"అసలీమెట్లు తీసేసీ వేరే మెట్లు వేయిద్దామనుకొంటున్నాను. కాని అమ్మాయి ఆరోగ్యం దెబ్బతినడంతో తోచకుండా వుంది. ఎక్కడిపను లక్కడే వుండిపోయాయి. దానికి తగ్గట్టు నాకు దొరికిన ఈ వీరభద్రుడూ, అడివయ్యా వట్టి అడవి మనుషులు వీళ్ళవాళ్ళ ఏ పనీకాదు. వట్టి చచ్చువెధవలు బుర్రతక్కువ సగ్యాసులు" చివరి మెట్టుమీద ఆగివెనక్కు చూశాడు.
"చూశారా డాక్టర్గారూ! మనిద్దరం కిందకుదిగినా లాంతరుపట్టుకొని వాడు ఆ పై మెట్టుమీద నిలబడ్డాడు" అని వీరభద్రుడ్ని కేకవేశాడు.
ఒరే సన్యాసీ....ఇంకా అక్కడే నిలబడ్డావేంరా?"
"విరిగిపోయిన మెట్టంటే మీ వీరభద్రుడికి భయంలా వుంది. అక్కడ కాలుపెడ్తుంటే ఇందాకకూడా పెద్దగా అరిచాడు."
"ఆ మెట్టుకో పెద్దకథ వుంది."
"కథా? ఏం కథ?ఎప్పుడు జరిగింది?"
"తర్వాత చెప్తాను. మానసి వింటుందేమో?రండి మనకోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుచూస్తోంది."
ఆ కథ మానసి వినకూడదా? ఎందుకనో? ఆ మెట్టుమీద ఏం జరిగిందో? ఏదో జరిగి వుంటుంది. మానసి వినకూడని దుర్ఘటన ఏదో జరిగివుంటుంది.
చూస్తుంటే ఈ ఇంట్లో మెట్టుమెట్టుకూ ఓ కథ వున్నట్టుగా అన్నిస్తోంది. ఆలోచన తెగడంలేదు. ఆలోచిస్తూనే శివరామయ్యను అనుసరించాడు.
డైనింగ్ టేబుల్ ముందు కూర్చునివున్న మానసి లేచి డాక్టర్ను సాదరంగా ఆహ్వానించింది.
ఉదయ్ వెళ్ళి ఆమె పక్కకుకుర్చీలో కూర్చున్నాడు.
అడివయ్య విసనకర్రతో విసురుతూ డాక్టర్ వెనకే నిల్చున్నాడు. భూస్వామ్యపు నాగరికత మధ్యన బందీ అయిపోయాడు డాక్టర్ ఉదయ్ చంద్ర.
గ్లాసుల్లో నీళ్ళునింపి టేబుల్ మీదున్న పళ్లాలలో భోజనం వడ్డించ సాగింది మానసి.
ఉదయ్ చెయ్యి అడ్డంపెట్టి "థాంక్యూ మానసి.నేను వడ్డించుకుంటాను మీకెందుకు శ్రమ?" అన్నాడు.
"మీరు మా గెస్టు. మర్యాదచెయ్యడం మా విధికాదా డాక్టర్ గారూ?"
తను అతిథిగా వచ్చాడా? తను వచ్చిన పనేమిటి? మానసిని వేదిస్తున్న ఆ దుర్మద్గుడ్ని పట్టుకొని ఆమెముండు నిలబెట్టాలనే పట్టుదలతో వచ్చాడు. మానసిని ఒకడు వెంటాడడం ఏమిటనుకొన్నాడు.
పెరనాయిడ్ హెల్యూషనేషన్స్ అని భావించి, ఆమె చెప్పిన విషయాలను మొదట తేలిగ్గా కొట్టిపారేశాడు.
ఈ వాతావరణం చూశాక మానసి చెప్పింది నిజమేననిపిస్తుంది. వాడెవడో ఆమె వెనకపడడం వాస్తవమేననిపిస్తోంది....ఈ మనుషుల్ని చూశాక.
"ఒరే అడవీ! ఏమిట్రా ఆ విసరడం? బాగా విసురు. డాక్టర్ గారికి చెమటపడ్తోంది."
శివరామయ్య మాటలకు ఉదయ్ ఆలోచనలనుంచి బయటపడ్డాడు.
వెనక్కుతిరిగి తనకు విస్నకర్రతో విసురుతున్న అడివయ్యను చూశాడు.
