మనసున మనసై
---డి.కామేశ్వరి
జయంతి ఆఫీసుకి తయారై డైనింగ్ టేబిల్ మీద లంచ్ బాక్స్ బ్యాగులో పెట్టుకుంటుంటే "ఇవాళ నాలుగ్గంటలకల్లా ఇంటికి రా" అంది కాస్త భయపడుతూనే పద్మావతి, జయంతి చటుక్కున తల్లివంక చూసి "ఎందుకు? మళ్ళీ ఏ తల మాసినవాడొస్తున్నాడట పెళ్ళి చూపులకి" వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తూ అంది.
"ఏ తల మాసినవాడో, మా తాహతుకి తగిన వాడినే చూశాం. తలమాసినవాడట, నీలాగే బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నవాడే. నీ కంటికి ఆనడంలేదా" పద్మావతి కాస్త కటువుగా అంది.
"ఎవరు! మొన్న ఫోటో చూపించారు వాడా, నాకు నచ్చలేదని చెప్పాగా. మళ్ళీ చూపులెందుకు వద్దన్నాక" చిరాగ్గా చూసింది.
"మీ నాన్నగారేం జవాబు రాయకుండా ఊరుకున్నా, మా అబ్బాయి హైదరాబాదు హెడ్డాఫీసులో పనిమీద వస్తున్నాడు, పిల్లని చూస్తాడు అని వాళ్ళు రాస్తే ఏం చెయ్యమంటావు- యింటికి రావద్దని ఎలా అంటాం" పద్మావతి కోపంగా అంది.
"యింటికి వస్తానని ఫోను చేసినపుడు చెప్పాల్సింది" రెట్టించింది జయంతి.
"ఏమో తల్లీ! నీ అంత అమర్యాదగా మొహం మీద చెప్పడం రాదు. వచ్చి చూశాక, నీకలవాటేగా నచ్చలేదని అపుడు చెప్పేయి"
"అయినా జయా ఫోటోచూసి నచ్చలేదంటే ఎలాగే. కొంతమంది ఫోటోలో సరిగాపడరు పైకి బాగున్నా-చూస్తే ఏం పోయింది" పురిటికొచ్చిన వాసంతి చెల్లెలికి నచ్చచెప్పే ధోరణిలో అంది.
"అందం సరే, మొన్న మొన్నటి వరకు క్లరికల్ పోస్ట్ లో ఉండి, కిందటేడేగా ఆఫీసరు రేంకుకొచ్చాడు, ఉత్తి బి.కాం.నా కంటే తక్కువ చదివిన వాడిని, నేనెందుకు చేసుకోవాలి, ఇలాంటి సంబంధాలు చూడద్దని ఎన్నిసార్లు చెప్పాలి" గయ్ మంది జయంతి.
"చూడమ్మా మహారాణీ, మీ తాహతుకి సరిపోయిన సంబంధాలే చూడగలం, మనం ఆశపడితే మాత్రం మనకంటే అంతస్థువాళ్ళు మనల్ని ఎందుకు ఇష్టపడతారు. వాళ్ళ హోదాకి సరిపోయిన వాళ్ళని వాళ్ళు యిష్టపడతారు, ఇంతకీ పోనీ ఏరంభో, ఊర్వశి లాంటి అందగత్తెనో అయితే కాస్త దిగి వచ్చి ఒప్పుకుంటారు. ఇది వరకు ఎన్ని సంబంధాలు చూడలేదు, తిరిగి పోలేదు, యిన్నిసార్లు అయినా నీకింకా బుద్ది, జ్ఞానం రాలేదు. ఇలా వచ్చిన సంబంధం అల్లా తిరగొట్టి, యింకో ఏడాది రెండేళ్ళు పోతే యీ మాత్రం సంబంధాలు దొరకవు, వయసు మించిపోతే -"చాలా కోపంగా అంది పద్మావతి, "ఏ సంబంధం చూసినా ఏదో వంకే" తిరస్కారంగా అంది.
