Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 12

 

    గౌతమ్ తన ఆలోచనల్లో ఉన్నాడు.
    వెళ్ళేందుకు వచ్చినట్టు?
    అమ్మ ఎందుకంత భయపడి పోయింది?
    ఏదేదో వాగి ఉంటారు.
    పిచ్చితల్లి, తనకు దూరం అవుతానని భయపడుతుంది. తనను కనకపోయినా, మాతృప్రేమను తనకు అందించింది. ఈనాటికీ తనెంత బాధ పెట్టినా మౌనంగా భరిస్తుంది.
    తనకు బాగా సంపాదించి ఇవ్వలేక పోయినందుకు బాధపడ్తూ ఉంటుంది. తనను చిన్న పని చెయ్యనివ్వదు. లాడ్జి అజమాయిషీ అంతా తనే చూసుకుంటుంది. చిన్నప్పట్నుంచి తనకు తోటి పిల్లల్లో చిన్నతనంగా ఫీలు కాకుండా ఎంత కష్టపడైన అడిగినవన్నీ కొని పెట్టేది.
    చిన్నతనంలో తనను చాలా మంది "నీకు అమ్మా నాన్న లేరు. వర్ధనమ్మ మీ అమ్మ కాదు" అని ఏడిపించేవాళ్ళు. ఆ మాట అన్నవాళ్ళను తిట్టేవాడు, కొట్టేవాడు.
    రవికి నోరు పిడచకట్టుకు పోతోంది. ఆలోచిస్తూ ఉంటే అచ్చం అన్నయ్యలాగే ఉన్నాడు. ఇంత పోలికా? రక్తసంబంధం లేని వాళ్ళలో అంత పోలికలుండటం అసంభవం.
    అంటే?
    సందేహం లేదు. ఇతడు అమల కొడుకే!
    అంటే!
    అన్నపూర్ణమ్మ కొడుకా?
    "అవును!
    అమల ఎవరో కాదు అన్నపూర్ణమ్మ.
    శంకరరావు భార్య.
    తన తల్లి!
    తనకు అమ్మ అబద్దం చెప్పింది. అమల తన అక్క అనీ, ఆమె చనిపోయిందని చెప్పింది.
    ఎంత మోసం?
    మోసమా?
    పాపం! ఒక స్త్రీ నలబై ఏళ్ళు దాటిన స్త్రీ , తన కన్నకొడుకు - చెట్టంత కొడుకు - ఎదురుగా నిల్చుని ప్రశ్నిస్తుంటే ఏం చెప్పగలదు? అందుకే అమ్మ అబద్దం చెప్పింది.
    "ఏయ్! మిమ్మల్నే!" గౌతమ్ విశ్వం భుజాలు పట్టుకొని మొరటుగా ఊపాడు.
    విశ్వం తుళ్ళిపడ్డాడు.
    గౌతమ్ ముఖంలోకి చూసి భయపడ్డాడు.
    దుర్మార్గుడిలా ఉన్నాడు.
    కొడ్తాడా ఏం?
    "చెప్పు! మా అమ్మను ఏమన్నావ్?"
    ఇతడి వాలకం చూస్తుంటే అలాగే ఉంది. విశ్వం జంకుగా చూశాడు.
    "ఓ౧ చెప్పు."
    "ఏం....ఏంటి?"
    "మా అమ్మను ఏమన్నావ్?"
    "నేనా?"
    "ఆ- నువ్వే."
    "నే....నేను ఏమీ అనలేదు."
    అకస్మాత్తుగా విశ్వం చూపులు గౌతమ్ చెవి కిందగా మెడ మీద ఉన్న పుట్టుమచ్చ మీదకు పోయాయి. తుళ్ళి పడ్డాడు . నో! నో! ఇటీజ్ ఇంపాజిబుల్! ఇద్దరూ ఒకటే! వాడే వీడు!
    చిన్నప్పుడు చదివిన నవల పేరు గుర్తొచ్చి నవ్వొచ్చింది విశ్వానికి.
    "ఏయ్  మిస్టర్! ఏమిటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావ్?"
    అవును , వీడే వాడు ! వాడె వీడు! తనకు ముందు నుంచీ అనుమానం గానే ఉంది. డాక్టర్ జకిల్ అండ్ హైడ్ లాంటి క్యారెక్టర్ వీడిది. వీడు- ఈ రవిగాడే నమ్మలేదు.
    ఆ పుట్టుమచ్చ - నల్లగా పెసర బద్దంత పుట్టుమచ్చ - అచ్చం అన్నయ్యకు ఉన్నట్టే వుంది. అన్నయ్యకు ఆ పుట్టుమచ్చ ఎంతో అందాన్ని ఇస్తుంది. అలాగే ఇతడి కీను! సరిగ్గా అంతే ఉంది - నల్లగా పెసరబద్దంత-