వీడిలో ఏ ప్రత్యేకతా లేదు. మామూలుగా వున్నాడు. ఐదున్నర అడుగుల ఎత్తు, చామనఛాయ, ఇరవైఅయిదు, ముప్ఫెఅయిదు, ముప్ఫెఏళ్ళ వయసులోవున్నాడు. కోతిముఖం. అమాయకంగా వున్న చూపులు. మోకాలు పైకి కట్టిన ధోవతి, వంటికి అతుక్కుపోయిన బనీను, తలగుడ్డా....అతడ్ని పరిశీలనగాచూస్తూ అనుకొన్నాడ.
ఎదురైనా ప్రతివాడ్నీ ఇలా శల్యపరీక్ష చెయ్యడం అలవాటై పోయింది తనకు. అది వృత్తిలో ఒక భాగంగా అయింది.
రెండు చేతులతో విసనకర్ర పట్టుకొని విసురుగా విసురుతున్న అడివయ్యను ఆగమన్నట్టు చేత్తో సైగచేశాడు.
"శివరమాయ్యగారూ!ఇలా ఒక మనిషి పక్కన నిలబడి విసరడం నాకు బాగోలేదు ఈ రోజుల్లోకూడా ఇదేమిటి? ఎలక్ట్రిసిటీ లేకపోతే జనరేటర్ పెట్టించుకోవచ్చుగా? ఇలాంటి పాతకాలపు బంగాళాల్లో జనరేటర్ చాలా అవసరం."
"ఆ మాట నిజమే డాక్టర్ గారూ. ఇరవయ్యేళ్ళ క్రితం కనరేటర్ వుండేది. పాడయిపోయింది. బాగా పాతదయింది. కొత్తది కావాలంటే డెభైయ్ వేలవుతుంది. ఎటుతిరిగీ కరెంటు వస్తుందికదా. మళ్ళీ జనరేటర్ అంతడబ్బుపోసి కొనడం ఎందుకని ఊరుకున్నాను."
"ఈ రోజుల్లో కరెంటు తెచ్చుకోవడం ఏమంత కష్టం శివరామయ్యగారూ! మీరు నిజంగా తలచుకుంటే....."
"అవును డాక్టర్ బాబూ! అయ్యగారికి ఈ ఊళ్ళోకి కరెంటు రావడం ఇష్టంలేదనీ. రాకుండా వీరే చేస్తున్నారని ఊళ్ళో అనుకుంటు....."
"ఒరే అడివీ!" శివరామయ్య గుడ్లురిమాడు.
"చెప్పనియ్ నాన్నా వాడు నిజమే చెపుతున్నాడు. చెప్పరా అడివీ. వినండి డాక్టర్ గారూ " అంది మానసి.
"మీకు ఊళ్ళోకి కరెంటు రావడం ఇష్టంలేదా శివరామయ్యగారూ?" ఉదయ్ చంద్రకు బుర్ర గిర్రున తిరిగినట్టుయింది.
"అవును....ఒక రకంగా చూస్తే ఇష్టంలేదనే చెప్పాల్సివస్తుంది."
ఉదయ్ చంద్ర ముద్ద గుటుక్కున మింగాడు. పొలమారింది. గ్లాసుడు నీళ్ళు తాగి తేరుకున్నాడు.
"ఎందుకని? మీకు వెలుతురంటే ఇష్టంలేదా?" ఉదయ్ సాలోచనగా అడిగాడు.
ఈ రకం జబ్బును 'పైరోమానియా' అంటారు. దహనేచ్చకు అభిముఖమైన మానసిక వ్యాధి.
"వెలుగు ఇష్టంలేని వాళ్ళెవరుంటారు డాక్టర్ గారూ?" శివరామయ్య నవ్వుతూ అన్నాడు.
"అయితే ఊళ్ళోకి కరెంటు రాకుండా మీరెందుకు అడ్డుపడ్తున్నారు?" నిలదీసినట్లుగా అడిగాడు ఉదయ్.
"ఓ అదా? అది స్వార్థం డాక్టర్ గారూ."
"ఊళ్ళోని కరెంటువస్తే మీకు ఎక్కువ లాభమేకదా? ఆ మాట కొస్తే ఊళ్ళోవాళ్ళందరికంటే మీకే ఎక్కువ లాభం. మీ బంగళాకు కరెంటు వస్తుంది. మీ తోటకు నీళ్ళు కరెంటు మోటారుతో తోడుకోవచ్చు"
"ఆ మాట నిజమే డాక్టర్ చిన్నా పెద్దా, మిగతా రైతులంతా కరెంటు మోటర్లు పెట్టుకొంటారు."
