సుబ్బారాయుడు ఆదమరిచి నిద్రపోతున్న పిల్లల్ని సవరించి ఓ పక్కగా పడుకొన్నాడు.
ఆరు బయట భూదేవి నడుముకి కొంగు దోపి అరుగుల్ని వెన్నెలతో కడుగుతున్నట్లుగా ఉంది. గోరింటాకు పెట్టుకున్న కన్నెపిల్ల అరచేయిలా వుంది. మధ్యలో చంద్రుడూ, చుట్టూ చుక్కలూ ఉన్న ఆకాశం.
పార్వతి ఏం చేస్తుందో అనుకున్నాడు సుబ్బారాయుడు.
తామిద్దరే ఆ ఊరి టాకీసులో సినిమాకి వెళ్ళటం కుదరదు. సూరమ్మనీ, వాతల తాతయ్యనీ, శాంతనీ అందరినీ బయలుదేరదీస్తుంది పార్వతి.
ఒట్టి పిచ్చిది! ఓ ముద్దూ ముచ్చటా తెలియదు ఏ రాత్రి వేళయినా మనసేసి కబుర్లాడుకుందాం లెమ్మంటే 'రాములవారి గుడిలో హరికథ పెట్టించండనో .... పంపించండనో ...' చెప్పుకొస్తుంది. ఆమె కెంతసేపూ ఇతరుల గురించే ధ్యాస!
సుబ్బారాయుడికి సీతమ్మగారింట్లో శోభనం మంచం అలంకరిస్తున్న పెళ్ళాం కళ్ళముందు మెదిలినట్లయింది. ఇప్పుడు ఆరిందాలా కబుర్లు చెపుతూ వుండి వుంటుంది. ఆరోజు నన్నెంతగా ఏడిపించిందనీ? అనుకున్నాడు. అలాగే పార్వతి తాలూకు ఆలోచనలతో నిద్రలోకి జారిపోయాడు.
పార్వతమ్మ ఇల్లు చేరేటప్పటికే సగం రాత్రి కరిగిపోయింది. పడక గదిలో పట్టెమంచం మీద పిలల్లల నడుమ గుర్రుపెట్టి నిద్రపోతున్న పతిదేవుడ్ని చూసి మురిపెంగా నవ్వుకుని ఆయనకి నిద్రాభంగం కలుగకుండా కింద చాప వాల్చుకుని తేల్చుకోవాలనుకున్న సంగతి. అసలెందుకు ఏ సంబంధం చెప్పినా భర్త వద్దంటున్నాడూ? అని కాసేపు ఆలోచించింది. పగలల్లా చాకిరీ చేసి చేసి అలసిపోయి ఉండటం మూలానా వెంటనే నిద్రపట్టేసింది.
అర్దరాత్రి వీపుకింద తడిగా అనిపించి కళ్ళు తెరిచిన సుబ్బారాయుడుకి అది చంటాడి నిర్వాకం అని తెలిసింది.
"ఒరే ... పడుకునే ముందు పోసుకు రాకూడదూ!" అని విసుక్కుంటూ లేచి కూర్చుని కింద పడుకున్న భార్యని చూశాడు.
అతనికి వెంటనే తను పార్వతికి కేశవుడి కొడుకు వస్తున్నాడన్న విషయం చెప్పలేదని గుర్తొచ్చింది. లేపి చెప్దామా అనుకున్నాడు. కానీ అలా నిద్రపోతున్న ఆమె మొహం చూడగానే నిద్ర లేపాలనిపించక అప్రయత్నం విరమించుకుని తనూ ఆమె పక్కగా కింద మరో చాప వాల్చుకుని నిద్రకుపక్రమించాడు.
* * *
"ఇదుగో, పెద్దనాన్నా! నేను ఎక్కువసేపుండను ..... ఐదంటే ఐదే నిముషాలుంటాను..... ఆఁ!" మాధవ్ తల దువ్వుకుంటూ సీతారామయ్యతో చెప్పాడు.
"అలాగేరా! ముందు నడు! మా కేశవుడి కొడుకు అని .... గర్వంగా చూపించుకోవద్దంటావేం?" అన్నాడు ముఖాన తిరుచూర్ణంతో నామం పెట్టుకుంటూ సీతారామయ్య.
మాధవ్ కి రాత్రి రచ్చబండ దగ్గర జరిగిన సమావేశం, ఉత్తరం గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది.
"ఇక్కడి మనుషులు భలే కామెడీగా బిహేవ్ చేస్తున్నారు పెద్దనాన్నా!" అన్నాడు.
