Previous Page Next Page 
నిశాగీతం పేజి 15



    "ముందీ సంగతి చెప్పు. ఇప్పటిదాకా నువ్వెక్కడున్నావ్?" అడివయ్య కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఉదయ్.
    "తోటలో బాయి దగ్గర పడుకొన్నాను. కునుకు పట్టిందో లేదో వీటి సిగతరగ ఒకటే అల్లరి...బాయిలో దిగి జలకాలాటలాడుతున్నాయి. జలకాలాటలు?"
    "దయ్యాలు స్నానాలు చేస్తాయా?" తన మాట తనకే విధంగా కొత్తగా అన్పించింది.
    ఛ! ఛ! తమేమిటిలా అడుగుతున్నాడు? దయ్యాలేమిటి? స్నానాలేమిటి? ఎంత ఇర్రేషనల్ గా ప్రశ్నించాడూ?
    "ఎందుకు చెయ్యవు బాబూ. అన్నీ  చేస్తాయి మనుషులు చేసేపనులన్నీ అవీ చేస్తాయి."
    "ఏడ్చావులే. నోరుముయ్. ఇప్పుడిక్కడి కెందుకోచ్చావ్? ముందా సంగతి చెప్పు" కసిరాడు ఉదయ్ చంద్ర.
    "మీరేడ సెప్పనిస్తున్నారు బాబూ?" బెదురు బెదురుగా చెప్పాడు అడివయ్య.
    "చెప్పు! ఎందుకొచ్చావ్? నా గది కెందుకొచ్చావ్?"
    "బాయి దగ్గర నానా అల్లరీచేసి, ముందుగా ఆడది ఇటు, బంగాళా వైపుకు పరుగెత్తుకొచ్చింది."
    "ఆడదా?"
    "అవును బాబూ! ఆడదయ్యమే" అడివయ్య నొక్కి చెప్పాడు.
    "దెయ్యాల్లోకూడా ఆదా మగా ఉంటాయా?"
    "మరి వుండవాబాబూ?" చాలా ఖచ్చితంగా నిబ్బరంగా అన్నాడు అడివయ్య. "ఇంత చదువుకున్నావు ఆ మాత్రం తెలియదా: అన్నట్లు ఉదయచంద్ర ముఖంలోకి చూశాడు.
    ఉదయచంద్రకు మనసులో ఏదో కెలికినట్టు అయింది. ఎలాటి ప్రశ్నలడుగుతున్నాడు? తనకు తెలియకుండానే తను మళ్ళా ఉచ్చులో చిక్కుకుంటున్నాడు. వఠ్ఠి అమాయకుడిగా కన్పించే ఈ అడివయ్య సామాన్యుడు కాడు. వీరభద్రుడ్ని మించినవాడిలా కన్పిస్తున్నాడు.
    "ఎప్పుడూ రానిది, ఆడది బంగళాకేసి వచ్చిందంటే నా కప్పుడే అనుమానం వేసింది బాబూ?"
    "ఏమిటో ఆ అనుమానం?" వెటకారంగా అడుగుతున్నానను కొన్నాడు ఉదయ్. కాని అతడి కంఠధ్వనిలో విషయం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కొట్టోచ్చినట్టుగా కన్పించింది.
    "తవరోచ్చి బంగళాలో ఉన్నట్టు దానికి తేలిసిపోయింది. దీని సిగతరగ దీనికి వయసులో వున్న కుర్రాళ్ళంటే మహా మోజు."
    "మరి ఆ మగ దెయ్యానికో?"
    "ఆడపిల్లలంటే ఇష్టం. ఇప్పటికి ఏడాదినుంచి మా నసమ్మగార్ని పట్టుకొని ఏడిపిస్తుందిగా బాబూ?"