"వాళ్ళెవరో పెట్టుకుంటే మీకేమిటి నష్టం?"
"మా తోటకు నీళ్ళుచాలవు డాక్టర్ గారూ. ఈ ప్రాంతంలోవున్న ఊట చాలా తక్కువ. అదిభూగర్భ నీటి పరిశోధనా నిపుణులే నిర్థారించారు. ప్రస్తుతం ఆయిల్ ఇంజనుతో నీళ్ళు తోడించి తోటలకు పెడుతున్నాం. చుట్టుపక్కల రైతులు స్థితిమంతులుకారు. అందరూ బక్కరైతులే. ఎవరూ ఆయిల్ ఇంజన్ కోనేస్థితిలో లేరు. పైగా ఇంజన్ రిపేర్ వస్తే ఖర్చులు భరించడం సన్నకారు రైతులవల్ల కాదు. మోటవేసి నీళ్ళు తోడి, ఎకరం అరెకరం మాత్రమె సాగుచేసుకోగలుగుతున్నారు చుట్టుపట్ల నీళ్లు ఎక్కువగా తొడకపోవడంవల్ల మా బావిలో జల బాగా ఊరుతుంది. ఇంజన్ పెట్టి ఇరవై గాలుగ్గంటలు తోడినా, ఒక్క వేసవికాలంలో తప్పమిగతా కాలంలో నీళ్ళు పుష్కలంగా దొరుకుతున్నాయి. అయినా వందెకరాల తోట ఒక్కసారిగా తడవాలంటే, ఒకోసారి కష్టమైపోతున్నది. ఊళ్ళోకి కరెంటు వచ్చి, ప్రతివాడూ నీళ్లు తోడడం మొదలుపెడ్తే మా తోటలో పదెకరాలుకూడా తడవదు. అందుకనే ఉన్నవిషయంచెప్పొద్దూ....ఊళ్లోకి కరెంటు రాకుండా నేనే అడ్డుపడుతున్నాను. ఇంట్లో లైట్లకూ, ప్యాన్ ల కోసం జనరేటర్ పెట్టించుకోవచ్చును. ఓ పాతికవేలు పెడ్తే చిన్న జనరేటర్ వస్తుంది. అయినా ఎందుకు పెట్టించలేదో తెలుసా డాక్టర్ గారూ?"
"చెప్పండి."
"నేను జనరేటర్ పెట్టానే అనుకోండి. ఊళ్ళోవాళ్ళు ఈ ఊరికి ఇక కరెంటు రాదనీ భావిస్తాఋ. కరెంటుకోసం ప్రయత్నాలు సాగుతాయి. అసలు రహస్యం బయటపడుతుంది, ఊళ్లో అందరితోటీ విరోధం తెచ్చుకొని బతగ్గలామా? ఏయేటి కాయేడు కరెంటు వస్తుందని ఆశపడ్తున్నారు. ఊళ్ళో జనం. ఇదిగో వస్తుంది అదుగో వస్తుందనే నమ్మకంతో వున్నారు. ఈ ఏడు ఎలాగోలా గడిపి ఏడు ఈ బంగళా, తోటా ఆమ్మేద్దాం అనుకొంటూన్నాను."
"ఇది చాలా అన్యాయం శివరామయ్యగారూ?"
భోజనం పూర్తిచేసి డైనింగ్ టేబుల్ ముందునుంచిలేస్తూ అన్నాడు ఉదయ్.
చెయ్యి కడుక్కోవడానికి వెనకవైపు వరండాలోకి వచ్చాడు.
"ఒరే అడివీ! ఏమిట్రా? అలా చూస్తూ నిలబడ్డావ్? డాక్టర్ గా చెయ్యి కడగరా" శివరామయ్య పురమాయించాడు.
"ఛ! ఛ! నువ్వు నా చెయ్యి కడగడం ఏమిటి? నువ్వలావుండు చేతిమీద నీళ్లుపొయ్యి చాలు." అడివయ్య చేతిమీద నీళ్లు పోస్తుండగాచెయ్యి కడుక్కున్నాడు ఉదయ్.
