Previous Page Next Page 
ఒప్పందం పేజి 12


                           మిగిలిందేమిటి?


    "లతా ! నీకీ విషయం తెలుసా?" అటెండెన్స్ రిజిష్టర్ లో సంతకం చేసి సీటు దగ్గరికి వెళ్తుండగా నా వెనకాలే వచ్చి అంది అపర్ణ.
    "ఏ విషయం?' బ్యాగ్ టేబుల్ మీదపడేసి, కుర్చీలో కూర్చుంటూ అడిగాను.
    "మన రావుగారు లేరూ!" నా టేబుల్ కి దగ్గరగా మరో కుర్చీ జరుపుకుని కూర్చుంది అపర్ణ.
    "ఏ రావుగారూ? ... మన అకౌంటెంట్ రావుగారేనా?" అడిగాను.
    "ఆ...ఆయనే"
    "ఏమైందాయనకి" కొంచెం ఆత్రంగా అడిగాను.
    'ఆయనకేం కాలేదు. నిక్షేపంలా ఉన్నారు. వాళ్ళావిడ మన ఆఫీసు కొచ్చింది.
    "అదా!" తేలిగ్గా నవ్వి బ్యాగ్ లోంచి తాళం చేతులు తీసి టేబుల్ సొరుగు లాగాను.
    "అంత తేలిగ్గా అనకు. అసలెందుకు కొచ్చిందో తెలిస్తే....నువ్విలా ఆనవు"
    "ఏముంది? వాళ్ళాయనతో పనుండి ఉంటుంది."
    "నువ్వో మాలోకానివి. వాళ్ళాయనతో పనుంటే ఇంటి దగ్గర మాట్లాడదా! అయన మీద మన కమిషనర్ గార్కి రిపోర్ట్ చేయడాని కొచ్చింది."
    ఆశ్చర్యంగా చూశాను. "దేనికి?"
    అపర్ణ కొంచెం స్వరం తగ్గించి చెప్పింది "రావుగారికి లేటు వయసులో చాలా ఘాటు ప్రేమికురాలు దొరికిందిట. ఆవిణ్ణి ఉంచుకొన్నారట."
    నా మతి పోయినట్టయింది. రావుగారు చాలా మంచాయన. ఆయనేంటి? ఎవర్నో....నాన్సెన్స్ ఏదోమిస్ అండర్ స్టాండింగ్ కావచు.
    అపర్ణ మళ్ళీ చెప్పసాగింది. "సుభద్రాదేవి గారు.... అదే రావుగారి భార్య మన కమిషనర్ గార్ని కలిసి పిటిషన్ ఇచ్చింది. అయన జీతం ఇవ్వడం లేదని, అంతా ఉంచుకున్నావిడకే పెడుతున్నాడనీ.... తనకు అయన జీతంలో యాభై శాతం ఇప్పించమని..."
    'మంచివాడు... మంచివాడు.... అంటే చంక నెక్కాట్ట. అలా ఉంది వరస. పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడదు. అపర శ్రీరామచంద్రుడు. శాంత మూర్తి, ఎవర్నీ పల్లెత్తు మాట అనడు ధర్మరాజు అంటూ బిరుదు లిచ్చెం చూడు అది మనం చేసిన తప్పు . హు.... మేకవన్నె పులి . అంటే ఈయనే అనిపిస్తోంది. లేకపోతె ఈ వయసులో ఈయనగారికి ప్రియురాలు కావాల్సి వచ్చిందా? సిగ్గుండక్కర్లె" ఆవేశంగా అంది అపర్ణ.
    అపర్ణ మాటలెం నాకు చెవిన పడలేదు. రావుగారు నిజంగా అలాంటి పని చేశారంటే నమ్మలేకపోతున్నాను. ఆయనంత మంచి మనిషి మా ఆఫీసులో మరొకరు లేరు.
