Previous Page Next Page 
ఒప్పందం పేజి 13


    ఇంతకాలానికి కలిసిన నా అత్మీయురాలితో రోజూ ఓ గంట కూర్చుని మాట్లాడటం తప్పా! రమాదేవి మా ఇంటికి వచ్చిన దగ్గర్నించి మా ఆవిడ ఇంటిని ఓ నరకం లా చేసింది. ప్రతిక్షణం నన్ను మానసికంగా చిత్రవధ చేసింది. దానిక్కారణం - ఇంతకాలం నేను నా అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, అట కెక్కించి , భార్య పిల్లల కోసం బ్రతికాను కదా! ఓ స్నేహితుడి దగ్గరికి కానీ, ఓ క్లబ్బు కి కానీ, కనీసం సుభద్ర కి తెలీకుండా సినిమాకి కానీ వెళ్ళని వాణ్ణి, హటాత్తుగా రమాదేవి లాంటి స్త్రీతో కబుర్లు చెప్పడం, ఆమె నా ఆత్మీయురాలనడం నా భార్య జీర్ణించుకో లేకపోయింది. ప్రతిరోజూ ఆమెని కలవకూడదని శాసించడం, ఆమె దగ్గరికి వెళ్ళితే గొడవ చేయడం, నిజం చెప్పనా? ఇన్ని సంవత్సరాల నా జీవితం గడిచి పోయినా నేను కోల్పోయిందేమిటో నాకర్ధమైంది."
    నేను ఆసక్తిగా చూశాను.
    'ఆడదాని కైనా, మగాడి కైనా వ్యక్తీ స్వేచ్చ ఎంత అవసరమో ఈ మధ్యే తెలిసింది. ఓ ఆదర్శ ప్రాయుడైన భర్తగా నా భార్యనీ, పిల్లల్ని ఎంతో అపురూపంగా చూసుకున్నాను. ఇల్లు, నగలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాను. నా పిల్లల్ని ప్రయోజకులను చేశాను. నా ఇష్టాలు, వాళ్ళ ఇష్టాలుగా, నా బ్రతుకు వాళ్ళ కోసమేనన్నట్లుగా బ్రతికాను. అందుకే వాళ్ళ దృష్టి లో మంచివాణ్ణి అయ్యాను. నువ్వు చెప్పు లతా! మనిషికి అత్మీయులుండ కూడదా?"
    నేనేం మాట్లాడలేదు. మౌనంగా అయన చెప్పేది వింటున్నాను. ఎంత సౌమ్యంగా , మితభాషిగా ఉండే రావుగారు, ఈరోజు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయన గుండెల్లో అణిగి వున్న ఎన్నో భావాలు ఈరోజు రెక్కలు వచ్చి ఎగురుతున్నట్టుగా ఎంతో భావోద్రేకంతో మాట్లాడుతున్నారు.
    "లతా!" నేను తాగుబోతుని కాదు. తిరుగు బోతుని కాదు. శాడిస్టు నికాదు. మీరంతా గొంతు చించుకుని ఉపన్యాసాల ద్వారా పొందాలనుకునే స్వేచ్చ ని నేను నా భార్య కేనాడో ఇచ్చాను. ఆమె ఇష్టాలకు నేనెన్నడూ అడ్డు తగల్లేదు. ఎప్పుడూ నేనామెని నాకిది కావాలని ఏదీ అడగలేదు. అసలు నాకేం కావాలో నాకూ తెలీలేదు. కానీ రమాదేవి తిరిగి నా జీవితంలోకి వచ్చాక తెలిసింది నేనేం పోగొట్టు కున్నానో! తిరిగి ఏం పొందానో! అదే ఆత్మీయత, భాద్యతలకూ, బంధాలకూ డబ్బుతో కూడిన లావాదేవీలకూ అతీతమైన ఓ స్నేహం . నేనా స్నేహం, ఆత్మీయత పొందాలంటే నాకు స్వేచ్చ కావాలి. ఇంతకాలం నేను బ్రతికాను. నా స్వేచ్చని, స్వతంత్రతని తాకట్టు పెట్టి బతికాను. నువ్వే చెప్పు? ఈ వయసులో నాకు రమాదేవి తో శారీరక సంబంధం ముఖ్యమా! పాపం! ఓరోజు తనకి గుండె నొప్పి వచ్చింది. ఆ సమయంలో నేను వాళ్ళింట్లో నే ఉన్నాను. అదృష్టవశాత్తు అది ఎటాక్ కాదు. కానీ వంటరిగా ఉంది. పైగా హటాత్తుగా అనారోగ్యం వచ్చింది. ఎలా వదిలేసి రాగలను. ఆరాత్రి తనకి తోడుగా అక్కడే ఉండి, మర్నాడు ఉదయం ఇంటికి వెళ్ళాను. ఇల్లోక రణరంగమైంది. సుభద్ర ఏడుపు, శోఖాలు , శాపాలు, పిల్లలిద్దరికీ ఫోన్ చేసి, నేను రమాదేవి ని ఛీ...ఛీ... ఎలా చెప్పను. చిన్న పిల్లవి. అంతే ఆరోజు వచ్చి కమీషనర్ గార్ని కలిసింది. నా పరువు తీసింది. నన్నో తిరుగుబోతుని చేసింది" బాధగా అన్నారాయన. కర్చీఫ్ తో కళ్ళు వత్తుకుంటూ.