టవల్ అందిస్తూఅన్నాడు శివరామయ్య...."మీరన్నట్టు నేను చేసింది అన్యాయమే డాక్టర్ గారూ. నేను ఉన్న విషయం దాచకుండా చెప్పాను ఆ పరిస్థితుల్లో నన్నేంచెయ్యమంటారో మీరే చెప్పండి. ఈ తోటవల్లనే ఈ బంగళాకు విలువవుంది. ఈ తోటా, ఈ బంగాళా చూసేగా, అమెరికాలో వున్న హరిబాబుఆశపడ్తున్నాడు. మానసి మెళ్ళో ఆ మూడుముళ్ళూ పడితే ఇక నాకే దిగులూ వుండదు. ఏ బరువూ బాధ్యతలూ వుండవు. తోట పచ్చగా వుండగానే అమ్మేసి అల్లుడితో, అమ్మాయితో అమెరికా వెళ్ళిపోదామనుకుంటున్నాను."
"మీ ఆలోచన బాగానేవుంది. కాని ఇంతకాలంగా మీరు ఈ ఊరికి చేసిన అపకారం...."
"క్షమించండి డాక్టర్ గారూ . ఉన్న విషయం సిగ్గువిడిచి, మనసు విప్పి మీ ముందు పెట్టాను. అయిందేదో అయిపోయింది. సూరిబాబు ఏ రోజునైనా రావచ్చు. అసలు ఈపాటికే రావాల్సింది. అతడొచ్చేలోపల అమ్మాయి జబ్బు నయంచెయ్యండి. కనీసం సూరిబాబు ఇక్కడున్న ఆ నాలుగురోజులైనా మానసి మామూలుగావుంటే చాలు. పెళ్ళయేవరకు మానసి జబ్బు గురించి అతడికి తెలియకుండావుంటే చాలు."
"శివరంయ్యాగారూ?"
శివరామయ్యగారు అదిరిపడ్డాడు ఆ కంఠం విని.
"మీ ఉద్దేశ్యం ఏమిటి? ఊళ్ళోవాళ్ళను మోసంచేసినట్టు కాబోయే అల్లుడ్ని మోసం చేద్దామనా? దానివల్ల వచ్చేనష్టం మీ అల్లుడికికాడు . మీ అమ్మాయికీ, మీకూ. పెళ్ళయ్యాక పిచ్చిదని తెలిస్తే విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. అలాంటిదే జరిగితే మీ అమ్మాయి శాశ్వతంగా పిచ్చాసుపత్రిలో వుండిపోవాల్సి వస్తుంది. మీరేమో పర్మినెంటుగా ఆసుపత్రిచుట్టూ తిరుగుతూ వుండాలి."
"డాక్టర్ గారూ! క్షమించండి. ఏదో మాట్లాడేస్తున్నాను. నాలోని స్వార్థమే నా ప్రవర్తనకు కారణం అయింది. ఇదంతా నా బిడ్డ క్షేమం కోరే చేస్తున్నానన్ను."
"మీ వేలితో మీ కన్నే పొడుచుకుంటున్నారు శివరామయ్యగారూ! ప్రతి చర్య మరో ప్రతిచర్యకు కారణభూతం అవుతుంది." చేతులుతుడుచుకున్న టవల్ అడివయ్యకు అందించాడు ఉదయ్.
అంతలో మనసి వరండాలో వచ్చింది.
"ఏమిటి నాన్నా. డాక్టర్ గార్ని అక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నావ్?"
"ఏంలేదమ్మా. డాక్టర్ గారు ఈ ఊరి విశేషాలు అడుగుతుంటే చెపుతున్నాను" అనునయంగా అన్నాడు.
డాక్టర్ మానసి ఆశ్చర్యంగా చూశాడు.
ఆమె మనసులో అట్టడుగు పొరల్లో అణిగిమణిగి పడివున్న విషయాన్ని దేన్నో వెలికిలాగి చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా అన్పించింది డాక్టర్ కు.
అవకాశం జారవిడుచుకుంటే మళ్ళీ రాకపోవచ్చు. కొన్ని నెలలుగా తను ప్రయత్నంచేసి చెప్పించలేని విషయాలు, అనాయాసంగా, అప్రయత్నంగా, మానసికరోగులు బయట పెట్టిన ఉదాహరణలు వున్నాయి. అవి పేషెంట్సు ట్రీట్ మెంటుకు చాలా ఉపకరిస్తాయి.