Previous Page Next Page 
అనూహ్య పేజి 9

    వివేక్ నాకు ఊపిరి తిప్పుకోనివ్వని ప్రేమని అందిస్తున్నాడు. నేను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాను. 'ఛస్తే జీవితంలో చెయ్యను' అనుకున్నవి ఎన్నో అతనికోసం చేస్తున్నాను. బ్యూటి పార్లర్లు, లిప్ స్టిక్ లు, ఎక్సర్ స్తెజులు, డైటింగులు!
    ఎంత చేసినా అతని కళ్ళల్లో నాకు ఇంకా ఏదో కావాలనే కోరిక కనిపించేది అదేదో నేనే తెలుసుకుని చెయ్యడం లేదనే అసంతృప్తి కదలాడేది!
    నాకు అర్ధంకాని విషయమేవిటంటే... అతను కొరుకునేలాంటి మోడర్న్ గర్ల్స్ పుష్కలంగా వుంటారు. మరి నాలాంటిదాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్ళిచేసుకుని, అలా  మార్చుకోవడంలో అతను పొందుతున్న ఆనందం థ్రిల్లా లేక  శాడిజమా?
    పడకగదిలో అతని చేష్టలు నాకు మెల్లమెల్లగా అలవాటుయ్యాయి. రాత్రయ్యేటప్పటికి అతను లేకుండా నిద్ర రావడం మానేసింది. మొదటిసారి పండక్కి అతను లేకుండా, ఒంటరిగా  ఊరెళ్ళాక తెలిసింది అతన్ని విడిచి నేను వుండలేనని!
    నాకు మా ఊరంటే ఎంతో ఇష్టం. వేణుగోపాలస్వామి ఆలయంలో చిరుగంటలు మోతా, కొలనులో కళ్ళిప్పుకున్న కలువభామల వయ్యారాలు, మల్లెలూ, జాజులూ రాసిపోసుకున్న పెరడ్లూ, మాగిన మామిడిపండ్లూ, చల్లని తాటాకు పందిళ్ళూ, అమ్మమ్మ చేసే సంతర్పణలూ, నిదుర లేని రాత్రిళ్ళూ మాత్రమే నాకు మిగిలాయి అక్కడ వివేక్  పరిస్ధితి కూడా అలాగే వుందని అతను వ్రాసిన ఉత్తరంవల్ల నాకు తెలిసింది!
    సైకిల్ బెల్ గణగణలాడించుకుంటూ వచ్చే పోస్ట్ మేన్ కోసం నేను రపక్షిలా ఎదురుచూస్తుండగా రానే వచ్చాడు.
    "అనూహ్యమ్మగోరికి.... ఉత్తరం" అంటూ అరిచాడు.
    పనిమనిషి రత్తి అందుకుని-" అనసూయమ్మ గోరికా?" అని అడిగింది.
    అప్పటికే అతను రయ్యిమని వెళ్ళిపోయాడు.
    నేను మేడమీద బట్టలారేస్తూన్నాను. అతడి కేక విని క్రిందకి వచ్చేటప్పటికే జరగవలసినదంతా జరిగిపోయింది. రత్తి  ఉత్తరం తీసుకెళ్ళి తులసికోట చుట్టూ పరదక్షిణాలు చేస్తున్న అమ్మమ్మకి ఇచ్చేసింది.
    ఆవిడ మడిచీరలో వుంది. "అసింటా అసింటా నిలబడు" అని గదిమి, క్రింద పెట్టిన ఉత్తరాన్ని అందుకుంది.
    "డియర్....నువ్వులేని రాత్రులు నాకు పిచ్చెక్కిస్తున్నాయి. నువ్వు గుర్తొచ్చినప్పడల్లా ఏం చేస్తున్నానో తెలుసా?"
    అంతవరకే పైకి చదివి, ఆతర్వాత ఆవిడ గగ్గోలుగా అరిచింది. "అయ్యో... అయ్యో... ఎవడే వీడు? ఈ రాతలేమిటే? అసలే మడిచీరలో వున్నాను, ఏవిటీ అపభ్రంశపు కూతలు? కృష్ణా... కృష్ణా!" అంటూ బావి దగ్గరకెళ్ళి నీళ్ళు తొడి నెత్తిన పోసుకోసాగింది.
