"చెప్పరా తల్లీ!"
అప్పుడూ ప్రమీల నోరు మెదపలేదు.
పార్వతమమ లోపల్నుండి వచ్చి "మీకోసం మీ చెల్లెలు కొబ్బరి లౌజు తెచ్చింది!" అంది.
"కొబ్బరికాయల వ్యాపారం కదా!" అన్నాడు.
మావయ్యది బంగారం కొట్టయితే ఎంతబాగుండేదో!" అని నవ్వింది రాధ.
పార్వతమ్మ భర్తతో "మీ బావగారి తమ్ముడు సారధి గుర్తున్నాడుగా! వ్యవసాయం చూసుకుంటున్నాడు. అతనికి మన అమ్మాయిని చేసుకుంటే సంబంధం దగ్గరౌతుందని తమ్ముడిగారి అభిప్రాయమట! అది చెప్పడానికే అది భయపడుతోంది!" అని ఆడబిడ్డ మనోరథం భర్త చెవిన వేసింది.
"ప్రమీలచేత కబురు పెట్టాడా ఈ విషయం? ఇంకా నయం ..... మీ చిన్నకొడుకు పేరేమిటమ్మా? శీనుగాడు .... వాడిచేత చెప్పించాడు కాదు!" అని భళ్ళున నవ్వి, "ఆడపిల్లవాళ్ళం మాకు లేని తొందర మీకెందుకమ్మా? 'ఇంకా అన్నయ్యకి రాధ పెళ్ళి ఆలోచన లేదుట' అని చెప్పు! అన్నాడు.
ప్రమీల తలెత్తి వదిన వంక 'మాట్లాడు' అన్నట్లు చూసింది.
పార్వతమ్మ అందుకుని "అబ్బాయి బావుంటాడు, ఆస్తిపరుడు మనకి దగ్గరవాడు అమ్మాయికి మేనత్త తోడుంటుంది...." అని చెప్పబోయింది.
"ఆకలేస్తోంది, ముందు వడ్డించు!" చెప్పాడు.
పార్వతమ్మ ఠక్కున లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
వంటింట్లో పీటలు వాలుస్తూ సూరమ్మ గొణిగింది. "ఇలా అందరితో పెళ్ళి చేసే ఉద్దేశం లేదు అని చెప్తుంటే, దాని పెళ్ళి ఎప్పుడు కావాలీ? వాడి వరస ఏమిటో నాకు అంతుపట్టడంలేదు. పెళ్లానివి .... నీకైనా తెలియద్దుటే?" అని పార్వతమ్మని నిలేసింది.
"ఆకలి మీదున్నారు, ముందు భోజనం చెయ్యనీయండి! కోపం వస్తే మీకు తెలుసుగా?" అంది పార్వతమ్మ.
దాంతో సూరమ్మ నోరు మూతపడింది.
ఆడవాళ్ళ భోజనాలు కూడా అయ్యాయి.
ఆరు బయట అరుగులనిండా వెన్నెల ఒలికి తెల్లగా మెరుస్తున్నాయి. చల్లని గాలి ఉండుండి కొబ్బరాకుల బూరలూదుతోంది. భుక్తాయాసం తీర్చుకుంటూ అరుగుమీద తల్లి దగ్గర కూర్చున్నారు అన్నదమ్ములు.
"పనసపొట్టు కూర మాత్రం ఆవపెట్టి మా వదినే వండాలి! ఆ వాసన రచ్చబండ దాకా వచ్చిందనుకో!" అన్నాడు విసనకర్రతో విసురుకుంటూ ప్రకాశం.
"ఆ మాట నిజం! అది కాపరానికి వచ్చాక మళ్ళీ ఎవరూ ఆ కూర దానిలా చెయ్యలేదు. అంత బాగా చేస్తుంది!" కోడలికి సర్టిఫికెట్ ఇచ్చేసింది తాయారమ్మ.
శాంత తమలపాకుల పళ్ళెం తీసుకొచ్చి వాళ్ళముందు పెట్టి వెళ్తుంటే, "ఏవిటీ కొత్తచీరకట్టి, పువ్వులు పెట్టి తయారయ్యావు?" గొంతు తగ్గించి అడిగాడు ప్రకాశం.
శాంత బావగారిముందు సిగ్గుపడింది.
"పేరంటానికెళ్తున్నాం అన్నీ చెప్పాలి మీకు!" అని ముచ్చటగా మూతి తిప్పింది.
ప్రమీల కూడా పట్టుచీర కట్టి, కొప్పు చుట్టి బయటకొచ్చింది. ఆ వెనకాలే పార్వతమ్మ వచ్చి మరచెంబుతో మంచినీళ్ళు అత్తగారి మంచం దగ్గర పెట్టి, "మేము సీతమ్మగారింటిదాకా వెళ్ళొస్తాం!" అంది.
