అనసూయ పలకరించలేదు. సావిత్రి మౌనాన్న భంగపర్చడం మంచిది కాదని భావించింది
టాక్సీ ఇంటిముందు ఆగింది.
"సావీ! దిగు ఇల్లువచ్చింది."
సావిత్రి యాంత్రికంగా దిగింది. లోపలకు నడిచింది. అనసూయ డ్రైవర్ కు డబ్బిచ్చి లోపలికొచ్చేసరికి సావిత్రి రూమ్ తలుపులు మూసున్నాయ్.
"పూర్ గళ్" అనుకుంది అనసూయ మనస్సులోనే.
సావిత్రి ఇంతవరకూ పెళ్ళెందుకు చేసుకోలేదో. ఎవర్నయినా ప్రేమించి మోసపోయిందా?
ఏదో బలీయమయిన కారణమున్నది.
తనూ, తన భర్తా ఎలాగయినా సావిత్రిని ఒక ఇంటిదానిని చెయ్యాలి. వంటచేస్తూ సావిత్రిని గురించి ఆలోచింపసాగింది అనసూయ.
ఎనిమిది గంటలయినా సావిత్రి బయటకు రాలేదు.
అనసూయకు ఎన్నో అనుమానాలు వచ్చినయ్.
గుండె ఝల్లుమంది.
తలుపు ఆదుర్దాగా బాదుతూ "సావీ! తలుపు తియ్. ఇంకెంతసేపు పడుకుంటావ్" కేకలు పెట్టింది.
సావిత్రి తలుపు తీసింది.
ఆమె జుట్టు రేగివున్నది.
కళ్ళెర్రగా ఉన్నాయ్.
కనురెప్పలు కొద్దిగా వాచి ఉన్నాయ్.
అనసూయ విస్మయంగా సావిత్రి ముఖంలోకి చూస్తూండిపోయింది.
"ఎందుకే అలా చూస్తావ్? బాగా నిద్రపట్టేసింది. తెగ తిరిగాం వడదెబ్బ తగిలినట్టు అన్పిస్తూంది" అన్నది సావిత్రి.
"వడదెబ్బ తగిలిందా? అయ్యో వెంటనే చెప్పలేదేం? డాక్టర్ కు ఫోన్ చేస్తాను."
"వడదెబ్బ తగల్లేదు. అలా ఉందంటున్నాను. అలసటగా ఉన్నది అంతే. ముఖం కడుక్కొస్తాను" అంటూ సావిత్రి బాత్ రూమ్ లో కెళ్ళింది.
ముఖం కడుక్కుంది.
తల దువ్వుకుంది.
పౌడర్ వేసుకొని బొట్టుపెట్టుకుంది.
చిరునవ్వును పెదవులకు పులుముకొని అనసూయ దగ్గరకు వచ్చింది.
"దీని నవ్వులో దుఃఖం ద్యోతకమౌతోంది" అనుకుంది అనసూయ.
ఇద్దరూ భోజనాలు చేశారు.
సావిత్రి ఆ మధ్య తను చూసిన "ఎగ్జార్సిస్టు" సినీమా గురించి చెబుతున్నది.
"నాకు అలాంటి కథలు చదవడం వినడం ఇష్టముండదు సినీమా అసలు చూడను."
"భయమా?"
"జుగుప్సను కలిగించేవీ, మనసును పాడుచేసేవీ అంటే నాకు నచ్చదు. సుఖముగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం మూర్ఖత్వం. టెన్షన్ క్రియేట్ చేసే పుస్తకాలు చదవడంవల్ల నష్టమేగాని ఎలాంటి విషయజ్ఞానమూ లభించదు. సైకో మావారి బలవంతం మీద చూశాను. ఎక్కువ సీన్స్ నేను చూడనేలేదు. వచ్చాక నెలరోజులు చీకటిపడితే చాలు ఎవరో వెనక వచ్చి నిలుచున్నట్టే వుండేది.
సావిత్రి గలగల నవ్వింది.
"అమ్మయ్యా! ఇప్పటికి ఇది ఈ లోకంలో పడింది" అనుకుంటూ రిలీఫ్ గా ఫీలైందనసూయ.
"సినీమాకు వెళ్దామా?" అన్నది సావిత్రి.
"ఇప్పుడా? సెకండుషోకి మగవాళ్ళు లేకుండా వెళ్ళడమంత మంచిదికాదు. రేపు వెళదాంలే. నువ్వొచ్చినప్పటినుంచీ మనం తిరుగుతూనే ఉన్నాము. మాట్లాడుకున్నట్టే లేదు. పడుకొని కబుర్లు చెప్పుకుందాం" అన్నదామె.
"ఓ.కే." అంటూ లేచి సింకు దగ్గరకెళ్ళింది సావిత్రి.
అనసూయ డైనింగ్ టేబుల్ సర్ది తమలపాకులూ, సున్నం, వక్కపొడి తీసుకొని సావిత్రి దగ్గర కొచ్చింది.
"నీకు ఈ మధ్య ఆకులు తినడం బాగా అలవాటైనట్టుంది" అన్నది సావిత్రి.
"రెండు పూటలూ భోజనం చెయ్యగానే వేసుకుంటాను." అన్నదామె తమలపాకు ఈనెలు తీస్తూ.
"మీవారు ఎప్పుడొస్తారే?"
"రేపో ఎల్లుండో రావాల మరి" తమలపాకు చిలకలు అందిస్తూ అన్నదామె.
"సావీ ఒకటడగనా?"
"ఒకటేమిటి ఎన్నయినా అడుగు."
"నిజం చెప్పాలి. నా దగ్గిర దాచకూడదు."
"మనిద్దరిమధ్యా చెప్పుకోలేనివి ఏముంటాయ్? అందుకే ఓ కవి అన్నాడు. 'సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్' అని. అమ్మకు కొన్ని విషయాలు, నాన్నకు చెప్పలేనివి చెబుతాం. వాళ్ళిద్దరికీ చెప్పలేని విషయాలు కొన్ని భర్తకు చెబుతాం. ఒక స్త్రీ జీవితంలో ఈ ముగ్గురికంటే సన్నిహితమైన బాంధవ్యం మరొకటి లేదేమో. కాని ఈ ముగ్గురికీ చెప్పుకోలేని విషయాలు స్నేహితులదగ్గర చెప్పుకుంటాం."
"నిజమే సావీ!" అనసూయ ఆలోచిస్తూ అన్నది.
"నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో కూడా నాకు తెలుసు."
"చెప్పుకో చూద్దాం"
"పెళ్ళెందుకు చేసుకోలేదని అడగాలనుకుంటున్నావ్. ఔనా?"
"ఔనే. ఎం.ఏ. పూర్తిచేసి కూడా సంవత్సరం దాటిపోయింది. మీ అమ్మా నాన్నా పెళ్ళి ప్రయత్నాలు ఎందుకు చెయ్యలేదో నాకర్ధం కావడం లేదు."
"వాళ్ళు చూపిన సంబంధం నేను చేసుకోనని తెలుసు."
"అదేమిటే అమ్మానాన్నా చూపిన సంబంధం చేసుకుంటాననే దానివిగా?"
"నువ్వు మాత్రం. అరేంజెడ్ పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్ళి చేసుకోనని పెద్ద కోతలు కోసేదానివిగా? చివరకు ఏమి చేశావ్?"
"నేను ఏ పరిస్థితుల్లో అలా చెయ్యాల్సివచ్చిందో నీకు తెలుసు"
"అలాగే నా పరిస్థితులూ మారి ఉండొచ్చుగా?" అంటూ పడుకుంది సావిత్రి.