Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 12


    "నా బంగారుతల్లి! ఎంతో కొంత ఇవ్వమ్మా రేపు పంపించేస్తానుగా" అంటూ ఆయన అవి అందుకుని కృతజ్ఞతతో కరిగిపోతూ నిష్క్రమించాడు.
    
    ధృతికి టిఫిన్ తినబుద్ది కాలేదు. మనుషులందరికి అంతో యింతో కష్టం వుండడం తప్పదన్నమాట. పాపం ఆ లీల కష్టాలు పోల్చుకుంటే నావెంత? అనిపించింది. ఆ తర్వాత పనిలో పడిపోయింది.
    
    సాయ్మత్రం ఇంటికి వచ్చేస్తుండగా వెనకాల ఎవరో "లీలా! ప్రొద్దుట ఆఫీసుకి రాలేదేమిటే?" అని అడగడం వినిపించి ఠక్కున తలతిప్పి చూసింది.
        
    "అవునే మార్నింగ్ షోకి వెళదామని మా అమ్మ ప్రాణం తీసేసింది అనుకో.     

    కొత్తగా పిక్చర్ రిలీజ్ అయితే చాలు ఆవిడకి చూసేదాకా ఆ తపన తట్టుకోలేదు. అందుకే 'హాఫ్ డే' లీవ్ పెట్టి, సినిమానుంచి యిటే వచ్చేశాను" అంటోంది ఓ పాతికేళ్ళ అమ్మాయి నల్లగా, పొట్టిగా వున్న ఆ అమ్మాయిలో ఏదో చెప్పలేని ఆకర్షణ కనిపిస్తోంది.
    
    ధృతి అక్కడే ఆగిపోవటం చూసి- "ఏమ్మా! ఏం కావాలి?" అడిగాడు మేనేజర్.
    
    "ఈ ఆఫీసులో ఎంతమంది లీలలు వున్నారండీ?" అడిగింది అనుమానంగా ధృతి.
    
    "ఒక్కరేనమ్మా! అదిగో...." అంటూ- "ఈవిడ ధృతి. ఈరోజే ఎమ్.డీ.గారి పి.ఏ గా జేరారు" అంటూ లీలకి పరిచయం చేసి, తన పని అయిపోయినట్లు వెళ్ళిపోయారు.
    
    లీల గలగలా నవ్వి- "అమ్మో! యమధర్మరాజుగారి దగ్గర డైరెక్టర్ గానే! మీకు చాలా గుండెధైర్యం కావాలి. అందుకు తాగాలీ రోజూ కాంప్లాన్, ట్రింగ్, ట్రింగ్...." అంది.
    
    ధృతి ఆశ్చర్యంలోంచి ఇంకా కోలుకోలేదు. "మీ నాన్నగారేనా ఉదయం వచ్చి...." అంటూ సంశయంగా ఆగిపోయింది.
    
    ఆ అమ్మాయి మోహంలో నవ్వు ఎగిరిపోయింది. "మా నాన్న వచ్చి మిమ్మల్ని కానీ కలిశాడా?" అని అడిగింది.
    
    "ఔను! మీ అమ్మగారికి పాపం చాలా..."
    
    "ఎంత?" ఆ అమ్మాయి గంభీరంగా అడిగింది.
    
    "ఏమిటి ఎంత?" ధృతి అయోమయంగా అడిగింది.
    
    "మీ దగ్గర ఎంత రాబట్టాడూ అని అడుగుతున్నాను" అంది కాస్తచిన్నగా నవ్వుతూ.
    
    "మీ అమ్మగారికి ఏదో....
    
    "భయంకరమయిన జబ్బనీ....అందుకు సాయం చెయ్యమనీ అడిగారు కదూ! మీరెంత యిచ్చారు?" ఆ అమ్మాయి ధృతి భుజంమీద తన చెయ్యివేసి నడుస్తూ అడిగింది.
    
    "రెండు వందలు అడిగారు...... కానీ నా దగ్గర వందే వుంటేనూ -"
    
    "మంచి పని జరిగింది" అంటూ లీల తన పర్స్ లోంచి వందరూపాయిల నోటుతీసి ధృతికి ఇచ్చేసింది. "ఇంకెప్పుడూ కొత్తవాళ్ళని అంత త్వరగా నమ్మకండి" హితబోధ చేస్తున్నట్లు చెప్పింది.
    
    "మీ అమ్మగారికి నిజంగా....
    
    "ఏ రోగమూ లేదు. నిక్షేపంలా ఇప్పుడే సినిమా చూసి యింటికెళ్ళింది. ఆయనకీ లాటరీ టికెట్లు కొని అమాంతంగా కోటీశ్వరులైపోవాలనే రోగం!" అంది కసిగా.
    
