శ్రీహరిరావుగారు నవ్వారు. "చూశారా? చచ్చిపోయినవాళ్ళు కూడా మనకి ఆతిధ్యమిస్తున్నారు! దేశభక్తంటే అదే! చచ్చినా దేశాన్ని మరిచి పోకపోవడం" అన్నారు.
ఆ మాటలకి అందరూ నవ్వేసి, ఇంకో మజిలీకి తయారవసాగారు.
* * * *
పోకల సత్యనారాయణకి మళ్ళీ జ్వరం తిరగబెట్టింది. ఈసారి ఆయన్నీ, ఆయన బిస్తరునీ ఒక అరుగుమీద వదిలిబెట్టి, తెల్లవరగానే "ఛత్రపూర్" వెళ్ళే బస్సు వస్తుంది. అందులో రమ్మని చెప్పి, ఒక కానిస్టేబుల్ కి అప్పచెప్పి, ముందుకు సాగిపోయారు.
ఊరు దాటి ముందుకు మూడుమైళ్ళు సాగేరో, లేదో, రమణ భర్త పక్కన నడుస్తున్నదల్లా నెమ్మదిగా ఆయనవైపు వాలిపోయింది. "రమణా! రమణా!" అంటూ ఆయన కుదపసాగారు. అందరూ తెల్లమొహాలేసుకుని చుట్టూ చేరారు.
"ఆడకూతురు పంతులూ! మనతో సమానంగా నడుస్తోంది కదా అని నువ్వస్సలు పట్టించుకోకపోతివి. కడుపునిండా తిండి తిని మూడురోజులయింది పాపం!" అన్నాడు నాగేశ్వరరావు.
ఈ విషయం ఆయనకు తెలియనిది కాదు! కానీ ఏం చెయ్యగలడు? తన నిబంధనల ప్రకారం ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా చూడకూడదు. అప్పటికీ, ఆమెకీ, అనారోగ్యం పాలయిన వాళ్ళకీ అప్పుడప్పుడు వాహనయోగం కలుగుతూనే వుంది.
కాస్త దూరంలో రెండెడ్లబండి ఒకటి ఆగి కనిపించింది. అటువైపు నడిచి, బండివాడ్ని "ఆడపిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. మంచినీళ్ళేమయినా వున్నాయా?" అనడిగార
అతను ఓ చెంబుడు నీళ్ళిచ్చి, పరిస్థితంతా గమనించి "ఆమె తిండి లేక నీరసంవల్ల కళ్ళు తిరిగి పడిపోయినట్లుంది. నా వద్ద ఇంకా గోధుమ పిండి మిగిలి వుంది? ఆ పక్కనే నేనిప్పుడే రొట్టె కాల్చుకుని తిన్నాను. నిప్పింకా అలాగే వుంది. ముందోరొట్టెచేసి తినిపించండి" అన్నాడు.
శ్రీహరిరావు వాడికో నమస్కారం చేసి, అతనికిచ్చిన పిండినితీసుకున్నాడు "భగవంతుడు కిరీటాలతోటీ, నాలుగు చేతులతోటీ కనిపించక్కరలేదు. ఏ రూపంలోనైనా సరే ఆదుకుంటాడు" అని ఆయనెప్పుడూ అంటుండేవారు.
బండివాడి ధర్మమా అని, రమణతోపాటు, మిగతా బృందం కూడా తలొక రొట్టే, చేతులతో చరుచుకుని, నిప్పులపై కాల్చుకుని తిన్నారు. దాంతో కాస్త ప్రాణం వచ్చినట్లనిపించి, తిరిగి బయల్దేరారు.
ఈలోగా సత్యనారాయణకి దారుణమైన అనుభవం జరిగింది.
బృందమంతా అతన్ని ఒంటరిగా అరుగుమీద వదిలేసి వచ్చేశాకా, పోలీసు కానిస్టేబుల్ కాసేపు దగ్గర కూర్చుని, టీ అదీ తాగించి, చీకటిపడగానే తనింక వుండలేనని చెప్పి, ఊళ్ళోకెళ్ళిపోయాడు.
సత్యనారాయణ జ్వరం వలన కలిగిన చలితో వణుకుతూ, నిండా రగ్గు కప్పుకుని ఆ అరుగుమీద అలాగే పడుకుని ఉండిపోయాడు.
