చిల్లర దేవుళ్ళు
------దాశరథి రంగాచార్య రచనలు
గడీ (దొరలుండేమేడ) గేట్లో అడుగుపెట్టిన సారంగపాణికి బంకు(కొలువు కూటం)ల్లో బల్లపీట మీద కూర్చున్న రామారెడ్డిగారు కనిపించారు. బట్టతల, కొలముఖం, పెద్ద కళ్ళు, పొడవైన ముక్కు, చూడ్డానికి నలభై లోపలివారుగా కనిపించినా, దబ్బపండు లాంటి ఛాయగల ఆయనకీ వాస్తవంగా యాబహి దాటేయి. శరీరం దృఢమైంది కావడం మూలాన ఒక పదేళ్ళు తక్కువగా కనిపిస్తారు. ఆయనే ఆ గ్రామ ప్రభువు - దేశ్ ముఖ్.
రెడ్డిగారు కూర్చున్న బల్లపీట కెదురుగా మరో బల్లపీటుంది. దానిమీద కూర్చుని ఉన్నారు నలుగురు - గ్రామ ముఖ్యులు.
సారంగపాణి వయొలిన్ కేసుతో మెట్లదగ్గరికి వెళ్ళి నమస్కరించాడు రెడ్డి గారికి. గమనించలేదు రెడ్డిగారు. నించున్నా డక్కడే వాళ్ళ సంభాషణ వింటూ.
"వాండ్లే దరఖాస్తు లిచ్చిన్రట కాదుండి?" నారయ్య ప్రశ్నించాడు.
"నాటక మాడ్తున్నరుగానీ మాల మాదుగులకు దరఖాస్తులియొచ్చే ఊళ్ళ మేమెందుకు? గడ్డపు తురుకోడు ఊళ్ళకొచ్చినాడే అనుకున్న ఊరికి శనిపట్టిందని. వాడే అంగుష్త్ నిషా(వ్రేలిముద్రలు)న్లేయించుకు పోయుంటడు." వివరించాడు కరణం వెంకట్రావు రెడ్డిగారివైపు చూస్తూ ఆయన వ్యాఖ్యానం ఆశిస్తున్నట్లుగా.
"మాదిగ మాల లం-కొడుకులు తురకల్ల కలుస్తే నిలుస్తారు భూమ్మీద! ఇగ బేగారేం (వెట్టిపని) చేస్తరు? రాజ్యాలేల్తరేమో రాజ్యాలు!" అని తుపుక్కున ఊశాడు రెడ్డిగారు.
"సర్కార్ వాండ్లది. మున్సఫ్ సబ్, ఆమీన్ సాబ్ తాసిల్దార్ వస్తున్నరట వాండ్లకు ఖిలాఫ్ (వ్యతిరేకంగా) చెప్పుతే ప్రజల్చేతులుంటారా?" సందేహం వ్యక్తపరచాడు కరణం వెంకట్రావు.
నారయ్య యేదో చెప్పబోయి కరణం వైపూ, రెడ్డిగారు వైపూ చూచి మాట మింగేశాడు.
"హు- వీండ్లెమో తురకల్ల కలుస్తరు. వాండ్లేమో తురకల్ల కలుపుతరు. ఇంతేజాము (ఏర్పాట్లు) లేమొమనం చెయ్యాలే! మన ముందర్నే జుట్టు మొల్తాళ్ళు కోస్తరేమో!" నిస్సహాయత వెలిబుచ్చాడు రెడ్డిగారు.
"పట్నం నుంచి కూడా ఎవరో వస్తాన్రట కాదుండ్రి?" ప్రశ్నించాడు నారయ్య.
"బహల్దూర్ యార్ జంగ్, వాడే ఇత్తేహాదు ల్ముసల్మీన్ శురు (ఆరంభం) చేసింది. ఈ తురకల్ల కలపటం కూడా వాని పనే. శానమందిని తురకల్ల కలిపినందుకు ఖితాబి(బిరుదు)చ్చిండట హుజార్ (నైజాంనవాబు) బహద్దూర్ ఖా పొయ్యి బహద్దూర్ యార్ జంగయ్యిండు." కరణం తన సర్వజ్ఞతను వెల్లడించాడు.
"అయితే ఇంతజాములు మెడకు పడ్డట్లే నంటవు." బహద్దూర్ యార్ పేరు విని లొంగారు రెడ్డిగారు.
"వారు ప్రభువులు, మనం ప్రజలం, ఇసం తినమన్నా తినాలే" నారయ్య అన్నాడు.
మౌనమే రాజ్యం చేసింది కొన్ని క్షణాలు.
