"నాకు నయమవుతుందా అన్నాయ్!"
చెల్లెలి కన్నీళ్ళు తుడిచి అనునయంగా అన్నాడు. "స్వాతీ! నీకు తప్పక నయమవుతుందమ్మా! నేను నయం చేయిస్తాను. నానమ్మ-అదే అమ్మగారు నయం చేయిస్తుంది. లేదా, వీధి వీధి తిరిగి ముష్టెత్తయినా నీజబ్బు నయంచేయిస్తాను నువ్వు దిగులు పెట్టుకోవద్దు. ఈవూళ్ళో మా ఫ్రెండ్స్ ఉన్నారు. కొందరు ఉద్యోగంలో, మరికొందరు వ్యాపారాల్లో ఉన్నారు. చెడిన చేనికి మందెందుకని యింతదాకా వచ్చి ఈమెని దేబెరించాక ఇంకా సిగ్గెందుకు వాళ్ళముందూ చేజాస్తాను. నీజబ్బునయం చేయిస్తాను. యింతలో నేను ఎక్కడయినా ఎంత చిన్నదయినా ఉద్యోగం సంపాదించుకుంటాను. స్వాతీ! మనం యీ వూరికి వచ్చాక యింతపెద్ద సిటీలో ఎక్కడతల దాచుకోవాలో దిక్కుతెలియని యీ దుస్థితిలో యీమె ఆశ్రయం యిచ్చింది. వూరకే యివ్వలేదనుకో-అయినా అదెంతకాదు."
"అన్నాయ్! మనం ఆ హారం అమ్మేసుకుని వుంటే..."
స్వాతి మాటలు పూర్తికాకముందే చప్పున ఆమె నోరుమూశాడు రవి.
"ఎప్పుడూ ఆ వూహ నీ మనస్సులో రానీవద్దు....మనం దాన్ని పూజించాలే తప్ప అమ్ముకోరాదు. మన తాతయ్య ఏనాడో చేసిన తప్పుకి రెండుతరాలు నరకంలాటి బీదరికం అనుభవించాం. మన నాన్నగారి దృష్టి ఎప్పుడూ దీనిమీదే వుండేది. అమ్మేస్తానంటే అమ్మహఠంచేసి, అల్లరి చేసి, ఏడ్చి అమ్మనీకుండా చేసేది, ఆఖరికి నాన్నగారు పోయి నప్పుడు కూడా ఎన్నో యిబ్బందులు పడినదాన్ని అమ్మాలనే ఊహేరానీలేదు. ఎలాగయితేనేం అది చేరాల్సిన చోటుకి చేరింది."
స్వాతి చిత్రంగా వింటూ వుండిపోయింది. విశ్రాంతిగా వుండిపోవటంతో ఆయాసం తగ్గింది అయా తెచ్చిఉంచిన ఫ్లాస్కులోని పాలుయిచ్చాడు రవి. అవి తాగాక నీరసం కూడా తగ్గినట్టయి లేచి కూర్చుంది.
"ఉదయం, సాయంకాలం అలా బయట కొద్దిసేపు తిరిగితే మంచిది స్వాతీ! మెల్లిగా లేచి వచ్చి అలా తిరుగు!"
రవి మాటవెంట బయటికి వచ్చింది స్వాతి. మెల్లిగా ఆ అవుట్ హవుస్ ముందే పచార్లు చేయసాగింది. ఉదయం పూట లేలేత ఎండలో ఆమెకి ఆయాసం అనిపించలేదు. ఏదో క్రొత్తబలం పుంజుకుంటున్నట్టుగా అనిపించింది.
బాల్కనీలోకి వచ్చిన స్వప్నకి అవుట్ హవుస్ ముందు తిరుగుతున్న స్వాతి కనిపించింది. స్వప్నకి ఆశ్చర్యముగా అనిపించింది. "ఎవరీ అమ్మాయి?" అనుకుంటూ మేడమెట్లు చకచకా దిగివచ్చింది. బృందావనంలాంటి గార్డెన్, ల కంత యింట్లో ఒక్కత్తే బిక్కుబిక్కుమంటూ పెరిగిందో స్వప్న. అమ్మమ్మగారూ, ఆయా, వంటపుట్టి, నాయర్, గార్డినింగ్ చేసే చలమయ్య. వాచ్ మన్ తప్ప ఆ యింటి ఆవరణలో గానీ, యింట్లో గానీ యెవ్వరూ కనిపించరు.