    నాకు ఆయన్ని అలా చూస్తుంటే చాలా జాలేసింది.
    "లతా! ప్రతి మనిషీకీ తనదంటూ ఓ ప్రవైట్ లైఫ్ సపరేట్ గా ఉండాలి. అది మగాడికి, ఆడవాళ్ళ తోనూ, ఆడవాళ్ళకి మగాళ్ళ తోనూ అని కాదు. కొందరు ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళతారు. కొందరు క్లబ్బు ల కేళతారు. కొందరింకేదో చేస్తారు. దాని క్కారణం తెలుసా! స్వేచ్చని కోల్పోకుండా ఉండడం కోసం. ఆ స్వేచ్చ అనేది లేకపోయాక మనిషి బ్రతకడం అనవసరం అనిపిస్తోంది. నేనిప్పుడు ఆ స్వేచ్చను కోల్పోయాను. అందుకే ఆ స్వేచ్చ తిరిగి పొందడం కోసం నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోడం కోసం నేను కొంచెం మొండిగా మారాను. నాకు తెలుసు. నాలోని ఈ మార్పు నన్నేందరికో శత్రువుని చేస్తుందని, అయినా నేను మరదల్చు కోలేదు. ఇదంతా రమ మీద ప్రేమతోటో, మోహం తోటో కాదు. నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోడానికి. నేను కోల్పోయిన స్వేచ్చని తిరిగి పొందడానికి."
    ఇదంతా చెప్పి దీర్ఘంగా నిట్టుర్చాడాయన.
    నాకు చాలా జాలేసింది. పాపం! రావుగారు అనిపించింది.
    ఎందుకో కొందరు ఆడవాళ్ళు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. భర్త చేతుల్లోంచి జారిపోతాడేమో నని, గుప్పెట్లో బిగించడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా ఎంతకాలం అధికారంతో మనిషిని బంధించగలరు? అనురాగంతో మనసు గెల్చుకోవాలె గానీ, అధికారంతో ఆ మనసు మీద ఆధిపత్యం చేలాయించాలను కోవడం దారుణం కదా!
    "మీరు జీతం ఇంట్లో ఇవ్వడం లేదా?' అడిగాను.
    "ఎందుకివ్వనమ్మా! రమకి బోలేడాస్తీ ఉంది. నాకన్నా మంచి హోదాలో ఉంది. తనకి నా డబ్బు ఎందుకు? ఇంకా తనే ఏదో సాయం చేయడానికి ఆరాట పడుతుంది కానీ నాకూ తన సాయం అవసరం లేదు. ఇదంతా నా భార్య నా మీద చేస్తున్న కక్షసాధింపు చర్య . నన్ను అడిగితె యాభై శాతం ఏం ఖర్మ మొత్తం జీతం ఇచ్చేవాణ్ణి. నాకేం కావాలి? సంవత్సరానికి రెండు జతల బట్టలు  ఓ గుప్పెడు మెతుకులు. ఈ రెండూ రమాదేవి ఇవ్వగలదు."
    సుభద్రాదేవి గారు అలా చేసి ఉండాల్సింది కాదేమో అనిపించింది.
