'పూండీ'లో రోడ్డు పక్కగా ఒక స్కూలు కనిపించింది. శ్రీహరి రావు, కోటయ్యా వెళ్ళి అక్కడెవరన్నా కాంగ్రెసు మనుషులున్నారా? అని వాకబు చేశారు. స్కూల్లో హెడ్ మాస్టర్ "ఇక్కడ 'బబ్బూసింగ్' అనే కాంగ్రెసు మనిషున్నారు. అయన లోగడ ఒకటి రెండుసార్లు జైలుకి కూడా వెళ్ళి వచ్చారు" అని చెప్పాడు.
'బబ్బూసింగ్' ఇల్లు కనుక్కొవడమేమీ ఆ పల్లెటూర్లో కష్టం కాలేదు. అయన "ఆన్ ఫూట్ బ్యాచ్' అంటే మీరేనా?" అని ఎంతో ఆనందంగా ఆహ్వానించాడు. రాత్రి అందరికీ రొట్టెలూ, పప్పూ చేయించి భోజనాలు పెట్టించి, ఒక ఇంటిలో బస ఏర్పాటు చేశాడు. అందరూ రగ్గులు కప్పుకుని పడుకున్నారన్న మాటే కానీ, చలికి వజ వజా వణకసాగారు. ఒళ్ళు కొంకర్లు పోతోంది. చుట్టూ కొండలు కావడం వలన ఈదురుగాలి చలికి తట్టుకోలేక ఒకరొకరే లేచి కూర్చున్నారు.
"పంతులూ! చలి వాత పడి చచ్చిపోతామేమో" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"నాకైతే అసలు ప్రాణాలతో తిరిగి మన ఊరు చేరుతామా!" అనిపిస్తోంది అన్నాడు కోటయ్య.
"నీకేమనిపిస్తోంది రమణా!" అడిగారు శ్రీహరిరావుగారు.
"ఇలాపోతే ఇంతకన్నా ఏం కావాలి? అనిపిస్తోంది" అందామె తన ఖద్దరు చీరలన్నీ మడతలు పెట్టి, పిల్లమీద కప్పుతూ.
ఆయన నవ్వి, తన రగ్గు కూడా తీసి ఆమెమీద కప్పారు. లేచి బయటికొచ్చి, మిగతా గదుల తలుపులు తీసి లోపల ఏముందో అని పరీక్షించసాగారు. లోపల గదుల్లో అంతా గోధుమ పోట్టుంది. దానిని చూడగానే ఆయన బుర్రలో తళుక్కుమన్న ఓ ఆలోచన స్ఫురించింది.
"రాజూ, కోటయ్యా" అని పిలిచారు. అందరూ లేచి వచ్చారు. "చూడండి! ఒక్కొక్కరే పడుకోండి, ఈ పొట్టు మీ మీద కప్పుతాను. తెల్లవారేదాకా వెచ్చగా పడుకోవచ్చు" అని చెప్పారు.
అందరూ మంచి హుషారుగా, ఒక్కొక్కరి మీదే పొట్టు కప్పేశారు. చివరిగా ఆయన తలకింద చేతులు పెట్టుకుని, వారిని చూస్తూ పడుకున్నారు. తెల్లవారేదాకా వాళ్ళు పక్కకి కూడా ఒత్తిగిల్లకుండా వెచ్చగా నిద్రపోయారు.
అయన తృప్తిగా నిట్టూర్చారు.
'పూండి' నుండి తిరిగి తరువాత మజిలీకి నడక సాగించారు. మధ్యలో ఓ చోట మార్గాయాసం తీర్చుకోవడానికని ఆగారు. చెంబులు తీసుకుని కాలకృత్యాలు తీర్చుకోవడానికని వెళ్ళిన కుర్రవాళ్ళు కాస్సేపట్లోనే, "పంతులూ! రమణమ్మగారూ!" అంటూ ఉత్సాహంగా పరిగెత్తుకొచ్చారు. "ఏమయిందర్రా! ఏమిటీ హడావుడీ" అనడుగుతే, చెంబుల నిండా ఎర్రగా పగడాల్లా మెరుస్తున్న తుప్పరేగుపండ్లు చూపించారు. ఆయన నవ్వారు. అంతే! అందరూ రేగుపండ్లు శక్తికొలదీ కోసుకొచ్చేశారు.
