నయంకావనుకొన్న మొండికేసులు నయం అవుతాయి.
"మానసీ ఆగావేం? ఈ ఇంట్లో ప్లీజ్ గో ఎహెడ్" ప్రోత్సహిస్తున్నట్టుగా అన్నాడు.
"ఇంతమంది ఉన్నారు. ఏం లాభం? ఒక్కడూ వాడ్ని పట్టులేకపోయారు" దిగులుగా అన్నది మానసి.
ఆమె ముఖంలో విషాదచ్చాయలు అలుముకొన్నాయి. కళ్ళు తేలిపోతున్నాయి. చూపులు ఒకచోట నిలవడం లేదు.
ఉదయచంద్ర నీరుకారిపోయాడు.
ఏదో ముఖ్యమైన విషయం బయటపడపోతుందని ఆశించి హతాశుడైనాడు.
కథ మళ్ళీ మొదటికొచ్చింది.
ఆమె మానసిక స్థితిలో మార్పులేదు.
స్కిజోఫ్రేనిక్....పెరానాయిడ్...హెల్యూషనేషన్స్ ఆమెను వెంటాడుతున్నాయి.
భ్రాంతి____విభ్రాంతి.
భ్రమ___విభ్రమ.
ఆమె అంతరంగాన్ని చుట్టుకొనివున్నాయి. ఏమైనాసరే ఈ రోజు ఆ మబ్బుల్ని తొలగించాలి. సబ్ కాన్ క్షన్ కూ మధ్యనిలిచిన గోడల్ని బద్దలుకొట్టాలి ఆమె అంతరంగాన్ని మధించి అసలు సంగతి బయటికి లాగాలి. డైరెక్టుగా ఆ పని చెయ్యకూడదు. అందువల్ల పేషెంటుకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం వుంది.
అయినా తప్పదు.
ఛాన్సు తీసుకోవాలి.
మళ్ళీ ఈ అవకాశం దొరకదు.
డాక్టర్ ఒక నిర్ణయానికి వచ్చాడు. మనసి ముఖంలోకి సూటిగా చూసి ఆశ్చర్యపోయాడు.
ఇంతలోనే ఎంతమార్పు?
ఆమె మనసులో ప్రజ్వరిల్లుతున్న అగ్నిజ్వాలలు ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్నాయి. ఆమె ఊపిరి పీల్చడంలో అలజడివుంది. చూపుల్లో అసహనం ఉంది.
"మానసీ?"
"యస్. డాక్టర్!"
నిటారుగా నిలబడి చురుగ్గా చూసింది.
ఆమెలో వచ్చినమార్పు చూసి శివరామయ్య బిగిసిపోయాడు. భయం భయంగా కూతుర్నీ, డాక్టర్నూ మార్చి మార్చి చూశాడు.
"నిన్ను వెంటాడే ఆ దుర్మార్గుడు వీళ్ళల్లోనే వున్నాడేమో?"
ఉరమకుండానే పిడుగుపడింది.
ఎగిరిపడ్డాడు అడివయ్య.
క్రుంగిపోయాడు శివరామయ్య.
మానసి విరగబడి నవ్వసాగింది.
"డాక్టర్....డాక్టర్....మీ....మీకేమైనా..." అని ఉదయచంద్ర ముఖంలోకి చూసింది.
"మీకేమైనా పిచ్చా డాక్టర్?" నవ్వుతూ అడిగింది. అడిగి మళ్ళీ పకపకా నవ్వింది. నవ్వుతూనే వుంది. ఆపుకోవాలన్న ప్రయత్నంలేదు.
శివరామయ్య ఉదయచంద్ర ముఖంలోకి చిరాగ్గా చూశాడు.
"డాక్టర్ గారూ ఈ ఇంట్లో వున్నవాళ్ళు మానసి వెంటపడడం ఏమిటి? ఉన్న భయలూ చాలవా? ఈమె మనసులోకి కొత్త అనుమానాలనూ, భయలనూ ఎక్కిస్తున్నారు" శివరామయ్య నొసలు ముడిచాడు.
ఉదయచంద్ర సాలోచనగా శివరామయ్యను చూశాడు.
"నిన్నటిదాకా మీరన్నదేమిటి?"
"ఏమన్నానూ?"
"అవన్నీ ఆమె మనసు కల్సించుకొన్న భ్రమలు అనలేడూ? డాక్టర్ గారూ! ఈ ఇంట్లో అలాంటివాళ్ళెవరూ లేరు" శివరామయ్య కంఠం కటువుగా వుంది.
"అయితే వాడెవడో బయటిను. చే వస్తున్నాడంటారా?" ఉదయ్ శివరామయ్య కళ్ళల్లోకి సూటిగా చూశాడు.
"డాక్టర్ మీరంటున్నదేమిటి?"
"మీరు అలాగే అన్నారు?"
"డాక్టర్ నేను అలా అన్నాన్నా?"
