మెల్లమెల్లగా నిద్రమత్తు రెప్పలమీదకు పాకుతున్నప్పుడు కూడా ఆమె రూపం అతని రెప్పలకింద చెదరకుండా అలాగే ఉంది!
అలవాటుపడిన దారి కావడంతో చీకట్లో సైతం పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నడవగలుగుతున్నాడు సుబ్బారాయుడు. అతని బుర్రనిండా విచిత్రమైన ఊహలు తిరుగుతున్నాయి. కేశవుడిలా తను పట్నం వెళ్ళి చదువుకోలేదు. పోనీ, ఇప్పటికైనా మించిపోయిందేంఉందీ.....ఈ పొలాలూ అవీ అమ్మేసి ఏదో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి హాయిగా చలివేంద్రం గదిలో కూర్చుంటే-ఎదురుగా పొట్టి గౌను పిల్ల పుస్తకంతో నిలబడి.....
"బావా.....బావా!" సన్యాసిరావు పిలుపు వినిపించింది.
సుబ్బారాయుడికి ఎంత చిరాకేసిందంటే, ఛీ! కలలు కనేపాటి స్వతంత్రం లేదీ బ్రతుక్కి... థూ! ఎందుకురా నన్ను ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వవు?" అని సన్యాసిరావు మీద విరుచుకుపడ్డాడు.
"వాన వచ్చేట్లు ఉంది. గొడుగు ఇస్తే వేద్దామనీ ..." భయంగా అన్నాడు సన్యాసిరావు.
ఇంతలో టప ... టపా ... వాన చినుకులు మొదలయ్యాయి. "ఊఁ ..." అంటూ చంకలో ఉన్న ఉన్న గొడుగు తీసి అందించాడు సన్యాసిరావు బావగారికి గొడుగు పట్టి వెనకే నడవసాగాడు.
సుబ్బారాయుడికి తన భార్య పార్వతమ్మ జ్ఞాపకం వచ్చింది. పన్నెండేళ్ళపిల్లగా ఉన్నప్పుడు తన భార్యగా ఈ ఇంట్లోకి వచ్చింది. తన ఈడే ఉన్న నలుగురు ఆడబిడ్డల్నీ వదినగా గాక, తల్లిలా చూసి వాళ్ళ పెళ్ళిళ్ళకీ పేరంటాలకీ చాకిరికీ తన యవ్వనం అప్పచెప్పింది. తఃరువతః పురుళ్ళూ.... జబ్బులూ.... బంధుఉలూ.... బాధ్యతలూ వీటితో మనిషి నాచు పట్టిన కోనేరు మేట్టులా తయారయ్యింది. నిత్యం ఏదో వ్రతం, స్నానం, పూజా ....రక్తం లేకుండా తెల్లగా పాలిపోయి, బలహీనంగా ఉంటుంది. ఎప్పుడూ వచ్చేవాళ్ళూ పోయేవాళ్ళూనూ.... నిత్యసంతర్పణ. వండడంవార్చడం ఇదే జీవితాన్ని చిరునవ్వుతో మోస్తోందేగానీ ఒక్కనాడైనా మూతి బిగింపు కానీ మోహంలో చిటపటకానీ కనపడనీయదు. ఆడబిడ్డలొస్తే నాలుగుఇ రకాలు చేసి పెడుతుంది.
కన్నతల్లికి మనసు విప్పి చెప్పుకోని మాటలు వదినతో చెప్పుకుని ఊరట పొందుతారు వాళ్ళు, అతనికి సూరమ్మ అక్కయితే జానకీ, రాజేశ్వరీ, కాత్యాయినీ, ప్రమీలలు చెల్లెళ్ళు జానక్కీ, రాజేశ్వరికీ మధ్య వాడు ప్రకాశం అందరికీ ఆడపిల్లలున్నారు. వాళ్ళకి ఏ ముచ్చటైనా పెద్ద మేనమామ చేతులమీదుగానే జరగాలి. బావగార్లు కూడా ఏ సంప్రదింపైనా సుబ్బారాయుడితోనే చేస్తారు. సంక్రాంతి పండగొస్తే ఇంటినిండా తిర్నాలలా ఒకటే మువ్వల మోతలు ఎటుచూసినా కువకువలాడే ఆడపిల్లలే! నాలుగు గంపల బంతిపూలూ, పన్నెండు అత్తాల అరటిపండ్లూ ప్రతిరోజూ కావాల్సిందే. గాజుల మలారం మల్లయ్యొస్తే ఆ సందడే సందడి! ఎన్ని జతల చేతులకి వేసాడో గుర్తుంచుకుని కరక్ట్ గా చెప్తేనే అమ్మ చేసిన భక్ష్యాలు పెడతానని రాధ అల్లరి చేస్తుంది. అతని పని ఇందరాడంగుల మధ్య రాట్నం మధ్య ఇరుసులా మారిపోతుంది.
