Previous Page Next Page 
నిశాగీతం పేజి 11


    ఉదయ్ చంద్ర వెడల్పుగా, బలంగా వున్నా అతడి వీపు చూస్తూ మెట్లెక్కసాగాడు. విశాలమైన  కొయ్యమెట్లు వీరభద్రుడు పాదాల  కింద కదిలిపోతున్నాయి.
    ఆ ప్రకంపనలు, ఉదయచంద్ర పాదాలను తాకి,  శరీరంలో  ప్రవేశించి, అతడి  మస్తిష్కంలో కలవరాన్ని  సృష్టిస్తున్నాయి.
    'నో వండర్ ఇలాంటి మనుషులున్నచోట....'
    "జాగ్రత్త బాబూ?"
    ఉదయ్  తృళ్ళిపడ్డాడు.
    మరో క్షణంలో  కోడిపిల్లను తనను కెళ్ళాడానికి సిద్దంగావున్న గద్దలా చూస్తూ "బాబుగారూ! అక్కడ ఆ మెట్టు   విరిగిపోయి  వుంది. చెక్క పేళ్ళుకొట్టి మోపుచేసి  వుంచాం. ఆ మెట్టు  మెల్లగా  ఎక్కండి" అన్నాడు .
    "ఉదయ్  రిలీఫ్ గా నిట్టూర్పు  విడిచాడు.
    నిడుటికి పట్టిన చెమట  తుడుచుకుంటూ  మెల్లమెల్లగా  మెట్లెక్కి పైఉకి వచ్చాడు ఉదయ్.
    కిందవున్న పెట్రమాక్సు వెలుగుమెట్లవరకే  కన్పిస్తుంది. పైన  అంతా  చీకటిగా  వుంది. ఆ చీకట్లో వీరభద్రుడు  ఎటు  పోయిందీ  కన్పించలేదు.
    ఆ కటిక  చీకట్లోనే చిన్నగా రెండడుగులు ముందుకు  వేశాడు డాక్టర్ ఉదయ్.
    "ఆగండి బాబూ. దీపం వెలిగించి  తెస్తాను."
    వీరభద్రుడి గొంతు  విన్పించినవైపు చూశాడు.
    ఆ చీకట్లో  రెండుకళ్ళు మెరిసినట్టు కన్పించాయి.
    ఆ కళ్ళెవారివి? మనిషికళ్ళు  ఇలా మెరుస్తాయా? అవి మనిషి  కళ్ళు కాకపోతే మరెవరి కళ్ళు?
    "ఛ! తనేమిటిలా ఆలోచిస్తున్నాడు?"
    ఆ కళ్ళు వీరభద్రుడివే.
    మరి అవి అలా ఎలా మెరిశాయి? వాడి కళ్ళు రేడియం  కళ్ళా ఏమిటి అలా మెరవడానికి? ఏమిటో అంతా అయోమయంగా వుంది. ఇలాంటి అనుభవం తనకెప్పుడూ కలగలేదు.
    ఆ మాటకొస్తే  ఇలాంటి ఊళ్ళో, ఇలాంటి కొంపలో ఎప్పుడూ అడుగు పెట్టలేదు.
    నో వండర్!
    ఇలాంటి ఇంట్లో, ఇలాంటి  మనుష్యులమధ్య వున్న మానసికి మతిపోయిందంటే, పోకేం  చేస్తుంది?
    మానసిని వెంటాడుతున్నది ఈ  దుర్మార్గుడేనేమో?
    ఆ ఆలోచన రాగానే, అంతవరకూ మనసును చుట్టేసిన మబ్బు విడిపోయినట్టుగా అన్పించింది.
    ష్యూర్. సందేహంలేదు. వాడే వీడు. శివరామయ్యతో మాట్లాడి ముందు వీడ్ని పనిలోనుంచి తీసేయించాలి. ఆ పని రేపే  జరగాలి.
    వీడు ఈ యిల్లు వదిలేసిన మరుక్షణమే మానసి ఆరోగ్యం కుదుట పడుతుంది.
    వాట్ ఏ పిటీ?