    ఇద్దరూ కలిసి బస్ స్టాప్ కి వచ్చేలోపల ఆమె ధృతిని 'నువ్వు' అని సంబోధించే స్టేజ్ కి వచ్చి, ధృతిని కూడా అలాగే పిలవమని ప్రాణం తీసింది.
    
    ధృతికి ఆమె ఒక అద్భుతమైన ప్రాణిలా కనిపించింది. తండ్రి బలహీనత గురించి సిగ్గుపడకుండా అతి మామూలుగా చెప్పేసి, అంతలోనే మాట మార్చి, తను చూసిన సినిమా కథ గురించి చెప్పుకొస్తోంది. ఆ కాస్సేపటిలో ఎన్ని రకాల సంగతులు చెప్పిందో ఆమెకే గుర్తుండివుండవు.
    
    "ఇదే సమస్య నాకు వుండి వుంటే, నా తండ్రి ఈ రకంగా ప్రవర్తించి వుంటే, తను యింత మామూలుగా నవ్వేసి వూరుకోగలిగేదా! ఈ అమ్మాయి ఇలా ప్రవర్తించడం ఆమె వయసుకి తగ్గట్లు ఆమె ఎదగకపోవడమూ, లేక వయసుకి మించి ఎదిగిపోవడమా? ఆమెకి అర్ధంకాలేదు. ఏమయినా జీవించడం ఒక కళ!
    
    కళ అంటే - పెద్ద పెద్ద విషయాలని అతి మామూలుగా, అతి మామూలు విషయాలని అద్భుతంగా చూపించడం!
    
                                                                 * * *
    
    ధృతికి ఆరోజు రాత్రికూడా ఏమీ తినాలని అనిపించలేదు. అమ్మా, నాన్నా, చెల్లెలూ, తమ్ముడూ, నవీన్ అందరూ గుర్తొచ్చారు. చాలా.... చాలా దిగులు, ప్రపంచం అంతా వెలివేసినట్లుగా, తను ఏకాకి అయిపోయినట్లుగా అనిపించింది. జీవితంలో మొదటిసారిగా ఒంటరిగా పడుకుంది. మార్పు మనిషికి జీవితం మీద భయాన్ని కలగచేస్తుంది. మార్పుకి భయపడి, జీవితంలో రాజీపడే వ్యక్తిలు ఏదీ సాధించలేరు. ఒక ఒప్పందానికి వద్దాం. సర్దుకుపోదాం అని అందరూ అనుకుని వుంటే చరిత్రలో యిన్ని విప్లవాలు వుండేవి కావేమో!
    
    మరుసటి రోజు ఇంకా త్వరగా బయలుదేరింది. ఆఫీస్ దగ్గర బస్ దిగి నడుస్తూ వుండగా రోడ్డుకి అవతలివైపు నవీన్ నడుస్తూ కనిపించాడు. ధృతి సంతోషం పట్టలేకపోయింది. గబగబా రోడ్డు క్రాస్ చేసి అతన్ని చేరుకోవాలని చూసింది. ఇంతలో ఓ బస్ వచ్చి అతనిముందు ఆగడం, అతను అది ఎక్కి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. నిస్త్రాణగా వెనక్కి తిరిగింది. నవీన్ ఇక్కడికి ఏం పనిమీద వచ్చాడో! తనని చూడలేదా? చూస్తే అలా ఎందుకు చేస్తాడూ? అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఆఫీసు చేరింది. మెట్లు ఎక్కుతుంటే పరిచితమైన ముఖం కనిపించింది. ధర్మానందరావుగారు పనిలోంచి తీసేసిన వాచ్ మెన్ గా అతన్ని గుర్తించింది.
    
    ధృతి అనుకున్నట్లుగానే ఆమెకి ధర్మానందరావుగారి నుంచి కబురు వచ్చింది.
    
    ఆమె లోపలికి వెళ్ళగానే, ఆయన కనుబొమలు ముడిచి "వస్తూనే డబ్బు కావాలని అప్లికేషన్ పెట్టావు! అంత యిబ్బందిగా వుందా?" అని అడిగాడు.    

    "ఇబ్బందే! నాకు కాదు" నిస్సంకోచంగా అంది.
    
    "ఎవరికి?" ఆయన విస్మయంగా చూశాడు.
    
    "నిన్న మీరు ఉద్యోగంలోంచి తీసేసిన వాచ్ మెన్ కి అతని తల్లి పోయిందట. ప్రొద్దుట దార్లో కలిసి చెప్పాడు. నిరాధారంగా వున్న అతనికి, పెద్దగా పరిచయంలేకపోయినా సాయపడటం నా విధి అనుకున్నాను" అని దృఢంగా పలుకుతూ, ఆయన మోహంలో భావాలకోసం చూసింది.
    
    ఆయన మొఖం నిర్భావంగా ఎప్పటిలాగే వుంది.
    
    "సరే! నువ్వెళ్ళు మేనేజర్ గారు డబ్బిస్తారు" అన్నాడు.

 Previous Page Next Page