"ఇంత రాత్రివేళ ఏం పేరంటం?" అడిగాడు సుబ్బారాయుడు.
తోడికోడళ్ళిద్దరూ మొహాలు చూసుకుని కిసుక్కున నవ్వుకున్నారు.
"సీతమ్మగారి ఆఖరిదానికి మొన్న మాఘంలో పెళ్లవలేదూ... దానికీవాళ శోభనం!" చెప్పేసింది తాయారమ్మ. పల్లెటూళ్ళలో ఇలాంటి విషయాలకి పెద్ద గుట్లూ, సిగ్గుపడటాలూ ఉండవు.
"అందుకా వీళ్ళు ఇలా తయారై వెళుతున్నారూ!" అన్నాడు సుబ్బారాయుడు.
"వాళ్ళని తొందరగా వదిలిపెట్టి రండి! లేకపోతే తిట్టుకుంటారు!" అన్నాడు ప్రకాశం.
"అబ్బా.... మాకు తెలుసులెండి!" విసుక్కుంది శాంత.
సుబ్బారాయుడికి తమ కార్యం నాటి రాత్రి జ్ఞాపకం వచ్చింది. ఇలాగే ఆ రోజూ వెన్నెల పుచ్చపువ్వులా కాస్తోంది. ఎన్నెన్ని మిఠాయిలు పెట్టారని! కష్టపడి మూడు గంటలు మెడ నీలుక్కుపోయేటట్లు కుట్టిన మల్లెపూల జడతో పార్వతి లోపలికి వచ్చింది. చాలా చిన్నపిల్ల, ఆవలిస్తూ మంచం ఎక్కి పడుకుంది. తనేలేపి పాలగ్లాసు అందించాడు.
"పాలు తాగితే పిల్లలు పుడతారా?" అని అడిగింది.
అప్పటినుండి పార్వతికి పిల్లల ధ్యాసే.
తను నవ్వి, "పిల్లలు కావాలా?" అడిగాడు.
మెరుస్తున్న కళ్ళతో "ఊఁ" అంది.
"ఎలా పుడతారో తెలుసా?" అడిగాడు.
మెడలోని మంగళసూత్రం చూపించింది. "ఈ సంవత్సరం మంగళసూత్రం మెడలో పడితే వచ్చే ఏడాదికి పిల్లలు కడుపులో పడతారట! మా బామ్మ చెప్పింది!" అంది.
అలాంటి బామ్మల్ని షూట్ చెయ్యాలి అనుకున్నాడు.
"కాదు .... దగ్గరకు రా, నే చెప్తాను" అన్నాడు.
పార్వతి తన మాటలు వినలేదు. మూడు నెలలు అలాగే మూర్ఖంగా బామ్మమాటలే నిజమని నమ్మింది. మళ్ళీ మాఘానికి పెళ్ళయి వచ్చిన తోటి స్నేహితురాలు మాటలు విన్నాక అసలు సంగతి తెలుసుకుంది. అందాకా అతను ఆమెను తాకలేకపోయాడు. ఐదుగురు అప్పచెల్లెళ్ళూ, తమ్ముడూ, తల్లీ, మేనమామలు ఉన్న కొంపలో ఆమె గట్టిగా అరిచి ఏడ్చి యాగీచేస్తే పరువు పోతుందని భయపడి వూరుకున్నాడు.
చివరికి పార్వతే విషయం తెలుసుకుంది.
పాత సంగతులు నెమరువేసుకుని మీసాల మాటున గుంభనంగా నవ్వుకున్నాడు సుబ్బారాయుడు.
పార్వతి ఎర్రని అంచున్న తెల్లని ఉప్పాడ చీరలో రతీదేవిలా మెరిసిపోతోంది. పెద్ద కొప్పుచుట్టి, దాని చుట్టూ పూలు పెట్టింది. వాళ్ళు వెళ్ళాక కూడా ప్రదేశం అంతా మల్లెపూల వాసనతో ఘుమఘుమలాడిపోయింది. అతనికి పార్వతి త్వరగా వస్తే బావుండు ననిపించింది.
"నిద్రొస్తోంది!" అంటూ గదిలోకి నడిచాడు.
పాతకాలంనాటి పట్టెమంచం మీద నిలువునా అడ్డంగా పడి నిద్దరోతున్నారు చెల్లెలి పిల్లలూ, తమ్ముడి పిల్లలూ పార్వతికి శాంత చిన్నకొడుకు బాగా మాలిమి. వాడు పడుకుంటే ప్రమీల పిల్లలు పోటీకి వస్తారు. వాళ్ళున్నన్ని రోజులూ పార్వతి పిల్లల కోడిలా పడుకోక తప్పదు.