    ఇంతవరకూ శివరామయ్యకు వీడిమీద అనుమానం రాలేదా? ఇంతకూ  వాడు ఇక్కడేం చేస్తున్నట్టు? తను నౌకరు కాడట. శివరామయ్య మనిషట. అంటే ఏమిటంటే "ఆర్నే అడగండి" అన్నాడు.
    ఆ మాటకు అర్థం?
    అంటే వీడు ఈ ఇంట్లో  నౌకరుకాని నౌకరు.
    బంధువు కాని బంధువు.
    మనిషి కాని మనిషి.
    అబ్ నార్మల్  పర్సనాలిటీ.
    మనిషి గాని మనిషేమిటి? తను క్రేజీగా ఆలోచిస్తున్నాడేమో?
    శివరామయ్య మనిషినని చెప్పాడు. అంటే  శివరామయ్య వీడిచేతిలో కీలుబొమ్మా?
    శివరామయ్య బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా?
    యస్. యస్. మస్ట్ బి సో.
    ఉదయ్ సన్నగా ఈల వేశాడు.
    ఇప్పుడు తన బుర్ర  పదునుగా  పనిచేస్తోంది.
    ఆలోచిస్తున్నా ఉదయ్ చంద్ర ఒక్కసారిగా  బిగిసిపోయాడు. మళ్ళీ  ఈల వెయ్యబోయిన అతడి పెదవులు గుండ్రంగా  చుట్టినట్టు వుండి పోయాయి.
    రెండుకాళ్ళు  రెండు  మెట్లమీద ఉన్నాయి.
    అగ్ని గోళాల్లా మండిపోతున్న  ఆ కళ్ళు అతడ్ని చూస్తున్నాయి.
    ఉదయచంద్ర గుండెలు తడబడ్డాయి.
    అవి....అవి....ఆ కళ్ళు  వీరభద్రుడివేనా?
    నో!నో! అలా కావడానికి వీల్లేదు.
    వీరభద్రుడి ఎత్తు ఆరడుగులు వుండవచ్చును. కానీ ఆ కళ్ళు దాదాపు తొమ్మిదడుగుల ఎత్తునుంచి కన్పించాయి. అంటే ఆ కళ్ళు వాడికళ్ళు కావు. మొదటిసారి కన్పించినప్పుడు ఆ కళ్ళు ఎంతెత్తునుంచి కన్పించాయి? వీరభద్రుడి కళ్ళు. రెండోసారి కన్పించినవి వాడికళ్ళు కావు.
    మరి అవి ఎవరివి?
    అవి రెండుసార్లూ ఒకే రకంగా కన్పించాయి.
    అంటే వీరభద్రుడు వాటిని  వదిలేసి వెళ్ళాడా?
    ఇదే  మాలోచన? తనకు మతిపోతోందా?
    మళ్ళీ తలెత్తి చూశాడు. ఆ కళ్ళు అక్కడ లేవు. చుట్టూ కలయజుశాడు. ఏమీ కన్పించలేదు.
    ఇదంతా  నిజంకాదా? తన భ్రమా? అంతే అయివుండాలి. వీరభద్రుడి కళ్ళు  చూడగానే  తనకు అదోలా అన్పించింది. ఈ వాతావరణం, వాడి కళ్ళూ , తనకు తెలియకుండానే తనలో భయాలను కలిగించాయి. ఆ భయాలే తనకు భ్రమల కలిగిస్తున్నాయి. ఇది మనసుచేసే గారడీ. ఇది  మనసు మనిషికి తెలియకుండా చేసే మాయగారడీ !
    ఉదయచంద్ర తనలో తనే నవ్వుకున్నాడు.
    అడుగు తీసి అడుగువేస్తూ ఆగిపోయాడు.
    మళ్ళీ అవే కళ్ళు.
    మండే కళ్ళు.
    నిప్పు కణికల్లా కణకణలాడుతున్న కళ్ళు.
    క్రూరాతి క్రూరంగా భయంగొల్పే కళ్ళు.
    ఆ కళ్ళు చురకత్తిలా గుండెల్లోకి దూసుకుపోతున్నట్టున్నాయ్.
    ఉదయచంద్ర గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళయితే మూసుకోగలిగాడు....మరి మనసు సంగతీ? మనసు ఇంకా ఆ కళ్ళను చూస్తూనే వుంది.