    ఐదేళ్ళ నుంచీ నేను రావు గారి దగ్గరే పనిచేస్తున్నాను. అయన మంచి మనసు, ఉదార స్వభావం, సహనం చాలా తక్కువమంది లో చూడగలం. నాతొ పాటు మరో ఇద్దరు కూడా అయన అండర్ లో పనిచేస్తున్నారు. వాళ్ళు పని దొంగలు. అస్తమానం లీవులు పెట్టేస్తుంటారు. అయినా వాళ్ళ పని కూడా ఈయనే చేస్తుంటారు. ఎన్నడూ ఒక మెమో ఇవ్వడం గానీ, మందలించడం గానీ చేయలేదు.
    రెండేళ్ళ లో రిటైర్ అవబోతున్నారు కూడా.
    అలాంటి రావుగారు ఇప్పుడు సెకండ్ సెటప్ పెట్టారా?' నో! నో!
    అపర్ణ చాలాసేపు ఏదో చెప్తూనే వుంది. చాలా పరుష పదాలు వాడి తిట్టింది రావుగార్ని. "దొంగ మొహం' అంది. 'తేనెపూసిన కత్తి' అంది. ఇలాంటి పర్యాయ పదాలు వాడుతూ రకరకాలుగా తిట్టి అలసిపోయి తన సీటు దగ్గరికి వెళ్ళింది.
    నేను రోజంతా పనిమీద నా మనసు లగ్నం చేయలేకపోయాను.
    అపర్ణ మాటలన్నీ నా చెవుల్లో హోరు మంటున్నాయి.
    రావుగారి మొహం కళ్ళ ముందు కదలాడుతూనే వుంది.
    వారం రోజులు గడిచాయి. నెమ్మది నెమ్మదిగా మొదలైన రావుగారి సెకండ్ సెటప్ గురించి పుకారు దావానలం లా వ్యాపించింది. అందరూ అయన వైపు దృష్టి కేంద్రీకరించారు. అయన గురించి గుసగుసలు కూడా ఎక్కువైనాయి.
    కొందరు రహస్యంగా ఆయన్ని తిట్టసాగారు. "ఈ వయసులో ఇదేం బుద్ది.... పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు అయి సెటిలయారు. మంచి ఉద్యోగాలు చేస్తూ ఎంచక్కా అమెరికాలో ఉన్నారు. మొగుడూ, పెళ్ళాం 'కృష్ణా రామా' అనుకుంటూ దర్జాగా బ్రతక్క ఇప్పుడీ కలహా లేమిటి?"
    "చాలా మంచి వాడులా , మెతగ్గా ఉంటూ ఇదేం పనండీ... అయినా ఇలాంటి పనులు చాటుమాటుగా ఉండాలి కానీ, ఇట్లా నేరుగా ఆఫీసర్ల కు కంపైంట్ చేయడం ఏమిటి? ఆడది ఇలా వీధిన పడడం బాగాలేదు."
    "నిజమే... సంసారం ఇలా రచ్చ కీడుస్తారా! అయినా ఆవిడకి డబ్బుకేం లోటని. కొడుకు లిద్దరూ ఇంజనీర్లు. పైగా అమెరికా లో ఉన్నారు. వద్దంటే డబ్బు. పైగా రావుగారు మాత్రం తక్కువ సంపాదించారా? ఎంత జాగ్రత్తగా ఉంటూ ఇల్లు కట్టాడు. పిల్లల్ని వృద్ది లోకి తీసుకొచ్చాడు. ఇంకా ఏం కావాలట. అతనితో అడ్జస్ట్ అవ్వాలి గానీ.... ఛీ...ఛీ ... ఇలా బజార్న పడడం బాగాలేదు."
    "అయినా ఏనాడూ ఓ కిళ్ళీ కూడా వేసుకొని రావుగారు, ఇలా ఎలా మారి ఉంటారు హటాత్తుగా. అందుకే అన్నారు "ఎంత వారలైనా కాంత దాసులే" అని.
    ఈ విధంగా రకరకాల వ్యాఖ్యానాలతో ఆఫీసంతా గగ్గోలెత్తిపోతోంది.
