Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 13


    సీతారామయ్య తలెత్తి రాధని చూసి, "అదేమంటుందీ మధ్యలో? ఇంద... దగ్గరికి రా" అన్నాడు.
    
    "పేరేమిటి?" మాధవ్ రాధని కాలి వేలినుండి పైదాకా ఆవగింజంత భాగం కూడా వదలకుండా పరీక్షిస్తూ అడిగాడు.
    
    "దూడకేం పేరు పెట్టారే" అడిగాడు సీతారామయ్య.
    
    "కావేరి!" చెప్పింది రాధ.
    
    మాధవ్ ముసలాయనవైపు కోపంగా చూస్తూ, "దూడ పేరు కాదు!" అన్నాడు.
    
    సీతారామయ్య అప్పుడు గమనించాడు మాధవుడి కళ్ళలోని మెరుపుని, "నువ్వు లోపలికి వెళ్ళవే" అని రాధని లోపలికి పంపించి, "సీతారామయ్య.....తెలియదా?" అన్నాడు.
    
    "నీ పేరు కాదు!" విసుక్కున్నాడు మాధవ్.
    
    సీతారామయ్య ముసిముసిగా నవ్వుకుంటూ, "పద .... పద .... ఐదు నిముషాలవగానే వెళ్ళిపోవాలన్నావ్!" అన్నాడు.
    
    రాధ లోపలికి వెళ్ళి చెప్పినట్లుంది. సుబ్బారాయుడూ, ప్రకాశం, సన్యాసిరావూ ఎదురొచ్చారు.
    
    "రా, బావా, రా! అని, "ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్లుంది!" అన్నాడు గుర్తు తెచ్చుకోటానికి ప్రయత్నిస్తూ సుబ్బారాయుడు.
    
    "రాత్రి రచ్చబండదగ్గర కలిశామండీ మీరేమో ఉత్తరం హడావుడిలో ఉండి నన్ను పట్టించుకోలేదు!" నవ్వుతూ అన్నాడు మాధవ్.
    
    సన్యాసిరావు తిప్పుకుంటూ, "బురద పూసుకొచ్చిన ఆ అబ్బాయే ఈ అబ్బాయి బావా" అన్నాడు.
    
    మాధవ్ ని కళ్ళ విప్పార్చిచూస్తూ, "సినిమా హీరోలా ఉన్నాడు .... ఎవరు బావా ఈ కుర్రాడు?" అడిగాడు ప్రకాశం.
    
    "బాగా చూసి నువ్వే చెప్పు....! గర్వంగా అని, "ఆ ఠీవీ... అందం... అన్నీ నా పోలికలే కదూ! మా కేశవుడి కొడుకు" అన్నాడు సీతారామయ్య.
    
    ఆ మాట వినగానే సుబ్బారాయుడు "ఓరి .... ఓరి ... ఓరి...!" అంటూ అమాంతం వచ్చి మాధవ్ ని నడుందగ్గర పట్టుకుని పైకెత్తేశాడు.
    
    అనుకోని ఈ సంఘటనకి మాధవ్ ఆశ్చర్యపోయి, "పెద్దనాన్నా!" అన్నాడు.
    
    "ఒరే ... చిన్నప్పుడు ఎత్తుకున్నట్లుగా ఇప్పుడు కూడా ఎత్తుకుంటే బాగుండదురా! వాడిప్పుడు పెద్ద ఇంజనీర్" అన్నాడు సీతారామయ్య.
    
    "ఇంజనీర్ అయితే మాత్రం మా కేశవుడి కొడుకు కాదా?" ముచ్చటగా చూసుకుంటూ అన్నాడు సుబ్బారాయుడు.
    
    మాధవ్ కి ఎక్కడో జలజలమని పారిజాతాలు జాల్వారినట్లు అనిపించి తల తిప్పి చూశాడు.
    
    రాధ తలుపు చాటునుండి తొంగిచూసి నవ్వుతోంది.
    
    కార్తీక పౌర్ణమినాడు అతివలు కోనేట్లో వదిలిన దివ్వెలన్నీ ఆమె చిరునవ్వులై ముంగిట్లో వాలినట్లుగా అనిపించింది.
    
    "పార్వతీ... పార్వతీ.... ఇలారా! ఎవరొచ్చారో చూడూ....అక్కా అక్కా..." అన్న సుబ్బారాయుడు కేకలకి అందరూ చేస్తున్న పనులు వదలి పరిగెత్తుకొచ్చారు.
    
    "లేడీస్ వస్తున్నారు, బాగోదు! ఇక దింపండి" బతిమాలుకున్నాడు మాధవ్.
    
    సుబ్బారాయుడు కిందికి దింపుతూ, "భలేవాడివే.... ఈ కాస్త దానికే ఇలా అంటావేం?" ఎత్తుకుని ఊరంతా తిప్ప చూపించాలని ఉంది" అన్నాడు.
    