    అవును! చూస్తూనే వుంది.
    లేదు. లేదు. ఏమీలేదు. ఇదంతా తన భ్రమే.
    అవును. ఇప్పుడు ఆ కళ్ళు కన్పించడంలేదు. తన మనసు తన అధీనంలోనే వుంది. ఇప్పుడు తనకేమీ కన్పించడంలేదు.
    "బాబుగారూ!"
    ఉలిక్కిపడ్డాడు ఉదయ్.
    "కళ్ళు మూసుకుని చూస్తున్నారేవిటి బాబూ?"
    ఎదురుగా  వీరభద్రుడు లాంతరు పట్టుకుని నిలబడి వున్నాడు.
    కళ్ళు మూసుకొని చూడటం ఏమిటి? భలేప్రశ్న వేశాడు.
    అంటే వారికి కళ్ళు మూసుకొని  చూడటం వచ్చన్నమాట. అలా చూడొచ్చునని వాడికి తెలుసు. అందుకే ఆ ప్రశ్న వేశాడు.
    "కళ్ళు మూసుకుంటే ఏం కన్పిస్తుంది?" వీరభద్రుడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.
    తను సైకాలజీ, సైకియాట్రీ , పారాసైకాలజీకి సంబంధించిన అనేక పుస్తకాలు చదివాడు. మూడేళ్ళు సైకియాట్రీలో యం.డి. చేసి రెండేళ్ళు విదేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఐదేళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్నాడు. ఎంతో అనుభవాన్ని సంపాదించాడు. కాని తనకు ఇలాంటివ్యక్తి ఎక్కడా  తగల్లేదు. ఇలాంటి వ్యక్తి వుంటాడనికూడా  ఊహించలేదు. 
    ఆ చూపులూ....ఆ నవ్వు...
    "ఏంటి బాబూ ఆలోచిస్తున్నారు?"
    "నీ గురించే" అనాలోచితంగా అనేశాడు.
    "నా గురించా? ఎట్టెట్టా?" గరగారా  నవ్వాడు.
    ఉదయచంద్ర అదిరిపడ్డాడు.
    "నేనాలోచిస్తున్నానని నీకెట్లా తెలిసింది?"
    "ఇదే బాబు మీ గది" గదిముందు నిలబడి చూపించాడు.
    "నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు."
    "మా తాత గోసాయిల్లో కలిసిపోయిన  సంగతి చెప్తుంటే మీరు విన్పించుకోలేదుగా! అందుకు తమరు ఏదో  ఆలోచిస్తూ నిలబడ్డారనుకున్నాను. నా గురించే ఆలోచిస్తున్నారనుకోలేదు."
    "ఆఁమీ తాత  గోసాయిల్లో కలిసి?" ఉత్కంఠతో అడిగాడు ఉదయ్.
    "తమరు ముందు గదిలోకి వెళ్ళండి బాబూ. వేన్నీళ్లా? చన్నీభ్లా?"
    "ఏమిటీ?" అయోమయంగా ముఖం పెట్టాడు ఉదయ్.
    "అదే బాబూ! ఏ నీళ్ళ  స్నానం చేస్తారోనని? అడివయ్యకు చెప్తే తెచ్చిపెడ్తాడు." అంటూ ఉదయ్ తో పాటు  గదిలోకి  వచ్చాడు. వీరభద్రుడు.
    "చన్నీళ్ళు ఇక్కడే ఉన్నాయ్. వెన్నీళ్ళయితే అడివయ్యాతో పంపిస్తాను." వెళ్ళడానికి  ఉద్యుక్తుడైనాడు వీరభద్రుడు.
    ఉదయ్ చంద్ర టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని బూట్ల లేసు విప్పుకోసాగాడు.
    "అయ్యగారు ఎదురుచూస్తుంటారు. వెళ్తాను."
    "ఎలా తెలుసు? క్లియర్  వాయన్స్ ద్వారా తెలుసుకొన్నావా?" గొంతులోని వ్యంగ్యాన్ని చూచుకాకుండానే  అన్నాడు ఉదయ్.
