Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 11


    "నీ పేరేమిటి?"
    'స్వాతి!' రెప్పలల్లాడిస్తూ అంది.
    "హౌస్వీట్! నాపేరు స్వప్న!"
    "హాయ్! మీ పేరెంత బావుంది. మీరూ మీ పేరూ నాకూ చాలా నచ్చాయి!"
    నవ్వింది స్వప్న. ఆమె అందం మరీ ఇనుమడించి నట్లయింది.
    "నువ్వేం చదువుతున్నావ్?"
    "ఎయిత్ పాసయ్యాను, ఆపేశాను!" దిగులుగా అంది.
    నిండుచంద్రుడిని అమాసమబ్బులు కమ్మేసినట్లయిన ఆ అమ్మాయి ముఖంచూసి జాలిగా "ఏం? ఎందుకు మానెశావ్?" అని అడిగింది.
    "మా నాన్నగారు పోయారు నిరుడు ఎయిత్ లో ఉండగానే నాకు జబ్బు చేసింది సమ్మర్ నుంచి!"
    "ఏమిటి నీ జబ్బు?" ఆదుర్దాగా ప్రశ్నించింది.
    అడ్డంగా తలూపింది స్వాతి.
    "చెప్పవూ?"
    "ఊహు ఁ చెప్పవచ్చుగా. చెబితే మీరు నా జట్టు రారు. అంతా దూరమయ్యారు. నాతో ఆడటానికి పాడటానికి ఎవరూరారు!"
    "నువ్వు పాడతావా?"
    "ఓఁ"
    "సినిమా పాటలా? గీతాలా?"
    "అన్నీ-నాకు కృష్ణశాస్త్రిని, రాయప్రోలునీ నేర్పించారు మా నాన్నారు. ఆయనకి విశ్వనాధ అంటే ఎంతో ప్రేమ. కిన్నెరసాని పాటలన్నీ కంఠతావచ్చు నాకు" ఉత్సాహంగా చెప్పింది స్వాతి.
    కళ్ళు మిలమిలా మెరిసేయి. "ఊహూఁ అలాగా!" అంది స్వప్న. ఒక్క క్షణం ఆగి దగ్గరగా వెళ్ళింది. స్వాతి చప్పున రెండడుగులు వెనక్కి వేసింది. 'పాడవూ ఒక పాట!" అంది బ్రతిమాలుతున్నట్టుగా స్వప్న.
    "ఉహూఁ యీ జబ్బు చేసినప్పటినుంచి పాడటం లేదు."
    "ఇంతకీ జబ్బేమిటి?"
    తన విశాలమైన కళ్ళు  అటూ ఇటూ తిప్పుతూ "ఉహూ చెప్పనన్నానుగా" అంది నవ్వుతో.
    "అయితే నీతో కచ్చి!" తనూ నవ్వింది స్వప్న.
    మొగం వేలేసింది స్వాతి "అదేం?" అంది నీరసంగా.
    "జుట్టు కడితే నాతో చెప్పాలిగా. చెప్పకుంటే ఇంకేం జుట్టు?"
    "చెబితే మీరు పారిపోతారు. ఇంకెప్పుడూ రారు!"
    ఆత్మీయతకీ, అనురాగానికీ, ఆప్యాయతకీ మొగం వాచినట్టుగా అంటున్న స్వాతి మాటలు స్వప్నని కదిలించేయి.
    "స్వాతీ!"
    బయట మాటలు వినిపించి, అంతదాకా లోపలున్న రవి బయటికి వచ్చి పిలిచాడు. అతను బయటకి రాగానే స్వప్న కనిపించింది, తొలిసారి హీరోయిన్ ని చూసిన హీరోలా అయిపోయాడు.
    "అన్నయ్యా! స్వప్నగారు!" అంది స్వాతి.
    "నమస్తే" అన్నాడు రవి.
    "మా అన్నాయ్ రవి!" పరిచయం చేసినట్టుగా అంది స్వాతి. "ఏం.ఏ. ఫస్ట్ రాంక్. గోల్డు మెడలిస్టు ...అయినా నిరుద్యోగి!"
    "నమస్తే!" అప్రయత్నంగా అతన్ని పరీక్షగా చూసింది స్వప్న. "ఈ అమ్మాయికి వయస్సు మించిన ఆలోచనలు న్నాయి!" అనుకుంది.
    "మా చెల్లాయికి టి.బి. ఇంకా ప్రిలిమినరీ స్టేజిలోనే వుంది. లంగ్ ఎఫెక్ట్ అయింది!"
    "అయ్యో!" స్వప్న మనస్సు ఎండవేడిమికి మంచులా కరిగిపోయింది. ఏదో చెప్పబోయింది.
    అంతలో అమ్మమ్మగారు "స్వప్నా!" అంటూ కేకవేసింది.
    పిడుగుపాటు విన్న లేడిపిల్లలా బెదిరిపోయింది స్వప్న. చప్పున "వస్తానండీ" అంటూ రివ్వున పావురాయిలా పరిగెత్తింది.
    తెలివాగులా, ఎల కోయిలలా, చిరుగాలిలా, శివరంజని రాగంలా వెళుతోన్న స్వప్ననే చూస్తూ వుండిపోయాడు రవి.
    మరో నిమిషం తర్వాత అమ్మమ్మగారి కేకలు విని పించసాగాయి. నిట్టూరుస్తూ లోపలికివెళ్ళేడు. స్వాతి అనుసరించింది.
    
                                            6
    
    సాయంత్రం మూడు గంటల సమయం. వేణుగోపాలస్వామి ఆలయం ధర్మానికి నిలయంగా, న్యాయానికి నిలకడగా, నీతికి నీడగా వున్నట్టు చల్లగా వుంది. పూజారి పరిహారంగారు మండపంలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నారు ఆయన ముందు వ్యాస పీఠంలో భాగవతం వుంది. అది తెరిచే వుంది. ఆయన గొంతుకలో చదువుకుంటూ వున్నారు.
    ఆయన కెడంచేతివేపు ఓ పళ్ళెరం వుంది. దానిపై ఓ గుడ్డ కప్పి ఉంచారు. శ్రద్ధతో భక్తితో చదువుతూనే వున్నా అప్పుడప్పుడూ ఆలయ ముఖద్వారం కేసి చూస్తూనే వున్నారు.
    మరో అరగంట గడిచింది.
    గేటు చప్పుడైంది. నరసింహం వచ్చేశాడు. అక్కడి నుంచే "నమస్కారం పంతులు గారో!" అంటూ వచ్చాడు.
    "దీర్ఘాయుష్మాన్ భవ! రా నాయనా కూర్చో!" అన్నాడు హరి హరంగారు. ఆయన శత్రువునైనా అలా ఆశీర్వదించేస్తారు ఠపీమని. సర్వేజనా స్సుఖినో భవంతు అనే మంత్రార్దాన్ని వచసా మనసా కర్మణా ఆచరిస్తారు ఆయన.

 Previous Page Next Page