    అసలు పాయింటుకొచ్చాడు. వీళ్ళిద్దరి పథకం ఇదన్నమాట? మానసికి దయ్యం పట్టిందని నమ్మించి తనను ఇక్కడ్నుంచి తరిమెయ్యాలని చూస్తున్నారు. అవును. అదే వీళ్ళ ఉద్దేశ్యం. తనను ఇక్కడ్నుంచి పంపించివేస్తే వీళ్ళకువచ్చే ప్రయోజనం ఏమిటి? మానసి పిచ్చిదై పోతే వీళ్ళకు లభించే లాభం ఏమిటి? వీళ్ళకు కాకపోవచ్చు. మరొకళ్ళకు లాభం చేకూరవచ్చుగా? ఆ మరోకడే వీళ్ళను ఈ పనికి పురమాయించి వుండొచ్చుగా?
    ఉదయ్ చంద్ర ముఖం విప్పారింది. మెదడును ఆవరించిన మబ్బు తెరలు తొలగిపోయినట్టుగా అన్పించింది.
    మానసి మానసిక ఆరోగ్యం పొందడం, ఒకడికి ఇష్టంలేదు. శివరామయ్యగారు తనను ఇక్కడకు తీసుకురావడం వాడికి ఇష్టంలేదు. మానసిక ఆరోగ్యం కుదుటపడి తిరిగోచ్చిన మానసిని మళ్ళీ యథాస్థితికితెచ్చింది. కూడా వాడే. తను వాడు అనుకుంటున్నాడు. మగవాడే అయివుండాలని ఏముంది. దీనివెనక ఆడదాని అజ్ఞాత హస్తం ఎందుకు వుండివుండకూడదు?
    ఆమె లేక అతడు వీరభద్రుడ్నీ, అడివయ్యనూ డబ్బుతో కొనేసివుండాలి. అందుకే వీళ్ళు శివరంయ్యకు ద్రోహం తల పెట్టారు. అందుకే వీళ్ళిద్దరూ, దయ్యాలకథలు సృష్టించారు. డబ్బుతిని స్వామిద్రోహానికి పాల్పడ్డారు.
    "ఇన్నారా బాబూ!"
    "అడివయ్య కంఠంవిని, అంతవరకూ ఆలోచనల్లో మునిగిపోయి వున్న ఉదయ్ తృళ్ళిపడ్డాడు.
    "ఏమిటది?"
    "వాళ్ళ పోట్లాట."
    "పోట్లాట."
    "అవును బాబూ! ఆడదెయ్యం. మగదెయ్యం పోట్లాడుకుంటున్నాయి. ఆడది చెట్టుఆకులు దూసి మగదెయ్య నెత్తిమీద పోస్తున్నది. మగది, ఆడదాన్ని కొడ్తున్నాడు. అందుకే ఆడదెయ్యం ఏడుస్తోంది బాబూ?"
    "అవి మొగుడూ పెళ్లాలా?" చట్టుక్కున అనేశాడు. ఇదేమి ప్రశ్న? తనకూ మతిపోతున్నట్టుంది. లేకపోతే ఏమిటీ పిచ్చిప్రశ్న దెయ్యాలేమిటి? మొగుడూ పెళ్ళాలేమిటి?
    ఉదయ్ కు మళ్ళీ ఊబిలో కాలేసినట్టుగా అన్పించింది.
    "అవునోకాదో తెలియదుబాబూ? కాని అవి పోట్లాడుకునే తీరుచూస్తుంటే మాత్రం మొగుడూ పెళ్ళాలే అన్పిస్తుంది. అచ్చంగా అట్టాగే పోట్లాడుకొంటాయి, మాట్లాడుకుంటాయి." వీరభద్రుడు అన్నాడు.
    ఉదయచంద్ర చివాల్న తలతిప్పి వీరభద్రుడ్ని చూశాడు.
    "దెయ్యాలుకూడా పెళ్ళిళ్ళు చేసుకొంటాయా?"
    వీరభద్రుడూ అడివయ్యా ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు.
    "వాటికి పెళ్ళి మీరే చేశారా?" వ్యంగ్యంగా అడిగాడు డాక్టర్ ఉదయ్.
    తన మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థంచేసుకోలేనంతటి అమాయకులు కారని, వాళ్ళ ముఖాలుచూసి అనుకున్నాడు ఉదయ్.