మేనేజర్ వెంకట్రామయ్య రోజుకోపూట వచ్చి వెళుతూ వుంటాడు. అతనితో స్వప్నకి పరిచయం తక్కువే. ముక్తసరిగా మూడు మాటలు-నమస్తే__బావున్నారా____ఎక్కడికెళ్ళేడు తప్ప మరో ప్రసంగం సాగదు. అంతే!
అలాటి స్వప్నకి యిన్నేళ్ళుగా నిద్దరోతున్న దానిలా ఉన్న ఆచిన్ని అవుట్ హవుస్ ముందు ఓ అందాలబాల పచార్లు చేయటం వింతగా, కొత్తగా, ఆనందకరంగా ఉంది.
గబగబ మెట్లుదిగేసి అమ్మమ్మగారిని వాళ్ళవిషయం కనుక్కునేందుకు వెళ్ళింది. అయితే అమ్మమ్మగారు పూజ చేసుకుంటున్నారు. ఆమె కూర్చుని పూజ చేస్తూవుంటే ఆమె కెదురుగా ఆమె ఎత్తున్న శ్రీ అలివేలుమంగా సహిత శ్రీ వెంకటేశ్వరస్వామి వారు అమితానందంతో పూజలు అందుకుంటున్నారు. తరతరాలుగా ఆ యింటి పూజలు అందుకుంటున్న స్వామివారికి అది నిత్యపూజ.
నిరాశతో వెనుదిరిగింది స్వప్న. అమ్మమ్మగారి పూజ యిప్పుడిప్పుడే పూర్తవదు మరి! ఆ అమ్మాయిని చూసి పరిచయం చేసుకుని పలకరిస్తేగానీ ఆమె మనస్సు శాంతించేట్టులేదు. ఎవరనడగాలి? పోనీ ఆయాని అడిగితేనో? అమ్మో! యింకేమయినా ఉందా? అమ్మమ్మగారు చూసే చూపుల్ని భరించుకోవటం కష్టం...
మెల్లిగా బయటికి వచ్చింది స్వప్న.
అల్లంత దూరంలో పచార్లు చేస్తోంది స్వాతి.
అటూ ఇటూ చోసొంది స్వప్న! ఎవరూలేరు...చప్పునవెళ్ళి, అందాలలోకం నుంచి అలా అలా తిరిగేందుకు వచ్చిన అప్సరకన్యలా ఉన్న ఆ అమ్మాయిని పలకరించివస్తే ఎవరు చూడొచ్చారు? అమ్మమ్మగారికి తెలిస్తేకదా కేకలు వేసేది? కాలేజీలో తనతో చదివే అమ్మాయిలతో తప్ప మరెవ్వరితోనూ మాటాడనివ్వదు ఆమె! తమది పెద్ద కుటుంబం. సంపన్న కుటుంబం.....కులం శీలం ఉన్న వంశం...ఎవరితో చనువుగా చిల్లరగా తిరగ్గూడదు. మాటాడకూడదు....మర్యాద నిలుపుకోవాలి- ఇవీ అమ్మమ్మ మాటలు!
ఓస్!
అమ్మమ్మ చూస్తేకదా కేకలు వేసేది! ఆమె చూసే లోగా వచ్చేస్తే సరి? గప్ చిప్! ఎవరు చూశారు__ఎవరు చెబుతారు?
ఉబలాటంతో ఉత్సాహంతో ఆనందంతో వెళ్ళింది స్వప్న.
అందంగా, నాజూగ్గా సినిమా తారలా వస్తున్న స్వప్నని చూసి కళ్ళు విశాలం హేసుకుని చూడసాగింది స్వాతి. అసలే అందమైన పెద్దకళ్ళు ఆ అమ్మాయిని-చిక్కి బలహీనంగా ఉన్నా కళ్ళు మాత్రం కాంతివంతంగా ఉన్నాయి.
"నమస్తే!" చిరునవ్వుతో అంది స్వాతి.
ఆ అమ్మాయిని చూడగానే ముచ్చటేసింది స్వప్నకి. మనస్సులో ఏదో తెలియని ఆత్మీయత, అనురాగం పెల్లుబికి నట్లయింది దగ్గరికి తీసుకోవాలని, ముద్దుపెట్టుకోవాలనీ అనిపించింది. అయితే సహజమైన ఆప్యాయతని అమ్మమ్మ గారి పెద్దరికంలో వచ్చిన బెట్టు ఆపేసిందామెని.