    రావుగారు మాత్రం నిండు కుండలా తొణక్కుండా ఎప్పట్లాగే ఉన్నారు. తన పని తాను చేసుకు పోతున్నారు. నాతొ అప్యాయంగానే ఉంటున్నారు.
    హటాత్తుగా ఓ ఇరవై రోజుల తరువాత రావుగారు ఆఫీస్ కి రావడం మానేశారు.
    ఫస్టు తారీఖు వచ్చింది. ఆరోజు మాకు పేడే.
    రావుగారి భార్య సుభద్ర గారు వచ్చారు.
    నుదుట నయాపైసంత కుంకుమ బొట్టుతో, నిండుగా కొంగు కప్పుకుని ఉన్న సుభద్ర గారు ఎంతో గౌరవనీయంగా కన్పించారు. ఆవిణ్ణి చూస్తుంటే ఈవిడలో ఇంత రివల్యూషనరీ థింకింగ్ ఉందా? అనిపించింది.
    ఆవిడ ఒంటి మీద నగలు, ఆవిడ కట్టుకున్న ఖరీదైన చీర, కళకళలాడుతున్న ఆవిడ మొహం చూస్తుంటే ఈ ప్రపంచంలో ఈవిడ కన్నా సుఖంగా ఉన్న స్త్రీ ఇంకొరు లేరేమో అనిపించింది.  
    ఆవిడ వెళ్ళిపోయాక స్టాఫ్ అంతా ఆవిడ గురించే మాట్లాడుకోడం మొదలుపెట్టారు.
    మనిషి చూస్తె మహాలక్ష్మీ లా ఉంది. ఇదేం బుద్ది. మొగుణ్ణి ఇంతలా హెరాస్ చేసే స్వభావం ఉందా?
    "భార్య లందరూ ఇంతేనండి. మొగుడి సంపాదన మీదే కాదు, వాడి ఇష్టాయిష్టాల మీద, వ్యక్తిత్వం మీద కూడా పెత్తనం చెలాయిస్తుంటారు. కనీసం తల్లికి చెల్లికి కూడా పైసా పెట్టనివ్వరు."
    "నిజమే మా కజిన్ ఒకడికి పెళ్ళయిన రెండు నెలల్లోనే జీతం మొత్తం తనకివ్వమని ఆర్డర్ పాస్ చేసిందట వాడి భార్య."
    "హు....డి.ఎ. అరియర్స్ వస్తే మా తమ్ముడి భార్య ఆ డబ్బు తీసికెళ్ళి నగలు కొనుక్కుంది. కనీసం వాదికేదన్నా అవసరం ఉందేమో ఆ డబ్బుతో అని కూడా అడగలా."
    "మా ఆవిడ కూడా అంతేనండీ బాబూ, నా బట్టల గురించి, నా అవసరాల గురించి ఆలోచించదు. నా డబ్బంతా తీసుకెళ్ళి ఇన్ స్టాల్ మెంట్స్ కడ్తుంది. అన్నీ చీరలే."
    ఇలా మా మేల్ స్టాఫ్ మధ్య సాగుతున్న సంభాషణ చాలాసేపు ఓ చర్చగా సాగిపోయింది.
    కొంతకాలం గడిచింది.
    రావుగారు లాంగ్ లీవ్ పెట్టారు. రెండో ఆవిడ దగ్గరే ఉంటున్నారట. సుభద్రా దేవి గారు ఇంకో పిటిషన్ పెట్టింది. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ యాభై శాతం తనకి ఇప్పించాల్సిందని.
    కోర్టు ఆర్డర్ లేకుండా మా కమిషనర్ గారు అలా ఎలా యాభై శాతం జీతం ఇస్తున్నారో ఆవిడకి అనుకున్నాను.
    రావుగారు తల్చుకుంటే కమిషనర్ గార్ని వ్యతిరేకంగా కోర్టు కెళ్ళవచ్చు. కాని అలా వెళ్ళకపోవటం అయన సంస్కారం.
    ఓరోజు రావు గారు నాకు మార్కెట్లో కనిపించారు.
