"ఏమిటి భాగవతమా?" అంటూ కూలబడ్డాడు నరసింహం మాసిన పై పంచ, పంచకూడా మాసే వుంది. మాసిన చొక్కా అక్కడక్కడా చిరుగులు పడింది. ముఖం కూడా కళావిహీనంగా ఎన్నో రోజులుగా తలారా స్నానం, కంటినిండా నిద్ర, కడుపునిండా తిండీ లేని వ్యక్తిలా వుంది. అయితే ముఖంలో దర్పం వుంది.
"బాబూ, కృష్ణవేణమ్మగారు యివ్వమన్నారు." అంటూ పళ్ళెరంపైన గుడ్డతీసి అయిదువేల రూపాయలు అందించారు. ఆ డబ్బుని చూడగానే అతని కళ్ళు మిల మిల మెరిసేయి. ఒక క్షణం పాటు....
"బాబూ నరసింహం."
"అయ్యగారూ."
"కృష్ణవేణమ్మ గారిది భారీ చెయ్యి. జమీందారీ ఫాయామనిషి. ఎముకలేని చేయి! దానం పట్టిన వాళ్ళది అదృష్టం. ఆమె ముందు చేయి చాపాలే గానీ వాళ్ళ జన్మ దారిద్ర్యం తీరిపోతుంది. పాపం మీ ఆవిడ జబ్బులోవుందట కదూ ఆమె వచ్చి యాచిస్తే కూతుర్ని చూసినట్టుగా కడుపుతరుక్కుపోయిందన్నా రామె. జాలిగుండె ఈ అయిదువేలతో జబ్బు నయం చేయించుకోమన్నారు. జాగ్రత్తగా వైద్యం చేయించు బాబూ! అమ్మాయికి నయం కాగానే అమ్మగారి దర్శనం చేయించు!"
శాస్త్రిగారి మాటలు వినగానే నవ్వు వచ్చింది నరసింహానికి "శాస్త్రిగారూ! ఆవిడ ఎవరో కాదు స్వయానా నామేనత్త తనిష్టం లేకుండా ఆమె కూతుర్ని పెళ్ళి చేసుకున్నాను. మేం ప్రేమించి పెళ్ళి చేసుకుంటే నేను ఆమె స్థాయికి తగనని మమ్మల్ని తన్ని తగిలేసింది. నా భార్య ఆ ఆస్తి మొత్తానికి వారసురాలు! ఈ ముష్టి అయిదువేలు యివ్వడం ఓ లెక్కా! కోర్టుకెళితే ఆస్తి అంతా వస్తుందన్నారు ప్రీడర్లు కానీ నా భార్య ఒప్పుకోలేదు. కూతుర్ని వదిలేసి వచ్చాం మేం. మా బ్రతుకునే వదులుకున్నాం!" అని చెప్పాలను కున్నాడు. కానీ కృష్ణవేణమ్మ గారి స్ట్రాటజీ అతన్నా మాటలు చెప్పనివ్వలేదు.
"శాస్త్రిగారూ! ఆమె చాలా గొప్ప వ్యక్తి. దాతృత్వం వాళ్ళ వంశంలోనే వుంది. నా చర్మంవలిచి చెప్పులుగా కుట్టిచ్చినా నా ఋణం తీరదు. ఈ డబ్బు సద్వినియోగం చేస్తాను. నేను పేకాడను. తాగను. సినిమాలు చూడను. అడ్డమైన కొంపల వెంట తిరగను నాకు నా భార్యే సర్వస్వం!" అన్నాడు ఆ నాటకానికి తగినట్టుగా.
"యోగ్యుడిని బాబూ వెళ్ళిరా" అంటూ ఆశీర్వదించాడాయన.
నరసింహం లేచి వెళ్ళాడు. వెళ్ళబోతూ "స్వామీ! దేవుడి గుడికి తాళంవేశారేమిటి? వచ్చే పోయేవారిని ఆయనా, ఆయన్ని వాళ్ళూ చూసుకోనివ్వండి" అన్నాడు.
