Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 11


    
    "లే...దు" అతను నిలువునా నీరయినట్లుగా వణుకుతూ చెప్పాడు.
    
    "ఆ అయిదు నిముషాల్లో ఎవరయినా ఇంట్లో ఏ అడ్డూ ఆపూలేకుండా ప్రవేశించవచ్చు కదా?" అంతే శాంతంగా అడిగాడు ఆయన.
    
    "అవును" అన్నట్లు తలూపాడు వాచ్ మెన్.
    
    ధృతి సోఫా అంచుకి జరిగి కూర్చుని గుప్పెళ్ళు బిగబట్టింది. ఆమెకు ఊపిరాడనట్టుగా అనిపిస్తోందా ప్రదేశంలో.
    
    "నీ అశ్రద్దకి ఫలితంగా నిన్ను ఈ పూట నుండే ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. రావలసిన జీతం ఆఫీసుకొచ్చి తీసుకో" అంటూ ఆయన ధృతివైపు చూసి "మీ నాన్నగార్ని తీసుకుని అవుట్ హౌస్ కి వెళ్ళు" అన్నాడు.
    
    వాచ్ మెన్ అమాంతం ఆయన కాళ్ళదగ్గర కూలబడుతూ "ఈ ఒక్కసారికి క్షమించండి సార్..... పిల్లలు కలవాడిని...." అంటూ ఏవో చెప్పబోయాడు.
    
    ఆయన చిరాగ్గా నుదురు చిట్లించి "సుబ్బరాజూ! అవుట్ హౌస్ తాళాలు తీసుకెళ్ళి ఈ అమ్మాయిని దింపిరా" అని లోపలికి వెళ్ళిపోయాడు.
    
    వాచ్ మెన్ లేచి కళ్ళు తుడుచుకున్నాడు.
    
    సుబ్బరాజు తాళాలు తీసుకొచ్చి "పదండి" అన్నాడామెతో.
    
    ఆమెకి వెళుతున్న వాచ్ మెన్ ని చూస్తుంటే మనసంతా కలచివేసినట్లయింది. 'అతని దృష్టిలో అతను చేసింది చాలా చిన్న పొరపాటు. ఆయన కోణంనుండి చూస్తే ఆ పొరపాటువల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ముల్లు వుందని తెలిస్తే చెట్టుని నరికేసే మనిషిలా వున్నాడు' అనుకుంది.
    
    ధృతిని చూస్తూనే పెట్టెతో ఎదురొచ్చాడు సీతారామయ్య "మీ ఆఫీసర్గారు ఎక్కడున్నారూ?" అని అడిగాడు.
    
    తండ్రి చేతిలోంచి పెట్టె అందుకుంటూ "బిజీగా వున్నారు" అంది తన భావాలు కన్పించనీకుండా.
    
    అవుట్ హౌస్ చాలా ముచ్చటగా వుంది. చిన్నవి రెండు గదులూ, వంటిళ్ళుతో వున్న పోర్షన్ అది. ఎంతో శుభ్రంగా కర్టెన్లతోసహా అమర్చి వున్నాయి. వాడకంలో లేనిదానిలా లేదు. ధృతీవాళ్ళు ప్రస్తుతం వుండే ఇల్లుకంటే పెద్దదే! ఆమె తనతోబాటు తెచ్చిన బుట్టలోంచి సీసాలూ, డబ్బాలూ, స్టౌలాంటివి తీసి వంటింటిలో సర్దుకోసాగింది.
        
    ఈలోగా సీతారామయ్య సుబ్బరాజుని నానావిధమైన ప్రశ్నలూ వేస్తున్నాడు.
    
    "అయ్యగారికి భార్యా పిల్లలూ వున్నారా?"
    
    "లేరండి."
    
    "అదేం? పెళ్ళి కాలేదా?"
    
    "ఒక్కరే వుంటారండి" అన్నాడతను అందుకు సమాధానంగా.
    
    "అమ్మాయిని వదిలి ఎప్పుడూ వుండలేదు. అందుకే నాకు భయం"
    
    "మీకా భయం అక్కర్లేదండి- అమ్మాయిగారికి ఇక్కడేమీ భయం లేదు."
    
    "ఆ....అమ్మాయి చెప్పిందిలే ఆయన చాలా పెద్దమనిషి నీకంటే కూడా వయసులో పెద్దేమోలే నాన్నా అంటేనే వప్పుకున్నాననుకో."
    
    తండ్రి ఇంకా ఏమేమో మాట్లాడేస్తాడేమోనని ఆమెకి భయం వేసింది. "నాన్నా! మీకు ఆలస్యమవుతుందేమో" అనేసింది.
    
    "నా మొహం! నాకేం పనులున్నాయనీ" అన్నాడాయన చాప మీద మఠం వేసుకుని కూర్చుని.
    
    "అది కాదు....అమ్మావాళ్ళు ఆత్రంగా ఎదురుచూస్తుంటారనీ...."
    
