Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 10


    
    ఆమె ఆపగానే ఆయన చిరునవ్వు నవ్వి "క్రిందపడ్డా, మీదదానిననే నీ పంతం నాకు నచ్చింది. చూద్దాం ఏం అవుతుందో ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్" అన్నాడు.
    
    ఆమె నవ్వి "డబ్బుకన్నా ప్రేమా, ఆప్యాయతా ముఖ్యమని నిరూపించాలి అంటే నేను మీకు సమీపంలో వుండాలిగా! అందుకే నేనీ ఉద్యోగానికి ఒప్పుకుంటున్నాను" అంది.
    
    ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. "మేనేజరుగారు అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇస్తారు తీసుకో! ఈవేల్టినుంచీ నువ్వు ఆదివారం తప్ప మిగతా రోజుల్లో నీ కుటుంబానికి దూరంగా అంటే మా అవుట్ హౌస్ లో వుండాలి. పని విషయంలో నాకు తృప్తికరంగా లేకపోతే నిన్ను టెర్మినేట్ చేసేస్తాను. నేను ప్రతి పైసాకీ లెక్కకట్టి పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం వస్తోందా లేదా అని చూసుకునే మనిషిని నా గురించి తెలిసిన వారందరూ నన్ను పరమ మెటీరియలిస్ట్ అంటారు" అన్నాడు.
    
    ఆమె లేచి నిలబడి నవ్వుతూ "మనుషులు తమకి అతి తక్క్జువగా తెలిసింది నమ్మినంతగా మరింక దేన్నీ నమ్మరు" అంది.
    
    ధృతి వెళ్ళిపోయినా తర్వాత కూడా ఆయన ఆ అమ్మాయి మాటలు ఒకటికి రెండుసార్లు మననం చేసుకుంటూ వుండిపోయాడు.
    
                                                             * * *
    
    పెద్ద కోటగోడ లాంటి ప్రహరీకి ఎత్తయిన ఇనపగేటు. గొప్పవాళ్ళు తమకోసం తామే 'జైళ్ళు' నిర్మించుకుంటారులా వుంది అని నవ్వుకుంది ధృతి.
    
    "దిగమంటావా?" అన్నాడు సీతారామయ్య ఆటోనుంచి తల బయటకు పెట్టి.
    
    "వద్దు! నే వచ్చేదాకా అందులోనే కూర్చోండి" అంటూ గేటువైపు నడిచింది. గేటు తోయగానే తెరుచుకుంది. లోపలికి అడుగు పెడుతుంటే ఒక్కసారిగా ఆమె గుండె కొట్టుకునే వేగం హెచ్చినట్లనిపించింది. అటూ ఇటూ చూస్తూ ఆ భవంతిలాంటి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఎంతో ధైర్యస్తురాలిని అనుకునే ధృతికి ఆ నిమిషం భయమో, సంకోచమో తెలీని ఫీలింగుతో వణుకు పుట్టింది.
    
    "భగవాన్! నేను వేసే ఈ అడుగు నన్ను మంచి వైపు నడిపించాలి" అని దేవుడ్ని వేడుకుంది.
    
    విశాలమైన హాలు, క్రింద ఆకుపచ్చరంగు తివాచీ, గోడలకి అందమైన తైలవర్ణ చిత్రాలూ, పైన షాండ్లియర్ - ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించిందామెకి.
    
    "అయిబాబో! ఎవరు కావాలండమ్మా?" అన్న ప్రశ్నకి తల తిప్పి చూసింది.
    
    "పనతను కాబోలు...." కంగారుగా ధృతి వైపు పరుగులాంటి నడకతో వస్తూ కనిపించాడు.
    
    "ధర్మానందరావుగారనీ..." అంటూ ఆగిపోయింది.
    
    "ఆయ్! మీ పెరండీ?" అన్నాడు తూర్పుగోదావరి యాసలో సాగదీస్తూ.
    
    "ధృతి"
    
    "కేకేస్తాను. మీరు కూర్చోండయ్యా" అంటూ వచ్చినంత హడావుడిగానే లోపలికి పరుగుదీశాడు.
    