    "అది నీకు కాదు అమ్మమ్మా" అని ఆ ఉత్తరాన్ని అందుకుని పరుగున నా గదిలోకి వచ్చి చదివాను చదువుతూ వుంటే నాకు సిగ్గూ, భయమూ, కోరికా ఏకకాలంలో కలిగాయి. ఎంత సిగ్గులేనివాడైనా మరీ  ఇలాగా? ఛ... అమ్మమ్మ మొత్తం చదివిందేమో! ఆవిడకి ఈ ముఖం ఎలా చూపించనూ!
    అమ్మమ్మ ఉత్తరంలో వాక్యాలు చదివే, మైల పడ్డానని స్నానాలు చేసింది. అసలు తాతయ్యతో కాపురం ఎట్లాచేసిందబ్బా! అనుకుని  నవ్వుకున్నాను.
    తెల్లవారుఝామున వివేక్ కలలోకి వచ్చి ముద్దులతో ముంచెత్తుతూవుంటే- "వద్దు...వద్దు..." అంటూ దూరంగా తూసేశాను.
    "చచ్చానే బాబూ!" అన్న కేక వినిపించి కళ్ళువిప్పి చూశాను. పట్టెమంచం మీద నుండి క్రిందపడి పోయిన అమ్మమ్మ  నడుము పట్టుకుని ఆపసోపాలు పడ్తోంది. జరిగింది అర్ధమై గట్టిగా కళ్లు మూసేసుకుని, దుప్పటి బిగించేశాను.
    మధ్యాహ్నం పెరట్లో కూర్చుని పెన్నూ, కాయితాలతో కుస్తీపడ్తూ వివేక్ కీ ఉత్తరం రాయాలని ప్రయత్నిస్తుండగా, బట్టల గురవయ్య వచ్చాడు.
    "చీరలండీ... చీరలు! శ్రావణ పట్టీ చీరలు! కట్టుకుంటే ఐదునెలలకల్లా శ్రీ మంతం చీరలకోసం మాకే కబురుపెట్టాల" అన్నాడు నవ్వుతూ.
    అమ్మమ్మ వచ్చి రత్తిచేత చాప వేయించింది.
    "మా పాపతల్లికి మేలురకం చీరలు చూపించు గురవయ్యా" అంది.
    "అద్దకం చీరలకి గోరంచు జరీ. అమ్మాయిగారూ... పట్నం అబ్బాయిగారికి మా పనితనం చూపండి" అన్నాడు. నాకు ఏదో తట్టి, లోపలికి వెళ్ళి గబగబా కాయతం మీద రాశాను.
    'శ్రీ వారికీ...
    పదాలు పోందిగ్గా వేసి, వాటిమీద భావాల అద్దకం అమర్చి, శృంగారపు గోరంచు జరీతో ఎదురుచూసే పట్టుచీరలా వుంది మీ లేఖ! పట్టుకుంటే పరవశం.... కట్టుకుంటే కలవరం.... ఏం చెయ్యనూ?'
    వివేక్ దానికి రిప్లై రాశాడు.
    'నీకు శృంగారం చెయ్యడం మాట్లాడడం కాదు కనీసం వ్రాయడం కూడా రాదు. మై నైట్స్ ఆర్ సాలిటరీ విత్ అవుట్ యూ! రేపు బయల్దేరు'
    నేను దాన్ని పట్టుకుని ఆలోచిస్తూ వుండిపోయాను. నా భావాలకి విలువనివ్వనీ, సున్నితంగా ఆలోచించనీ అతడి దగ్గరకి పీలవగానే ఎందుకెళ్ళాలి అనిపించింది. కానీ అతని గరకు చెంపలూ, ఇరుకు కౌగిలీ,  ఉక్కిరిబిక్కిరి చేసే  సిగరెట్ పోగా, గుచ్చుకునే, మీసం గుర్తొచ్చి ఆ రాత్రి చాలా  ఇబ్బందిగా గడిచింది. తెల్లవారగానే ప్రయాణం అయ్యాను.  
                                                                       *        *        *
    అమ్మమ్మ పంపీన తెల్లని పూతరేకు మడతలూ, నున్నని  సున్నండలూ చూసి- "తెల్లని సైను పంచెలో నున్నగా మెరిసే  గుండుతో వున్న మీ అమ్మమ్మే  గుర్తొస్తోంది వీటిని చూస్తుంటే తీసెయ్! నాకు  భయం" అని ఆటపట్టించాడు వివేక్.
