రంగేలీ నా! చాలా చిత్రమైన పేరు! ఇంతకీ ఎవరీవిడ? ఎక్కుడుంది తను? ఈ పసరు తనకెందుకు తాగిస్తున్నారు?
అప్పుడు మొదటిసారిగా గమనానికొచ్చింది సృజనకు. తనవళ్ళంతా క్లీన్ గా ఉన్నట్లు అనిపిస్తోంది ఎందుకని?
తనవైపు చూసుకుంది ఒకసారి.
వెంటనే షాక్ తగిలినట్లయింది.
చీరెకట్టివుంది తనకు!
వదులొదులు జాకెట్ వేసి ఉంది!!
కన్నుమూసి తెరిచేలోగా తన బాల్యాన్ని ఎవరో దోచుకుపోయినట్లు దిగులు కలిగింది సృజన.
ఎవరు కట్టారు ఇవి? ఈవిడేనా?
ఈవిడ....కాదు ఈయన.....కాదు.....ఈవిడ డాక్టరా?
అప్పుడు వినబడింది పక్కగదిలో నుంచి ఒక గొంతు టీచరు పిల్లలచేత వల్లె వేయిస్తున్నట్లు చెబుతున్నాడు ఎవరో?
"చెప్పవే! చెప్పు! బావా అమ్మ! బావా!"
"బావా!" అంది ఒక విచిత్రమైన గొంతు.
అది నిశ్చయంగా మానవకంఠం మాత్రం కాదు.
"నాచిట్టి చిలకపలుకులే! మరదలు పిల్లచేరెలోపల ఏం కట్టుకుంటుందీ? చెప్పు?"
"పెట్టికోట్!పెట్టికోట్!పెట్టికోట్!"
చిలకఅలా గబగబా అనడంలోనే వేరే అర్ధం మోటుగా ధ్వనిస్తోంది.
గలగల నవ్వులు వినబడ్డాయి.
"ఏయ్ చిలకల చిన్నారావ్? ఏంటి కావాలీ? చెప్పు చిలకమ్మా?" అన్నాడు చిన్నారావు.
"పండుకొని పెట్టు! పండుకొని పెట్టు!"
మళ్ళీ ఉధృతంగా నవ్వులు.
"నిన్నూ...."అంది మధుమతి బెదిరింపుగా.
ఆ మధుమతి చిన్నారావుని కొట్టబోతున్నట్లు అతను తప్పించుకు పారిపోతున్నట్లూ శబ్దాలు, నవ్వులు. చిన్నారావు నవ్వు మొహంతో పరిగెత్తి గదిలోకి వచ్చాడు.
"రంగేలీ! రంగేలీ! మధుమతినా వెంటపడింది చూడు! దీని నోరూకాళ్ళూ పడిపోయేటట్లు మందోమాకో పెట్టరాదూ?"
"నాకెందుకూమందూ? ఆడోళ్ళనిచూస్తే ఆమడదూరంలగెత్తుతావ్! నువ్వేతీసుకో రంగేలీ దగ్గర ఊరపిచ్చుకల లేహ్యం. అప్పుడు నువ్వే నా వెంటపడివస్తావ్!" అంది మధుమతి. "హేయ్!" అని పెద్దగా అరుపు వినబడింది. దానితోబాటే లోపలికి వచ్చాడు కానిస్టేబుల్ కిష్ణయ్య.
"ఏమి? ఏమిటీ హంగామా? వాంగా నాచ్ రహే హై క్యా? గడ్ బిడ ఎక్కువయితే గప్ చిప్ గా సెక్షన్ సిక్స్ టీ యైట్ కింద బుక్ చేసి బొక్కలోతోయిస్తా!" అన్నాడు బెదిరిస్తూ. అతను వీలైనప్పుడల్లా ఆ ఇంట్లోనే "డ్యూటీ" లో ఉంటాడు.
అతని మాటలని ఎవరూ లక్ష్య పెట్టినట్లు లేదు. మధుమతి ఊరుకోకుండా "ఏం చేయిస్తావూ?" అంది.
"బొక్కలో తోయిస్తా!"
"అంటే ఆ పని నీ వక్కడివల్లాకాదా ఏమిటీ? శ్రీకృష్ణ లీలల కిష్ణయ్యా!"
మళ్ళీ నవ్వులు. ఈసారి కిష్ణయ్యకూడా నవ్వాడు. కార్నివాల్ లాగా ఉంది అక్కడి వాతావరణం. ఎవరో కిష్ణయ్యను వెక్కిరిస్తూ పాట మొదలెట్టారు శృంగారపు జావళి అది.