    "ఇంతకూ నువ్వు నా గది కెందుకొచ్చావో చెప్పలేదు." అడివయ్య ముఖంలోకి లోతుగాచూస్తూ అడిగాడు ఉదయ్.
    "బంగళాకేసి దెయ్యం, మేడమీదకొచ్చి మీ గది కిటికీదగ్గర నిలబడ్డం చూశాను బాబూ!వీరభద్రయ్య ఇక్కడున్నట్టు నాకు తెలువదుగా మరి! అందుకే వచ్చా."
    "థ్యాంక్సు. ఇక నువ్వెళ్ళి పడుకో" ఉదయ్ కంఠస్వరం తడిపొడిగా వుంది.
    "అట్టాగే  బాబూ....ఎందుకైనామంచిది మీరే కిటికీ మూసేసి....." అంటూ కిటికీలోనుంచి బయటికి చూసిన అడివయ్య ఎవరో గొంతునొక్కేసినట్టుగా ఆగిపోయాడు. చేష్టలుడిగి వుండిపోయాడు. కొద్దిక్షణాల తర్వాత కిటికీ దగ్గరకు పరుగుతీశాడు.
    "మీ తల్లి సిగతరగ ఇయ్యాల ఏమొచ్చిందే మీకు?"
    అతడి వాక్యం పూర్తికాకముందే వీరభద్రుడూ ఉదయ్ కూడా కిటికీ దగ్గిరకెళ్ళారు.
    అడివయ్య వెనగ్గా నిల్చుని బయటికి చూశాడు ఉదయచంద్ర.
    "అదుగో బాబూ అటు చూడండి....ఆ జువ్విచెట్టు దగ్గర___కాగడాలు పట్టుకుని చిందులేస్తున్నాయి. చూడండి బాబూ! చూడండి" అడివయ్య గొంతు మూసుకుపోతుంటే అతికష్టంమీద పెకలించుకొంటూ అన్నాడు.
    "చూశారా బాబూ! మేం చెపుతుంటే మీరు నమ్మడంలేదు కదూ? మీకంతా ఏదో తమాషాగా వుంది కదూ బాబూ? మీ కళ్ళతో మీరే చూడండి. చెట్టు మొదలు పట్టుకొని కిందికీ పైకీ పాకుతున్నాయి. దూకుతున్నాయ్" అంటూ వీరభద్రుడు కిటికీరెక్కలు ముయ్యడానికి ప్రయత్నించాడు.
    ఉదయ్ చంద్ర వీరభద్రుడి చెయ్యిలాగేసి, కిటికీలోనుంచి, దూరంగా జువ్వి చెట్టుకింద గంతులేస్తున్న కొరివి దెయ్యాలను. గుడ్లప్పగించి చూశాడు.
    కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాడు.
    అదే దృశ్యం.
    దీపాలు వెలుగుతున్నాయి.
    ఆరిపోతున్నాయి. మళ్ళీ వెలుగుతున్నాయి.
    ఉదయ్ మళ్ళీ మళ్ళీ కళ్ళునులుపుకొని చూశాడు.
    పరుగులు తీస్తున్న వెలుగులు, ఆరిపోయినట్టే ఆరిపోయి మళ్ళీ వెలుగుతున్న దీపాలు.....
    జుట్టు విరబోసుకుని నాట్యం చేస్తున్నట్టున్న చీకట్లు....
    డాక్టర్ ఉదయచంద్ర నిలువు గుడ్లేసుకుని చూస్తున్నాడు. చెక్కినరాతిబొమ్మలా నిలబడిపోయాడు.
    తనకేమైంది?
    వీళ్ళు తనను మోసం చేస్తున్నారా?
    వీళ్ళు ఇచ్చే  సజేషన్లకు తను గురి అయ్యాడా?
    తనకెళ్ళే తనను మోసంచేస్తున్నాయా?
    తన బుద్ధి తననే  మోసం చేస్తున్నదా?
    లేక___
    గతి తార్కిక భౌతిక వాదంమీద తన నమ్మకం సడలిపోయిందా?
