Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 2

 

    ఆ మరునాడు దొడ్లో పాదులకు నీళ్ళు పోస్తున్న తనను బాబాయ్ "మాధవా" అని పిలవటంతో హడలిపోతూ వెళ్ళాడు.
    అక్కడ కాత్యాయని , పిన్ని కూడా వున్నారు. పిన్ని ముఖం ఎందుకో మరింత దుమదుమలాడుతుంది. "మా అక్కయ్య నిన్ను పెంచు కుంటుందిట! వెళ్తావా!" గంభీరంగా అడిగాడు బాబాయ్.
    తెల్లబోయి అందరి వంకా అయోమయంగా చూశాడు మాధవ.
    "ఏం బాబూ! నాకెవ్వరూ లేరు. నువ్వు  రావా నా దగ్గరికి?" ఎంతో ఆప్యాయంగా అడిగిందావిడ.
    "పిన్ని వెళ్ళమంటే ...." భయంగా పిన్ని వంక చూస్తూ అన్నాడు తను.
    "బుద్దిమంతుడవే!" నవ్వింది ఆవిడ.
    'అక్కడికి నా నోటిమీదే నడుస్తున్నట్లు ....." రుసరుసలాడింది పిన్నీ.
    "రేపే వెళ్దాం. ఏం తమ్ముడూ! తీసి కెళ్ళనా?" బాబాయ్ ని చూస్తూ అంది ఆవిడ.
    "నీ యిష్టం. యిన్నాళ్ళూ గోపిని పెంచుకుంటానని.....యిప్పుడు..... "కొంత నిష్టూరంగానే అన్నాడు బాబాయ్.
    తేలిగ్గా నవ్వేసింది ఆవిడ.
    "గోపికి స్వంత తల్లీ తండ్రి ఉన్నారు. నేనీ పెంచుకోవడం దేనికి? ఎవరూ లేని మాధవే కావాలి నాకు."
    స్వంత తమ్ముడి మనసుకి కష్టం కలిగినా, మరదలు స్పష్టంగా అసహనాన్ని వ్యక్తపరిచినా తనను తీసుకెళ్ళటానికే నిర్ణయించుకుంది ఆవిడ. అప్పుడు "ఇలా జరుగుతుందని తెలిస్తే ఈ ముష్టి వెధవని తీసుకొచ్చేదాన్ని కాను" అని పిన్ని సనుక్కోవటం స్పష్టంగా వినిపించింది తనకు.
    ఆ మరునాడే కాత్యాయనితో వచ్చేశాడు తను. కాత్యాయని అండ చేరినప్పటి నుంచీ తను అనాధననే విషయం గుర్తేరాలేదు మాధవకు. చనిపోయిన తన తల్లికి అభిమానం ఉందే కాని, ఐశ్వర్యం లేదు.  కాత్యాయని దగ్గర రెండూ ఉన్నాయి.

                                                   *    *    *


    "ఏమిటాలోచిస్తున్నావు ? పోనీ నీకిష్టం లేదని రాసెయ్యనా సరోజినికి?
    ఉలికిపడి కాత్యాయని ముఖంలోకి చూశాడు మాధవ. స్వల్పంగా కనీ కనిపించకుండా కాత్యాయనీ ముఖం మీద అవరించుకున్న నీడల్ని  గమనించాడు. "వెళ్దాం రేపు బయలేరుద్దాం " అనేశాడు.
    
