అనిత
- డా|| సి|| ఆనందారామం
"ప్రియమైన అత్తయ్యకి,
నేను రేపు బయలుదేరి మీ ఊరు వస్తున్నాను. అక్కడి మా పొలం వ్యవహారాలు పరిష్కరించుకొనే వరకూ మీ ఇంట్లోనే వుంటాను.
నమస్కారాలు.
నీకోడలు.
అనిత......
ఉత్తరం చదవటం పూర్తి చేసినా మతిపోయినా దానిలా చూస్తూ కూర్చుంది శారదమ్మ,
"ఏమిటమ్మా అది? ఎవరి దగ్గరనుండి?"
కూతుహలంగా అడిగాడు రాజారావు. ఉలిక్కిపడింది శారదమ్మ.
"అనిత రాసింది. ఇక్కడికి వస్తోందట!"
ఈ మాటలు వినగానే శారదమ్మకంటే ఎక్కువగా వులికి పడ్డాడు రాజారావు.
అతని కనుబొమలు ముడిపడ్డాయి. "అనిత రాసిందా? అక్కడికి వస్తోందా? ఎందుకు?"
"పొలం వ్యవహారాలు పరిష్కరించుకోడానికట !"
"దానికి ఆవిడెందుకు రావటం! మావయ్య రావచ్చుగా!"
శారదమ్మ సమాధానం చెప్పలేదు. బేలగాచూసి వూరుకుంది.
"మగవాళ్ళు చేసుకోవలసిన పనులకి తను తయారవటం దేనికి? అంతేలే! ఎవరి సంతానం మరి!"
వెటకారంగా అన్నాడు రాజారావు.
అప్పటికీ శారదమ్మ మాట్లాడలేదు.
"మా ఇంట్లోదిగటానికి వీల్లేదని ఖండితంగా రాసెయ్యి - ఒంటరిగా పొలం వ్యవహారాలు పరిష్కరించుకోటానికి రాగలిగిన వ్యక్తి ఒంటరిగా నివసించలేకపోలేదు"
కచ్చితంగా అన్నాడు రాజారావు.
శారదమ్మ ముఖం పాలిపోయింది.
కొన్నిక్షణాలు మాట్లాడకుండా మారుకుని ఎలాగో గొంతు పెగల్చుకుని "పోనీ, రానియ్యరాదురా! కొన్నాళ్ళు మనింట్లో ఉంటుంది. నీ స్నేహితులెంతమంది ఎన్నిరకాల వాళ్ళు మనింట్లో ఉంటుంది. నీ స్నేహితులెంతమంది ఎన్నిరకాల వాళ్ళు మనింట్లికి రావటంలేదూ? సొంత మేనకోడలు! ఆ మాత్రం ఉంచుకోలేనూ?" అంది.
రాజారావు విస్తుపోయి చూశాడు. అతనికి జ్ఞానం వచ్చిన దగ్గిర నుండీ చూస్తున్నాడు.
శారదమ్మ ఎన్నడూ ఎవరి మాటలకు ఆవునినకాని కాదనికాని అనలేదు.
ఆవిడ నోట్లో ఎప్పుడూ "అలాగే" అన్న పదం సిద్దంగా వుంటుంది.
ఎవరేం చెప్పినా వెంటనే "అలాగే" అనేస్తుంది.
భర్త బ్రతికి ఉన్నన్నిరోజులూ అలాగే అంది. కొడుకు ప్రాజ్ఞుడయి యాజమాన్యం స్వీకరించాకా అలాగే అంటోంది.
తల్లి ఈ బేలతనం చూసి రాజారావు అనేకసార్లు జాలిపడినా అప్పుడప్పుడు చికాకుపడక పోలేదు.
ముఖ్యంగా తండ్రి చేసిన అప్పుల జాబితాలు తలచుకున్నప్పుడల్లా ఈ చికాకు ద్విగుణీకృతమవుతూ వుంటుంది.
