"పడుకున్నావేం? నిద్రొస్తుందా? సరే నిద్రపో" అన్నది అనసూయ.
"నీ ప్రశ్నకు సమాధానం అక్కర్లేదా?"
"నీకు చెప్పడం ఇష్టం ఉన్నట్టులేదు."
"నీ మొహం నీకు కాక ఇంకెవరికి చెప్తాను" కొంచెంసేపు కళ్ళు మూసుకుని పడుకుంది.
అంతలోనే ఎవరో చెయ్యి పట్టుకు లాగి కూర్చోపెట్టినట్టు చివ్వున లేచి నడిమంచం మీద కూర్చుంది. తనలో తానే నవ్వుకుంది. కాని ఆమె కళ్ళలో లీలగా విషాదం కదిలి ఇట్టేమాయం అయింది.
"నువ్వు బాధపడుతున్నావు. మరోసారి నీకు చెప్పాలనిపించినప్పుడు చెబుదువు పడుకో" అన్నది అనసూయ సావిత్రిని జాలిగా చూస్తూ.
"అనూ! నువ్వు మొదటికంటే ఇప్పుడు నిండుగా చాలా అందంగా వున్నావే" అనసూయ కేసి చూస్తూ అన్నది సావిత్రి.
అనసూయ పకపక నవ్వింది.
"నువ్వు మాట మారుస్తున్నావు గాని పడుకో"
"అదేం లేదే. నీకు తప్పక చెబుతాను" తనకు తానే చెప్పుకుంటున్నట్టు అన్నది. అదోలా నవ్వింది. ఆ నవ్వు తనను చూసుకుంటూ తనే నవ్వుకుంటున్నట్టు అన్పించింది అనసూయకు. ఆ నవ్వు సావిత్రి కళ్ళల్లో దేన్నో వెదకటానికి ప్రయత్నించింది.
సావిత్రి తలవంచుకుని, నెత్తి గోక్కుంటూ కూర్చుంది. ఆ కూర్చున్న వాలకం కూడా అనసూయకు అసాధారణంగా అన్పించింది.
"ఏమిటే అలా తల గోక్కుంటున్నావు? పేలు పడ్డాయా?"
"ఆఁ ఆఁ ఛ! నా తల్లో పేలువుండవ్. నీ తల పేల తల. అవి ఎక్కినాయో ఏమో."
"నీ మొహం! ఇప్పుడు నాకు పేలు పడటం లేదు లేవే!" అంటూ ఆవలించింది అనసూయ.
"నిద్రొస్తుందా!"
"మరి రాదూ! అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ బోరు కొడుతుంటే!"
"నువ్వేమో మీ అన్నయ్య తెచ్చిన సంబంధం కిక్కురుమనకుండా చేసుకున్నావ్. నేనేమో నాన్న ఎన్ని సంబంధాలు తెచ్చినా చేసుకోను పొమ్మన్నాను. తమాషాగా ఉంది కదూ అనూ!"
"అవును!"
"నేను ఎం.ఏ. లో చేరాను. అమ్మకు నేను ఎం.ఏ. చదవడం ఇష్టంలేదు."
"ఊఁ"
"నా క్లాసుమేట్ వేణుగోపాల్ కు నేనంటే చచ్చేంత ఆరాధన కాని నాకు అతన్ని చూస్తేనే వళ్ళు మండిపోయేది. అతను పలకరిస్తే చాలు కరిచినట్టే జవాబిచ్చేదాన్ని. అతనికి నన్ను ప్రేమించే అధికారం ఎవడిచ్చాడు?"
అనసూయ పక-పక నవ్వింది.
"ఎందుకే నవ్వుతావ్."
"ప్రేమించడానికి ఒకరు అధికారం ఇవ్వడం ఏమిటే?"
"అది నిజమేలే! అప్పుడు అలా అనుకునే దాన్ని."
"అంటే నువ్వూ ప్రేమలో పడ్డావన్నమాట!"
"అవును పడ్డాను. అదే బురదలో పడ్డాను చివరకు మిగిలింది బురదే!"
"కవిత్వం మాట్లాడుతున్నావే?"
"మధ్యలో వెధవ రిమార్క్స్ పాస్ చెయ్యకు?" సావిత్రి మూతి సన్నగా చుట్టింది.
"అలాగే మా తల్లిగా త్వరగా చెప్పు. నిద్రొస్తున్నది."
"అతను కనిపిస్తే చాలు నాకు వంటిమీద తేళ్ళు జెర్రెలూ పాకినట్టుండేది."
"అందంగా ఉండేవాడు కాదా?"
"అయ్యో లేకేం. చాలా అందంగా వుండేవాడు. చాలామంది ఆడపిల్లలు అతనంటే పడి చచ్చేవాళ్ళు."
"మరి నీకెందుకింత ఏవగింపుగా ఉండేది?"
"నాకే తెలియదు. అతని చూపుల్లో కాంక్ష కన్పించేది. నాకు వెగటుగా అన్పించేది. పాపం ఇప్పుడు ఎక్కడున్నాడో"
అనసూయ సావిత్రి ముఖంలోకి చూసింది.
"ఇప్పుడు అతను కన్పిస్తే పెళ్ళి చేసుకుంటావా?"
సావిత్రి చివ్వున తలెత్తి చూసింది.
"చస్తే చేసుకోను. అతన్నే కాదు ఏ మగవాడిని చేసుకోను" ఉద్రేకంగా అన్నది.
అనసూయ విస్మయంగా చూసింది.
"కాలేజీలో ఫంక్షన్ లో రామక్రిష్ణతో పరిచయం అయింది. అతను నల్లగా ఉంటాడు. పెద్ద అందంగా ఉండడు. అయినా అతనంటే నాకు ఇష్టం ఏర్పడింది. ఎందుకో తెలుసా"
"చెప్పు."
"అతను ముభావంగా వుండేవాడు. గర్వంగా కనిపించేవాడు. నేను అందంగా ఉంటానని అందరూ అనేవాళ్ళుగా. చాలామంది నాకోసం చేతులు చాచారు. చాచిన చేతుల్ని కసిగా కొరికాను. అంటే నిజంగా కొరకడం కాదు. తిరస్కరించానని..."
"ఆ మాత్రం అర్ధం చేసుకోగలను చెప్పు."
"అతను నాకేసి చూసేవాడు కాదు. నిర్లక్ష్యంగా ఉండేవాడు. అందుకే అతనివైపు నేను ఆకర్షించబడ్డాను. ఒక రకంగా నేనే అతని వెంట పడ్డాననుకో. ఆ తర్వాత మా పరిచయం ప్రేమగా మారింది" దీర్ఘంగా నిట్టూర్చింది సావిత్రి.
అనసూయ ఆలోచిస్తూ కూర్చుంది.
"రామకృష్ణది మా కులం కాదు.
నాన్నకు ముందుగా నే చెప్పదలుచుకోలేదు.
రామకృష్ణతో సినిమాలకు కూడా వెళ్ళాను. గంటలు గంటలు పార్కుల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. బీచి ఇసుకలో పరుగులు తీశాం."
"ఊఁ ఆ తర్వాత?"
"ఎం.ఏ. పరీక్షలు రాశాం. రామకృష్ణ త్వరలో వస్తాననీ, రిజిష్టరు మేరేజ్ చేసుకున్న తర్వాతనే పెద్దవాళ్ళకు చెప్పొచ్చుననీ చెప్పాడు. నేను నమ్మాను."