                                                   *    *    *

    ఆరోజు శ్రీనివాసు ఆనందానికి అవధులు లేవు. మొదట సరోజినీ తన దగ్గరకు వచ్చి "జానకికి మంచి సంబంధం చూశా!' అంటూ వివరాలు చెప్పినప్పుడు సంతోషపడడానికి బదులు "అంత గొప్ప సంబంధమా౧ ఎన్ని వేలు గుమ్మరించమంటారో /నేనెక్కడ తూగగలను?" అంటూ నీరసపడిపోయాడు .
    సరోజినీ జాలిగా నవ్వింది.
    "కట్నాలు గుమ్మరించవలసిన సంబంధం నీకెందుకు చెప్తాను? మా కాత్యాయని గురించి నీకు తెలీదు. చిన్నతనం నుండీ ఒకచోట కలిసిమెలిసి పెరిగాం. మొదటినుండీ వాళ్ళు మాకన్నా గొప్పవాళ్ళే! ఆ భేదం అప్పుడూ లేదు కాత్యాయనీ మనసులో, ఇన్నాళ్లయి ఇంత స్థితిమంతురాలయినా ఇప్పుడూ లేదు. ఒక్క నా విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా కాత్యాయనీ ఇంతే!"
    ఏదో అద్భుత విషయం వింటున్నట్లు విన్నాడు శ్రీనివాసు. జానకికి పెళ్ళి ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాను. మూడు వంతులు సంబంధాలన్నీ కట్నం దగ్గరే పేచీ వచ్చీ చెడిపోయాయి. ఒకటి రెండు సంబంధాల వాళ్ళు కట్నం దగ్గర ఎలాగో రాజీపడినా , "అయ్యొ౧ చదువుకోలేదా' అంటూ పెదవి విరిచేశారు. అసలు జానకికి పెళ్ళంటూ అవుతుందా అని బెంగపడిపోతున్నాడు అతను. గంగిగోవులాగా నోరు విప్పకుండా ఇంటెడు చాకీరీ చేస్తూ కనీసం గట్టిగా నిట్టుర్పనైనా విడువని చెల్లెల్ని చూస్తోంటే అతనికి గుండె తరుక్కుపోతోంది. కాని, ఏం చెయ్యగలడు? సాధారణమైన స్కూల్ మాస్టారు ఉద్యోగం తనది. నెలకు రెండు వందల జీతం. ఇద్దరు పిల్లలు. ఏ పూటకాపూట గడపటమే కష్టమయిపోతుంటే , కట్నాలు గుమ్మరించి చెల్లిలికి మంచి సంబంధం కుదుర్చి పెళ్లెలా చెయ్యగలడు? ముఖామంతా వెలిగిపోతుండగా సరోజినీ వంక ఆప్యాయంగా చూస్తూ "నిజమేనమ్మా! మన జానకి అంత అదృష్టవంతులారా ?" అన్నాడు.
    "ఎవరి అదృష్టం ఎవరు చెప్పగలరు? ఇంతకూ ఆ అబ్బాయికి నచ్చాలి. నచ్చకేంలే ? కళ్ళున్న మానవుడు ఎవడు తిరస్కరించగలడు జానకిని! వాళ్ళు ఎల్లుండి వస్తున్నామని ఉత్తరం రాశారు. కాస్త ఇల్లూ అదీ శుభ్రం చేయించు అన్నయ్యా! నేను వస్తాను" అంటూ సరోజినీ లేచి వచ్చేసింది.
    సరోజినికి శ్రీనివాసుకీ పెద్ద దగ్గిరి చుట్టరికం లేదు. ఏదో బీరకాయ పీచు బాంధవ్యం. ఆప్యాయంగా "అన్నయ్యా !" అని పలకరించినా శ్రీనివాసు భార్య అలమేలు దురుసు స్వభావానికి జడిసి, ఎన్నడూ ఆ ఇంటి కొచ్చి పదినిమిషాలు కూర్చోలేదు సరోజినీ . కాని, జానకి అంటే మాత్రం ఆమెకు అపరిమిత వాత్సల్యం. సరోజినికి పిల్లలు లేరు. జానకిని చూసినప్పుడల్లా కన్నకూతురిని చూసినట్లు పొంగిపోయేది ఆమె మనసు. జానకి సరోజినీ ఎప్పుడూ కలుసుకున్నా తెల్లవారుజామున చెరువు దగ్గరే!
