"ఇంతకీ ఆ కేశవరావు కొడుకు ఏదో ఎరువుల ఇంజనీరింగు చదివాడట కదన్నయ్యా!"
మాధవ్ వెనక్కి తిరిగి చెప్పాడు. "ఎరువుల ఇంజనీరింగు కాదు, కెమికల్ ఇంజనీరింగు!"
"మాకు తెల్సులేవో..... పెద్ద ఇంగ్లీషు తెల్సినోడిలా చెప్పొచ్చాడు! కెమికల్స్ అంటే మందులు. నేను స్కూల్ ఫైనల్! తెలుసా?" క్రాఫ్ ఎగరేసి చేత్తో దువ్వుకుంటూ అన్నాడు గణపతి.
"తెలిసింది.....!" అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మాధవ్.
"ఎళ్ళగానే.... ఆ ఒళ్ళు కడుక్కోడం మరిచిపోకు!" అని సన్యాసిరావు అరవగానే అందరూ విరగబడి నవ్వారు.
"మా కేశవుడి కొడుకు అమెరికాలో ఇంజనీరింగ్ చేసొచ్చాడా? అదృష్టం అంటే ఆడిదేరా!" ఆనందంగా అన్నాడు సుబ్బారాయుడు.
ప్రకాశం ఏదో ఆలోచించి, "కేశవరావుకి అన్నయ్యేగా ఈ సీతారామయ్య.....ఆయనతో ఈ కుర్రాడికేం పనో?" అన్నాడు.
"ఆయన అప్పుడప్పుడూ పట్నంనుండి నల్లమందు తెప్పించుకుంటాడులే!" అన్నాడు సన్యాసిరావు.
"అయ్యుండొచ్చు!" ఒప్పుకున్నాడు ప్రకాశం.
అందరూ కాసేపు కేశవుడి అదృష్టాన్నీ, కేశవుడి లాంటి మిత్రుడున్న సుబ్బారాయుడి భాగ్యాన్నీ పొగిడి ఎవరిళ్ళకు వారు బయలుదేరారు.
* * *
చాలా పాతకాలపు పెంకుటిల్లు అది. మేఘాలు మోసుకుపోతున్న వెలుతురు ఆకాశంలో అక్కడక్కడా తళుక్కున మెరుస్తోంది! ఇంట్లో అంతా చీకటే మిగిలింది. గూట్లో సంజెదీపం ఒంటికంటితో చూస్తోంది.
మాధవ్ తలవంచి గుమ్మంలోంచి లోపలకు వెళ్ళాడు. ఉయ్యాల బల్ల గొలుసుల చప్పుడు వినిపిస్తోంది. దానిమీద కూర్చుని కళ్ళద్దాలు సవరించుకుంటూ 'సర్వ కర్మాణి మనసా సన్న్వస్సాస్తే సుఖం వశీ!" అని భగవద్గీత చదువుతున్న వృద్దుడు "పెద్దనాన్నా," అన్న పిలుపుకి తలెత్తి చూశాడు.
అందంగా, ఆధునికంగా, అంతకుమించి హుందాగా ఉన్న యువకుడ్ని ఆశ్చర్యంగా చూశారు.
అతను ముందుకు వచ్చి ఆయన పాదాలకి నమస్కరించి, "నేను మాధవ్ ని పెద్దనాన్నా!" అన్నాడు.
ఆ పేరు వినగానే ఆయన మొహంలోకి వెలుగూ, కళ్ళల్లోకి నీరూ ఒకేసారి వచ్చాయి. "నువ్వు... నువ్వు.... నా మాధవుడివా? ఎంత పెద్దయిపోయావురా?" ఆప్యాయంగా అతని చెంపలు నిమురుతూ అన్నాడు.
"నువ్వూ పెద్దయిపోయావు పెద్దనాన్నా "పక్కనే ఉన్న ఆయన చేతికర్రని చూస్తూ అన్నాడు మాధవ్.
"ఈ పెద్దనాన్న కోసం ఇంత దూరం వచ్చావా?" వణుకుతున్న కంఠంతో అడిగాడు సీతారామయ్య.
"దూరం అనేది కిలోమీటర్లతో కొలిచేది కాదు పెదనాన్నా! మనస్సులో ఆలోచనలమీద ఆధారపడుతుంది. నాకు పెద్ద దూరం అనిపించాలేదు. నువ్వు నాకు దగ్గర కాబట్టీ!" చిరునవ్వుతో చెప్పాడు మాధవ్.
నిలువెత్తు తమ్ముడి కొడుకుని కళ్ళారా మళ్ళీ మళ్ళీ చూసుకుంటే దిష్టి కొడుతుందేమోనని ఆయన తల తిప్పుకుని "నేను బియ్యం కడిగి పొయ్యి మీద పెడతాను. ఇంతలో నువ్వు స్నానంచేసి, రా!" అన్నాడు.
