"ఎవరూ కొనలేదమ్మా! మన పక్కింటి పార్వతమ్మ గారికి వాళ్ళ వూరినుంచి కూరగాయలు తెచ్చాడట పాలేరు! ఆవిడ పెట్టింది!' అప్పుడే వంటింట్లోకి వచ్చిన సుందరమ్మ అంది. వచ్చి కూతురు పక్కనే కూర్చుంది.
ఈ రోజు ఆవిడకి మరీ బలహీనంగా వుండడంతో తినడానికో, తాగడానికో ఏదయినా ఇస్తుందేమోనని వచ్చిందావిడ! నోరు విడిచి అడగలేదు. అటూ యిటూ చూసింది అంతేకానీ ఆమె ఏమీ అనలేదు. యింకాస్త జరిగి కూతురి ప్రక్కన కూర్చుంది.
"నువ్విలా వచ్చావేమిటమ్మా?" అడిగింది నంద.
"కడుపులో అదోలా వుంది! ఏదయినా తినడానికో" ఆమె వంట పూర్తి చేయలేదు. అర్ధోక్తిలోనే ఆపేసింది. అసలావిడ ఏదీ ఎప్పుడూ అడగదు. ఫలానా కావాలని కోరుకునే మనస్తత్వం కాదామెది.
కుటుంబ పరిస్థితి ఎలా వుందో ఆమెకి తెలుసు! యిల్లు జరుగుతోందో బాగా తెలుసు. ఒక్కరి సంపాదనపై ఆర్గురు ఈ రోజుల్లో బ్రతకడం ఎంత కష్టమో నిత్యానుభవమే యింకెలా అడుగుతుంది.
తినడానికో, తాగడానికో అని ఆమె అనగానే టానిక్ గుర్తుకొచ్చింది. నందకి నిన్న తన ఫ్రెండ్ డాక్టర్ ప్రమీలని అడిగితే తల్లి కోసం వో శాంపిల్ టానిక్ ఇచ్చింది. అయినా ఇంటికి రాగానే యివ్వటానికి కుదర్లేదు. ఆలోచనల సందడిలో ఏదో ఆలోచనలతో అవి ఆమెకి ఇవ్వనే లేదు! చేసిన తప్పుని యిప్పుడు సరిదిద్దుకుంటున్నట్టుగా లేచి వెళ్ళి వానిటీ బాగ్ తీసి టానిక్ తీసి యిచ్చింది.
"ఇది రోజూ మూడుపూటలా పుచ్చుకోమ్మా!" అంది.
"కొని తెచ్చావా? ఎందుకమ్మా. నాకింకా టానిక్కులూ?" అందామె.
"అమ్మా!" గద్దించింది నంద. ఇంకెప్పుడూ అలా అనవద్దు. నేనెంత చాతకానిదాన్ని అయినా తల్లికి మందులు తెచ్చివ్వలేని స్థితిలో లేను. పైగా అది మన ప్రమీల ఇచ్చింది వూరకే! అంది సంజాయిషీ యిస్తోన్నత్తుగా. సుందరమ్మ ఇంకేం అన్లేదు.
అంతలో ఇంటింటికి వచ్చి ఇడ్లీలు అమ్మపోయే బ్రాహ్మడు వచ్చాడు. హోటల్లో ప్లేటు ఇడ్లీ యాభయిపైసలయితే ఇతని దగ్గర యాభయి పైసలకి ఆరు! కారుచవక! అంతేనా రుచికి రుచి! శుచికి శుచి! పైగా కడుపు నిండుతుంది.
"ఒరేయ్ శశీ! స్వామిని కేకేయ్! అమ్మకి ఓ మూడు ఇడ్లీలు తీస్కో!"
సుందరమ్మ వద్దనబోయి ఆగిపోయింది.
శశి వెళ్లి మూడు ఇడ్లీలు తెచ్చాడు.
తల్లి ముందు ఆ ఆకు అలాగే వుంచాడు.
"నువ్వోటి తీసుకో నేనిన్ని తిన్లేను!"
శశి ఏం మాట్లాడకుండా డబ్బు కోసం అన్నట్లు నంద వైపు చూశాడు.
నంద డబ్బు తీసిచ్చింది! అంతలో రవి వచ్చాడు అక్కడికి. తనకీ ఇడ్లీలు కావాలన్నట్టుగా చూశాడు.
"కావాలా?" అడిగింది సుందరమ్మ.
తలూపేడతను.