సారంగపాణి మెట్లెక్కాడు. స్తంభం దగ్గర నుంచొని మళ్ళీ నమస్కరించాడు. రెడ్డిగారు గమనించలేదు. మిగతావారు చూచి చూడనట్లు ఊరుకున్నారు. వయొలిన్ కేసు క్రింద పెట్టి, కండువా సర్దుకొని, స్తంభానికి అనుకొని నుంచున్నాడు పాణి, రెడ్డిగారు తనవైపు చూచినప్పుడు వారి దృష్టిలో పడాలనే సంకల్పంతో, రెండుసార్లు వినయమంతా ముఖంలో కేంద్రీకరింపజేసి నమస్కరించాడు. చూచినా చూడనట్లు నటించారు రెడ్డిగారు.
"చింతల్తోపుల దింపుదమా?" మౌనాన్ని భంగం చేస్తూ ప్రశ్నించాడు కరణం రెడ్డిగారి ముఖంలోని ఉద్రేకం తగ్గిపోవడాన్ని గమనించి.
"అట్లనే బాగుంటది. ఊళ్ళ కెందుకింక? ఊరిబైటనుంచి వెళ్ళగొడ్తేసరి" అన్నారు రెడ్డిగా ఆమోదం వ్యక్తం చేస్తూ.
మాల మాదుగుల్ను ఎట్టి పట్టొద్ద.... "కోమటి కిష్టయ్య మాట పూర్తికాకుండానే ఉరిమారు రెడ్డిగారు.
"హు - ఎట్టి పట్టొద్దు ఎట్టి. నెత్తి కెక్కించుకుంటం. ఎట్టి కొటురి లం- కొడుకుల్ను. ఊళ్లుంటరో ఊరిడిచి పోతరో చూస్త. తురకల్ల కలుస్తరట తురకల్ల!" రెడ్డిగారి కళ్ళెర్రపడ్డాయి.
"ఎట్టి కొట్టకుంటే ఎళ్ళుతాడుండి?" వంత పాడాడు కోమటి ఎంకయ్య.
"పందిళ్ళేయించొద్దు మరి?" అడగ్గూడదనుకుంటూనే అడిగాడు కరణం.
"బండ్లు ఎట్టిపట్టి మాదిగోండ్లం తోలురి అడవికి, వాసం తెప్పిచ్చురి. గౌండ్లోండ్లను తాటాకు కొట్టియ్యమనురి. సుత్లిగిట్ట (పురికొస మొదలైనవి) కోమటోండ్లకు కట్టున్రి" అని కోమట్ల వైపు చూచారు, రెడ్డిగారు.
"ఇస్తంలేరి" అన్నారిద్దరూ, ఒకరు మొఖాలు ఒకరు చూచుకొని ఇది తప్పేది కాదన్నట్టుగా.
అడగాల్సిన వాటిని గురించి కరణం ఆలోచించసాగడంతో మౌనం వెలిసింది కొన్ని క్షణాలు.
పాణి అలసి ఉన్నాడు. ఆదరణ కోసం తపిస్తున్నాడు. మరొకసారి నమస్కరించాడు. రెడ్డిగారు చూడలేదు. ఒక్కింత చిరాకుపడ్డాడు పాణి. ఇన్నిసార్లు నమస్కరించినా గమనించడేం రెడ్డి? దుఃఖంతో, ఆవేశంతో గొంతు పూడుకొనిపోయింది. ఎంతో దూరం నుంచి వచ్చిన శ్రమ వృధా అవుతుందా? ఈ రెడ్డికి ఇంత గర్వమేం? వయొలిన్ కూడా పట్టుకొని సాక్షాత్తు సంగీతరూపంలో తాను అవతరిస్తే కనీసం పలుకరించడే! తనను చూచికాకున్నా ఫిడేల్ను చూచి పలుకరించవచ్చునే! అంతకంటే అవమానం ఏం జరగాలి? మెట్లు దిగి వెళ్ళిపోదామానుకున్నాడు. అందువల్ల ప్రయోజనం లేదనుకున్నాడు. వాస్తవంగానే తనను చూడలేదేమో! కావచ్చు. గంభీరమైన విషయాలు మాట్లాడ్తున్నారు. రామారెడ్డి రసికుడనీ ఉదారుడనీ కదా తాను వచ్చింది? ఓపిక పట్టడం మంచిదనుకున్నాడు. కండువాతో ముఖం తుడుచుకొని, చేతులు కట్టుకొని నుంచున్నాడు.
"స్టేషనుకు బండ్లు పంపాలే ఊళ్లున్న బండ్లన్నీ ఎట్టి పట్టాలే బస్తీగ్లిట్ట పోకుండ చూడుండి." ఆదేశించారు రెడ్డిగారు.
"అట్టనే" అన్నాడు కరణం పరధ్యానంగానే.
"గొల్లోండ్లను పట్టి గొర్లు తెప్పించాలే. ఎన్ని కావాల్నో? ఎంత మందొస్తరో?" లెక్క వేసుకోసాగారు రెడ్డిగారు.
"అన్నట్లు యాదమరచిన (జ్ఞాపకం), ఆవును తెప్పించాల్నట కొయ్యటాన్కి" అమాంతంగా స్పురించినట్లనేశాడు కరణం.