    జానకి ఎన్నడూ పెదవి విప్పి ఒక్క పోల్లుమాట సరోజినితో అనలేదు. చిరునవ్వులతో విచ్చుకున్న జానకి పెదవులను చూస్తూ అమెకసలు చికాకులుంటాయని కూడా సరోజినీ ఊహించలేదు. ఒకనాడు బాగా ఉబ్బి ఉన్న జానకి మొహం చూస్తూ "అలా ఉన్నావెం?" అని అడిగింది. "అత్తయ్యా! ఎవరికి ఆత్మహత్య అని తెలియకుండా చచ్చిపోయ్యే మార్గం ఏదైనా ఉందా?" అని జానకి ప్రశ్నించినప్పుడు మొట్టమొదటిసారి తెలిసింది ఆ లేత గుండె లోతుల్లో ఎంత బాధ ఉందో!
    "అవేం మాటలమ్మా!" అంది లాలనగా.
    జానకి వెక్కి వెక్కి ఏడ్చింది.
    "నాకు ఏ ఆశలూ లేవు , ఏ కోరికలూ లేవు. చివరికి బ్రతకాలని కూడా లేదు. మరొకరికి పెద్ద గుదిబండలా ఈ బ్రతుకు బ్రతక్కపోతేనేం?"
    సరోజినీ జానకిని గుండెల్లోకి తీసుకుని ఓదార్చింది. "ఏం జరిగిందమ్మా? నాకు చెప్పు. ఇలా గుండెలు బద్దలు చేసుకోకు..... నీకు తల్లిలాంటి దాన్ని . నా దగ్గర దాపరికం దేనికి?' అని బుజ్జగించింది.
    సరోజినీ బుజ్జగింపుతో జానకి శోకం కొంత ఉపశమిల్లింది. అంతేకాని తన దుఖానికి కారణం మాత్రం జానకి వివరించలేదు. మలినమైన జానకి ముఖాన్ని చూస్తూ ఇంకా గుచ్చి గుచ్చి అడగ్గలిగే శక్తి సరోజినికి లేకపోయింది.
    ఆనాటి నుండి జానకి విషయం సరోజినీ మనస్సంతా ఆక్రమించేసుకుంది. తనేం చెయ్యగలనా అని మాధనపడుతోన్న సమయంలో కాత్యాయనీ గుర్తుకొచ్చింది. తను చెప్పినదంతా విన్న కాత్యాయనీ జానకిని మాధవకు చేసుకోవడానికి ఒప్పుకోగానే తన కూతురికే పెళ్లవుతొందన్న సంతోషంతో పొంగిపోయింది. అంత చనువు లేకపోయినా స్వయంగా శ్రీనివాసు దగ్గరకొచ్చి విషయమంతా చెప్పి వివరించి తన అనందం అతడికీ పంచింది.
    శ్రీనివాసు ఆ వార్త అలమేలు క్కూడా చెప్పాడు, కాని ఆవిడా మాత్రం అతనితో అనందం పంచుకోలేకపోయింది. పైగా 'అప్పుడే అయిపోయినట్లు సంబరపడతారేమిటి? అతనికి నచ్చోద్దూ?" అంది.
    "ఎందుకు నచ్చదు? జానకి లాంటి అందమైన ఆడవాళ్ళు ఎందరుంటారు?
    "అబ్బో! అవిడొక తిలోత్తమ. మీరొక నలకూబరుడు . మేమే కూరూపులం....."
    "ఏమిటి నీ మాటలు? ఇప్పుడు నీ అందచందాల ప్రసక్తి దేనికి? నిన్ను కూరుపి అని ఎవరన్నారు?"
    "వేరే అనాలా? అవునులెండి. వంటింట్లో మూలపడుండి అందరికీ చాకిరి చేసే నా విషయంలో అందచందాల ప్రసక్తి దేనికి?"
    "అబ్బబ్బ! శుభమా అని పెళ్ళి మాట ఎత్తితే అనందించడానికి బదులు ఈ రాద్దాంతాలేమిటి అలివేలూ?"

 Previous Page Next Page