    "ఏమిటి బాబూ అది?" అయోమయంగా  చూశాడు వీరభద్రుడు.
    "అదొక శక్తి. కొంతమంది మనుష్యులకు ఆ శక్తి సహజంగానే వుంటుంది. అది అద్భుతశక్తి. ఎక్కడ ఏం జరుగుతున్నదీ తెలుసుకుంటూ చూడగలరు."
    "ఓహొ అదా? దూరదృష్టా బాబూ? అది మా తాత రుద్రయ్యకు వుండేది."
    ఉదయ్ బిత్తరపోయి అతడ్ని చూశాడు. వీడ్ని ఎగతాళి పట్టించాలని తను అలా  అన్నాడు. కాని వీడు.....
    "మా తాతకు ఇంకా చాలా విద్యలోచ్చు హిమాలయాల్లో ఏడేళ్ళు  తపస్సు  చేశాడు. పరకాయ ప్రవేశం చేసేవాడు. జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి చెప్పెసేవాడు."
    "యూ మీన్ ప్రికాగ్నిషన్?"
    "అంటే ఏందిబాబూ?"
    ఉదయచంద్ర తల విదిలించుకొన్నాడు. తను ఏదేదో మాట్లాడేస్తున్నాడు. వీరభద్రుడ్ని చూసినప్పట్నుంచి తనకేదో  అయిపోతున్నది. వీడు మామూలు మనిషి కాడు.
    "మీ తాత దగ్గర్నుంచి ఏమేమి నేర్చుకున్నావ్?"
    "నేనా  బాబూ?"
    "ఆఁ నువ్వే"
    "నేర్చుకొన్నా పోయేది బాబూ" దిగులుగా అన్నాడు.
    "అంటే ఏమీ నేర్చుకోలేదనేనా?"
    "అనేబాబూ" సూటిగా ఉదయ్ కళ్ళల్లోకి చూశాడు.
    ఉదయ్ కలవరపడ్డాడు.
    అతడి చూపుల్లో వాడీ వేడీ  ఉన్నాయి.
    వస్తున్నా అయ్యగారూ" వాకిలివైపు చూసి అన్నాడు వీరభద్రుడు తల పంకిస్తూ.
    ఉదయ్  విస్మయంగా చూశాడు.
    "అయ్యగారూ పిలుస్తున్నారు బాబూ."
    "పిలుస్తున్నారా? నాకు విన్పించలేదే?" వీరభద్రుడి ముఖంలో  తీక్షణంగా  చూశాడు  డాక్టర్  ఉదయచంద్ర.
    "విన్పించలేదా? పరధ్యానంగా వున్నారేమో. నాకు విన్పించింది." ఉదయ్చంద్ర సమాధానానికి ఎదురుచూడకుండానే వీరభద్రుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గదినుంచి బయటికి వెళ్ళాడు.
    ఉదయచంద్ర రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నాడు. వీరభద్రుడి నిష్క్రమణతో  తలమీద బరువు ఏదో దించేసినట్టుగా అన్పించింది. లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు. అద్దాల రెక్కలు  తెరిచాడు. తూర్పుగాలి చల్లగా ముఖాన్ని తాకింది. టైం చూసుకున్నాడు.
    వచ్చి ఇంకా అర్ధగంటకూడా కాలేదు. ఎన్నో రోజులై నట్టుగా వుంది. ఎందువల్ల? ఈ వాతావరణం.....ఈ  ఇల్లూ ....ఈ  మనుషులూ.
    "ఏం మనుషులు?
    తను చూసింది ఒక్కడ్నే ఇంకా అడివయ్యను చూడనేందు. వాడేలా వుంటాడో? పేరే భయంకరంగా వుంది. వీరభద్రుడ్ని చూస్తుంటే తనకే మనసు చిందరవందరగా వుంది. పాపం! మానసికి మతి పోవడంలో ఆశ్చర్యం ఏముంది?
    శివరామయ్యకు వీడికీ ఉన్న సంబంధం ఏమిటో?