"నాకు అలాగే అర్థం అయింది."
"డాక్టరుగారూ! నిజంగానే బయటినుంచి ఈ ఇంట్లోకి ఎవడో వస్తున్నాడనుకుంటున్నారా? వాడెవడో వచ్చి మానసిని బెదిరిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా?"
"నేను నమ్మడంలేదు."
"మరి?"
"బయటనుంచి ఎవడో వస్తున్నాడని నమ్మడంలేదు."
"అంటే మీ ఉద్దేశ్యం...."
"ఈ ఇంట్లోనే వుండొచ్చునని అనుమానం. ఏం మానసీ. ఉద్దేశ్యంకూడా అదేకదూ?"
"ఆ దుర్మార్గుడు....ఈ ఇంట్లో .....ఇక్కడే...."
"చెప్పు. ఇక్కడే వీళ్ళలోనే వున్నాడా?"
మెల్లాలోవున్న పెట్రమాక్స్ లైటు గుప్ గుప్ మని మంటలు లేచి ఒక్కసారిగా ఆరిపోయింది.
అంతటా గడాంధాకారం అలుముకుంది.
"వీరభద్రుడూ__ఒరేయ్-ఎక్కడ చచ్చావురా?" శివరామయ్య గట్టిగా అరిచాడు కోపంగా.
"డాక్టర్ గారూ. ఇలారండి" అంటూ మానసి ఉదయచంద్ర చెయ్యి పట్టుకొని వరండాలోనుంచి లోపలకు నడిపించింది.
"చాలా చీకటిగా వుంది మానసీ."
"ఇది మాకు అలవాటే. చీకట్లోకూడా నడవగలం. ఈ యింట్లో ఏది ఎక్కుండుందో మాకు తెలుసు. ఇక్కడ వంగి ఆగండి. కాలు పైకెత్తి వెయ్యండి. ఇక్కడ గడపవుంది. ఇటు కుడివైపుకు తిరగండి" చెప్తూనే ఊకసారిగా "డాక్టర్" అని గావుకేక పెట్టింది.
"ఏమిటి మానసీ?"
"డాక్టర్ ఆగండి. ఆడుగో? వాడొస్తున్నాడు" అరుస్తూ మానసి వెనక్కు జరిగి ఉదయచంద్ర మీదకు వాలిపోయింది.
ఆమెను రెండుచేతుల్తో పట్టుకొని కళ్ళు బాగావిప్పి చీకట్లోకి చూశాడు.
చెవులు రిక్కించి విన్నాడు.
"అమ్మాయ్ మానసీ! ఎందుకమ్మా భయం? ఇక్కడి కెవరూ రాలేడంమా. నేనే ఉన్నాను. ఒరేయ్ వీరభద్రుడూ! ఎక్కడ్రా లాంతరు?" శివరామయ్య గొంతు పగిలేలా అరిచాడు.
సన్నగా వెలుగూ, వెలుగును వెన్నంటి క్రీనీడా, ఆ వెనకే వీరభద్రుడు లాంతరు పట్టుకొని వచ్చాడు.
అంతవరకూ తన చేతుల్లో వున్న మానసిని, తనవైపుకు తిప్పుకొని లాంతరు వెలుగులో ఆమె ముఖం చూశాడు ఉదయ్. ఆమె ముఖం బాగా పాలిపోయింది. గజ గజా వణికిపోతున్నది.
ఆ భుజాలు పట్టుకొని గట్టిగా కుదిపాడు ఉదయచంద్ర.
"మానసీ!"
"డాక్టర్! వచ్చాడు. వాడొచ్చాడు సేమ్ ఫెలో."
"డోన్ట్ వర్రీ. అతడు ఇహ నిన్నేం చెయ్యలడు. నేనున్నాను నీ పక్కన. దైర్యంగా వుండు."
"నిజం తల్లీ. డాక్టర్ గారు చెప్పినట్టు విను. వాడు ఇక నిన్నేమీ చెయ్యలేడు." శివరామయ్య కూతురికి దైర్యం చెప్పాడు.
"డాక్టరుగారూ. మీకూ కన్పించాడా?" సూటిగా ఉదయచంద్ర కళ్ళల్లోకి చూసింది మానసి.
డాక్టర్ తొట్రుపాటు పడ్డాడు.
"ఏం చెప్పాలి?"
"బాబుగారూ గ్యాస్ లైటు వెలిగింఛసుంటారా?" వీరభద్రుడు అడిగాడు.
"ఇంకా ఇప్పుడెందుకురా? భోజనాలుకూడా అయిపోయినై. డాక్టరుగార్ని వారి గదిలోకి తీసుకెళ్ళు. పక్క ఆరుబయట డాబామీద వెయ్యమంటారేమో కనుక్కో" శివరామయ్య పురమాయించాడు.
"రండి డాక్టర్ బాబూ" చెక్క మెట్లకేసి దారితీశాడు వీరభద్రుడు.
