాడు.
ఉదయ్ గడ దగ్గరకొచ్చి నిలబడ్డాడు.
వీరభద్రుడు పెద్ద పెద్ద అంగలువేస్తూ నడవాలో నడిచి పోతున్నాడు. వాడ్నిచూస్తూ నిట్టూర్పు విడిచాడు. లోపలకొచ్చి తలుపు గడియ వేశాడు.
రాస్కెల్. వెళ్తూ వెళ్తూ ఓ సజెషన్ వదిలేసిపోయాడు.
వీడు తనను బెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
దానికి తెలుస్తుదట. ఏమిటది? దానికేం తెలుసు? అసలు అదంటే ఎవరు?
బట్టలు మార్చుకొని మంచంమీద వాలిపోయాడు. వళ్ళంతా విరగ్గొట్టినట్టుగా వుంది. మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఈ వాతావరణం తననే ఇంతగా అలజడికి గురి చేస్తుంటే, మానసి మనసు చెదిరిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? తను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాడేమో?
ఏకాగ్రతతో సెల్స్ హిప్నాటిజం చేసుకొన్నాడు. పదిహేను నిముషాల తర్వాత లేచి మంచం మీద కూర్చున్నాడు. మనసు హాయిగా వుంది. మాలినమైనవస్త్రం ఉతికి ఆరవేసినట్టుగా వుంది. గత నాలుగు గంటల కాలంలో జరిగిన సంఘటనల్ని నెమరువేసుకుంటూ డైరీ రాయసాగాడు.
డిసెంబరు 29
నాలుగు గంటల ప్రయాణం. బంగళాకు చేరేసరికి రాత్రి తోమ్మిదయింది. ఈ బంగాళా వందేళ్ళకిందట కట్టినది. చెక్కమెట్లు. పదమూడో మెట్టు విరిగి వుంది. కరంటులేదు. ఊళ్ళోకి ఎలక్ట్రిసిటీలేదు. శివరామయ్య అది రాకుండా చేస్తున్నాడు. ఎలక్ట్రిసిటీ వస్తే అందరూ మోటర్లు పెట్టుకుంటారట తనకు నీళ్ళు చాలవట. అది నిజమైన కారణం కాకపోవచ్చు. అదే నిజమైతే శివరామయ్యకంటే క్రూక్ మరొకడుండడు. ముందుగా కన్పించింది వీరభద్రుడు. వీడిది పెక్యూలియర్ పర్సనాలిటీ. వీడి తాత సన్యాసుల్లో తిరిగి పరకాయ ప్రవేశం....దివ్యదృష్టి...దీన్నే పారాసైకాలజీలో క్లియర్ వాయన్స్....
రాస్తూ కూర్చున్న ఉదయచంద్రకు కనురెప్పలు బరువెక్కాయి.
11
కిటికీ చువ్వల సందుల్లోనుంచి రెండుకళ్ళు చూస్తున్నాయి. అవి తనను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. ఆశగా చూస్తున్నాయి.
"ఏయ్? ఎవరూ?" ఉదయచంద్ర తృళ్ళిపడిలేచి కూర్చున్నాడు.
దక్షిణవైపు కిటికీ వెనకనుంచి ఏదో ఆకారం కదిలి వెళ్ళింది.
ఉదయచంద్ర ఒక్క దూకులో మంచం దిగాడు. హలుపులుతెరుచులోని వరండాలోకి పరుగుతీశాడు.
మెట్ల పక్కగా లాంతరు పెట్టుకొని గోడవారగా పడుకొని గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు వీరభద్రుడు.
వాడు వీడుకాడు. వాడే వీడయితే ఇంత త్వరగా గోడ చేరుకొని ఇలా పడుకొని గురక నటించలేడు. మరొకడెవడో అయివుండాలి. అయితే వాడు టెర్రస్ మీదనే దాక్కుని వుండాలి.
మెట్ల పక్కన పెట్టివున్న లాంతరు తీసుకున్నాడు. వత్తి పెద్దది చేశాడు. వెనక్కు పరుగెత్తాడు. తన గది దగ్గరకు వస్తుండగా మెట్లమీద ఎవరో పరుగెత్తినట్టు అన్పించింది. ఉదయచంద్ర మెట్ల దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు.
వీరభద్రుడు లేచి కూర్చొని కళ్ళు నులుపుకుంటూ చూశాడు.
"ఏంటి బాబూ? ఇప్పుడు మెట్లమీద పరిగెత్తింది మీరేనా బాబూ?"
"నేను కాదు." ఉదయచంద్ర రొప్పుతూ చెప్పాడు.