రాత్రి వెన్నెల పుచ్చపువ్వులా పరుచుకుంది. ఎక్కడా మానవ అలికిడి లేదు. భయంకరమైన ప్రశాంతత! సమయం ఎంతయిందో కూడా తెలియదు. ఇంతలో గుర్.....రు.....ర్.....అన్న ధ్వని-ఏదో నడుస్తున్న చప్పుడూ వినిపించింది. అతను మొదట తన బాధలో తానుండి పట్టించుకోలేదు. కానీ అది అంతకంతకూ దగ్గరవడంతో, నెమ్మదిగా రగ్గు తొలగించి చూశాడు. నల్లని తారురోడ్డు, వెన్నెలపడి మిలమిలా మెరిసిపోతుండగా, మధ్యలో నిలబడి రాజసంగా చూస్తోంది. "పెద్దపులి!" ఆ దృశ్యం చూడగానే ఆయన పై ప్రాణాలు పైనే పోయాయి. "ఇంకోరోజు నేను దీని బారినుంచి తప్పించుకోవడం కల్ల! నేను బ్రతికి బట్టకట్టడం, తిరిగి పంతులూ వాళ్ళని కలుసుకోవడం, బహుశా జరగవు" అని మనసులో అనుకుని, భగవన్నామం చేస్తూ పడుకున్నాడు.
అది నెమ్మదిగా, రోడ్డు మధ్యలో, ఈయనకి పది, పదకొండు అడుగుల సమీపంలో మేను వాల్చింది. మధ్య మధ్యలో తల తిప్పి, ఎర్రటి చింతనిప్పుల్లాంటి కళ్ళతో ఇటుకేసి దృష్టి సారించసాగింది. ఏమీ చెయ్యలేని దుర్భరమైన పరిస్థితి అతనిది. లేచి నిలబడడానికి శక్తిలేదు. ఏ చెట్టుమీదకో, ఎక్కడానికి అస్సలు ఆస్కారంలేదు. ఏదైతే అదే అవుతుందని మొండిగా కళ్ళు మూసుకుని, చెంపల మీదనుంచి కన్నీరు కారిపోతుండగా, జపంచేస్తూ పడుకున్నాడు. అక్కడున్న ప్రాణులు ఇద్దరే! ఒకరు ఈయన, రెండు పెద్దపులి!
కళ్ళు మూసుకుని సత్యనారాయణ ఆలోచించిసాగాడు. "నరవాసన పట్టెయ్యడానికి దానికెంతోసేపు పట్టదు. మొదటగా, మొండెం వేరు చేసేస్తుందా లేక కాళ్ళనించీ తింటూ వస్తుందా?" అని, "మొదట మెడకొరికేసి, ఆ తర్వాత తింటేనే మంచిది" అని కూడా అనుకున్నాడు. తను కళ్ళు తెరుచుకుని చూస్తుండగా, అది తనని పరపరా నమిలెయ్యడం, అనే వూహ అతను భరించలేకపోయాడు. అలా చాలాసేపు నరకమనుభవించాడు.
ఎంతోసేపటికి గజ్జెల కర్రలశబ్దం వినిపించసాగింది. అది దగ్గరవుతున్నకొద్దీ అతనిలో జీవితంపై ఆశ చిగురించసాగింది. నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు. కాగడాల వెలుగులో ఓ తండా జనం అటే వస్తున్నారు. అది వెంటనే లేచి, రోడ్డు ప్రక్కల చేలల్లోంచి అడ్డం పడి చిటికెలో మాయమయింది. గుండెలనిండా ఊపిరి పీల్చుకుని,. "దేముడున్నాడు" అనుకున్నాడు సత్యనారాయణ. ఓపిక చేసుకుని లేచి కూర్చుని వాళ్ళని కేకలువేసి పిలిచాడు. వాళ్ళు దగ్గరకొచ్చాకా జరిగిందంతా చెప్పి, తెల్లవారి బస్సు వచ్చేదాకా తనకి తోడుగా ఉండమని అర్ధించాడు. వాళ్ళకి 'షేర్' 'డర్' అన్న మాటలు అర్ధమయినట్లున్నాయి. "భయంలేదు" అని వీపు నిమిరి, బస్సు వచ్చేదాకా అతనికి సాయంగా వుండి, బస్సు వచ్చాక అతన్ని ఎక్కించి అప్పుడు వెళ్ళారు.
వాళ్ళే ఆ నిముషంలో అతని పాలిట దేవుళ్ళు!
కాలినడకన శ్రీహరిరావు బృందం సాయంత్రం ఆరు గంటలకి 'ఛత్రపూర్' చేరుకున్నారు. అప్పటికే సత్యనారాయణ అక్కడ వున్నాడు.
"పంతులూ! మళ్ళీ మిమ్మల్ని కలుస్తాననుకోలేదు." అంటూ వచ్చి వాటేసుకుని భోరుమన్నాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని ఓదార్చి, సంగతేమిటో కనుక్కున్నారు. అంతా విని అతని పరిస్థితి ఊహించుకుని అందరూ బాధపడ్డారు.