"మూడునాళ్ళాయెరా మువ్వగోపాలా?
నిన్ను చూడకేనింక నిలువజాలనురా!"
ఇంతలోచిన్న బుడతలాంటిటీల కుర్రాడు వచ్చాడు. ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క గ్లాసుమంచినీళ్ళూ, ఒక గ్లాసు టీ అందించెడు. నిక్కరు జారిపోతుంటే మధ్యమధ్య పైకి లాక్కుంటున్నాడు అతను.
"ఒక్కసారిగా ఆ లాగూ పూర్తిగా జారిపోనీరా? విశ్వరూపం చూడొచ్చు! సిగ్గుపడతావేమిటీ?" అంది మధుమతి.
మళ్ళీ నవ్వులు.
ఒకమ్మాయి విరబోసుకున్న జుట్టులో దువ్వెన గుచ్చుకుని గదిలోకి వచ్చి "కాస్త జడెయ్యవేమధూ!" అంది.
"ఉండు! ఈ కొత్తపిల్లకి ముందు జడిసి రమ్మంది అమ్మ!" అంది మధుమతి.
"దానికి తొందరేముందే! ఇంకాస్త పొద్దుగూకిందంటే ధోవతి ఊడిపోతున్నది కూడా చూసుకోకుండా నాకోసం పరిగెత్తుకువస్తాడు త్రిభువన్ మల్! నా సంగజ్జూడు ముందు!"
ఈమాటలూ, ఈ నవ్వులూ, ఈ వాతావరణం వికారం కలిగిస్తున్నాయి సృజనకి.
దానికితోడు సాంబ్రాణీపొగా, అగరొత్తుల పొగా ఇల్లంతా అలుముకుని వాతావరణాన్ని అసహజంగా మార్చాయి. కలలాగా ఉంది అంతా.
ఈ చౌకబారు సంభాషణల నేపథ్యంలో వినబడుతోంది శ్రావ్యమైన వీణానాదం.
ఆమాటలు చెవినపడకుండా వీణానాదంమీదే మనసు కేంద్రీకరించింది సృజన. అది వింటూంటే మెల్లిగా మగత తెర కమ్మింది.
చాలాసేపటి తర్వాత ఎవరో సన్నగా ఏడుస్తున్నట్లుంటే మెలకువ వచ్చింది సృజనకి. తన పక్కనే పడుకుని ఉంది. ఇందాక తనతోబాటే తీసుకురాబడ్డ అమ్మాయి.
ఇందాకటినుంచి ఎక్కడ ఉంది ఈ అమ్మాయి?
ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చింది?
తను పెదిమలు కదిలిస్తే మాటలు బయటికి వస్తాయో ఏడుపే వస్తుందో తెలియడం లేదు సృజనకి. అందుకని పసిపిల్ల తొలిపలుకులు పలుకుతున్నట్లు పెదిమలు కదల్చిచూసింది.
"అమ్మా!" వెలువడింది పిలుపు.
అదేపిలుపు!
అమ్మా!
సంతోషం వచ్చినా, దిగులేసినా, దుఃఖం ముంచుకొచ్చినా, దెబ్బ తగిలినా అప్రయత్నంగా గుర్తొచ్చేపదం!
అమ్మా!
తెలుగులో అమ్మ, హిందీలోనూ, సంస్కృతంలో మాత, ఇంగ్లీష్ లో మదర్----అనేకజాతులలో అనేకానేక భాషలలో అనేకరూపాలతో వినబడేపదం అది! పసిపిల్లలు తల్లి రొమ్ముని పెదిమలతో పట్టుకుని స్తన్యం చప్పరిస్తున్నప్పుడు కలిగే ప్రథమ అనుభూతి వారి సబ్ కాన్షసే లోకి ఇంకిపోతుందంటారు.
వారిపెదిమలు పలికే తొలిపలుకులు కూడా స్తన్యం చప్పరించేక్రియని అనుకరిస్తూ ఉంటాయి. మ్మ్ అ....మ్మ్ అ....మ్మ్ అ....అమ్మా....అమ్మా.....అమ్మా.....!"
"అమ్మా!" అంది సృజన మళ్ళీ, పెద్దగా "అమ్మా! నాకు భయంగావుందమ్మా!"
దానికి సమాధానం లాగా పక్కనున్న అమ్మాయి బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది.
ఇప్పుడు వారినోట్లో గుడ్డలుకుక్కిలేవు.