"అయితే మిమ్మల్ని గదిలోనుంచి లేపుకోచ్చిందన్నమాట? అనుకుంటూనే వున్నా బాబూ?"
ఉదయచంద్ర అయోమయంగా వీరభద్రుడ్ని చూశాడు.వళ్ళు చల్లబండింది.
"అదృష్టవంతులు బాబూ! మీరు ఆ మెట్లు దిగలేదు. సిగడానికి ప్రయత్నిస్తే ఏమయ్యేదో ఈపాటికి? చెప్పలేను బాబూ. అదీ ఏశాలేస్తుంది ఏశాలు.
"ముందు నువ్వు ఆ వేషాలు ఆపి సరిగా చెప్పు. నన్ను నిద్రలేపింది ఎవరూ? ఈ మెట్లమీద పరుగెత్తింది ఎవరు?" డాక్టర్ కంఠంలో భయంతోపాటు కరకుతనం పలికింది.
"ఇక్కడొద్దులే బాబూ? అది, ఇక్కడే ఎక్కడో థిరుగుతూ వుంటుంది. మీ గదిలోకి పదండి చెప్తా" అంటూ లేచాడు వీరభద్రుడు.
డాక్టర్ చేతిలోని లాంతరు అందుకొని గదివైపుకు నడిచాడు. ఉదయ్ కు అతడ్ని అనుసరించక తప్పలేదు.
"అట్టా కూర్చోండి బాబూ. వళ్ళంతా చెమటతో ముద్దయింది. ఇందా! ఈ తువ్వాలుతో తుడుచుకొండి బాబూ" వీరభద్రుడు ఉదయ్ కు టవల్ అందించాడు.
ముఖాన పట్టిన చమట తుడుచుకొని వీరభద్రుడ్ని అనుమానంగా చూశాడు
"ఏందిబాబూ అట్టా చూత్తారు? ఇదంతా దానికతే బాబూ! ఇది మీకు కొత్త కానీ మాకు ఇది రోజూవుండే కొలువే. మీలాంటి వాళ్ళోస్తే...అదే పెళ్ళికానోళ్ళు.....వయసులో వున్నోళ్ళు వస్తే దాని ఆటలు చెప్పలేం బాబూ."
ఇది వీడికి ఆటగా వుందా? ఇదంతా వీడు ఆడిస్తున్న నాటకమే కదూ? తను వచ్చిన దగ్గర్నుంఛీ వాడి వాలకం చూస్తూనే వున్నాడు.
"స్థిమితపడండి డాక్టర్ బాబూ. ఈ సల్లటినీళ్ళు తాగి కాసేపట్టాకూచోండి" గ్లాసుతో నీళ్ళు అందించాడు వీరభద్రుడు.
ఉదయ్ నీళ్ళు తాగి గ్లాసు అందించాడు.
నిద్రపోయేముందు టేబుల్ మీద పెట్టిన వాచీ అందుకొని టైం చూశాడు.
పన్నెండు ఏభై అయింది.
అంటే తను నిద్రపోయింది గంటన్నరేనా?
ఇక్కడకొచ్చి ఇంకా నాలుగ్గంటలుకూడా కాలేదు. కాని ఎంతో కాలం అయినట్టుగా వుంది. వీడెంత నాటకం ఆడుతున్నాడు? ఇది వీడొక్కడే ఆడుతున్న నాటకం కాదు. వీడికి తోడు మరొకడు ఉండి ఉండాలి. ఒక్కడే అని ఎందుకనుకోవాలి? మరొకడుకూడా వుండే వుండాలి.
"అదృష్టం బాబుగారూ! అదృష్టం!"
"ఎవరిదీ?" అసహనంగా అడిగాడు ఉదయ్.
"మీదే బాబూ! మీదే. మిమ్మల్నయితే మెట్లదాకా తీసుకెళ్ళింది కాని ఆ పదమూడో మెట్టుమీదకు లాగలేకపోయింది."
"పదమూడో మెట్టు మీదకు వెళ్తే ఏమైవుండేదంటావ్?"
ముఖం గంభీరంగా పెట్టడానికి ప్రయత్నం అయితే చేశాడు కానీ...
"ఈపాటికి నెత్తురు మడుగులో పడి గిలగిలా కొట్టుకుంటూ వుండేవారు" ఆగి ఉదయ్ ముఖంలోకి చూశాడు.
అక్కడి నెత్తురు మడుగు సంగతేమోగాని ఇక్కడ ఇతడి ముఖంలోకి కత్తివేటుకు రక్తం చుక్కలేదు.
నాలుకతో పెదవులు తడుపుకొన్నాడు.
"బాబూ! ఇంకాసిని నీళ్ళు తాగండి" అది చూసి అన్నాడు వీరభద్రుడు.