"తలుపులూ, తాళాలూ ఆ సర్వాంతర్యామికి అడ్డమా? ఇందు అందూ లేడని సందేహం ఎందుకు? ఆయన ఎక్కడైనా వుంటాడు. ఎలానయినా చూస్తాడు. ఆయనకళ్ళు కప్పటం ఎవరికి సాధ్యం?" అన్నాడు శాస్త్రిగారు.
"ప్చ్!" నిట్టూర్చి నవ్వుతూ వెళ్ళేడు నరసింహం.
7
"మోహన్, నీ పద్దతేం బాగా లేదు."
"ఏం? నేనేం అడ్డమైన కొంపలచుట్టూ తిరగలేదే?" విలాసంగా పొగ వదులుతూ అన్నాడు.
"నోర్ముయ్, ఏ కొంపలూ తిరగందే వేళకింత తిండి యెలా వస్తుంది? గుడ్డొచ్చి పిల్లనివెక్కిరించిందట, శుభ్రంగా ఆ బి. ఏ. పూర్తి చేసి, ఏదయినా ఆఫీసులో గుమాస్తాగా చేరిపోతే ఆ కృష్ణవేణమ్మను ఒప్పించొచ్చు..."
"నాన్నా నీ దంతా చాందసం. నన్ను ఆమె తన యింటి చాయలకి కూడా రానివ్వదు. ఒకవేళ రానిచ్చి, ఆ స్వప్నని నాకు కట్టబెట్టేట్టయితే ఇక బి.ఏ తో పనేముంది? ఉద్యోగం అవసరం ఏమొచ్చింది? రాజాలాగా కాలుమీద కాలువేసుకుని తింటూ గడిపినా మూడుతరాలదాకా తరగని ఆస్తి అది....వజ్ర వైఢూర్యాలని చేతిలో పెట్టుకుని నయాపైసకి దేబరించే మనస్సు నీది. నన్ను అనకపోతే ఆమెని ఎలాగో ఒప్పించి మా పెళ్లి చేసెయ్యరాదూ!" నవ్వుతూ అన్నాడు మోహన్.
"నోర్ముయ్యరా వెధవ కుంకా. కష్టపడరా అంటే నీతులు చెపుతావ్? కృష్ణవేణమ్మ అంటే ఏంటనుకున్నావ్? పులి. పులి మనుషుల్ని జెమినీవాళ్ళ బొమ్మలకి మల్లే ఆడిస్తుంది. జమినీ యెంబ్లమ్ చూశావా? ఆ బొమ్మలకంటే హీనం మనం ఆమె దృష్టిలో ఒరే ఆమె అంగీకారం పొందడం అంత సులువు కాదు."
"ఓస్, ఇంతటి కృష్ణవేణమ్మని మీరు కాబట్టి పొగిడేస్తున్నారు. అదే నేనయితేనా?"
"ఏం చేశేవాడివో." హేళనగా అడిగాడు.
"సఫా! అంతే! సామదాన బేధ దండోపాయాలన్నారు. మనకవి గిట్టవ్. దండమే మన ఆయుధం కృష్ణవేణమ్మని పాచికల్లోంచి తొలగిస్తే మనపని చాలా యీజీ అప్పుడు స్వప్న కలల్లోంచి బయటపడి మన అండకొస్తుంది." తేలిగ్గా నవ్వుతూ అని సిగరెట్ ముట్టించేడు.
ఉలిక్కిపడ్డాడు వెంకట్రామయ్య. అతన్లో అప్పుడప్పుడూ ఆ ఊహ మెదిలేది. చప్పున భయంతో దాన్నిపారదోలేవాడు....బాతు బంగారు గుడ్డు కధలోలా అవుతుందేమోనని అతని భయం. అందుకని తీవ్రంగా కసురుకున్నాడు కొడుకుని" నోర్ముయ్యరా వెధవాయ్. లుచ్చాబుద్దులు, లుచ్చాబుద్దులని పెళ్ళి చేసుకోరా అంటే హత్య చేస్తానంటావా?"