ఆ రోజు పూండీ నుండి తెచ్చుకున్న అటుకులూ, బెల్లమే వారికి ఆధారమయ్యాయి. చీకటి పడేదాకా నడిచినా ఎక్కడా ఊరు తగల్లేదు. అందరూ తప్పిపోయారు. ఎక్కడో ఒకచోట ఆగక తప్పదుకదా! ఓ చెట్టు మొదట్లో ఆగి, "ఇక్కడ మన బిస్తర్లు సరిచెయ్యండి" అని ఆజ్ఞాపించారు శ్రీహరిరావు.
"ఇక్కడా?" అన్నారందరూ చుట్టూ పరికించి.
"ఫరవాలేదు! దేవుడే దిక్కు కావాలంటే పెద్ద మంట చెయ్యండి" అన్నారు.
అందరూ దేముడ్ని తలుచుకుని, అక్కడ తమ పక్కలు పరుచుకున్నారు.
"ఇద్దరిద్దరు కాపలా కాయాలి. రెండు గంటలు గడిచాక, మరో ఇద్దర్ని లేపి, వీళ్ళిద్దరూ పడుకోవాలి" అన్నారు శ్రీహరిరావుగారు.
ఆయనాజ్ఞకి తిరుగులేదు. పడుకున్నారన్న మాటేకానీ, భయంకరమైన అరుపులు వినపడసాగాయి. చీకట్లో మెరుస్తూ వేటివో కళ్ళు కూడా చెట్లమీద కనపడసాగాయి. వాటి అరుపులు పగలబడి నవ్వినట్లుగా భయంకరంగా వున్నాయి.
"భయమేస్తోందండీ!" అంది రమణ ఆయనకి దగ్గరగా జరుగుతూ.
ఆమెమీద ఓ చెయ్యివేసి, "ఆంజనేయ దండకం చదువుకో!" అన్నారాయన. దూరంగా మంటలు గాల్లోకి లేస్తూ కనపడసాగాయి.
"పంతులూ! కొరివిదయ్యాలనుకుంట" అని నాగేశ్వరరావనగానే, అందరూ భయంలో బిక్కచచ్చిపోయారు.
"అవి నిజంగా దయ్యాలయితే గనక, తప్పకుండా మనుషుల్ని చూసి పారిపోతాయి" అన్నారాయన నవ్వుతూ.
వారి భయాన్ని పారద్రోలుతూ ఆ రాత్రి వారికి అయన ఎన్నో తెలియని విషయాల్ని బోధించారు. వివేకానంద ఉపన్యాసాలూ, రామకృష్ణ పరమహంస గొప్పతనం గురించీ, మహాత్ముడి గురించీ వారు చుట్టూ వున్నా పరిస్థితులనీ, పరిసరాలనూ మరిచి, తన్మయులయ్యేట్లు ప్రసంగించారు.
రమణ చెక్కిట చేయి జేర్చుకుని, భర్త చెప్పేది శ్రద్దగా వినసాగింది. భర్తలో స్నేహితుడ్నీ, గురువునీ, దైవాన్నీ చూసుకునే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది?
ఎప్పుడు తెల్లవారిందో వారికి తెలియలేదు.
తెల్లవారుజామున నిద్ర ఆపుకోలేక, అందరూ నిద్రలోకి జారిపోయారు. కొండకోతులు కూడా శాంతించి, తమ దారిన తాము పోయాయి.
పుడమితల్లి రాత్రంతా నొప్పులు పడి, ప్రసవించిన పొత్తిళ్ళలోని పసిబాలుడిలా ఉదయభానుడు రక్తపుగుడ్డులా దర్శనమిచ్చాడు.
ఆ లేలేత సూర్యకిరణాలు సోకి, ఒక్కొక్కరికే మత్తు విడిపోయి తెలివి రాసాగింది.
మొదటిగా రమణ లేచి, చుట్టూ చూసి, 'కెవ్వుమని' అరిచింది, ఆ తర్వాత ఒక్కొక్కరే!
"ఇదేమిటి పంతులూ? ఇక్కడా మనం నిద్ర చేసింది?-" అన్నాడు వెంకటరత్నం.
చుట్టూ ఎముకలూ, పుర్రెలూ వాళ్ళు పడుకున్న ప్రదేశం వెనకాలే పెద్ద పాములు పుట్టా, దూరంగా యింకా కాలుతున్న చితిమంటలూ వీళ్ళని చూసి, ఒక్కరాత్రి చెలిమితోనే స్నేహితులయిపోయామన్నట్లు పళ్ళికిలించి నవ్వుతున్న కొండకోతులూ-