"రా!" ఆప్యాయంగా పిలిచింది. దగ్గరికి రాగానే కూర్చోమని సైగచేసి ఆప్యాయంగా తినిపించింది.
మూడూ తినేశాడు రవి!
సుందరమ్మకి కడుపు నిండినట్టయింది.
తల్లివేపు ప్రేమగా చూసి తిరిగి వెళ్ళిపోయాడు రవి.
ఈ లోగా శశి వెళ్ళి మూడిడ్లీ తెచ్చాడు.
చిల్లర తెచ్చి నంద చేతికిచ్చాడు.
"మళ్ళీ ఎందుకమ్మా? వూరకే యాభయిపైసలు దండుగ!" అంది సుందరమ్మ నొచ్చుకుంటున్నట్లుగా.
జాలిగా చూసింది నంద! ఏమీ అనలేదు.
సుందరమ్మ ఇంకేమీ అనకుండా మూడిడ్లీ తినేసింది నీళ్ళు తాగి వెళ్ళిపోయింది.
"ప్చ్! ఏం బ్రతుకులు! వెధవది ఇడ్లీ తినడానికీ, కాఫీ తాగడానికీ కూడా ఆలోచించి డబ్బులు వెతుక్కోవలసి వస్తూంది! మరీ బడ్జెట్ బ్రతుకులయిపోయాయి. ఇది కాలం మార్పా? పరిస్థితుల ప్రభావమా? తన తల్లీ, తండ్రీ ఎలా గడిపారు కాలాన్ని? ఇంటినిండా ధనధాన్యాలు ఉన్నట్లుగా ఉండేది. దేనికీ తడుముకోవలసిన అవసరం కానీ, వెదుక్కునే ఇబ్బందికానీ తమ ఇంట్లో ఎరుగరు! బంధువులు ఎందరొచ్చినా అమ్మ విసుక్కునేది కాదు. ఆప్యాయంగా చేసిపెట్టేది అలాటి అమ్మకి ఏం గతి పట్టింది" గుండెల్లో కెలికినట్లయింది ఆమెకి.
చార్లో వేయడానికి కొత్తిమీర కట్ట కోసం వెతికింది నంద. ఎంత వెతికినా ఎక్కడుందో అది కనబల్లేదు.
ఓ చిన్న కట్ట కొనడానికి రోజూ పదిపైసలు కావాలి! నెలకి మూడు రూపాయలంటే మాటలా? తమ పెరట్లో బోలెడంత ఖాళీ స్థలం వుంది! ఎన్నో కూరగాయలు పండించుకోవచ్చు! దానిలో అరంగుళం నేలనికూడా గీరనివ్వదు కామాక్షమ్మ! దుర్యోధనుడి చెల్లెలు! అక్కడ ఎప్పుడో గదులు వేయాలట! ఆ గదులని విడివిడిగా ధనవంతులయిన స్టూడెంట్స్ కి బాడుగలకి ఇవ్వాలట!
వాళ్ళకయితే ఎక్కువ బాడుగ వస్తుందట! నెల నెలా ఠంచన్ గా బాడుగొస్తుందట! ఈ పేచీలుండవట!
ఎంత ఆశ! డబ్బంటే ఎంత యావ!
కామాక్షమ్మకి వసతి వుంది. తనకోసమైనా కూర గాయలు పండించుకోదు. తమని పెంచుకోనివ్వదు. అదే తమ పూర్వం ఇంట్లో అయితే-
* * *
"ఏమోయ్! మీ మేనల్లుడు వచ్చాడు!" బయటినుంచి భార్యని కేకేశాడు నారాయణ. ఆ కేక వెంటే వచ్చాడతను.
తలెత్తి చూసింది సుందరమ్మ!
ఆమె అన్న కుమారుడు విక్రాంత్ వచ్చాడు.
వాడు అక్కడెక్కడో మెడిసిన్ చదువుతున్నాడు. వాడిని మెడికల్ లో చేర్చడానికి ఎంతో శ్రమపడి డొనేషన్ దాదాపు ఇరవయివేలు కట్టాడు ఆమె అన్నయ్య.
మేనల్లుడిని చూడగానే ఆమెకి ఎంతో ఆనందమైంది.
వాడు అక్కడికి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. మళ్ళీ తిరిగి రావటం యిప్పుడే! ఈ మధ్య కాలంలో మనిషి బాగా ఎదిగాడు. బుగ్గలు నిండాయి. కళ్ళు కాంతులు చిమ్ముతున్నాయి! ముఖాన మీసకట్టు ఏర్పడింది.