"అవ్ న్ మ్మా!" అని గొంతు పెద్దది చేసింది ఆ అమ్మాయి.
ఏంచెయ్యాలో తోచకకాసేపు సందిగ్ధంగా చూసింది సృజన. తను తమ ఇంటికి పెద్దపిల్ల. తమ్ముడు చెల్లెలూ ఏడుస్తుంటే సముదాయంచడంతన చిన్నప్పటినుంచి అలవాటు.
ఇప్పుడు తనకే ఏడుపొచ్చేస్తోంది. ఇంక ఈ అమ్మాయినేం ఓదారుస్తుందీ?
అయినా "ఊరుకో!" అంది వణుకుతున్న గొంతుతో.
ఊరుకోకపొగా ఏడుపు ఇంకా పెద్దది చేసింది ఆ అమ్మాయి.
"ఇదిగో నిన్నే! ఊరుకోమంటుంటే! ఏడవకు?"
"నేను ఇంటికెళ్ళిపోతానూ!"
"నాకూ వెళ్ళిపోవాలనే ఉంది. ఏడిస్తే వీళ్ళు పంపించేస్తారా ఏమిటి? ఏదో ఒక ప్లాను వెయ్యాలి మనం! నువ్వు ఏడుస్తుంటే నాకు బుర్ర పనిచెయ్యొద్దూ! ఊర్కో! నీ పేరేమిటి?" అంది. ఆ అమ్మాయి ఏడుపు ఉగ్గాబట్టుకుని చెయ్యి వెనక్కి తిప్పి కళ్ళు తుడుచుకుంటూ "కామాక్షి" అంది. "ఇదిగో కామాక్షీ! నువ్వు కాసేపు ఏడవకుండా ఉండు! ఇది ఆ రాఘవులుగాడి ఇల్లు ఉన్నట్లు జైలులాగాలేదు సత్రంలాగా ఉంది. ఈ సందట్లో మనం ఎలాగోలాగ తప్పించుకు పోవచ్చనుకుంటాను. నువ్వు మాత్రం అప్పటిదాకా ఏడవకూడదు సరేనా?"
"సరే!" అన్నట్లు దిగులుగా తల ఊపింది కామాక్షి.
అతికష్టంమీదలేచి కూర్చుంది సృజన విశ్వప్రయత్నం మీద మంచం దిగింది.
చీరెకట్టుకోవడం అలవాటులేకపోవడంవల్లనడక కుదరడం లేదు. చిన్న చిన్న అడుగులు వేస్తూ తలుపు దగ్గరికెళ్ళింది.
అక్కడెవరూలేరు.
సందేహంగా బయటికి తొంగిచూసింది సృజన.
చాలాపాతకాలపు భవంతి అది.
మధ్య అంతా ఖాళీ స్థలం ఉంది అక్కడ నుంచి చూస్తే పైన ఆకాశం కనబడుతోంది.
ఆ ఖాళీస్థలం చుట్టూతా ఇల్లు. రెండంతస్తులు ఉన్నాయి దానికి. స్త్రీలు బయటికి రాకుండా పరదా పాటించే రోజుల్లో ఇంట్లో ఉండే ఆడంగులకి కాస్త గాలీ వెలుతురూ తగలాలని అప్పట్లో ఆ విధంగా కట్టించారు ఇళ్ళు.
తలెత్తి మేడమీదికి చూసింది సృజన.
అన్నిగదుల్లోనూ ప్రకాశవంతంగాలైట్లు వెలుగుతున్నాయి ఎక్కడో సోడాకార్క్ ఓపెన్ చేసిన శబ్దం. సోడాని గాజుగ్లాసు లోకి వంపుతుంటే వచ్చేబుసబుస శబ్దం వినబడింది.
మధుమతి అనే అమ్మాయి బాల్కనీలో నుంచి తొంగిచూసి "చిన్నారావ్! ఆ చీట్ల పేక తీసుకురా!" అని తన వెనుకగదిలో ఉన్న మనిషివైపు తిరిగి "ఏమిటీ!" అంది.
అతనేదో చెప్పగానే "సిగరెట్లు----త్రిబుల్ ఫైవటా, రెండు పానులు--ఒకటి కాశ్మీరీ కిమామ్, నాకు బాబాజర్దా! తొందరగా!" అంది.
చిన్నారావు బయటికి వెళ్ళాడు.
మధుమతి గొంతు వినబడగానే చటుక్కున వెనక్కి తప్పుకున్న సృజన మళ్ళీ నెమ్మదిగా బయటికి వచ్చి చూసింది.