    ఆమె సోఫాలో కూర్చుని ఇంటిని పరికించి చూస్తూ 'ఇంత ఇంట్లో ఒక్కరే వుంటారో, లేక ఫ్యామిలీ వుంటుందో? అయినా భయంవేయదూ?" అనుకుంది.
    
    "గుడ్ మార్నింగ్."
    
    ఆమె ఆ మాటకి తలెత్తి చూసేలోగా ఆయన ఆమె ఎదురుగా కూర్చోవడం కూడా జరిగిపోయింది.
    
    ఆమె గబుక్కున లేచి నిలబడింది.    

    "కూర్చో! ఇల్లు కనుక్కోవటం కష్టం కాలేదుగా?" ఎంతో ప్రశాంతంగా వుంది ఆయన మొహం వైట్ సూట్ లో చాలా క్యాజువల్ గా హాయిగా కనిపించారు.
    
    "లేదు"
    
    "వాచ్ మెన్ కి ఏం చెప్పావు? స్లిప్ పంపించలేదేం?" అమ్మూలుగా అడిగేశాడు.
    
    ధృతి అయోమయంగా చూస్తూ "వాచ్ మెన్ ఎవరూ నాకు గేటు దగ్గర కనిపించలేదండీ!" అంది.
    
    ఆయన మొహంలో ప్రశాంతత ఎవరో వూదేసినట్లుగా ఎగిరిపోయింది.
    
    "సుబ్బరాజూ!" అని పిలిచారు.    

    ఇందాక ధృతిని ప్రశ్నించైనా పనతను మళ్ళీ అంత హడావుడిగానూ పరుగెత్తుకొచ్చాడు.
    
    ఆయన గంభీరంగా "వాచ్ మెన్ గేటు దగ్గర వుంటే పిలుచుకురా" అన్నాడు.
    
    "ఆయ్" అంటూ అతను బయటికెళ్ళాడు.
    
    ధర్మానందరావు ఆమె వైపు తిరిగి "ఒక్కదానివే వచ్చావా?" అని అడిగాడు.
    
    "మా నాన్నగారూ..... బయట ఆటో దగ్గర వున్నారు" అంది నెమ్మదయిన స్వరంతో. ఆయన ముందు ఆమెకి గొంతు పెగలటంలేదు. మొదటి రోజు ఇంటర్వ్యూలో ధాటిగా మాట్లాడింది నేనేనా అన్న అనుమానం ఆమెకి కలిగింది.
    
    ఇంతలో సుబ్బరాజుతోబాటు మరో వ్యక్తి వాచ్ మెన్ యూనిఫాంలో లోపలికి వచ్చాడు.
    
    "ఈ అమ్మాయి రావడం చూశావా?" అని ఆ వచ్చిన వ్యక్తిని అడిగాడు ధర్మానందరావు.
    
    "లేదండీ! గేటు దగ్గర ఓ ముసలయన మాత్రం పెట్టె పట్టుకుని నిలబడ్డాడు" అంటూ భయంగా జవాబిచ్చాడతను.
    
    ఆయన తాపీగా వెనక్కి వాలి "అయిదు నిముషాల క్రితం నువ్వేం చేస్తున్నావు?" అనడిగాడు.
    
    ఆ వ్యక్తి సమాధానం చెప్పడానికి జంకుతూ నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.
    
    "నా కొడుకు వచ్చి మా అమ్మకి ఒంట్లో బాలేదనీ, ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి డబ్బులు కావాలనీ అడిగాడు. వాడికి డబ్బులిచ్చి, వాడితో నాలుగడుగులు వేసి వెనక్కొచ్చాను. అంతే సార్" అతను దాదాపు ఏడుపు స్వరంతో చెప్పాడు.
    
    "మరప్పుడు గేటుకి తాళం వేయడం కానీ, ఎవరికయినా అప్పచెప్పడము కానీ చేశావా?" ఆయన చాలా నెమ్మదిగానే అడిగారు.

 Previous Page Next Page