    ప్రక్కనే ఓ నడి వయసు స్త్రీ ఉంది. ఆవిడ చాలా హుందాగా ఉంది. మొహం ప్రశాంతంగా, చిరునవ్వులు చిందిస్తూ ఉంది. నన్ను చూడగానే రావుగారు చాలా ఆప్యాయంగా పలకరించారు. ప్రక్కన ఉన్న ఆవిణ్ణి పరిచయం చేశారు. "ఈమె రమాదేవి. నా చిన్ననాటి స్నేహితురాలు."
    నేను అప్రయత్నంగా నమస్కరించాను.
    ఆవిడ చిరునవ్వుతో పలకరించింది. "నీ పేరేంటమ్మా?' అంటూ.
    "ఈ అమ్మాయి లత. నా అసిస్టెంట్. చాలా మంచమ్మాయి" చెప్పారు రావుగారు.
    'అలాగా! మీరు మాట్లాడుతుండండి. నేనలా ముందు కెళ్ళి వెజిటబుల్స్ కొనుక్కోస్తాను. " అంటూ ఆవిడ చకచకా ముందుకి నడిచింది.
    రావుగారు "ఎలా ఉన్నారమ్మా లతా! అందరూ నన్నసహ్యించుకుంటున్నారా?" అడిగారు.
    "అబ్బే అదేం లేదండి. ఎందుకు లాంగ్ లీవ్ పెట్టారు? ఆరోగ్యం బాగా లేదా?" అడిగాను.
    అయన నెమ్మదిగా నిట్టుర్చారు.
    "లతా నాకు తెలుసు నా గురించి ఆఫీసులో అందరో ఏమనుకుంటున్నారో! దానికి నేను బాధపడటం లేదు లతా! జీవితంలో కొందరికి ఎన్నో ఇస్తాడు దేవుడు. కానీ కొన్ని ఇవ్వడు. కొందరికీ అన్నీ ఇస్తాడు. కానీ ఏమీ ఇవ్వడు. ఇదో రకం వేదాంతం . కంగారుపడకు. నాకు మంచి ఉద్యోగం , మంచి భార్య, ముత్యాల్లాంటి పిల్లలు, ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు కానీ రమని దూరం చేశాడు. తనకీ అంతే , కావాల్సినంత డబ్బు, మంచి ఉద్యోగం, కారు, ఫోను అన్నీ ఇచ్చాడు. కానీ తన అనే ఆత్మీయుల్ని ఇవ్వలేదు. రమాదేవి నా చిన్న నాటి స్నేహితురాలు. దాదాపు పి.యు.సి దాకా కలిసి చదువుకున్నాం. తరువాత వాళ్ళ నాన్నగార్ని ట్రాన్స్ ఫర్ అవడంతో రమాదేవి చాలాదూరం వెళ్ళింది. ఆమె వెళ్ళాక కాని తెలీలేదు. ఆమె అంటే నాకిష్టమని. ఆమె లేనిలోటు తెలిశాక ఏం చేయ లేకపోయాను. తరవాత నేను జీవితంలో సేటిలయాను'. తనేం చేస్తుందో ? ఎక్కడుందో తెలీలేదు."
    "ఇప్పుడెలా కలిశారు?" కుతూహలంగా అడిగాను.
    "రమ నాకన్నా ఎక్కువ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసి మంచి ఉద్యోగం సంపాదించింది. ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ గా ప్రమోట్ అయి ఈమధ్యే అంటే ఏడాది క్రితం హైదరాబాద్ కి వచ్చింది. పాపం వంటరిది. వాళ్ళ నాన్నగారు హటాత్తుగా పోవడంతో బాధ్యతల మీద పడి తమ్ముళ్ళ ను, చెల్లెళ్ళ నూ వృద్ది లోకి తీసుకువచ్చే బాధ్యత తీసుకుంది. ఫలితంగా ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఈ ఊరు రాగానే నా అడ్రస్సు వెతుక్కుంటూ కలిసింది.

 Previous Page Next Page