Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 11

 

    "వంట పని ప్రారంభించాలి" అనుకుని ఆమె వెళ్ళబోయింది.
    
    పెరట్లో ఏదో గొడవ వినిపించింది.
    
    విమల గొంతుకకూడా వినిపిస్తోంది. ఏం జరిగిందో తెలీక దడదడలాడే గుండెతో గాబరాగా వెళ్ళింది నంద.  

 

    "అమ్మాయి నువ్వు చిన్నపిల్లవి నీకు తెలియదు."    

 

    "ఏం చిన్నపిల్లనయితే?" రెట్టిస్తోంది విమల.
    
    "విమలా!" మందలింపుగా పిలిచింది నంద.
    
    "నువ్వూ వచ్చావమ్మా! రా!" ఎద్దేవగా అంది ఇల్లు గలావిడ కామాక్షమ్మ.
    
    ఆవిడ నోరంటే ఆలిండియా రేడియో! ఆ సంగతి ఆ వీధి వీధికంతకూ తెలుసు! "అందులో వివిధభారతి!" అంటారు కసిగా.
    
    అందుకే నందకి భయం.
    
    "ఏం జరిగిందండీ!" మెల్లిగా వినయంగా అడిగింది.
    
    "నీ చెల్లాయినే అడుగమ్మా! నీళ్ళు కాస్త చూసి వాడుకోండి అంటే తప్పా?"
    
    "టాంక్ అప్పుడే ఖాళీ అయిందా?" చెల్లాయి వైపు తిరిగి అడిగింది."
    
    "బావి నీళ్ళకెందుకు వచ్చావు" అన్న ప్రశ్న వుంది అందులో.
    
    బావి నీరు ఎక్కువగా వాడితే తాడూ, గిలకా పాడవుతాయని కామాక్షమ్మ భయం. ఆమెగారికి అన్నీ అలాంటి ఆలోచనలే! ఎలా అద్దెకున్న వాళ్ళని అదుపులో వుంచాలా అని ఆలోచిస్తుంది! ఎప్పుడూ ఆరుకుటుంబాలున్న కాంపౌండ్ అది!
    
    "ఎక్కడే! మూడుబిందెలు వచ్చాయి మన వాటాకి.
    
    "అప్పుడే ఖాళీ అయింది" ఎవరు ముందొస్తే అన్ని బిందెలు ఎక్కువ పట్టుకుంటారాయె! ఈ బావికి పంపు వేయమంటే కరెంటు లేదట! పోనీలే యిక్కడే కదా యీ బావిలో చేద్దామంటే ఈవిడ కేకలు పెడుతూంది. స్నానాలకి, ఇంటిపనులకి ఎలా?" సంజాయిషీ యిచ్చుకుంది విమల.
    
    "అలా అంటే ఎలాగమ్మా! ఏటికి వెళ్ళిరండి!" అందామె.
    
    "పిన్నిగారూ!" పిలిచింది నంద శాంతంగా. "వేసవి రాకముందే మీరిలా నీళ్ళకి ఇబ్బంది పెడితే ఎలా? మాకు చాలినన్ని నీళ్ళు కూడా పట్టుకోనివ్వకపోతే ఎలా?" అడిగింది అర్దింపుగా.
    
    "ఎవరొద్డాన్నారమ్మా! టాంక్ నిండా ఉన్నప్పుడు పట్టుకో."
    
    "టాంక్ ఖాళీ అయిపోయిందిగా?" అంది విమల.
    
    "ముందుగాలేచి పట్టుకోవాలి. లేదా రాత్రే పట్టిపెట్టుకోవాలి."
    
    "రాత్రి కూడా ఖాళీయే! నేను నాల్గింటికే టాప్ తిప్పినా నీరు రాలేదు!" అంది నంద.
    
    "ఈ రోజు రాత్రి ట్యాంక్ నింపలేదు. మా అబ్బాయి మరిచిపోయాడు!"
    
    "మరి ఎలా చెప్పండి?" విమల నిలేసింది.
    
    "ఏంటమ్మాయ్ నీ దబాయింపు? గవర్నరు గారి పెద్ద కూతురిలా వాదిస్తావేం? అయినా ఎప్పుడూ ఏమిటీ గొడవ మాకు? అంతగా నీకు నచ్చకపోయినట్లయితే ఇల్లు ఖాళీ చేసేయ్యండి!" ఆల్టిమేటమ్ జారీ చేసింది.
    
    నంద టక్కున నోర్మూసుకుంది. ఈ వూళ్ళో ఇళ్ళు ఖాళీ చేయటమన్నా, మరో ఇల్లు వెదుక్కోవటమన్నా ఎంతకష్టమో ఆవిడకి బాగా అనుభవం అద్దె ఎలా వున్నా బాడుగకి ఇల్లు దొరకడం గగనం! ఇల్లు ఖాళీ చేస్తే బాడుగ మరో ఇరవయ్యేనా పెరుగుతుంది.
    