"ఆ చూశారు, మెల్లకన్నువాడిని, బట్టతల వాడిని, బానపొట్టవాడిని, పొట్టివాడిని, నల్లవాళ్ళని - ఒక్కళ్ళకీ ఓ రూపురేఖ లేదు - కాస్త ఓ మాదిరిగా వున్నాడనుకుంటే చెత్త ఉద్యోగాలు లేకపోతే యిద్దరు చెల్లెళ్ళు తమ్ముళ్ళు, బాధ్యతలు నెత్తిన వున్నవాళ్ళు....ఎకసెక్కంగా అంది జయంతి.
"అవునమ్మా, నీవు పెళ్ళాడతావని తల్లీ, తోడబుట్టిన వాళ్ళులేని వాళ్ళు వస్తారు, వున్నా వదిలేసుకుంటారు నీకోసం. మాట మాట్లాడితే సబబుగా వుండాలి"
"ఇదిగో అమ్మా! ఎన్నిసార్లు చెప్పాను, యిలాంటి సంబంధాలు తేవద్దని, మంచి సంబంధాలు తేలేకపోతే నాకర్మానికి నన్ను వదిలేయండి, అంతేకాని నేను చచ్చినా నాకిష్టంలేని సంబంధం చేసుకోను" జయంతి తెగేసినట్లంది.
"జయా! ఏమిటే నీ మొండితనం ఏ సంబంధం తెచ్చినా ఏదో ఒక వంకపెడితే ఎక్కడ నించి వస్తాయే" వాసంతి చెల్లెకి నచ్చ చెప్పే ధోరణిలో అంది.
"ఈ నీతులకేంలే- ఇతర్లకి చక్కగా చెప్పవచ్చు, నేనేం అడిగాను, తాతా, బిర్లా, అంబానీ ఫేమిలీలడిగానా, జమీందార్లడిగానా, కాస్త పొడుగ్గా, స్మార్ట్ గా వుండాలన్నాను. చదువు, ఉద్యోగం బాగుండాలని కోరుకోకూడదా, నేనే ఏడెనిమిదివేలు తెచ్చుకుంటుంటే, నాకంటే ఎక్కువ సంపాదించే వాడొద్దా....' ఉక్రోషంగా అంది.
"ఏం యీ కుర్రాడు ఆఫీసరు, నీకంటే వెయ్యో పదిహేను వందలో జీతం ఎక్కువే బ్యాంకు ఉద్యోగం- అందం అంటే అసలు మన తెలుగు మగాళ్ళలో అందంగా ఎంత మందుంటారే. కాస్త నార్త్ లో పంజాబీలు, సింధీల లాంటి వాళ్ళు రంగు వుండి బాగుంటారు. మన తెలుగు వాళ్ళలో ఆడవాళ్ళే రంగుండరు, ఇంకా మగవాళ్ళకి రంగెవరు చూస్తారు, అసలింతకీ అబ్బాయి చదువూ, సంస్కారం ఉద్యోగం చూడాలి కాని అందం ఎవరూ చూడరు. ఏదో మరీ కోతిలా వుంటే పోనీ అనుకోవచ్చు, కట్టుకునే వాడి అందం కాదే కావాల్సింది, మంచితనం, భార్యబిడ్డల్ని సుఖపెట్టగలిగే వాడు కావాలని కోరుకో, యిద్దరిది ఒక మాట, బాట కావాలని ఆడది కోరుకోవాలి గాని ఈ గొంతెమ్మ కోరికలేమిటి పద్మావతి ప్రతీసారిలాగే ఈ సారీ కూతురికీ నచ్చచెప్పపోయింది. జయంతి విసురుగా తలతిప్పి తల్లి వంక తీక్షణంగా చూసి 'నాకు నచ్చనిది సర్దుకుని బతకాల్సినంత అవసరం నాకు లేదు'