తన తల్లి మరీ ఇంత అమాయకంగా అన్నింటికీ 'అలాగే' అనకుండా వుంటే తన తండ్రి ఇంత వ్యసనలోలుడయి ఇన్ని అప్పులు చేసేవాడు కాదేమో!
భర్తకు విధేయురాలై ఉండటం భార్య ధర్మం కావచ్చు.
కానీ,
తన గృహాన్ని చక్కదిద్దుకోవటం గృహిణి ధర్మం కాదా?
ఎప్పుడూ అన్నింటికి గానుగెద్దులాగా తల ఊపే తల్లి ఈనాడు స్వతంత్రించి ఇన్ని మాటలాడేసరికి ఆశ్చర్యంగా చూశాడు.
శారదాంబ ఏదో ఆవేశంలో అన్ని మాటలందేకాని వెంటనే తన మాటలకు తనే ఆశ్చర్యపోయి భయంగా బేలగా కొడుకు వంక చూసింది.
ఆ చూపులకు తట్టుకోలేక పోయాడు రాజారావు.
"సరే! రమ్మని రాయి."
అన్నాడు పొడిగా___
"నీకు కష్టంగా వుంటే ......"
"నట్టుతూ ఆగిపోయింది శారదమ్మ "నాకు కష్టంగా వుంటే వుంటుంది. నాకు సాధ్యమయినంతవరకూ నీ యిష్టాన్ని కూడా గౌరవిస్తాను."
నడిచిపోతున్న కొడుకును వెనుకనుండి చూచి లోలోపల నిట్టూర్పు విడుచుకోంది శారదాంబ.
అంతా తండ్రి రూపమే!
కానీ, స్వభావాలతో ఎంత వైరుధ్యం!
"నాకు సాధ్యమయినంతవరకూ నీ యిష్టాన్ని కూడా గౌరవిస్తాను."
"ఎన్నాళ్ళకు వింది తను ఇలాంటి మాట!
మొదటినుండి తనది సాత్త్విక స్వభావమే!
వాదాలకూ యుద్దాలకూ కాలుదువ్వటం ఏనాడూఇష్టం లేదు.
ఏదో సందర్భంలో భర్త అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏదో చెప్పబోయింది.
కస్సుమన్నాడు భర్త.
"బ్రతకటమెలాగో మాకు తెలుసు. ఈ నాడు నువ్వు నాకు బోధించక్కర్లేదు, నోరు మూసుకుని ఇల్లు చక్కదిద్దుకో!"
తను పైకి ఎంత కఠినమో, మనసంత సున్నితం.
ఆ రోజు మనసు తీవ్రంగా మథనపడింది. ఆ తర్వాత ఏనాడూ ఏ సందర్భాలోనూ తానై కలిగించుకోలేదు.
ఆ యాంత్రికమైన అలవాటు రానురాను తన వ్యక్తిత్వంలో ఒక భాగమై పిల్లల ముందు కూడా అలాగే నిలబడింది.
ఈ నాటికి తన రాజా 'నీ యిష్టాన్ని గౌరవిస్తాను' అంటున్నాడు.
ఎంతవరకు గౌరవిస్తాడు? తన అంతరాంతరాల్లో కోరిక నెరవేరుతుందా?
ఇంటిముందు ఒక్కసారిగా సందడి చెలరేగింది.
కన్న ఎందుకో అరుస్తున్నాడు.
కమల పకపక నవ్వుతోంది.
సుశీల ఇంట్లోకి వస్తూ కూడా పుస్తకం చదవటం మానలేదు.
పిల్లలంతా ఇంటి కొచ్చారు.
శారదాంబ లేచింది.
పిల్లలకు త్వరగా కాఫీ ఫలహారాలు అందించాలనే ఆరాటంలో ఆవిడ ఆలోచనలు ఎక్కడి వక్కడ ఎగిరిపోయాయి.