Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 9


    
    రవి లోపలికి వచ్చి పడుకున్న అక్కని చూసి ముఖం చాటు చేసుకుంటూ గబగబా దొడ్లోకి నడిచాడు.
    
    తమ్ముడి ప్రవర్తన కొత్తగా అనిపించి, తను కూడా మంచం దిగి పెరట్లోకి వెళ్ళిందామె.
    
    బావిలోంచి నీళ్ళ తోడుకుని మొహం, కాళ్ళూ చేతులూ రుద్దుకుని కడుక్కుంటున్నాడు రవి. అయినా బుగ్గలమీద నల్లని 'ఆయిల్' మరకలు కనిపిస్తూనే వున్నాయి. ఉస్సూరుమని నిట్టూరుస్తూ లోపలికి వచ్చేసిందామె. జరుగుతున్న సంఘటనలన్నీ ఆమె మనసుని కలచివేస్తున్నాయి. తల్లి ఇంట్లో లేదు. గుడికి వెళ్ళిందని చెప్పింది చెల్లెలు. బహుశా ఆ దేవుడు దూరంగా ఉండడం మూలాన యీ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుని సరి చెయ్యలేకపోతున్నాడూ తెలియజేద్దామని కాబోలు పాపం!
    
    రవి అక్కకి ఎదురుపడకూడదని తప్పించుకుని తిరగసాగాడు. అలా ఎంతసేపని తిరగగలడు రెండు గదుల కొంపలో!
    
    "రవీ!" పిలిచిందామె.
    
    రవి బెరుకుగా వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు.
    
    "ఈ సంచీ, డబ్బూ తీసుకెళ్ళి యీ చీటీలో వున్నవి తీసుకురా ఇంకో మాట! తప్పు చేసినవాళ్ళే భయపడతారు. తప్పు అని అనిపించిన ఏ పనైనా వెంటనే మానెయ్యాలి. అంతేకానీ తలవంచుకుని అనుక్షణం పిరికితనంతో బాధపడకూడదు" అంది స్థిరంగా పలుకుతూ.
    
    రవి తల ఎత్తి ధైర్యంగా అక్క కళ్ళలోకి చూస్తూ సంచీ, డబ్బులూ తీసుకుని వీధిలోకి నడిచాడు.
    
    చీకటిపడుతూ వుండగా తల్లీ, తండ్రీ వచ్చారు. ఆమె అప్పటికే వంట పూర్తిచేసి చెల్లెలికీ, తమ్ముడికీ పెట్టేసింది.
    
    తల్లీ, తండ్రీ చాలా రోజులకి నవ్వుతూ, సంతోషంగా ఇంట్లోకి రావడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది.
    
    "భోజనానికి రండి" అంటూ వడ్డించడానికి వెళ్ళిందామె.
    
    "నువ్వు తిన్నావా?" ఆప్యాయంగా అడిగింది సుభద్ర.
    
    "లేదు" చెప్పిందామె.
    
    భోజనాలై పక్కలు వేస్తుండగా తండ్రి ఓ కవరు తెచ్చి ఆమె చేతిలో పెట్టి "కృతి ఇవ్వలేదా?" అని అడిగాడు.    

    "ఇవ్వలేదు! ఏమిటిది?" అంటూ చూసింది. అప్పటికే చదివినట్లు గుర్తుగా కవరుచింపి వుంది.
    
    పైన 'ధర్మా ఎలక్ట్రానిక్స్' అని చదవగానే ఆమె నొసలు ముడి పడింది. క్రింద ధర్మానందరావుగారి సంతకం! మధ్యలో సారాంశం ఇలా వుంది 'మూడు వేలు జీతం యిస్తాం. వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరండి. అదీ ఓ రెండు రోజుల్లోగానే.
    
    ఉత్తరం చదివి తల ఎత్తి తల్లిదండ్రుల వైపు చూసింది. తండ్రి కళ్ళల్లో ఆనందం, తల్లి ముఖంలో నవ్వు! చాలా రోజుల తర్వాత చూసింది.
    
                                                               * * *
    
    "అయితే ఇప్పుడేం చేస్తానంటావ్?" తల వంచుకుని గడ్డి పరకలు తెంపుతున్న ధృతిని అడిగాడు నవీన్.
    
    "అదే అర్ధం కావడం లేదు" అంది నెమ్మదిగా.
    
    "అసలు ఆ ఉత్తరం వ్రాసి ఆయన్ని రెచ్చగొట్టకుండా ఉండాల్సింది" అన్నాడు నవీన్.
    
    "జరిగినదాని గురించి వద్దు. జరగబోయే దాని గురించి ఆలోచించు" అంది కాస్త విసుగ్గా.
    