    నాస్తిక వాదం నాస్తి అయిందా?
    క్షుద్ర విద్యమీదా, క్షుద్ర శక్తులమీద తనకు తెలియకుండానే తనలో నమ్మకం ఏర్పడిందా?
    "బాబూ! ఇలా వచ్చి కూర్చోండి. అవి మనం చూస్తున్న కొద్దీ కచ్చగా చేస్తాయి. ముందు మన గుండెనిబ్బరంమీద దెబ్బకొట్టి ఆ తర్వాత మనల్ని ఆటలు పట్టిస్తాయి. ఆటిని మనం చూసీ చూడనట్టేవుంటే ఆటిపాటికి అవే పోతాయి. రండి బాబూ!"
    వీరభద్రుడు కిటికీ రెక్కలు మూశాడు.
    ఉదయ్ అతడ్ని వారించలేనంత అశక్రుడయ్యాడు.
    అడివయ్య ఉదయచంద్ర చెయ్యిపట్టుకొని మంచం దగ్గరకు నడిచాడు.
    ఉదయచంద్రకు వళ్ళంతా చెమట్లు పడ్తున్నాయి. ఉక్కగా ఉంది. కిటికీకూడా మూశాడు వీరభద్రుడు.
    ఉదయ్ చంద్ర  మెదడు తిమ్మి రెక్కినట్టు మొద్దుబారిపోయింది.
    "బాబుగారూ! మీరు పడుకోండి తోడుగా గదిలో నేను పడుకుంటాను ఈరభద్రయ్య ఎళ్ళి మెట్లమీద పడుకొంటాడు. మీకేం భయం లేదు. మేమున్నాం" భరోసాగా అన్నాడు అడివయ్య.
    ఉదయచంద్ర మామూలు స్థితిలో వుండివుంటే అలా అన్నందుకు అడివయ్య ముఖం పగలగొట్టేవాడే. కాని ఆలోచించే స్థితిలోలేడు. మాట్లాడకుండా మంచం ఎక్కాడు. దిండు తలకింద సర్దుకుని పడుకొన్నాడు.
    వీరభద్రయ్య లాంతరు తీసుకుని గదిలోనుంచి బయటికి వెళ్లాడు. అడివయ్య తలగుడ్డతీసి, ఉదయ్  మంచం పక్కగా పడుకునే ప్రయత్నంలో వున్నాడు.
    హఠాత్తుగా ఉండేలు బద్దలా లేచికూర్చున్నాడు ఉదయ్ చంద్ర మంచంమీద.
    మెట్లమీద మనిషి పరిగెత్తుతున్న చప్పుడు గుండెలు అదిరేలా విన్పిస్తోంది.
    "ఏంలేదు బాబూ! ఈరభద్రయ్యనుచూసి అవి పారిపోతున్నాయ్." అన్నాడు అడివయ్య.
    "ఇంతకుముందు దూరంగా చెట్టుకింద ఉన్నాయిగా" మనసులోనే అనుకున్నానని భావించాడు ఉదయ్ చంద్ర. కాని ఆ మాటలు పైకే అనేశాడు.

    "వాటి కెంతసేపు కావాలి బాబూ! సిటికేసేంతలో ఆడున్నాయ్ ఈడుంటాయ్."

    "అడివయ్యా?"
    "ఏం బాబూ?"
    "ఇప్పుడు మెట్లమీద పరిగెత్తింది వీరభద్రయ్యేకదూ?"
    నడుంవాల్చిన అడివయ్య బిళ్ళంగోడులా లేచి కూర్చున్నాడు.
    "ఏంటి బాబూ మీరంటున్నదీ?"
    "అది వీరభద్రయ్యగాడి పనేకదూ?"
    అడివయ్య కళ్ళు గిర్రున తిప్పాడు. కొవ్వొత్తి వెలుగులో వాడిముఖం రంగులు మారడం కన్పించింది.
    "రాస్కెల్ అలా  దారికిరా?" మనసులో అనుకొని ఒక్క సారి మంచం దిగాడు ఉషారుగా.

 Previous Page Next Page