    ఆవిడ కోసం రావుగారు అన్ని త్యాగాలు చేయకపోతే ఆవిడకీ నాడు ఇంత కంఫర్టబుల్ లైఫ్ ఉంది/ అయన సంతోషాలు, అభిరుచులు, స్వేచ్చ ,స్వాతంత్ర్యాల ఆవిడ కోసం అయన త్యాగం చేయగా లేనిది అయన కోరుకున్న ఒక్క స్నేహన్ని ఆహ్వానించ లేకపోయింది. భార్యాభర్త లంటే ఒకరి తప్పులు మరొకరు క్షమించుకుంటూ ఒకరి భావాల్ని మరొకరు గౌరవించుకుంటూ ఒకర్నొకరు అర్ధం చేసుకుని అన్యోన్యంగా జీవించడం అంటారే , మరి సుభద్రదేవి గారెందుకు తన భర్తను అర్ధం చేసుకోలేక పోయింది.
    "లతా! పెద్దవాణ్ణి ఒక్కమాట చెప్తున్నాను విను. పెళ్ళి కావాల్సిన దానివి భర్త అంటే , గారడీ వాడి చేతిలో మంత్రదండం లాగా , నీ చేతిలో నువ్వు తిప్పినట్లల్లా  తిరుగుతూ ఉండాలని కోరుకోకు. మన దేశం వివాహ వ్యవస్థ ని ఎంతో గౌరవిస్తోంది. కాబట్టి స్త్ర్తీలకు, ఎన్నో హక్కులు కల్పించింది. చట్టపరంగా , అలాగని భార్యాభర్తల బంధాన్ని చట్టాలు, శాసనాలు, ఇండియన్ పీనల్ కోడ్ లతో కాకుండా ప్రేమానురాగాలతో , పరస్పర నమ్మకాలతో , అవగాహన తో నిలబెట్టుకోడానికి ప్రయత్నించు. మరి నే వస్తాను. రమ వస్తోంది." అన్నారు రావుగారు నా దగ్గర సెలవు తీసుకుంటూ.
    అయన వెళ్తున్న వైపు చూసి గాడంగా నిట్టుర్చాను.
    కొన్ని రోజులు గడిచాయి. అయన రిటైర్మెంట్ ఇంకా రెండు నెలలుంది. రావు గారు జాయిన్ అయ్యారు.
    ఇప్పుడు మా ఆఫీసు లో రావు గారి విషయం బాగా పాతబడి పోయింది. ఆయనతో అందరూ మాములుగానే ఉంటున్నారు. ఆయనే బాగా మారిపోయారు. పూర్వం కన్నా ఉదాసీనంగా మారారు.
    ఓరోజు సుభద్రదేవి గారు నా టేబుల్ దగ్గరకి వచ్చి....
    'అయన అకౌంట్స్ సెటిల్ చేసేది నువ్వేనా?" అని అడిగింది.
    "మా సెక్షన్ లోనే కానీ నేను కాదు" అన్నాను.
    "చూడు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటీ, వెల్ ఫేర్ ఫండ్, ఎల్.ఐ.సి , లీవ్ ఎన్ కాష్ మెంట్....ఇలా చాలా డబ్బు రావాలి గదా ఆయనకీ. అందులో కూడా నాకు యాభై శాతం ఇవ్వాలని చెప్పాను మీ కమీషనర్ గార్కి ఏం నిర్ణయించారు?" అని అడిగింది.
    నాకెందుకో అసహ్యం వేసింది ఆవిణ్ణి చూస్తె. ఎంత జాగ్రత్తగా లెక్కలు వేసుకుంది. ఈవిడ భర్త ద్వారా తనకొచ్చే లాభాలలో భాగం కోరడం చాలా గొప్ప అనుబంధం. ఇంకా నయం అయన పొతే వచ్చే లాభాలను బేరీజు వేసుకోలేదు.
    "తెలీదండీ" అన్నాను ముభావంగా.
    "తెలీకపోవడం ఏమిటి? వారం రోజుల్లో అయన రిటైర్ అవుతుంటే ఇంకా తెలీదా?" సీరియస్ గా అన్నది.