    "ఏం వుందీ? పందెం, పట్టుదలా ముఖ్యమనుకుంటే మొన్న వ్రాసిన లాంటిదే ఇంకో ఉత్తరం వ్రాసి ఆయన ముఖాన కొట్టు ఆయన ఎంతో కదిలిపోయి "నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించు అంటూ ఆస్తి మొత్తం నీపేర రాసేస్తాడు" అన్నాడు సీరియస్ గా.    

    ధృతి ఉక్రోషంగా "నీకు నా పరిస్థితి నవ్వులాటగా వుందా?" అని అడిగింది.
    
    "అదొక పద్ద్తతి! లేదా ముసలాయన పంతానికిపోయి రెట్టింపు జీతం యిస్తానంటున్నాడు. ఇదే మంచి ఛాన్సు అని చేరిపోయి నువ్వు సుఖంగా వుండటం, నీ వాళ్ళని సుఖపెట్టడం...." తేలిగ్గా చెప్పేశాడు నవీన్.
    
    ఆమె ఆలోచనగా అంది. "కానీ ఆయన ముందుకి వెళ్ళి ఉద్యోగానికి ఒప్పుకుంటున్నట్లు ఎలా చెప్పను? 'చూశావా నీ వాళ్ళకి నీ డబ్బే ముఖ్యం' అన్నట్లు హేళనగా చూసినా కూడా భరించలేనే!" నవీన్ ఆమె కళ్ళలోకి కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ - "అంటే ఉద్యోగం చెయ్యడానికి మానసికంగా సిద్దమయిపోయావన్నమాట!" అన్నాడు.
    
    ఆమె తప్పుచేసినట్లు తల వంచుకుని "తమ్ముడూ, చెల్లెలి భవిష్యత్తు అమ్మ ఆరోగ్యం, నాన్నగారి అశక్తతా అన్నీ తెలిసీ, ఇలాంటి అవకాశం వదులుకుని వాళ్ళని కష్టపెట్టి, నేను సాధించేదేమైనా వుందా? వాళ్ళకోసం నా పంతాన్ని..." అంటూ వుండగానే ఆమె కళ్ళలోంచి కన్నీళ్ళు జలజలా కారిపోయాయి.
    
    నవీన్ కర్చీఫ్ తో ఆమె కళ్ళు అద్ది "సమస్యలు రావడం కూడా మంచిదే! అవి మనసుని ఆలోచింపచేస్తాయి చూశావా?" అన్నాడు.
    
    ఆమె అతని చేతిని అలాగే పట్టుకుని "నవీన్" అంది ఆర్తిగా.
    
    నవీన్ ఆమె తలమీద తన చేతిని వుంచి నిమిరాడు.
    
    విరుద్దమైన భావాలున్నా ఫరవాలేదు. ఒకేలా స్పందించే హృదయముంటే చాలు, మంచి స్నేహితులవుతారు.
    
                                                              * * *
    
    "నాకు చాలా సంతోషంగా వుంది" అన్నాడు నవ్వుతూ ధర్మానందరావు.
    
    ధృతి మాట్లాడకుండా సూటిగా ఆయన కళ్ళలోకి చూసింది.
    
    "నువ్వు ఉద్యోగంలో చేరుతున్నావని కాదు నా సంతోషం. నువ్వు వ్రాసిన "సుమహారం' లో పువ్వుకీ పువ్వుకీ మధ్య డబ్బు అనే ముడివుందని నువ్వు తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది....." అన్నాడు వ్యంగ్యంగా.
    
    ధృతి స్థిరంగా పలికే కంఠంతో "పొరపాటుపడుతున్నారు! పువ్వుల మధ్యన అనురాగ బంధనాలు వుంటాయి. అవి డబ్బు ముడులుగా పొరపాటు పడుతున్నారు" అంది.
    
    ఆయన తీవ్రంగా "అయితే డబ్బుకోసం కాదా..... నీ కుటుంబం నిన్ను విడిచి వుండటానికి ఒప్పుకున్నదీ...." అన్నాడు.
    
    "డబ్బు కోసమే! కానీ వాళ్ళు పంపలేదు "నేనే వచ్చాను. ఈ డబ్బుతో నావారి అవసరాలన్నీ తీరతాయి. అలాంటప్పుడు నేను వాళ్ళని వదిలివుండడం అనే త్యాగం చేస్తేనేం అనిపించింది. అందుకే వచ్చాను. ఇలా దూరంగా వుండడంవల్ల మా మధ్యన అనురాగం మరింతగా గట్టిపడుతుంది. కానీ తెగిపోదు" అంది ఆవేశంగా.

 Previous Page Next Page