"మానసీ! గుడ్ నైట్" చెప్పాడు డాక్టర్.
"గుడ్ నైట్!" రెండడుగులు ముందుకువేసి డాక్టర్ ముఖంలోకి దిగులుగా చూసింది.
తను అప్పుడే మానసిని వదలి వెళ్ళడం ఆమెకు ఇష్టంలేనట్టు గ్రహించాడు ఉదయ్.
"నీకేం ఫర్వాలేదు మానసీ. ఈ రోజు నువ్వు హాయిగా నిద్రపోతావు. చాలా హాయిగా నిద్రపోతావు" ఆమె కాళ్ళల్లోకి చూస్తూ ఆవే మాటలు అంటూ సజెషన్స్ ఇచ్చాడు ఉదయ్.
ఆమె ముఖంలో ప్రశాంతత కన్పించింది. చాలా రిలాక్స్ డ్ గా వుంది.
"థాంక్యూ డాక్టర్. గుడ్ నైట్" అన్నది.
"గుడ్ నైట్." అని ఉదయ చంద్ర వీరభద్రుడు వెనకే ఒక్కొక్క మెట్టూ ఎక్కసాగాడు.
"డాక్టర్ గారూ వుంటా."
ఉదయ్ చంద్ర ఆగి వెనక్కు తిరిగి "మంచిది. మీరు వుండండి శివరామయ్యగారూ రేపు ఉదయం మాట్లాడుకుందాం" అన్నాడు ఆలోచిస్తూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతున్నాడు.
"ఒరేయ్ వీరభద్రుడూ. డాక్టర్ గారికి ఏం కావాలో చూడు. నువ్వూ మేడ మీదే పడుకో" కిందనుంచి కేకపెట్టి అన్నాడు శివరామయ్య.
"అట్టాగే బాబూ!" లాంతరు ఎత్తి కిందనున్న యజమానిని చూసి జవాబిచచ్చాడు వీరభద్రుడు.
వీడ్నెందుకు పైన పడుకోమంటున్నాడూ?
వీడు తనకు తోడా?
నొసలు చిట్లించి ముందుకు నడుస్తున్న వీరభద్రుడ్ని దీక్షగా చూశాడు. విశాలమైన భుజాలూ, బలమైన వెన్నూ, లయబద్దంగా పడ్తున్నఅడుగులూ....
వీరభద్రుడు హఠాత్తుగా ఆగాడు. వెనక్కు తిరిగి ఉదయ్ ను చూసి "బాబూ, జాగ్రత్త! విరిగిన మెట్టు గోదాపక్కగా నడవండి."
"ఈ మెట్టుకేదో మిస్టరీ వుంది. ఇక్కడేదో ప్రమాదం జరిగి వుండాలి. లేకపోతే ప్రతిసారీ ఇంత గగ్గోలు పడిపోతూ హెచ్చరించరు. అవును గుర్తొచ్చింది. శివరామయ్య ఈ మెట్టుకు ఏదో కథ వుందన్నాడు. మనసి రావడం చూసి ఆగిపోయాడు. ఆలోచిస్తూ ఆ మెట్టుమీద కాలుపెట్టి ఆగిపోయాడు.
"ఈ మెట్టుమీదనుంచి పడి ఎవరన్నా...." వీరభద్రుడి కళ్ళలోకి సూటిగా చూశాడు ఉదయచంద్ర.
"మీకెట్టా తెలుసు బాబూ!" వీరభద్రుడి గొంతు కీచుమన్నది.
"చెప్పు! ఇక్కడేమైంది?"
"బాబోయ్, అయ్యగారు చంపేస్తారు" తెగ గాభరాపడిపోతున్నాడు వీరభద్రుడు.
నటిస్తున్నాడా? నిజంగానే భయపడుతున్నాడా?
"సరే నడు. మీ అయ్యగారి చేతే చెప్పిస్తా రేపు" గోడవారగా ఆ మెట్టుదాటి పైకి వచ్చాడు ఉదయచంద్ర.
ఆగి వెనక్కు తిరిగి మెట్లు లెక్కపెట్టాడు. అది పదమూడోమెట్టు. లాంతరు పట్టుకొని ముందుకెళుతున్న వీరభద్రుడ్ని కొంచెం ఆగమన్నాడు.
"ఎందుకు బాబూ?" అక్కడే నిలబడిపోయాడు. వెనక్కు తిరిగాడు.
"ఇక్కడ....ఇక్కడ...."
"ఆఁ అక్కడ ఏమిటైంది బాబూ?"
కళ్ళు....
నిప్పు కణికల్లాంటి కళ్ళు! రెండు.
తనను గంటకుముందు వెంటాడాయి. ఉదయ్ మనసులో మధనం ప్రారంభం అయింది.
"డాక్టర్ బాబూ! ఏమిటట్టాగే వుండిపోయారూ?"