    ఆవిడ మళ్ళీ అన్నది. "చూడమ్మాయి, నీకింకా పెళ్ళి కాలేదు కాబట్టి నా బాధ నీకర్ధం కాదు. పిల్లలు పెద్ద వాళ్ళు అయి ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతున్నారా? ఈయన రిటైర్ అయ్యాక మాకు మేమేనా కాలక్షేపం- ఇప్పుడు ఈ వయసులో కృష్ణా, రామా అనుకుంటూ ఒకరికొకరు ఉండాల్సిన వయసులో దాన్నేవత్తినో ఉంచుకోడం బాగుందా? ఏ వయసులో నాకు అయన రక్షణ, తోడు కావాలో.... ఆ వయసులో స్నేహితురాలంటూ దానితో గంటల తరబడి కూర్చోడమా....నా కడుపు మండదూ! అందుకే ఆయనకి బుద్ది రావడం కోసమే నేనిలా చేస్తున్నాను. అంతేగానీ నాకు డబ్బు లేకనా? నా పిల్లలు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఇల్లుంది. మా అబ్బాయి కారు కొనిస్తానన్నాడు. ఇంట్లో నౌకర్లు న్నారు, నాకేం కావాలి?" కొంచెం దర్పంగా చెప్తున్న ఆమె స్వరంలో ఒకింత అహం కూడా తొంగి చూసింది.
    నా ఇల్లు... నా పిల్లలు... ఈరెండు పదాలు ఆవిడ నోటి నుంచి వింటోంటే చాలా వెగటుగా అనిపించాయి.
    రావుగారు ఎంతో కష్టపడీ , చాలా ఎకనామికల్ గా జీవించి, డబ్బు కూడబెట్టి, ఇల్లు కట్టించారు. అయన హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రికవరీ ఇటీవలే పూర్తయింది. పిల్లల్ని వృద్ది లోకి తీసుకురావడం లో కూడా అయన కృషి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయనకి ఈ రెండింటి లోనూ ఏమీ సంబంధం లేనట్లు ఆవిడ 'నాది' అన్న స్వార్ధ పూరిత ప్రయోజనం ఆశించడం అంత మంచిది కాదనిపించింది.
    రావుగారు ఇవన్నీ అమర్చడం, అయన బాధ్యతగా... అనుభవించడం తన హక్కుగా భావించే ఈ సగటు స్త్రీ సుభద్రాదేవి.
    ఆరోజే రావుగారు రిటైర్ అయ్యేది.
    ఆ సాయంత్రం ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు.
    పార్టీకి సుభద్రాదేవి గారు రాలేదు. రమాదేవి గారు వచ్చారు.
    తన స్నేహితురాలిగా పరిచయం చేశారు రావుగారు. కమిషనర్ గారు ఆవిణ్ణి చాలా మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు.
    కమిషనర్ గారు, జి.ఎం. గారు ఇతర ఆఫీసర్లు రావు గారి నిజాయితీ ని మేధస్సు ని ఎంతో శ్లాఘించారు. కొందరు స్టాఫ్ కూడా అయన మంచి తనాన్ని పొగిడారు. రమాదేవి గార్ని ముఖ్య అతిధిగా భావించి రెండు ముక్కలు మాట్లాడమన్నారు. రావుగారితో తనకున్న అనుబంధం గురించి, అయన మంచితనం గురించి ఎంతో హుందాగా వివరించారు.
    పూలదండలతో సత్కరించారు ఇద్దరినీ.
    కమిషనర్ గారు డ్రైవర్ని పిలిచి, రావుగార్ని , ఇంటి దగ్గర దింపి రమ్మని చెప్పారు.
    డ్రైవర్ కొంచెం సందేహంగా చూశారు. ఈమధ్య రావుగారు ఇంటి దగ్గర ఉండడం లేదని అందరికీ తెలుసు.
    రావుగారు డ్రైవర్ సందేహాన్ని గమనించి, చిరునవ్వుతో అన్నారు.
    "రమాదేవి గారింటి దగ్గర దింపు నన్ను."'    
    పూలదండలు ఒళ్ళో పెట్టుకుని, మేమొంటోలు చేతుల్లో పట్టుకుని, పక్క పక్కనేకూర్చున్న వాళ్ళిద్దరూ నూతన వధూవరుల్లా అన్పించారు. రిటైర్ మెంట్ తరువాత కొత్త జీవితం ప్రారంభం అవుతుందా? మరి సుభద్రాదేవి గారో? !
    ఆవిడకి రావుగారి ఆస్తిలో, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ లో ఫిప్టీ పర్సెంట్ మిగిలిందన్న మాట. వైవాహిక జీవితాలు విచ్చిన్నం అవడానికి కేవలం మగవాడి ఆహంకారమే కాదు, ఆడవాళ్ళ స్వార్ధం కూడా కారణం అనిపించింది.

                                                           ***

 Previous Page Next Page