లేచి వెళ్ళి కూజాలోని నీళ్ళు గ్లాసులోకి వంపి తెచ్చి ఉదయ్ కు అందించాడు.
అయిష్టంగానే గ్లాసు అందుకొని గ్లాసెడు నీళ్ళూ గట గట తాగేశాడు. ఇప్పటికే రెండు గ్లాసుల నీళ్ళు తాగించాడు. తనకు తెలియకుండానే వాడి హేతుల్లో కీలుబొమ్మగా మారిపోతున్నట్టుగా అనిపించింది ఉదయ్ కు.
వీడి కళ్ళల్లో ఏదో శక్తివుంది.
వీడి మాటల్లో ఏదో ఆకర్షణ వుంది.
తను హిప్నటైజ్ చెయ్యబడ్డాడా?
తను హిప్నటిక్ ట్రాన్స్ లో వున్నాడా? వీడు తనను హిప్నటైజ్ చేశాడా?
ఆ ఆలోచనకు ఉదయ్ కు వళ్ళు జలదరించినట్టయింది. తల విదిలించుకొన్నాడు.....గట్టిగా గాలిపీల్చి వదిలాడు.
వీరభద్రుడి ముఖంలోకి సూటిగా చూశాడు.
"ఏంటి బాబూ! అట్టా సూత్తారు? నేను సెప్తున్నది మీరునమ్మడం లేదు కదూ? అంతా అబద్దమే అనుకుంటూన్నారు గదూ?"
"ముమ్మాటికీ అబద్దమే. నువ్వు పచ్చిమోసగాడివి. ఇదంతా నువ్వే ఉదయ్ మంచంమీద నుంచి ఒక్కదూకు దూకాడు.
వీరభద్రుడు రెండడుగుళు వెనక్కువేసి ఉదయ్ ముఖంలోకి జాలిగా చూశాడు.
"బాబూ!మీ కోపం నామీద సూపిస్తే ఏంలాబం బాబూ! చేతనయితే...."ఆగి చెవులు రిక్కించి వినసాగాడు వీరభద్రుడు.
"ధన్ ధనా! టక్ టకా!" కొయ్యమెట్లమీద మనిషి పరుగులుతీసిన చప్పుళ్ళు.
ఉదయ్ చంద్రకు ఊపిరి స్థంభించిపోయింది.
వీడు.....వీడు ఇక్కడే వున్నాడు. మరి ఆ మెట్లమీద పరుగులు తీసింది ఎవరు?
వాడెక్కడ? వాడే అయివుండాలి.
ఉదయ్ చంద్ర అడ్డంగా నిలబడి వున్న వీరభద్రుడ్ని తోసుకుని వాకిలి దగ్గరకు పరుగుతీశాడు. వాకిట్లో ఎదురైన అడివయ్యను ఢీకొట్టినంత పనైంది.
వీడు ఇక్కడున్నాడా? ఆ మెట్లమీద పరిగెత్తింది వీడుకాడు. కాడు. వీడే మెట్లమీద పరిగెత్తివుంటే ఇంతత్వరగా ఇక్కడికెలా రాగలడు? మెట్ల దగ్గర్నుంచి పరిగెత్తికొచ్చినా ఒక నిముషం పైగానే పడ్తుంది. ఆ చప్పుళ్లు విన్పించి ఒక్క నిమిషంకూడా కాలేదు. ముప్పయ్ సెకండ్లుఅయి వుండొచ్చు. ఇదెలా సాధ్యం?
"ఇయ్యాల వీటల్లరి మరీ జాస్తిగా వుంది. యీరాభద్రయ్యా. ఇంట్లో కొత్తవాళ్ళున్నారనీ పసికట్టినట్టున్నాయ్. వీటి సిగతరగ. మీరు బయపడ మాకండి బాబూ! బయపడితే అవి మనంతు సూత్తయి బాబూ!" తలుపు వారగా నిలబడి అన్నాడు అడివయ్య.
బోడి వెధవ! సలహాలిస్తున్నాడు. సలహాలు!
ఉదయ్ కు వళ్ళు మండిపోయింది.
వీటి అల్లరి అంటున్నాడు. అంటే ఒకటి కాదనేగా ? అయితే రెండా? ఒక్కొక్కడు ఒక్కొక్క....
"ఒరే అడివయ్యా! బాబుగారూ మనం ఏం చెప్పినా నమ్మేట్టులేర్రా!" వీరభద్రయ్య గొణిగాడు.
"ఇందులో నమ్మకపోవటానికేముంది బాబూ! సాయంగా అవి మన కళ్ళెదురుగా తిరుగుతుంటేనూ? వాటి అల్లరి మనకు వినిపిస్తుంటేనూ?"