"సుబ్బారాయుడిదీ, మీ నాన్నదీ అలాంటి ఇలాంటి స్నేహం కాదురా అబ్బాయ్. నిన్ను చూస్తే మీ నాన్ననే చూసినంత సంతోషిస్తాడనుకో....ఎక్కువసేపు నువ్వు ఉంటానన్నా నేను ఉండనీయను! ఎవరి కళ్ళు ఎలాంటివో...? పద!" అన్నాడు.
ఇద్దరూ బయటకొచ్చి మట్టిదారిన నడవసాగారు.
"ఐదు నిముషాలవగానే, నేను చెప్పను నువ్వే నీ అంతట నువ్వు బయలుదేరిపోవాలి! తెలిసిందా?" అన్నాడు మాధవ్.
"అలాగేరా!" అన్నాడు సీతారామయ్య.
పాతకాలపు మండువా లోగిలిలోకి అడుగు పెడుతుండగానే మువ్వల మోతతో గోమాత 'అంబా ...!' అన్న పిలుపు ఆప్యాయంగా వినవచ్చింది.
సీతారామయ్య మొదటగా దాని దగ్గరికి వెళ్ళి వెన్ను నిమిరి, పొదుగుని ముట్టెతో పొడుస్తూ పాలు తాగుతున్న తువ్వాయిని "ఓసినీ ... అప్పుడే ఎంత దానివయ్యావే!" అని ముద్దుచేశాడు.
ఛెంగు ఛెంగున ఎగురుతున్న తెల్లని దూడని చూస్తే మాధవ్ కి ముద్దొచ్చింది. దగ్గరికి వెళ్ళగానే మెడలో గంట మోగిస్తూ ఛెంగున పైకి దూకింది! అదిరిపడి రెండడుగులు వెనక్కి వేశాడు.
కుడితిలో కూరముక్కలు వెయ్యడానికొచ్చిన రాధ అనుకోకుండా అతను వెనక్కి అడుగులు వేయడంతో జారిపడిపోతున్నాడేమోనని గట్టిగా అతని జబ్బ పట్టుకుని ఆపింది.
మాధవ్ "థాంక్స్ అండీ!" అంటూ వెనక్కి తిరిగి షాక్ కొట్టినట్లుగా ఆమెనే చూస్తుండిపోయాడు.
తలంటుకున్న కురులు గాలికి ఎగురుతుండగా తెల్లని పరికిణీ మీద ఎర్రని ఓణీ వేసుకుని అప్పుడే పూసిన దానిమ్మ పువ్వులా ముగ్ధమనోహరంగా ఉంది రాధ.
అతను ఆమెపట్టుకున్న తన జబ్బవైపు చూసుకున్నాడు. ఆమె వెంటనే సిగ్గుపడి వదిలి పెట్టేసింది.
"పసిది...దాన్ని చూసి భయపడ్డావేమిటిరా, ఇంజనీరూ?" నవ్వుతూ అన్నాడు సీతారామయ్య.
"చాలా ముద్దొస్తోంది పెద్దనాన్నా!" రాధనే చూస్తూ అన్నాడు.
"ఔను.... తెల్లగా బొద్దుగా..." అన్నాడు సీతారామయ్య.
"ఆ ఎర్రని పెదవులూ....కలువల్లాంటి కళ్ళూ.....శంఖంలాంటి మెడా.....!"
రాధకి అర్ధమైంది తననే వర్ణిస్తున్నాడని మొహం అంతా మంకెన పువ్వంత ఎర్రన చేసుకుని తల వంచుకుంది.
"నీకు అంత నచ్చిందేమిట్రా?" తువ్వాయిని ముద్దుచేస్తూ అడిగాడు సీతారామయ్య.
"ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది!" అన్నాడు కొంటెగా మాధవ్.
రాధ అదిరిపడి కళ్ళు పెద్దవిచేసి చూసింది.
"అనిపిస్తే పెట్టుకోరా .... నీకు అడ్డేమిటీ?" ముసలాయన మురిపెంగా అన్నాడు.
"పెట్టుకున్నాక ఏఁవీ అనుకోకూడదు మరి....!" మాధవ్ ఆమె వైపు అడుగులేస్తూ అన్నాడు.
రాధ బెదురుగా చూసింది.
"అబ్బా.... పెట్టుకోరా! ఎవరూ ఏమీ అనరు!" అంటూ సీతారామయ్య తలపైకెత్తాడు.
"ఈ అమ్మాయి కూడా ఏమీ అనకూడదు మరీ!" అల్లరిగా అన్నాడు మాధవ్.
అతను అంత దగ్గరగా నిలబడి ఆ మాట అనగానే రాధ గుండెలు అదిరాయి. ఏ నిమిషానికైనా తనని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టేస్తాడన్నంత భయంవేసి వెనక్కి జరిగింది.