    అమ్మమ్మని హాస్యానీకైనా ఏవైనా అంటే నా హృదయం విలవిలలాడ్తుంది. ఆవిడ ఆప్యాయత అర్ధం చేసుకోలేని అతనిమీద నాకు పుట్టబోయే పిల్లలకి ఆవిడ చేయించబోయే నగల వివరాలూ, వాళ్ళ ముద్దుముచ్చటలూ ప్రముఖంగా వుండేవి,  ముని మనవల కోసం ఆవిడ తహతహలాడిపోతోంది.
    'నీళ్ళోసుకున్నావా?' అంటూ ప్రతి ఉత్తరంలో విడవకుండా చాదస్తంగా రాసేది. సంతాన గోపాల స్వామికి పూజలు చేయించి ఆ ప్రసాదం పొట్లాలు ఈ ఊరు ఎవరొచ్చినా వాళ్ళతో పంపేది.
    నేను ఆ రోజు అలాగే  ఆవిడ పంపిన లడ్డూ  ప్రసాదం వివేక్ నోట్లో వెయ్యబోయాను.
     వివేక్  వెంటనే "ఆగు....ముందు నేను  నీ నోట్లో ఇది వెయ్యాలి....నోరు తెరు!" అన్నాడు.
    నేను  తల  అడ్డంగా ఊపి, అల్లరిగా, "ఉహూ....నేనే ముందు" అన్నాను
    "ఇట్లాంటివిషయాల్లో ,ముందేలే!" నవ్వాడు వివేక్. నేను  ఆలిగి  మూతి ముడుచుకుంటే.
    "ఇద్దరం ఒకేసారి....సరేనా?" అన్నాడు.
    కాస్త మెత్తబడి- "సరే" అని నోరు తెరిచాను.
    నేను నీళ్ళు తాగి గుటక వేశాక, "ఎందుకండీ ఆ టాబ్లెట్? ఆరోగ్యంగానే వున్నాగా!" అన్నాను.
    వివేక్ లడ్డూ నములుతూ- "అదా.... అది గర్భనిరోధకపు మాత్ర! ఈరోజు నుండి నువ్వు రాత్రుళ్ళు క్రమం తప్పకుండా వేసుకోవాలి.... అది సరే...ఈ  లడ్డూ  ఎక్కడిదీ? చాలా రుచిగా వుంది" అన్నాడు.
    అతని మాటలకి నాకు శూలంతో కడుపులో పొడిచినట్లయింది వణుకుతున్న పెదవులని స్వాధీనంలోకి తెచ్చుకుని "గ...ర్భ...ని...రో...ధ...క...పు...మా...త్ర...లా...?" అన్నాను.
    "ఊఁ"
    "ఎందుకూ?"
    "ఇప్పుడే పిల్లలెందుకు? నీకే ఇంకా సరిగ్గా జీవించడం రాలేదు!" హేళనగా అన్నాడు.
    ఆ రోజునుండీ  నేను సంతాన గోపాలస్వామి కుంకుమ నుదుటన పెట్టుకుంటూనే వున్నాను. అతను ప్రతిరాత్రీ  ఇచ్చే మాత్రలు మింగుతూనె వున్నాను. అమ్మమ్మ  కోయవాళ్లకీ, ఎరుకలవానులకీ డబ్బూ , బియ్యం వెదజల్లుతూ నా కడుపుకోసం ఎదురుచూస్తూనే వుంది!
    అసలు నేను  తల్లి కావడం నాకు సంబంధంచిన విషయమా? ఇద్దరికీ సంబంధించిన విషయమా? లేక  అతనికీ మాత్రమే సంబంధించిన విషయమా అన్నది మాత్రం నాకు  అర్ధం కాలేదు.
    ఈ ఇంట్లో వున్న టి.వీ.సీ.ఆర్.. ఫ్రీజ్ , గోడ మీదున్న  కొండజాతి పిల్లి పెయింటింగ్ ఎంతో  నేనుకూడా అంతే! నన్ను  ఓ మనసు లేని వస్తువుగా అతను  చూస్తున్నాడని నాకు  మరునాడు జరిగిన సంగతితో పూర్తిగా అర్ధమైంది.
    నా వ్యక్తిత్వాన్ని సమూలంగా చంపేసి తన ఇష్టాలూ, ఆనందాలూ మాత్రమే నా ద్వారా  తీర్చుకుంటున్న  అతనితో కలిసి  కాపురం చెయ్యడం ఇంక నా వల్ల కాదని ఓ నిశ్చయానికి వచ్చాను. అందుకు దారితీసిన పరిస్ధితులు అతనే కల్పించాడు.
      

 Previous Page Next Page