    పార్వతమ్మ దగ్గరకొచ్చి "ఎవరండీ ఈ అబ్బాయి?" అంది.
    
    నుదుట రూపాయికాసంత బొట్టుతో, నేతచీరలో, ఆంధ్రదేశం అందమంతా ముక్కున మెరిసే నత్తులో దాచుకుని అడుగుతున్న ఆవిడ్ని చూడగానే మాధవ్ కి కాళ్ళకి నమస్కరించాలనిపించింది.
    
    "మా కేశవుడి కొడుకు అమెరికాలో ఇంజనీర్ చదివి వచ్చాడు" అన్నాడు సీతారామయ్య.
    
    "ఇదుగో పెద్దాయనా.... మధ్యలో నువ్వెందుకు గొంతు చించుకుంటావు? నేనున్నానుగా చెప్పడానికి!" విసుగ్గా చూస్తూ అన్నాడు సుబ్బారాయుడు.
    
    "అంతంత పెద్ద చదువులు చదివాడా?" పార్వతమ్మ కొంగు భుజం మీద నుండి తీసుకుని రెండడుగులు వెనక్కు వేస్తూ గౌరవంగా చూసింది.
    
    సూరమ్మ ముందుకు వచ్చి, మాధవ్ తలచుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచి, "మా బాబే.... నిన్ను చూస్తూంటే మీ నాన్నని చూసినట్లే వుంది. ఉండు, దిష్టి తీయిస్తాను!" "శాంతా...! శాంతా!" అని పిలిచింది.
    
    "ఎవర్రా వచ్చిందీ?" మంచంలో నుండి తాయారమ్మ పిలిచింది.
    
    "మా అమ్మగారు?" అన్నాడు సుబ్బారాయుడు.
    
    మాధవ్ అరుగెక్కి ఆవిడ కాళ్ళకి నమస్కరించాడు.
    
    "స్వయంవరానికొచ్చిన రాముడిలా ఉన్నాడు ఎవర్రా కుర్రాడు" అడిగిందావిడ.
    
    "మన...." అని ఆపేసి సీతారామయ్య సుబ్బారాయుడి వైపు చూశాడు.
    
    సుబ్బారాయుడు మీసాలు తిప్పుతూ, "మన కేశవుడి కొడుకే!" అన్నాడు.
    
    దాంతో ఆవిడ ఉత్సాహంగా మాధవ్ చెంపలు నిమిరి "అచ్చు వాడిని చూసినట్లే ఉంది! మీ అమ్మా, నాన్నా బాగున్నారా? వాళ్ళు రాలేదే?" అని కుశల ప్రశ్నలు వేసింది.
    
    జవాబులిస్తూనే రాధకోసం అతని కళ్ళు ఇల్లంతా తిరిగొస్తున్నాయి.
    
    గణపతి లోపల నుండి బయటకు రాగానే, మాధవ్ "హలో యంగ్ మేన్! హౌ ఆర్ యు?" అని చెయ్యి జాపాడు.
    
    అతని చెయ్యి అందుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు గణపతి.
    
    "ఐ థింక్ యు ఆర్ ఫైన్.... అంటే అపరాధ రుసుం కట్టాలి!" అని నవ్వాడు.
    
    గణపతి మొహం ఎర్రబడింది అతనెవరో తెలుసుకున్నాక, అదింకా ఎర్రబడి తల వంచుకున్నాడు.
    
    "బోఫార్స్ కేసులో నిందితులు తేలిపోయారు...." అన్నాడు పేపర్ తో బయటకు వచ్చిన తాతయ్య.
    
    "చాలా రోజులయిందిగా!" అన్నాడు మాధవ్.
    
    "అయ్యుండచ్చు.... కానీ ఈ పేపరు ఆయనచేతికి ఇవాళే అందింది!" అన్నాడు ప్రకాశం.
    
    దాంతో అందరూ నవ్వేశారు.
    
    మాధవ్ అమెరికా నుండి వచ్చిన విషయం తెలుసుకుని ముసలాయన ఉత్సాహంగా అక్కడి వార్తలు అడగసాగాడు.
    
    ఇంతలో శాంత వచ్చి, "అందరూ పక్కకి తప్పుకుని అబ్బాయికి వూపిరి సలపనీయండి!" అంటూ ఎర్రనీళ్ళు దిగదుడిచి పోసింది.
    
    ప్రమీల పిల్లాడ్ని ఎత్తుకుని వచ్చింది.
    
    "మా ఆఖరి చెల్లెలు ప్రమీల....ఈ చంటిగాడు వాళ్ళబ్బాయి!" అని పరిచయం చేశాడు ప్రకాశం.

 Previous Page Next Page