    తలమీద చన్నీళ్ళు పోసుకుని స్నానం  చేశాక  కొంత హాయిగా  అన్పించింది ఉదయ్ కు. నైట్ డ్రస్  వేసుకొన్నాడు. అతనికి అంతా ఓ  వింతగా  అన్పిస్తోంది. జుట్టు దువ్వుకుంటూ కాండిల్ వెలుగులో ముఖం చూసుకున్నాడు. ఆ బంగళా, ఆ గదీ, ఆ పాతకాలపు పెద్ద  పందిరి మంచం, ఎదురుగా నిలువెత్తు అద్దం. చిత్రమైన అనుభూతిని కలిగిస్తున్నాయి.
    "డాక్టర్ గారూ స్నానం  అయిందా?" అంటూ శివరామయ్య గదిలోకి  వచ్చాడు.
    "అయింది. కాని  రాత్రికి ఈ గదిలోఎలా  పడుకోవాలా అని ఆలోచిస్తున్నాను."
    "ఫ్యాన్ లేకపోతేనేం? దక్షిణంవైపు కిటికీ  తెరిస్తే మంచిగాలి వస్తుంది. ఇంకా గాలి కావాలంటే  దక్షిణంవైపు టెర్రస్ మీద మంచం వేయిస్తాను" అంటూ వెళ్ళి అటువైపున్న కిటికీ తెరిచాడు.
    రివ్వున గాలి  లోపలకు వీచింది.
    గదిలో వెలుగుతున్న కాండిల్స్ అల్లాల్లాడి ఆరిపోయాయి. టేబుల మీద వున్న లాంతరు గుప్ గుప్ మన్నది.
    "చూశారా ఎంత విసురుగా గాలి వీస్తోందో?" అని శివరామయ్య కిటికీ రెక్కలు మూశాడు. ఆరిపోయిన కాండిల్స్ ను వెలిగించబోయాడు.
    "మళ్ళీ  అవవెందుకూ? లాంతరుందిగా ?" డాక్టర్ వారించాడు.
    "మీరెన్నన్నా చెప్పండి కాండిల్స్ వెలుగుతుంతే ఆ అందమే వేరు. హాయిగా, చల్లగా, ప్రశాంతంగా వుంటుంది."
    'అరిస్టాక్రసి!' మనసులోనే అనుకొన్నాడు ఉదయ్.
    కిటికీ తెరిచింది కొద్దిక్షణాలే అయినా అతడికి ఎంతో ఫ్రెష్ గా వున్నట్లు అన్పించింది . చల్లటిగాలి వంటికి తగిలి హాయిగా వుంది.
    ఆ గాలిలో ఏదో మత్తూ, సువాసనలూ వున్నాయ్.
    "లేవండి భోజనానికి వెళాం"
    "మానసి?"
    "మీ కోసమే ఎదురుచూస్తోంది."
    "ఎలా వుంది?"
    "చాలా సంతోషంగా ఉంది ఇక్కడకు వచ్చినప్పట్నుంచీ  ఆమెలో చాలామార్పు కన్పిస్తోంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడంలేదు డాక్టర్ గారూ?" శివరామయ్య గొంతు పూడిపోయింది.
    "బుణమేమిటండీ? డాక్టరుగా ఇది నా బాధ్యతగా భావించాను. మానసిని  మామూలు మనిషి చెయ్యగలిగితే కలిగే ఆనందాన్ని మరొక  దానితో కొలవలేము. తూచలేము. మీ అమ్మాయి కేసు చాలెంజిగా తీసుకొన్నాను. నేను ట్రీట్ చేసిన కేసులో ఇంత త్వరగా తిరగబెట్టిన కేసుల్లేవు. మానసి విషయంలో అలా ఎండుకయిందో తెలుసుకోవాలనే పట్టుదల కొద్దీ వచ్చాను.
    "అది మానసి అదృష్టం. నా అదృష్టం."
    శివరామయ్య వెనకే మెట్లుదిగుతున్న ఉదయ్ కు లాంతరు పట్టుకొని నిల్చునివున్న వీరభద్రుడు కన్పించడు.
    "బాబుగారూ! ఆ మెట్టుజాగ్రత్త."
    ఒక్కసారిగా రైలింగ్ వదలి గోడపక్కకు జరిగాడు ఉదయ్.    

 Previous Page Next Page