తిరకాసేంటంటే ... అది గాజులెయ్యగానే అతను వాళ్ళబుగ్గమీద పెట్టేకాటుక చుక్కతో మంచు విడిపోయినట్లు విడిపోతుంది. మాటకి దిష్టి తగలకుండా అంటాడు కానీ....అది అతని వ్యాపారపు మెలకువ! పార్వతి పిల్ల చేత బొమ్మల పేరంటం, సందె గొబ్బెమ్మలు.... భోగినాడు భోగిపండ్లు, తెల్లవారు ఝామున భోగిమంటలు ఏవీ మాననీయదు. వారం ముందునుంచే ఇంట్లోంచి పిండివంటల ఘుమఘుమలు వీధి వాళ్ళని ఊపిరి పీల్చుకోనీయవు. పండగయ్యాక, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళినా అలసట తీర్చుకునే వ్యవధి లేకుండా ఇన్నాళ్ళూ అమ్గాడిలా మారిన ఇంటిని సవరించుకోవడం సరిపోతుంది. ఈలోగా ఏ చుట్టమో రావడం, లేదా ఏ వేడుకనో ఇంటిల్లిపాదీ ప్రయాణం.....అన్నీ గంటా అరగంటా ప్రయాణాలు ఏదీ కాదనలేదు, ఆమెను అతను ఏకాంతంలోకూడా పరీక్షగా చూసి, నాలుగు మాటలు సరసంగా మాట్లాడీ.....ఎన్నాళ్ళయిందో! పార్వతిని ఒక్కసారి పట్నం తీసుకెళితేనో అనిపించింది. ఔను మంచి ఆలోచన! నాలుగురోజులు ఎలాగయినా పార్వతిని తీసుకుని తామిద్దరే కేశవుడి దగ్గరికి పట్నం వెళ్ళాలి అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే హుషారుగా చుట్ట నోట్లో పెట్టుకుని "ఒరే ... సన్నాసీ! వెలిగించరా!" అన్నాడు.
"ఇల్లోచ్చేసింది బావా!" అన్నాడు సన్యాసి.
"ఛత్! ఎప్పుడూ ఇంతే!" అని విసుక్కుని చుట్ట నోట్లోంచి తీసి వీధి వసారాలో పడుకున్న తల్లిని, "ఎలా వుందీ? దగ్గు తగ్గిందా?" అని హూంకరించాడు.
తాయారమ్మ కొడుకుని చూడగానే లేచి కూర్చుంటూ, "అన్నంతినే ముందు నీరసంగా అనిపించిందిరా పెద్దాడా! తిన్నకాసేపటికి గుండె దడదడలాడి ఆయాసంగా అనిపించింది. నీకోసం ఇందాకట్నించీ చూస్తున్నాను. ఇంతాలస్యం అయిందే?" అంది. సాధారణంగా తినకపోతే నీరసం, తింటే ఆయాసం అన్న విషయం రోజూ చెపుతుంది. అయినా అతనెప్పుడూ విసుక్కోడు. అదే మొదటిసారి వింటున్నంత శ్రద్దగా విని ఆదుర్దాపడుతూ "మందేసుకున్నావా, అన్నం తిన్నావా?" అంటాడు.
"తినలేదురా సుబ్బడూ!" అంటే,
"ఎవరే లోపలా! అమ్మకింకా అన్నం పెట్టలేదుట ఏం చేస్తున్నారే ఇంతసేపూ?" అని కేకలేస్తాడు. అందుకే ఏడున్నర కాగానే పెందలాడే తాయారమ్మకి వడ్డించేస్తుంది పార్వతమ్మ.
ఈరోజునా అలాగే అరిచాడు సుబ్బారాయుడు.
"అనుకోకుండా ప్రమీలావాళ్ళూ వచ్చేసరికి కబుర్లలోపడి ఎసరు పడెయ్యడానికి ఆలస్యం అయిపోయిందంతే!" అంది చెంగుతో చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చిన పార్వతమ్మ.
"ఆఖరుది వచ్చిందా? వాళ్ళాయన కూడా వచ్చాడా?" అడిగాడు.
"లేదండి .... ఒక్కర్తే వచ్చింది పిల్లల్ని తీసుకుని!" అంది భార్య.
ఇంతలో పిల్లలెవరో పోట్లాడుకోవడం, పెద్దవాళ్ళు విడిపించ చూడడం, వాళ్ళ కేకలూ, చిందులూ, ఏడుపులూ, "పెద్దమావయ్యొచ్చాడు ష్! ఊర్కోండి" అన్న పెద్దవాళ్ళ గదమాయింపులూ వినపడ్డాయి.
ప్రమీల అన్నగారి ఎదుట పడలేదు. అతనే స్నానం చేసొచ్చాక "చిన్నమ్మాయ్, ఇలా రా!" అని పిలిచి ఆమె మంచీ చెడ్డా, పిల్లల ఆరోగ్యం, వాళ్ళాయన టౌనులో పెట్టిన కొబ్బరికాయల హోల్ సేల్ వ్యాపారం గురించీ అడిగి తెలుసుకున్నాడు. అన్నింటికీ సమాధానాలు చెప్పి ఇంకా వెళ్ళకుండా నిలబడ్డ చెల్లెల్ని చూసి "డబ్బేమైనా కావాలన్నాడా బావా?" అని అడిగాడు.
అప్పుడూ ప్రమీల అన్నగారితో మాట్లాడలేదు.
రాధ లోపల్నుండి వచ్చి తండ్రి మెడచుట్టూ చేతులేసి కుర్చీ వెనుక నిల్చుంది.
సుబ్బారాయుడికీ అలా తన చుట్టూ చేతులేసి ఆటలాడిన చిట్టిచెల్లెలు ప్రమీల బాల్యం గుర్తొచ్చింది. అలా పెళ్ళయిందో లేదో ఎంతగా మారిపోయిందీ! 'అన్నయ్యా' అంటూ చనువుగా ముందుకు రావడమే మానేసింది. రేపు రాధైనా అంతే కదా అనిపించింది!