    ఇన్ని అనుభవాలతో నంద మరింకేం అన్లేదు.
    
    జయించిన గర్వంతో "ఈ పూటకి నీళ్ళు తోడుతోంది!" అనేసి కామాక్షమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అదేదో పెద్దవరం అనుగ్రహించినట్టుగా వుందామె ధోరణి.
    
    నిట్టూర్చింది నంద! తమ కర్మకి నిందించుకుంది.
    
    "వెధవ బుద్దులు!" సణిగింది విమల.
    
    "విమలా!" మందలింపుగా పిలిచింది నంద.
    
    ఇల్లు కట్టుకోవడం అంటే ఈ రోజుల్లో డబ్బుని బ్యాంక్ లో వేసుకోవడమే! పూర్వకాలంలో అయితే ఫూల్స్ ఇల్లు కడితే బుద్దిమంతులు అద్దెకుండేవారని సామెత! కానీ ఇప్పుడది మారిపోయింది బుద్దిమంతులు ఇళ్ళు కట్టుకుంటే ఫూల్స్ అద్దెకుంటున్నారనుకోవాలి! అంతే!"
    
    "మనం వూరికే వుంటున్నామా! అద్దె ఇవ్వటం లేదూ?' కస్సుమన్నట్టుగా అంది విమల.
    
    "ఈ కాంపౌండులో మనమే కాదు. ఇంకా అయిదు కుటుంబాలు వున్నాయి!" శాంతంగా అంది నంద.
    
    "అందరూ తిరగబడితే సరి!" అదే పరిష్కారమన్నట్టుగా అంది.  

 

    "ఖాళీ చేయిస్తారు! మరో కుటుంబం చేరుతుంది. ఆరిళ్ళమీదా మరో వంద అద్దె ఎక్కువ వస్తుంది!" అనేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది నంద.
    
    విమల నీళ్ళు చేది పోసింది తననీ, ఇంటావిడనీ కలిపి తిట్టుకుంటూ ఆ అమ్మాయికి కామాక్షమ్మ అంటే బొత్తిగా గిట్టదు.
    
    హాల్లో శశి ఫిజిక్స్ గట్టిగా చదువుతున్నాడు. నీళ్ళు తోడి వచ్చిన విమల బాతురూంలో వంట పాత్రలు శుభ్రం చేస్తూంది.
    
    "ఎందుకురా అంతగట్టిగా చదువుతున్నావు?"
    
    "చెల్లాయి కోసం!"
    
    "అదేమిటి?"
    
    "అది పనిచేస్తుంది కదా! చదువుకుందుకి వీల్లేదు. ఈ రోజు మాకు క్లాసులో టెస్టు వుంది" అన్నాడు శశికాంత్.
    
    "అరరే!" నొచ్చుకుంది నంద! జరిగిందానికి విచారిస్తున్నట్టుగా తప్పును సరిచేసుకోనున్నత్తుగా "అలా అయితే చదువుకోమను శశీ! ఈ ఇంటి పనులకేం ఎప్పుడూ వుండేవే!" అంది.
    
    "మరేం ఫర్లేదులేవే! రివిజన్ అందుకే కాస్త గట్టిగా చదవమన్నాను!" అంది విమల నవ్వుతూ.
    
    నంద ఇంకేం అన్లేదు. ఈ రోజు నిద్దర్లేచిందగ్గర్నుంచీ ఆమెకి తమ పూర్వపురోజులు గుర్తుకు వస్తూనే వున్నాయి తను చదువుకునే రోజుల్లో ఇలా ఉండేదా అనుకుంది!
    
    సరిగ్గా అప్పుడే వార్తలు ముగిశాయి.
    
    స్టౌమీదా, కుంపటిమీద గిన్నెలు పెట్టేసింది. బియ్యం కడిగి మరో కుంపటిమీద పెట్టింది. మిగిలిన కూరగాయలు తరుగుతూ కూర్చుంది.
    
    "వంకాయల్లో అన్నీ పుచ్చులే! చ! చ! తమ పెరట్లో కాసే వంకాయలు ఎంత లేతగా వుండేవి. నవ నవలాడుతూ కనువిందు చేసేవి! నాన్నగారికి లేత వంకాయ నిప్పుల్లో కాలేసి, మిరప్పొడి నెయ్యి, ఉప్పుతో మెదిపిపెడితే భోజనం అంతా దానితోనే ముగించేట్టుగా తినేవాడు-ప్చ్! మళ్ళీ ఆ రోజులు రావు! గతం తలచి వగచాల్సిందే! ఎవరుకొన్నారే వంకాయలు?" ప్రతిదాన్లోనూ పుచ్చు తీసెయ్యలేక విసుగ్గా అడిగింది చెల్లెల్ని.

 Previous Page Next Page