"నువ్వేం శ్రమపడకు! నేను స్నానం చేసొచ్చి, చిటికెలో వండిపెడతాను!" అన్నాడు మాధవ్.
ఆయన నవ్వి, "అలాగేలే... కాగులో వేడినీళ్ళున్నాయి. పద!" అన్నాడు.
పేడతో అలికి పిండితో ముగ్గులు పెట్టిన ఇల్లు పర్ణశాలలా మెరుస్తోంది. ఉట్టిమీద నుండి పెరుగు తప్పేళా తెచ్చి, "ఇంకాస్త మీగడ పెరుగు వేసుకో!" అంటూ మాధవ్ కంచంలో గుమ్మరించాడు సీతారామయ్య.
"కడుపు నిండిపోయింది పెద్దనాన్నా!" గునిసాడు మాధవ్.
"ఈ పచ్చడి మెతుకులకే!" కాస్త నొచ్చుకుంటూ అన్నాడు.
"కందిపచ్చడీ, పచ్చిపులుసూ, మీగడ పెరుగూ.... ఇంతకన్నా రుచికరమైన భోజనం ఏవుంటుంది పెద్దనాన్నా?" అని ఆగి, ముద్దమింగి "రుచి తింటున్న పదార్ధాన్ని బట్టి రాదు, పెద్దనాన్నా! అది పెడుతున్న మనసుని బట్టి వస్తుంది!" అన్నాడు.
ప్రతి విషయానికీ కొత్త వివరణ ఇస్తున్న ఆ నవయువకుడిని విప్పారిత నేత్రాలతో చూశాడా వృద్దుడు.
దోమతెర కట్టిన తెల్లని పరుపుమీద నడుంవాల్చి పెద్దనాన్నతో చాలాసేపు అమెరికా ముచ్చట్లు చెప్పాడు మాధవ్.
కాసేపటికి ఆయన గురక పెట్టడం వినిపించి చెపుతున్నది ఆపేసి, లేచి వెళ్లి ఆయన గుండెలదాకా దుప్పటి కప్పి వచ్చాడు.
రెండు చేతులూ తలకింద పెట్టుకుని పడుకుని ఊళ్లోకి అడుగుపెట్టగానే కోవెలలోని కోమలి దర్శనాన్ని గుర్తుచేసుకున్నాడు.
రెండు ఆకుల మధ్యన చినుకు పుట్టినట్లుగా! సన్నని పెదవుల చాటున విరిసీ విరియని నవ్వులా! అప్పుడే రేకు విడిచిన పువ్వులా! ఎంతటి ముగ్ధత్వం!! ఎంత సౌకుమార్యం!!
"తీయని మల్లెపూదేన సోనల పైని" తూగాడు తొలిరాకు దోనెవోలె తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో బయనమై పరువెత్తు కోయిల పాటవోలె....!"
దిండు స్థానభ్రంశం చెంది అతని తలకిందనుండి గుండెలమీదకి ఎలా వచ్చి చేరిందో అతనికే తెలియదు.
ఇదే, వయసు వచ్చిన తరువాత ఈ రకమైన ఊహలతో అతను చేసిన మొదటి జాగారణ!
అరచేతిని కళ్ళముందు పెట్టుకుని ఆమెను స్పృశించిన వేళ్ళని ముద్దుపెట్టుకున్నాడు.
సిగ్గుతో అలవోకగా తల వంచుకుని అంతలోనే కనురెప్ప పరచాలను ఎత్తి తన చూపుల తుమ్మెదలకు జడిసి సుతారంగా కన్నులు వాల్చి....అంతలోనే తన తుమ్మెదరెక్కల చిరుగాలులకి పరవశించి.....బరువైన నిట్టూర్పుని లేత గుండెలపైన మోసి.....ఇంకా మోయలేక గాలిలో వదిలేసి.....ఉచ్చ్వాస నిశ్వాసాలకి శ్రద్ధతో శ్రుతిచేసి, కాలి మువ్వలను లయగా వాటితో జతచేసి.....ఓహ్.....! ప్రతిదీ ఇంత పోయెటిక్ గా చేస్తే ప్రతి నిముషం ఒక రసరమ్యకావ్యం కాదూ! జీవితం ఒక రసాతలం అవదూ! ఆ చెరిగిన కుంకుమ రేఖలలో.... వీడిన జడపాయలలో......చెదిరిన చీర కుచ్చిళ్ళలో.....కరిగిన కాటుక చారలలో.....మేనంతా పరుచుకున్న సుగంధాలలో.....చెక్కిళ్ళ వెన్నెలలో..... మందహాస మలయా పవనాలలో.....వెతుకుతున్న తీగ చటుక్కున కాలికి చుట్టుకున్నట్లయింది!