"హు ఆవును సుత (కూడా) మనతోనే తెప్పిస్తన్రులే చూడబోతే మనతోనే కోపిచ్చేటట్లున్నరు." ఉద్రేకంలో గొంతుపూడింది. క్షణం తరువాత "నిజామొద్దీనుకు కట్టండి ఎట్లన్న ఏడుస్తడు" అన్నారు.
"మంచిమాట చెప్పిన్రు దొరవారు." కోమటి ఎంకయ్య నవ్వి "ఎవని చేతులు వాని నెత్తిమీదనే పెట్టాలే" అన్నాడు.
రెడ్డిగారు పొంగిపోయారు. మీసం సైతం మెలేశారు.
కరణం చిన్నబుచ్చుకుని "అయితే వస్తమరి" అని లేచాడు. అతనితో మిగతావారు లేచారు.
"అచ్చా! జర్ర (కొంచెం) ఇంతే జాములు మంచిగ చూడున్రి, పొద్దుస్తే ఆ కొడుకుల్తోనే పనిబడ్తడి" అంటూ లేచారు రెడ్డిగారు.
"సరే" అన్నాడు కరణం ఆ పురమాయింపు నచ్చనట్లు.
అందరూ నమస్కరించారు.
సాగనంపడానికి రెండు మొట్లు దిగారు రెడ్డిగారు. పాణి పక్కనుంచే వెళ్ళారాయన. ఆయన సారంగపాణి నమస్కారాన్ని గమనించనూ లేదు, ప్రతినమస్కారం చేయనూ లేదు. గేటు దగ్గర రెండు చేతులు కట్టుకొని నుంచున్న మనిషి కనిపించాడు రెడ్డిగారికి: తలగుడ్డ, మోకాలి వరకు పంచె, వంటిమీద గుడ్డలేదు. నల్లని ముడతలు పడిన శరీరం. ఎంతో సేపన్నుంచి రెడ్డికోసం ఎదురుచూస్తున్నట్టు అతని కండ్లు చెపుతున్నాయి. రెడ్డిగారిని చూచి వంగి, రెండు చేతులూ నేల కంటించి, ముఖానికి తాకించుకొని నమస్కరించాడతను. రెడ్డిగారు నమస్కారం చేయలేదు కాని-
"ఏమ్ర పుల్లిగ ఏడ్కో వచ్చినవు?" అని అడిగారు.
"నీ కాల్మొక్త బాంచెను (బానిసను)! బిడ్డకు లగ్గం కుదిరిందుండి"
"ఏం చెయ్యమంటవ్?"
"రెండు కుండల గింజలు, ఇరవై రూపాయలిస్తే మాట దక్కుతదుండి." నసిగాడు.
"పోయినేడాది పెండ్లన్నవు. గింజలతీస్కపోయినవు. తాగినవు. మీ కులమే అట్లరా. ఒక్క గింజ ఇయ్యనపో. తురకల్ల కలుస్తరేమో కదరా, పోయి వాండ్లనే అడుక్కోన్రి."
"అట్లంటేమే మెట్ల బతుకతముండి? పోయినేడాది లగ్గానికిచ్చిన గింజలు లచ్చి చావుకైనయిండి. తాగి చచ్చినాముండి, నీ గులాపోన్ని (సేవకుణ్ణి)." కండ్లు చెమ్మగిల్లాయి. చేతుల్తో కండ్లు తుడుచుకొని "మేం కలుస్తమన్నామున్రి? గడ్డపు తురుకోడొచ్చిండు, బావుల్తవ్విస్తనన్నడు. భూములిప్పిస్తనన్నడు. ఆశకాదుండి నీ కాల్మొక్త, తురకోల్లమైతేం, మాదిగోళ్లమైతేం , మీ కాళ్ళకాడ పడుండేటోండ్లమే కాదుండి?" అన్నాడు మరొక సారి వంగి దండంపెట్టి.
"చావన్న, పేండ్లన్న తాగుడే కాదుర మీకు. అప్పుడది చచ్చిందని తాగిన్రు, ఇప్పుడు దీని లగ్గమని తాగుతరు. ఏమైన తగలబడ్రుని, గింజలు కొలిపిస్త పైకాని కెల్లుండి రా!"
"నీ బాంచను దరమ దొరలు" అని, నేలకు చేతులానించి మొక్కాడు మూడుసార్లు.
"ఎంకటిగా! పుల్లిగానికి రెండు కుండల గింజలు కొల్వు" అని కేకవేసి వాడు విన్నదీ లేనిదీకూడా గమనించక వెనక్కు తిరిగి మెట్లెక్కారు రెడ్డిగారు.
స్తంభం దగ్గరికి రాగానే దండం పెట్టాడు పాణి.
బల్లమీద కూర్చుంటూ అడిగారు రెడ్డిగారు "ఎవరు నువ్వు" అని.
"నా పేరు సారంగపాణండీ"