Previous Page Next Page 
మానిని మనసు పేజి 10


    "మరి అతడు రాలేదా?"
    "రాలేదు. నెల రోజులు గడిచాయి. నేను ప్రతి నిత్యం అతనికోసం విలవిలలాడిపోయాను. అశాంతితో పిచ్చిగా తిరిగేదాన్ని. ప్రేమలోని ఆనందాన్నీ, ఆవేదననూ తెలుసుకున్నాను."
    "అతను మోసం చేశాడా?"
    "అవును. అతను పెళ్ళి శుభలేఖతో పాటు తనను క్షమించమని ఒక వుత్తరం కూడా పంపించాడు."
    సావిత్రి కళ్ళు ఎర్రబడ్డాయి.
    ఉద్రేకంతో ఊగిపోతున్నది.
    ఆమె రూపం అనసూయకు ఏదోగా అన్పించింది. భయం వేసింది.
    "సావీ!"
    "ఊఁ"
    "ఈ జీవితం మనం కావాలంటే లభించింది కాదు. ఒకసారి ఏదో జరిగిందని జీవితమంతా ఏడుస్తూ కూర్చోవడం వివేకం అనిపించుకోదు. ప్రతి గాయాన్నీ కాలం మాన్పుతుంది. జీవితములో గడిచిపోయిన ఒక్కక్షణంకూడా మనం ఎన్ని తపస్సులు చేసినా వెనక్కు తెచ్చుకోలేం. అతన్నే తల్చుకుంటూ నీ జీవితం నాశనం చేసుకోకు.
    "అబ్బే అతన్ని తల్చుకోవడం లేదు. ఇప్పుడు అతనంటే నాకు అసహ్యం."
    "మరి పెళ్ళెందుకు చేసుకోలేదూ?"
    "మగవాళ్ళంటేనే నాకు పరమరోత"
    "అదేమిటి?"
    "ఆ జాతి అంటే నాకు కసి. మగవాళ్ళంతా మోసగాళ్ళు. రోగ్స్" కోపంతో నిలువెల్ల కదిలిపోతున్నది సావిత్రి.
    "ఎవరో ఒకడు మోసం చేశాడని మగవాళ్ళంతా చెడ్డవాళ్ళే అనుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. ఆ మాటకొస్తే ఆడవాళ్ళు కూడా కొందరు నమ్మించి మోసం చేసే వాళ్ళుంటారు."
    "ఆడవాళ్ళలో కొద్దిమంది ఉండవచ్చు. కాని మగజాతిని నమ్మకూడదు. అందరూ ఒకటే."
    అనసూయ సావిత్రి ముఖంలోకి చూసింది.
    "నీలాంటివాళ్ళను దృష్టిలో పెట్టుకొనే పాలతో మూతి కాలినవాడు మజ్జిగ ఊది ఊది తాగాడు- అనే సామెత పుట్టిందనుకుంటాను."
    "నీ ఉద్దేశం నాకు పూర్తిగా అర్ధం కాలేదు."
    "అదే. ఒక మగవాడెవడో నిన్ను మోసం చేశాడు. ఆ అనుభవముతో నువ్వు మగవాళ్ళంతా మోసగాళ్ళు అని అనుకుంటున్నావు."
    "ఔను మగవాళ్ళంతా మోసగాళ్ళే. ఒకడూ పెళ్ళాన్ని ప్రేమించడు. అంతా నటన. ప్రేమిస్తున్నట్టు నటిస్తూనే వీలుంటే పెళ్ళాన్ని చంపుతారు" ఉద్రేకంతో ఊగిపోతూ అంది.
    "నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మీ అమ్మను మీ నాన్న చంపాడా? మా అమ్మను మా నాన్న చంపలేదు. నా భర్త నన్ను ఎంతగానో ప్రేమిస్తారు."
    "ఏమో అదంతా నాకు తెలియదు. కొందరు పిరికివాళ్ళు కావచ్చు. కొందరు పెళ్ళాన్ని చంపితే మళ్ళీ ఆ మాత్రం పెళ్ళాం రాదేమోనని భయం కావచ్చు."
    "నువ్వు అనవసరముగా ఏదేదో వూహించుకుంటున్నావ్."
    "నేను కళ్ళారా చూశాను"
    "ఏమిటి?"
    "భర్త భార్యను దారుణంగా కాల్చి చంపాడు."
    "కళ్ళారా చూశావా?"
    "ఔను."
    "ఏం సావీ! ఏమిటలా వణికిపోతున్నావ్. అరే నీ ముఖమంతా చెమట బిందువులే."
    "ఆ దృశ్యం..." సావిత్రి గుప్పెళ్ళు బిగబట్టింది.
    ఆమెకు సావిత్ర రూపం చూస్తుంటే భయము వేసింది. లేచి వెళ్ళి సావిత్రి భుజముమీద చెయ్యివేసి కుదిపింది.
    "ఆ దృశ్యం... రెండేళ్ళయినా ఇప్పుడే జరిగినట్టు కనిపిస్తోంది..." సావిత్రి ఈ లోకంలో లేని మనిషిలా మాట్లాడుతోంది.
    "సావీ! సావీ!"
    "ఆఁ"
    "పడుకో. రేపు మాట్లాడుకుందాం."
    సావిత్రి అలాగే కూర్చుంది. ఆమె కళ్ళలో కసి కన్పిస్తోంది. ముఖం ఉద్రేకముతో కందగడ్డలా వుంది.
    అనసూయకు సావిత్రిని చూస్తుంటే ఏదో భయంగా వుంది. ఇది ఇలా తయారైందేమిటి? హిస్టీరియా పేషెంటులా ప్రవర్తిస్తోంది. "పడుకో రేపు మాట్లాడుకుందాం. ఇంద మంచినీళ్ళు తాగు."
    గ్లాసు అందుకొని తాగింది.
    ఖాళీగ్లాసు అనసూయకు అందించింది.
    సావిత్రి ఆమె ముఖంలోకి చూసింది.
    "సారీ అనూ! ఆ విషయం గుర్తొస్తే చాలు నన్ను నేను ఉన్న పరిసరాల్ని కూడా మర్చిపోతాను."
    "పడుకో."
    "నిద్రపట్టదు. ఆ విషయం నీకు పూర్తిగా చెబితేకాని నా మనసు తేలికపడదు."
    "అయితే చెప్పు" అయిష్టంగానే అందామె
                                                                                   6
    అనసూయ గడ్డంకింద చెయ్యిపెట్టుకొని నడిమంచములో కూర్చుని కుతూహలంగా సావిత్రి ముఖంలోకి చూడసాగింది.
    సావిత్రి గతాన్ని నెమరువేసుకుంటూ కూర్చుంది.
    "వూ చెప్పవే. ఎంతసేపు సస్పెన్సుతో చంపుతావ్."
    "నాన్న రిటైర్ అయ్యారు. మా ఇల్లు రెండు భాగాలుగా చేసి ఒక భాగం అద్దెకిచ్చారు. అలా అద్దెకివ్వడం నాకు ఇష్టంలేదు. ఆర్ధిక పరిస్థితులు తెలుసు కనుక ఏమీ అనలేకపోయాను.
    టూలెట్ బోర్డు తగిలించారు.
    ఒకరోజు కాలేజీనుండి వచ్చేసరికి ఎవరో ఆ భాగంలో అద్దెకు దిగారు. ఎవరొచ్చారని అమ్మను అడిగాను.

 Previous Page Next Page