    కూతురి భావం అర్ధమైందతనికి. ఒక్క ఆదివారం తప్ప కుటుంబ సభ్యులెవరినీ ఆమె ఒట్టిరోజుల్లో కలుసుకోకూడదని ఆఫీసర్ గారు కండిషన్ పెట్టారు అని ఆమె ముందే చెప్పింది.
    
    "సరే నే వస్తా" అంటూ ఆయన లేచి, ధృతికి పదేపదే జాగ్రత్తలు చెప్పి, సుబ్బరాజుని కనిపెట్టి వుండమనిచెప్పి బయల్దేరాడు.
    
    సుబ్బరాజు గేటుతాళం తీసి ఆయన్ని పంపించి, తను బంగళాలోకి వెళ్ళిపోయాడు.
    
    ధృతి దేవుడి పటానికి పూలదండ వేసి, దీపం పెట్టి స్టౌ మీద పాలు పొంగించింది. ఆ పూటకి భోజనం ఇంటినుండే తెచ్చుకుంది.
    
    పది గంటలవుతుండగా కారు హారన్ వినిపించి బయటకు వచ్చి చూసింది.
    
    సుబ్బరాజు గేటు తెరుస్తున్నాడు. ధర్మానందరావు కిటికీ అద్దం దింపి ధృతివైపు చూసి ఏదో చెప్పడం కనిపించింది.
    
    'బహుశా నన్ను కూడా ఆఫీసుకి రమ్మంటారేమో! ఇద్దరం వెళ్ళేది ఒక్క చోటుకే కదా!' అనుకుని గబగబా లోపలికి వెళ్ళి టిఫిన్ బాక్సూ, తాళంకప్పా తీసుకుని బయటకు వచ్చింది. ఆమె వచ్చేసరికే కారు వెళ్ళిపోతూ కనిపించింది.
    
    సుబ్బరాజు ధృతి దగ్గరకు వచ్చి "మొదటిరోజు కదా! మీకు బస్ స్టాండ్ చూపించి రమ్మన్నారు పదండమ్మా" అన్నాడు.
    
    ధృతికి తన అమాయకత్వానికి తనకే నవ్వొచ్చింది. 'ఐదు నిమిషాల్లో పని సక్రమంగా నిర్వర్తించలేదనే ఉద్యోగంలోంచి తీసేసే మనిషి తనని కార్లో ఆఫీసుకు తీసుకువెళతాడని' ఎలా అనుకోగలిగింది? నవీన్ అందుకే 'నీకు ఎక్స్ పోజర్ లేదు' అంటుంటాడు. ధర్మానందరావు గురించే ఆలోచిస్తూ సుబ్బరాజుతో బస్టాండ్ వైపు అడుగులు వేసింది ధృతి.
    
                                                              * * *
    
    మొదటిరోజు ఆఫీసులో పెద్ద పనేమీ చేసినట్లనిపించలేదు ధృతికి. కంగారులేకుండా చక్కగా టైప్ చేసింది. ఆయన మధ్యాహ్నం బయటికి వెళుతూ ఏవైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే తెలియజెయ్యమని నెంబర్ ఇచ్చి వెళ్ళారు.
    
    మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసి తల్లి యిచ్చిన చపాతీ తినబోతుండగా, ఒక వ్యక్తి హడావుడిగా ఎవరో తరుముకొస్తున్నట్లుగా ధృతి దగ్గరకొచ్చాడు. అతని బట్టలు బాగా నలిగిపోయి, మొహం చాలా అలసటగా వుంది. వయసు యాభై పైనే వుండచ్చు.
    
    "అమ్మా! మా అమ్మాయి ఈ ఆఫీసులోనే పనిచేస్తుంది. పేరు లీల. అదీరోజు ఆఫీసుకి రాలేదు...." అంటూ ఆగి ఓసారి చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకున్నాడు. "మా ఆవిడ కేన్సర్ పేషంట్. ఇక్కడే రేడియం ట్రీట్ యిప్పిస్తున్నాను. ప్రతిరోజూ వంద రూపాయలు ఇస్తారు. ఈ రోజు జేబుకి చిల్లుందన్న సంగతి చూసుకోలేదు. పర్సు ఎక్కడో జారిపోయింది. మా అమ్మాయి ఆఫీసుకి రాలేదు అని తెలిసినా, ఎవరో ఒకరు ఆదుకోకపోతారా అన్న ఆశతో వచ్చాను. ఓ రెండు వందలు అప్పిస్తే....రేపు అమ్మాయిద్వారా తీర్చేస్తాను" అంటూ మళ్ళీ కళ్ళు తుడుచుకున్నాడు.
    
    ధృతికి వెంటనే తండ్రి గుర్తుకు వచ్చాడు. పర్సులో వంద రూపాయలున్నాయి ఇంకా నెల గడవాలి. అయినా ఆలోచించలేదు. "వంద అయితే ఇవ్వగలనండి" అంటూ తీసి యిచ్చేసింది.

 Previous Page Next Page