    మాట్లాడరేం?" గౌతమ్ ఆశ్చర్యంగా ఇద్దర్నీ మార్చి మార్చి చూశాడు.
    వీళ్ళేదుకు తనను అలా చూస్తున్నారు? వీళ్ళు కూడా ఖర్మ కాలి ఆ గౌతమ్ అనే అనుకుంటున్నారా? అంతే అయి ఉండాలి.
    అచ్చం అన్నయ్య లాగే వున్నాడు. అయితే అన్నయ్య మాత్రం కాదు. ఇరవై రెండు సంవత్సరాలు అన్నయ్యతో కలిసి పెరిగాడు . అందుకే ఈ ఇద్దరి మధ్యా ఉన్న ఆ సూక్ష్మమైన వ్యత్యాసం తనకు తెలుస్తుంది. బయటి వాళ్ళకు చస్తే తెలియదు. ముఖ్యంగా ఇద్దర్నీ వేరువేరుగా చూస్తే చస్తే గుర్తు పట్టలేరు. మాట్లాడితే తప్పించి తనూ వేరు వేరుగా చూస్తే గుర్తు పట్టలేడు. అన్నయ్యకంటే ఇతని తంగు కాస్త తక్కువ. కంఠంలో అన్నయ్య  కంఠంలో ఉన్న చల్లదనం లేదు. చూపుల్లో ఆ స్థైర్యం లేదు. ముఖంలో ఆ సంస్కారం లేదు. మనిషి కూడా పిసరంత అన్నయ్య కంటే సన్నం. అన్నయ్య శ్రీమంతుల కుటుంబంలో పెరిగాడు. ఇతను సాధారణ కాదు బీదగా బతికాడు. అందువల్ల ఇద్దరి వయసులో ఉన్న భేదం కూడా కనిపించడం లేదు. వీళ్ళిద్దరూ ఎదురు పడితే ? - ఎవరి రూపాన్ని వాళ్ళు సంపూర్ణంగా తెలుసుకోలేరు. పోలికలున్నట్లు భావించవచ్చును. అంతే గాని ఇతర్లను ముంచినంత ఆశ్చర్యంలో వాళ్ళను వారి రూప సారూప్యం ఆశ్చర్యంలో ముంచ లేకపోవచ్చు.
    సందేహం లేదు. ఇతడే ఆరోజు తమ ఇంటికి వచ్చింది. ఇతడ్ని చూసే అమ్మ అంత షాక్ అయింది.
    ఇతడ్ని గుడ్డి వెలుగులో అల్లంత దూరాన చూసే ఇందుమతి తన ప్రియుడు గౌతమ్ గా భ్రమ పడింది. ఇతను తమ ఇంటికి ఎందుకు వచ్చినట్టు?
    "వాళ్ళ నోళ్ళు మంత్రించినట్లు కదలటం లేదు. నువ్వన్నా చెప్పమ్మా! ఏమైంది?"
    "ఏం లేదు బాబూ!"
    "ఏం లేకపోవడం ఏమిటి?"
    వర్ధనమ్మ మౌనంగా ఉండిపోయింది.
    "చెప్పమ్మా! నీకు వాళ్ళ మీద అంత కోపం ఎందుకొచ్చింది? వాళ్ళే మన్నారు? నిన్ను అవమానించారా?"
    "వాళ్ళు నన్నేం అవమానిస్తారురా!"
    "బతికిపోయారు , లేకపోతే ఇద్దర్ని ఇక్కడే ఖతం చేసి పాతిపెట్టేవాణ్ణి."
    ఇతడు కోపంలో అచ్చంగా అన్నయ్యలాగే ఉన్నాడు. కోపాన్ని దిగామింగడానికి పై పంటితో కింద పెదవి ఎడం చివరను నొక్కి పట్టాడు.
    ఇతను కూడా మరి తనకు అన్నయ్యేగా?
    ఇంతసేపూ ఆ భావం ఎందుకు కలగలేదు?
    ఛ! వీడు తనకు అన్నయ్యేమిటి?
    ఎందుకు కాదూ?
    తల్లి ఇద్దరికీ ఒక్కరే. తండ్రులు వేరు కావచ్చు. తన అన్నయ్య లాగే, ఇతడూ తన తల్లి రక్త మాంసాలు పంచుకొని పుట్టాడు.
    "చెప్పమ్మా?"
    "ఏం లేదు బాబూ! వాళ్ళు నీ గురించి ఏమేమో ప్రశ్నలు వేశారు?"
    "ఏం ప్రశ్నలు?" నిటారుగా నిల్చున్నాడు.
    "మాములు విషయాలే!"
    "అవి ఏమిటో చెప్పు!" కొంచెం విసుగ్గా ప్రశ్నించాడు.

 Previous Page Next Page